అంజలీ.. ఈరోజు ఎలాగూ కాలేజీ సెలవు కదా ఇల్లు సర్దేద్దాం నువ్వూ నాన్నా రెడీగా ఉండండి.. వంటింట్లోంచి కేకేసింది లావణ్య.. అమ్మా ఈరోజు వద్దమ్మా .. ఇంకోరోజు చేద్దాం.. తప్పించుకోబోయింది కూతురు.. లేదు.. లేదు.. పండగ వచ్చేస్తోంది.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. అన్నీ రూములు.. సెల్ఫ్ లు.. పుస్తకాలు.. బట్టలు.. బుక్స్ ర్యాకులు అన్నీ తీసి పక్కన పెట్టండి.. అన్నీ దుమ్ము దులిపి అన్నీ మళ్ళా లోపల పెట్టాలి.. అర్థమైందా.. ఆర్డర్ వేసింది లావణ్య. సరే.. చేస్తే నాకేమిస్తావ్ అంది అంజలి.. నీకు బిర్యానీ చేసి.. సాయంత్రం బొబ్బట్లు చేస్తాను అని ఆఫర్ ఇచ్చింది.. మరి నాకూ అన్నాడు రాజేష్ కొంటెగా.. సిగ్గుండాలి మనిషికి అని మురిపెంతో కలిపిన చిరాకుతో వంటింట్లోకి వెళ్ళింది లావణ్య.
బుక్స్ సర్దుతూ నాన్నా ఇదేంటి ఇలా మాసిపోయింది అంటూ ఓ కోతిబొమ్మను చూపించింది.. ఓ.. అదా.. ఇన్నేళ్లకు మళ్ళీ దొరికిందా అంటూ దాన్ని ముద్దుగా చేతిలోకి తీసుకున్న లావణ్య.. ఓహ్.. అదా.. నువ్వు నాలుగేళ్లు ఉన్నపుడు డాల్ఫిన్ హోటల్లో ఓ పుట్టినరోజుకు వెళ్ళాం గుర్తుందా అప్పుడు అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన బొమ్మ కావాలని ఏడ్చావు.. ఎంత ఊరుకోబెట్టినా ఏడుపు ఆపలేదు.. చిరాకొచ్చి నాన్న నీకు టెంకిమీద రెండు పీకాడు గుర్తుందా.. అంది లావణ్య.. ఓహ్.. నాన్న నన్ను కొట్టారా.. అంటూ ఇప్పుడు ఏడుపు మొహం పెట్టింది అంజలి.. ఆ.. అలా కొట్టి మళ్ళీ నిన్ను ఎత్తుకుని జగదాంబ జంక్షన్లో చినుకులు పడుతున్నా వెతికి మరీ ఈ బొమ్మ కొన్నాం.. అదన్నమాట దీని కథ.. అని లావణ్య చెప్పగా.. ఓహ్.. అంటూ నాన్న తనను కొట్టారన్న కోపం స్థానే.. నాన్నను నేనంటే ఎంత ముద్దో అని ప్రేమగా నాన్నవైపు చూసింది అంజలి.
నాన్నా చిన్న చిన్న గ్రీటింగ్స్ .. ఆకులు.. ఎండిపోయిన పూలు.. రంగుకాగితాలు దొరికాయ్.. అంది అంజలి.. అవునమ్మా చిన్నప్పుడు నువ్వు నా బర్త్ డేకు. న్యూ ఇయర్ కు కూడా నువ్వే సొంతగా గ్రీటింగ్ చేసి ఇచ్చేదానివి.. అవన్నీ ఇలా దాచిపెట్టాను.. ఇప్పుడు పెద్దయ్యాక ఇవ్వడం మానేసావులే.. అన్నాడు రాజేష్ నిష్టూరంగా. చిన్ననాటి తన క్రియేటివిటీకి మురిసిపోయిన అంజలి.. అయ్యో అదేంలేదునాన్న నువ్వు ఎప్పటికీ నాకు హీరోవి.. నీకు నేనే పెద్ద గ్రీటింగ్ కార్డు.. అంటూ కవర్ చేసేసింది.
నాన్నా ఇవేంటి ఐస్ క్రీమ్ కప్పులు.. జడక్లిప్పులు.. అన్నీ ఒక్కో రంగులో ఒక్కో గాజు.. ఇవన్నీ ఒక్కో కవర్లో ఉన్నాయి.. బయటపడేయాలా అంది అంజలి.. వంటగదిలోంచి పరుగున వచ్చిన లావణ్య.. వెంటనే ఆ కవర్ అందుకుని తీసుకుంది.. ఎందుకమ్మా ఆ చెత్తంతా బయటేసేద్దాం అంది అంజలి.. అది చెత్త కాదమ్మా.. ప్రేమ జ్ఞాపకాలు చెప్పబోయాడు రాజేష్.. చాలు.. మీ దిక్కుమాలిన లవ్వు.. దానికో జ్ఞాపకం.. పిల్ల ఉందన్న జ్ఞానం కూడా లేదు.. కసురుకుంటూ.. జ్ఞాపకాలను తలచుకుంటూ కవర్ తీసుకుని ప్రేమగా వేరేచోట పెట్టింది.
ర్యాక్ లోని కవర్ నుంచి ఓ పాత చీర తీసి సెల్ఫ్ మొత్తం తుడిచేయబోతుంటే రాజేష్ .. అంజూ ఆ చీర జాగ్రత్తగా ఉంచమ్మా అన్నాడు.. ఏంది దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా అంది అంజలి.. ఉంది నాన్న.. నేను అమ్మను తొలిసారి చూసింది ఈ చీరలోనే.. ఆ తరువాతనే నేను అమ్మను ప్రపోజ్ చేయడం.. పెళ్లి చూపులు చూడడం ... నువ్వు మాకు దక్కడ అంటూ పరవశంతో చెబుతున్నాడు.. ఐతే నాన్న నేను ఈ చీర ఉంచుకుంటా.. అమ్మనువ్వు ఇద్దరూ నాతో ఉన్నట్లే ఉంటుంది కదా అంది అంజలి.. పాప ప్రేమను చూసి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.. సరే సర్దింది చాలు.. బిర్యానీ అయిపొయింది.. రండి అంది లావణ్య. చూసారా ఇల్లు సర్దితే అటు సమన్లు పేర్చుకోవచ్చు.. ఇటు పాత జ్ఞాపకాలనూ పొడుపుకోవచ్చు అంది లావణ్య.. అవునవును అంటూ తండ్రీకూతుళ్ళు ఇద్దరూ తల్లిని అల్లుకుపోయారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment