గోరంత విషయాన్ని కొండంత చేసి చూపించడం లేటెస్ట్ ట్రెండ్. దీన్నే బడాయి అని కూడా అంటారు. ఇదే ఫాలో అయ్యాడు ఓ బడాయి బసవయ్య. బ్యాంకు లోన్‌తో బైక్ కొనుగోలు చేసి, నానా హంగామా చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అసలు స్టోరీ ఏంటీ అంటే..
మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన మురారి లాల్ కుష్వాహ టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అలా వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో ఒక మోపెడ్ కొనుక్కోవాలనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత చేసిన హడావిడే సోషల్ మీడియాలో విడ్డూరంగా నిలిచింది.
బైక్ కొనుక్కోవాలనే ఆలోచనరాగానే అందరిలాగానే బ్యాంకును ఆశ్రయించాడు మురారి లాల్. రూ. 90వేల విలువైన టూవీలర్ ( టీవీఎస్ మోపెడ్) కోసం లోన్ తీసుకొని, 20వేల రూపాయల డౌన్‌పేమెంట్ కట్టాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ. బైక్‌ను తీసుకోవడానికి షోరూమ్‌కు ఏకంగా గుర్రపు బండి, డీజే గ్యాంగ్‌తో తరలి వచ్చాడు. ఆచారం ప్రకారం, కొత్త బండికి పూలమాలవేసి, పూజలు నిర్వహించాడు. అనంతరం బైక్ ఊరేగింపు షురూ అయింది. దోస్తులతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేస్తూ దాదాపు 115 కిలోమీటర్లు ఊరేగింపు తీశారు. అంతేకాదు బండి అందరికీ కనిపించేలా జేసీబీతో కూడా పైకెత్తించాడు. దీని కోసం మురారి పెట్టిన మొత్తం ఖర్చు అక్షరాలా 60వేల రూపాయలు. పైగా తన పిల్లల సంతోషం కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో వేడుక చేసుకోవడం తనకిష్టమని చెప్పాడు.
ట్విస్ట్ ఏంటంటే
ఈ తతంగం అంతా పోలీసులకు చేరింది. ముందస్తు అనుమతి లేకుండా రహదారిపై అనవసర హగామా చేయడమేకాకుండా, డీజేతో శబ్ద, వాయు కాలుష్యానికి కారణమై నారంటూ స్థానిక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురారితో పాటు డీజే ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేశారు. డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మురారికి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రూ.12,500 పెట్టి ఫోన్ కొని, రూ.25 వేలతో సంబరాలు చేసుకున్నాడట మురారి.
Comments
Please login to add a commentAdd a comment