అనుబంధాలు, ఆప్యాయతల కలబోత రాఖీ పౌర్ణమి | Rakhi Purnima | Sakshi
Sakshi News home page

అనుబంధాలు, ఆప్యాయతల కలబోత రాఖీ పౌర్ణమి

Published Wed, Aug 17 2016 11:36 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

Rakhi Purnima

  •  నేడు రాఖీ పండుగ
  •  అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక
  • మార్కెట్‌లో పలు డిజైన్లలో రాఖీలు
  • ఆన్‌లైన్‌లోనూ...
  • నిజామాబాద్‌ కల్చరల్‌ : కాలం మారినా.. దూరం పెరిగినా.. చెరగని బంధం అన్నాచెల్లెల అనుబంధం... అన్నాచెల్లెల, అక్కాతమ్ముళ్ల అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ.. జీవితంలో తనకు ఎల్లవేళలా రక్షగా ఉండాలని, సాదకబాధకాల్లో తోడుగా నిలవాలని అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది.. అన్నాదమ్ములకు రాఖీలు కట్టేందుకు ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్తారు.. వీలు కానివారు పోస్టు ద్వారా, ఆన్‌లైన్‌లోనూ.. తమ సోదరులకు రాఖీలు పంపుతారు.. గురువారం రాఖీ పండుగ నేపథ్యంలో ప్రత్యేక కథనం...
    పండుగ పరమార్థం..
    సోదరి సోదరుల అనురాగాలకు ప్రతీకైన రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెల్లకు రాఖీ కడితే మేము మీకు రక్షగా నిలుస్తామని మాట ఇవ్వడం ఈ పండుగ పరమార్థం.. ఈ రోజు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు అక్కాచెల్లెల్లు ఆరాటపడుతుంటారు. ఈ బంధం కలకాలం నిలవాలని కోరుకుంటారు. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మన సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి. కానీ ప్రముఖంగా జరుపుకునేది.. రాఖీ పండుగ. తెలంగాణలో మహిళలు ఇష్టంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ, రాఖీ పండుగలను విశేషంగా చెప్పవచ్చు.
    పలు రకాల ఆకృతుల్లో.. 
    ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల ఆకృతుల్లో రాఖీలు అందుబాటులో ఉన్నాయి.. చిన్నపిల్లలను ఆకర్షించేలా టామ్‌ అండ్‌ జెర్రీ, చోటా భీమ్, పోక్‌మాన్‌ లాంటి ఎన్నో రకాల డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి.. అలాగే పెద్దల కోసం ఫ్యాన్సీ, గోల్డ్,సిల్వర్‌ ప్లేటెడ్, స్టోన్‌ రాఖీలు ఆకట్టుకుంటున్నాయి.. గతంలో కంటే ఈసారీ ధరలు పెరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారస్తులు చెబుతున్నారు.. అయినా రాఖీలు కొనుగోలు చేసేందుకు ఆడబిడ్డలు పోటీ పడుతున్నారు... నగరంలోని కుమార్‌ గల్లి, పూసలగల్లి,కిషన్‌గంజ్, మార్వాడీగల్లి, జవహర్‌ రోడ్, బడాబజార్, శివాజీనగర్, కంఠేశ్వర్, హైదరాబాద్‌ రోడ్, వినాయక్‌నగర్‌ తదితర ప్రధాన ప్రాంతాల్లో రాఖీల దుకాణాలు వెలిశాయి. ఇప్పటికే పలు చోట్ల కొనుగోళ్లు మొదలయ్యాయి.. రూపాయి మొదలుకొని వెయ్యి రూపాయల వరకు రాఖీలు అందుబాటులో ఉన్నాయి..
    ప్రత్యేక కిట్‌లు..
    విదేశాల్లో ఉండే తమ సోదరుల కోసం రాఖీ కిట్‌లను పంపుతుంటారు కొందరు.. ఈ కిట్‌లలో రెండు రాఖీలు, కుంకుమ బొట్టు, పసుపు, అక్షింతలు, స్వీట్లు ఉంటాయి.. సిల్వర్‌ కోటెడ్‌ ప్లేట్లతో కూడిన మంగళహారతి పళ్లాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో ఉండే సోదరుల దగ్గరికి వెళ్లలేని వారు ఇలా కిట్‌లు పంపడం సంప్రదాయంగా వస్తోంది.. ఈ కిట్‌ల ధర రూ. 300 మొదలుకొని రూ. 1000 వరకు ఉన్నాయి.
    కాలానుగుణంగా..
    కాలానుగుణంగానే రాఖీల డిజైన్లలోనూ మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న స్పాంజ్‌పైన ప్లాస్టిక్‌ స్వస్తిక్, ఓంకారం తదితర బొమ్మలతో కూడిన రాఖీలు ఉండేవి.. అవి కూడా కొన్ని రకాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. తర్వాత కాలంలో నెమలి ఈకలు, నాణెల రూపంలో, బొమ్మల రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మారుతున్న అభిరుచులకనుగుణంగా తయారీదారులు వినూత్న డిజైన్లు మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. చిన్న పిల్లల కోసం కామిక్‌ బొమ్మలు, పెద్దల కోసం బంగారం, వెండి కోటెడ్, ఇంకా మరెన్నో డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.. వ్యాపారులు కూడా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా ఆహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, బరోడా ప్రాంతాల నుంచి రాఖీలు తెప్పిస్తున్నారు. ఇక స్వర్ణకారులు వెండి, బంగారు రాఖీలను అమ్ముతున్నారు. 
    లేడీస్‌ స్పెషల్‌ రాఖీ
    వివాహిత మహిళలు తమ సోదరులకే కాదు వదిన, మరదళ్లకు కూడా కట్టే రాఖీలు ఈ మధ్య మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని లేడీస్‌ స్పెషల్‌ రాఖీలుగా పిలుస్తున్నారు. వ్యాపారులు వీటిని ప్రత్యేకంగా ముంబై నుంచి తెప్పిస్తున్నారు. 
    విలువైన కానుకలు..
    రాఖీ కట్టిన తన సోదరికి కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.. కొందరు కానుకలుగా డబ్బులు, మరికొందరు డ్రెస్సులు, చీరలు కొని ఇస్తారు.. ఇంకొందరు బంగారం, వెండి తదితర విలువైన కానుకలు ఇస్తారు...
    ఆన్‌లైన్‌లోనూ..
    దూర ప్రాంతాల్లో ఉన్న సోదరుల కోసం ఆన్‌లైన్‌లో కూడా రాఖీలు పంపవచ్చు.. ఆన్‌లైన్‌లో రాఖీలు పంపేందుకు ఎన్నో సంస్థలు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో తమవారికి రాఖీలు పంపేందుకు ఆన్‌లైన్‌బాట పడుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ వేల సంఖ్యలో రాఖీలు అందుబాటులో ఉంచుతున్నారు. వజ్రాలు పొదిగినవి, గోల్డ్‌ ప్లేటెడ్, ముత్యాల జర్దోసి తదితర వందల రకాల్లో రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రూ. 300 నుంచి రూ. 10 వేల వరకు ధరలో విభిన్న రాఖీలు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement