చిన్నంబావి మండలం పెద్దమరూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల క్రితం బావిమోటార్ల దొంగతనం కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాపీమేస్త్రీగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో పెద్దమ్మ పండగ కోసం ఇటీవల సొంతూరుకు వచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులతో ఆనందంగా ఉన్న సమయంలో సర్వే కోసం పోలీసులు ఇంటికి రావడంతో భయంతో వణికిపోయాడు. అందరి ముందు తన వేలిముద్రలు సేకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు.
పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం గొర్రెల దొంగతనం కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. అనేక వాయిదాల తర్వాత కోర్టు కేసు కొట్టివేయడంతో ప్రస్తుతం ఓ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. సర్వేలో భాగంగా పోలీసులు ఇంటికి రావడంతో అతనితో పాటు కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. ఆధార్, రేషన్‌కార్డు ఫొటోలు తదితర వివరాలు సేకరించడంతో బెంబేలెత్తిపోతున్నారు.
వనపర్తి విద్యావిభాగం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేరస్తుల సమగ్రసర్వే ఉద్దేశం మంచిదే అయినా తెలిసో తెలియకో చిన్న చిన్న నేరాలతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన నేరస్తులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పదేళ్ల పోలీసు రికార్డుల ఆధారంగా నేరస్తుల సర్వే కొనసాగుతోంది. గతంలో నేరుగా నేరాలు, దొంగతనాలు చేసిన వారు కొందరైతే పాతకక్షలతో కొందరు, తప్పుడు కేసుల్లో మరికొందరు, నేరస్తులకు సాయం చేసిన వారు ఇంకొందరు.. ఇలా వివిధ కారణాలతో పోలీస్ రికార్డుల్లోకి ఎక్కినవారు ఉన్నారు. వివిధ నేరాల్లో జైలుకెళ్లి, కోర్టులు కేసులు కొట్టివేయడంతో నేరప్రవృత్తికి దూరంగా జీవనం గడుపుతున్నవారు ఉన్నారు. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న తమ ఇంటికి పోలీసులు రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. గతంలో పోలీసు కేసు విషయం కొందరికే తెలిసినా ప్రస్తుతం పోలీసుల హడావుడితో నేరస్తులుగా ముద్రపడిన వారు, వారి కుటుంబసభ్యులు ఆత్మన్యూనతభావానికి గురవుతున్నారు. ఎక్కువ మంది చిన్న కేసుల్లో రికార్డుల్లోకి ఎక్కినవారు బాధపడుతున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న సర్వే
జిల్లాలోని 14మండలాల్లో పదేళ్ల పోలీసు రికార్డుల ప్రకారం 1758మంది నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఈ సర్వే కోసం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాలతో మొత్తం 50బృందాలు సర్వే కొనసాగిస్తున్నాయి. ఈ ప్రక్రియను ఏఎస్పీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లాలో 1,758మంది నేరస్తుల్లో 1,152మంది జిల్లాలో నివాసం ఉంటుండగా, 371మంది ఇతర తెలంగాణ జిల్లాలు, 235మంది ఇతర రాష్ట్రాల పరిధిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న ప్రారంభమైన ఈ సర్వే ఇంకా కొనసాగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
నేరస్తుల్లో మార్పు అవసరం
పోలీస్‌శాఖ చేపడుతున్న సర్వే పాత నేరస్తులను ఇబ్బందులకు గురిచేసేందుకు కాదు. నేరంచేసిన వారిపై పోలీస్‌శాఖ నిఘా ఉంటుందన్న విషయం తెలిస్తే మరోసారి నేరాలకు పాల్పడేందుకు అవకాశం ఉండదు. పాత నేరస్తుల్లో మార్పు కచ్చితంగా అవసరం. నేరస్తుల డేటా టీఎస్‌కాప్ యాప్‌లో అప్‌లోడ్ చేయడంతో ఒకవేళ పాత నేరస్తులు రాష్ట్రంలో ఏ మూలన నేరం చేసినా పట్టుబడే అవకాశం ఉంది.
– జె.సురేందర్‌రెడ్డి, ఏఎస్పీ, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment