నమ్మకమే జీవితం.. ఆయనే ఉదాహరణ.. | Lord Krishna Watching Laddu shop In Jabalpur | Sakshi
Sakshi News home page

నమ్మకమే జీవితం.. ఆయనే ఉదాహరణ..

Published Sat, Mar 22 2025 12:53 PM | Last Updated on Sat, Mar 22 2025 12:53 PM

Lord Krishna Watching Laddu shop In Jabalpur

ఓనాడు స్కూల్లో పిల్లలందరినీ దగ్గరకు పిలిచిన టీచర్ తలా ఒక్కో అరటిపండు ఇచ్చి ఎవరు చూడని చోటకు వెళ్లి తినేసి రండి అన్నారట. పిల్లలందరూ తినేసి వట్టి చేతులతో వచ్చి.. ఎవరు చూడకుండా తినేసాను మాస్టర్ గారు అన్నారట. కానీ స్వామి వివేకానంద మాత్రం అదే అరటిపండు వెనక్కి తెచ్చి నిలబడ్డారు. అదేంటి నరేంద్ర నువ్వు ఎందుకు తినలేదు ఆ మూలకు వెళ్లి తినొచ్చు కదా అన్నారంట టీచర్ గారు.. ఎవరూ లేని చోటుకి నేను వెళ్ళలేదు టీచర్ గారు.. ఎవరికి కనిపించిన చోటు అంటూ ఉండదు.. ఎవరు చూడకపోయినా మనం చేసే ప్రతి పని ప్రతి కర్మను భగవంతుడు చూస్తుంటాడు.. అందుకే నేను ఆయన కళ్ళుగప్పి తినలేకపోయాను.. ఇదిగోండి మీ అరటిపండు అంటూ తెచ్చి ఇచ్చేసాడట. అంటే ఎవరికీ కనిపించకపోయినా నమ్మకం, విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది.. అదే ఈ జీవితాలను నడిపిస్తుంది..

ఓ పసి పిల్లాడ్ని గోడ ఎక్కించి మనం కింద నిలబడి దూకేయిరా చిన్నా నేను పట్టుకుంటాను అని చేతులు చాచిన మరుక్షణం ఆ చంటోడు ఒక్క క్షణం జాగు చేయకుండా నవ్వుతూ చటుక్కున దూకేస్తాడు. వాడికి తండ్రి మీద ఉన్న నమ్మకం. నాన్న తనను జారిపోనివ్వడని.. పడిపోనివ్వడని.. తనను భద్రంగా పట్టుకుంటాడని విశ్వాసం. ఆ నమ్మకమే పిల్లాణ్ణి అంతెత్తు నుంచి దూకేలా చేసింది.. చేస్తుంది.

అమ్మా  గమ్మున జడ వేసేసి పౌడర్ రాయవే నాన్న వస్తారు.. నన్ను బయటకు తీసుకెళ్ళి జైంట్ వీల్ ఎక్కిస్తారు అని అల్లరి చేస్తోంది చిన్నారి. దానికి నాన్నంటే అంత నమ్మకం.. అందుకే స్కూలు నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫ్రెష్ గౌన్ వేసుకుని నాన్న కోసం గుమ్మంలో ఎదురుచూస్తోంది. ఒసేయ్ మీ నాన్న రాడు.. మార్చి నెల కదా ఆఫీసులో పని ఎక్కువ ఉంటుంది. ఇంకో రోజుంటే తీసుకువెళ్తాడులే అని అమ్మ చెబుతున్నా వినదు. దాని నమ్మకం దానిది. తనకు మాట ఇచ్చారంటే ఆఫీస్ పని వాయిదా వేసి.. అవసరం అయితే ఆఫీసులో గొడవ పెట్టుకుని అయినా వస్తారనేది దాని నమ్మకం. 

అనుకున్నట్లే అరగంట ముందు వచ్చాడు నాన్న.. చిన్నదాని కళ్లలో మెరుపు.. చూశావా నాన్న నాకు  ఎప్పుడూ అబద్ధం చెప్పడు అంటూ బైక్ ట్యాంక్ మీద కూర్చుని అమ్మకు బై చెబుతూ తుర్రుమంది.. వెళ్తున్నంతసేపూ నాన్నతో అమ్మమీద కంప్లయింట్లు చెబుతోంది. నువ్వు రావన్నది నాన్నా . వస్తావని నేను చెబుతున్నా వినదే అంటున్నపుడు నా నమ్మకాన్ని నిలబెట్టావు.. నా మాట నెగ్గింది.. నెగ్గించావు నాన్నా అనే గర్వం ఆ చిన్నదాని మాటల్లో ప్రస్ఫుటిస్తూనే ఉంది.

ఈసారి సరిగా వేయలేదు కానీ.. వచ్చే ఏడాది అప్రైజల్లో నీకు భారీ హైక్.. ప్రమోషన్ గ్యారెంటీ.. గట్టిగా పని చేయవయ్యా సుభాష్ అని చెబుతున్న మేనేజర్ మాటల్లోని దృఢత్వం సుభాష్ ను రేసు గుర్రంలా పరుగెత్తించింది. మేనేజర్ మాటంటే మాటే.. అదే నమ్మకం సుభాష్ తో మరింత ఎక్కువ పని చేయించింది.

కొన్నిసార్లు ఈ నమ్మకం మనల్ని ముంచేస్తుంది.. నీకెందుకు డార్లింగ్ మీ అమ్మ తాలూకు బంగారం డబ్బు పట్టుకుని వచ్చేయ్ ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం అని ప్రియుడు చెప్పిన మాటలు నమ్మి ఊబిలో చిక్కుకున్న అమాయకురాళ్లు ఎందరో.. ఈ సైట్ కొనండి సర్.. రెండేళ్లలో డబుల్ చేసి అమ్మెద్దాం అని బ్రోకర్ చెప్పగా నమ్మేసి ప్రభుత్వ భూమిని కొనేసి అడ్డంగా నష్టపోయినవాళ్ళూ ఉన్నారు. నమ్మకం అనేది ఒకొక్కరి జీవితంలో ఒక్కోలాంటి ఫలితాలను సూచిస్తుంది. దుష్యంతుడు తన వద్దకు మళ్ళీ వస్తాడు అనేది శకుంతల నమ్మకం.. కానీ శాపగ్రస్తుడైన ఆయన శకుంతలకు ఇచ్చిన మాట మర్చిపోతాడు. అది ఆమెకు ఎంతటి నష్టాన్ని కలగజేసిందో పురాణాల్లో చదవవచ్చు.

ఇదంతా ఎందుకు చెప్పడం అంటే జబల్‌పూర్‌లోని లడ్డు గోపాల్ అనే వ్యక్తి స్వీట్ షాపులోని క్యాష్ కౌంటర్లో ఎవరూ ఉండరు. షాప్ తెరిచే ఉంటుంది.. సీసీ కెమెరాలు కూడా ఉండవు. ఎవరికి నచ్చిన మిఠాయి వాళ్ళు తీసుకుని కౌంటర్ మీద ఉండే డబ్బాలో డబ్బులు వేయడమే. మీరు వేశారా లేదా అనేది మీకు తెలుస్తుంది అంతే తప్ప దుకాణం యజమానికి తెలియదు.. చూడడు. అయితే, ఆ కౌంటర్ వద్ద చిన్ని కృష్ణుని విగ్రహం మాత్రం ఉంటుంది. మీరు చేసేవన్నీ ఎవరూ చూడకపోయినా ఆయన చూస్తూ ఉంటాడన్నమాట . ఆ నమ్మకంతోనే ఆ ఓనర్ ఆ షాపును అలా నిర్వహిస్తున్నారు. అదన్నమాట సంగతి.. నమ్మకమే జీవితం.
-సిమ్మాదిరప్పన్న. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement