
ఫైనాన్షియల్ బేసిక్స్..
జీవిత బీమాను సమీక్షించాల్సిందే..
మార్పు సహజం. ప్రపంచంలో ప్రతి ఒక్కటీ మార్పు చెందుతూనే ఉంటుంది. మన విషయానికి వస్తే.. మన కోరికలు, అవసరాలు, లక్ష్యాలు, కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాయి. జీవితంలో జరిగే మార్పులు జీవిత బీమా పాలసీని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే పాలసీని తీసుకుని ఉంటే దాన్ని ఏడాదికొకసారైనా సమీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు పెళ్లికి ముందు, తర్వాత జీవితం చాలా మారిపోతుంది. కొద్ది కాలానికి పిల్లలు వస్తారు. కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు మనపై ఆధారపడ్డ వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే ఇంటి/కారు రుణం తీరడం వంటి అంశాలు జీవిత బీమా పాలసీని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సందర్భాలు ఏం జరిగినా... అప్పుడు బీమా పాలసీని సమీక్షించుకోవడం తప్పనిసరి.
పాలసీ సమీక్ష ఎప్పుడు జరగాలి?
⇒ రిలేషన్‌షిప్ ఏర్పాటు: పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత జీవితం మారుతుంది. అప్పుడు పాలసీ సమీక్ష అవసరం. అలాగే పెళ్లైన తర్వాత విడాకులు తీసుకుంటే అప్పుడు కూడా పాలసీ సమీక్ష జరగాలి.
⇒ కుటుంబం పెరుగుదల: పెళ్లైన తర్వాత కొంత కాలానికి కుటుంబంలోకి పిల్లలు వస్తారు. అప్పుడు కూడా పాలసీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే భార్యభర్తలు ఉన్నప్పుడు ఖర్చులు ఒకరకంగా ఉంటాయి. అలాగే పిల్లలు పుట్టే కొద్ది అయ్యే వ్యయాలు మరోలా ఉంటాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని పాలసీలో మార్పులు చేసుకోవాలి.
⇒ రుణాలు: కొత్త రుణాలు తీసుకున్నప్పుడు కూడా పాలసీని సమీక్షించుకోవాలి. ఇంటి రుణం, కారు రుణం వంటి అంశాలు కుటుంబ ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తాయి. అలాగే ఆ రుణాలు తీరినప్పుడు కూడా పాలసీ సమీక్ష జరగాలి.
⇒ ఆదాయం: వచ్చే సంపాదనలో మార్పులు జరిగినప్పుడు కూడా పాలసీ సమీక్ష జరగాలి. ఆదాయాన్ని అనుసరించే లైఫ్‌స్టైల్ ఉంటుంది.
⇒లబ్ధిదారుడి మార్పు: మీరు పాలసీ తీసుకునే సమయంలో ఒక వ్యక్తి పేరును లబ్ధిదారునిగా సిఫార్సు చేశారు. కొద్ది కాలానికి అతను మరణించాడు/ సత్సంబంధాలు లేవు / రిలేషన్‌షిప్ చెడింది అనుకోండి. అప్పుడు కూడా పాలసీని సమీక్షించుకోవాలి.