ఒకపుడు మట్టి ఇల్లు, ఇపుడు భారీ ప్యాకేజీ ఉద్యోగం
ఇంజనీరింగ్ చదివి గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనేది చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు ఒక కల. కలలు అందరూ కంటారు. సాధించేది మాత్రం కొందరే. అందులోనూ ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన వేళ అలాంటి డ్రీమ్ జాబ్ సాధించడం అంటే కత్తి మీద సామే. కానీ ప్రతిష్టాత్మక కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగాన్ని సంపాదించాడో యువకుడు. బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ జాక్ పాట్ కొట్టేశాడు. గూగుల్‌లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. దీంతో అతని కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది.
జాముయి జిల్లాలోని జము ఖరియా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్ పట్నా ఎన్‌ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. అయినా అక్కడితో ఆగిపోలేదు అభిషేక్. తన డ్రీమ్ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. చివరికి సాధించాడు. బీటెక్ తరువాత 2022లో అమెజాన్‌లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. అక్కడ 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్‌లో చేరాడు. ఇక్కడ పనిచేస్తూనే ఇంటర్వ్యూలకు కష్టపడి చదివి గూగుల్‌లో ఏడాదికి 2.07కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగాన్ని సాధించాడు. గూగుల్ లండన్ కార్యాలయంలో అక్టోబర్‌లో విధుల్లో చేరనున్నాడు.
అభిషేక్ మాటల్లో చెప్పాలంటే ఒక కంపెనీలో 8-9 గంటలు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని తన కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్‌లో ఇంటర్వ్యూలకోసం ప్రిపేరయ్యేవాడు. ఇది గొప్ప సవాలే. ఎట్టకేలకు అభిషేక్ పట్టుదల కృషి ఫలించింది. "నేను ఒక చిన్న పట్టణం నుండి వచ్చా.. నా మూలాలు ఎక్కడో గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే, ఇపుడిక నేను కొత్త ఇల్లు నిర్మిస్తున్నాను." అన్నాడు సంతోషంగా.
అంతేకాదు “అన్నీ సాధ్యమే. చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా, ఏ పిల్లలైనా సరే, అంకితభావం ఉంటే, గొప్ప అవకాశాలను అందుకోగలరని నేను దృఢంగా నమ్ముతాను’’ అంటూ తన తోటివారికి సందేశం కూడా ఇచ్చాడు. అభిషేక్ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. ఆమెకు మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరికే కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ప్రేరేపించిందంటాడు అభిషేక్.
ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపాడు. తల్లితండ్రులు, సోదరులే తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పాడు. అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జముయి సివిల్ కోర్టులో న్యాయవాది, తల్లి మంజు దేవి గృహిణి. ముగ్గురి సంతానంలో చివరివాడు అభిషేక్.
Comments
Please login to add a commentAdd a comment