సాక్షి, హైదరాబాద్: గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు రోడ్డు రక్షణ సంస్థ (రోడ్ సేఫ్టీ అథారిటీ) ఓ అధ్యయనంలో తేల్చింది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రులు, వాహన నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు, జరిమానాలపై అథారిటీ చైర్మన్, డీజీ కృష్ణప్రసాద్ తన వార్షిక నివేదికను శనివారం విడుదల చేశారు.
సమన్వయంతో ముందుకు...
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్‌సేఫ్టీ అథారిటీ వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్టు కృష్ణప్రసాద్ తెలిపారు. రోడ్డు భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, రవాణా శాఖ, పోలీస్ శాఖ, వైద్య,విద్యాశాఖ ఇతర విభాగాలతో కలసి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం, అదే విధంగా ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టడం, రోడ్డునిర్మాణాల్లో ప్రమాదాల నివారణకు తగ్గట్టు నిర్మించేలా సూచనలు చేస్తూ పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదాలు జిల్లాల రోడ్లలోనే 55శాతం జరుగుతున్నాయని, రాష్ట్ర రహదారులపైన 16శాతం, జాతీయ రహదారులపైన 29శాతం మేర ప్రమాదాలు జరుగుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో 31శాతం మేర ప్రాణనష్టం ఉండగా, రాష్ట్ర రహదారులపై 18శాతం, జిల్లా స్థాయి రోడ్ల మీద 51శాతం ప్రాణనష్టం జరుగుతోందని వెల్లడైనట్టు పేర్కొన్నారు.
బ్లాక్ స్పాట్స్‌పై నజర్...
రాష్ట్రంలోనుంచి ప్రయాణిస్తున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లాల్లోని ప్రధాన రహదారులపై పదే పదే జరుగుతున్న ప్రమాద ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించినట్టు రోడ్డు రక్షణ సంస్థ చైర్మన్ డీజీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. 5 ప్రమాదాలకు మించి , 500 మీటర్ల లోపు జరిగిన ప్రమాద స్థలాన్ని బ్లాక్ స్పాట్స్‌గా పరిగణించినట్టు తెలిపారు. అదే విధంగా బ్లాక్ స్పాట్‌ను మూడు విధాలుగా గుర్తించామని, అందులో ఏ, బీ, సీ గ్రూపులుగా చేసి ప్రమాదాల నియంత్రణకు 2016నుంచి ఇప్పటివరకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు. 20ప్రమాదాలు లేదా 20మంది ఒకే ప్రమాదంలో మరణిస్తే ఏ కేటగిరి, 10ప్రమాదాలు లేదా ఒకే ప్రమాదంలో 10మంది మృతిచెందితే బి కేటగిరి, 5ప్రమాదాలు, ఐదుగురు మృతిచెందిన ప్రమాద ప్రాంతాన్ని సీ కేటగిరిగా విభజించారు. దశల వారీగా బ్లాక్ స్పాట్స్‌ను క్లియర్ చేసేందుకు అవగాహన, ముందస్తు జాగ్రత్తలు, ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగుకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్ ఇంజనీరింగ్‌లోమార్పులు, ప్రమాద స్థలాలకు చేరువలో అంబులెన్స్, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్లాక్ స్పాట్స్ వల్ల 2016లో 446 ప్రమాదాలు జరుగగా 573 మంది మృతిచెందగా, 818మంది క్షతగాత్రులయినట్టు నివేదికలో స్పష్టంచేశారు. 2017లో 292 ప్రమాదాలు జరిగితే 357మంది మృతిచెంది, 517 మంది క్షతగాత్రులయ్యారు. అలానే 2018లో 154 ప్రమాదాలు జరుగగా 216మంది ప్రాణాలు కోల్పో యి, 301మంది క్షతగాత్రులైనట్టు వెల్లడించారు.
‘కొండ గట్టు’తో జాగ్రత్తలు..
కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై వెంటనే రోడ్ సేఫ్టీ అథారిటీ స్పందించి, భవిష్యత్‌లో అలాంటి ప్రమాదాలు ఘాట్‌రోడ్డులో జరగకుండా చర్యలు చేపట్టినట్టు కృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. ఘాట్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశామని, బారికేడ్లు, బూమ్ బారియర్స్ ఏర్పాటుచేశామన్నారు. తాత్కాలికంగా ఏఎస్‌ఐ, ఏఎంవీఐ,ఏఈఈలతో రోడ్ సేఫ్టీ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ఘాట్ రోడ్డుపై పూర్తి స్థాయిలో హెచ్చరిక బోర్డు, సిమెంట్ కట్టడాలతో రైలింగ్స్, రాత్రి వేళల్లో లైటింగ్, రేడియం స్టిక్కర్లు తదితరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment