వైరల్
సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక సామాన్యులు ప్రశ్నించే పద్ధతులు మారాయి. ఏకంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక గ్రామీణ మహిళ
విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ‘మధ్యప్రదేశ్ నుంచి 29 సీట్లు ఇచ్చాం. మరి మా రోడ్ల సంగతేంటి?’ అని అడుగుతూ డొక్కు రోడ్ల మీద ఆమె ప్రయాణం చేస్తూ తీసిన వీడియో మోడి వరకు చేరేలా ఉంది.
పూర్వం ప్రధానికి కార్డు ముక్క రాసి పడేసేవారు జనం. ఇవాళ ఒక వీడియో చేసి వదులుతున్నారు. కార్డు రాస్తే ఎవరికీ తెలిసేది కాదు. కాని వీడియో లక్షలాది మంది కంట పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లా అటవీ ప్రాంతంతో, బొగ్గు గనుల నిక్షేపాలతో ఉంటుంది. కాని వెనుకబాటుతనం కూడా ఉంది. ‘మేం అడవుల్లో ఉంటాం. అయితే మాకు రోడ్లు అక్కర్లేదా మోదీ గారూ’ అని శివాని సాహు అనే మహిళ మోదీని ప్రశ్నించింది.
‘మధ్యప్రదేశ్ మీకు 29 సీట్లు ఇచ్చింది. ఇప్పుడైనా రోడ్లు వేయండి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. మేము ఎం.ఎల్.ఏ, ఎం.పి, కలెక్టర్ అందరినీ కలిశాం. కాని ఏం ప్రయోజనం లేదు. వానొస్తే మా పరిస్థితి అధ్వానం. బస్సు మలుపు తిరగలేదు. పిల్లలు నడవడం కూడా వీలు కావడం లేదు. రోడ్లు వేయండి మోదీ గారూ’ అని ఆమె వేడుకుంది.
అంతే కాదు ‘ ఈ వీడియో మోదీ గారికి చేరేవరకు షేర్ చేయండి’ అని కోరింది. దాంతో అందరూ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వచ్చాక సిధి జిల్లాలో పురోభివృద్ధి గురించి చర్చ నడుస్తోంది. అన్నట్టు ఇది నాటి మహా విదూషకుడు బీర్బల్ జన్మస్థలం. ఆయన మళ్లీ పుడితే ఇలాంటి ప్రభుత్వ పనితీరు చూసి ఎన్ని పరిహాసాలు ఆడేవాడో. మరెన్ని వ్యంగ్యాలు పోయేవాడో. వాతలు వేసేవాడో.
Comments
Please login to add a commentAdd a comment