ఇదో రూ.3 కోట్ల ముచ్చట | Three Crore Wastage On Yating Festival | Sakshi
Sakshi News home page

ఇదో రూ.3 కోట్ల ముచ్చట

Published Thu, Mar 29 2018 11:46 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

Three Crore Wastage On Yating Festival - Sakshi

బుధవారం రాత్రి ఫిషింగ్‌ çహార్బర్‌కు చేరుకున్న యాటింగ్‌ బోటును పరిశీలిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగర తీరంలో దేశంలోనే తొలిసారిగా నిర్వహించతలపెట్టిన యాటింగ్‌ ఫెస్టివల్‌కు పర్యాటకుల నుంచి ఆశించనంత స్థాయిలో స్పందన కనిపించలేదు. విదేశాల్లో మాత్రమే నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌ వేదికగా దేశ విదేశాల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆరు లక్షల మందికి ఆహ్వానాలు పంపగా తొలుత 1500 మంది ఆసక్తి చూపారు. చివరకు కేవలం 16 మంది మాత్రమే ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నారు. బుకింగ్‌ ద్వారా వచ్చిన ఆదాయం రూ.2.50 లక్షలు కాగా ఖర్చు మాత్రం రూ.3 కోట్లకు పైగా దాటిస్తోంది.

కేవలం ఒక్క బోటు రాక
షెడ్యూల్‌ ప్రకారం బుధవారమే ఫెస్టివల్‌ ప్రారంభించాల్సి ఉంది. కానీ బోట్ల రాకలో జాప్యం, పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో గురువారానికి పొడిగించారు. యాటింగ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తొమ్మిది బోట్లు వస్తాయని పర్యాటక శాఖ ప్రకటించింది. వీటిలో గోవా నుంచి ఐదు, చెన్నై నుంచి రెండు, థాయ్‌లాండ్‌ నుంచి మరో రెండు సోమ, మంగళవారాల నాటికే విశాఖ చేరుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క బోటు విశాఖ సాగర తీరానికి చేరుకుంది. మిగిలిన బోట్లన్నీ మార్గంమధ్యలో ఉన్నాయని పర్యాటక శాఖాధికారులు చెబుతున్నారు. మిగిలినవి గురువారం మధ్యాహ్నానికి చేరుకుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వీవీఐపీలతో కలిసి చేయాల్సిన యాటింగ్‌ విహారంపై సందిగ్ధత నెలకొంది.

ట్రాలీ దిగని బోటు
బుధవారం సాయంత్రం ట్రయిల్‌ రన్‌ నిర్వహించాలని భావించినప్పటికీ ఒకే ఒక్క బోటు అదీ అతికష్టమ్మీద సాయంత్రానికి చేరుకోవడంతో విరమించుకోవల్సి వచ్చింది. ట్రాలీపై వచ్చిన ఆ బోటును కిందకు దించలేకపోయారు. బుధవారం రాత్రి టూర్‌ ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు, కొంతమంది వీఐపీలను ట్రయిల్‌ రన్‌కు తీసుకెళ్తామని ప్రకటించారు. కానీ బోటు దింపే పరిస్థితి లేకపోవడంతో ట్రయిల్‌ రన్‌కు సైతం ముఖం చాటేశారు. ఇది ఇలా ఉండగా యాటింగ్‌ బోట్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ప్రవీణŠకుమార్‌లు తిలకించి ఏర్పాట్లను సమీక్షించారు. మిగిలిన బోట్లు ఎప్పుడొస్తాయి..? ఆరా తీశారు.

గత ఫెస్టివల్స్‌ అన్నీ తుస్‌
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన పలు ఫెస్టివల్స్‌ కూడా ఇదే రీతిలో తుస్సుమన్నాయి. హెలిటూరిజం, బెలూన్‌ ఫెస్టివల్, విండ్‌ ఫెస్టివల్, సౌండ్‌ ఆన్‌ సాండ్, దసరావళి వంటి కార్యక్రమాలన్నీ అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయి. వాటి సరసనే ఈ యాటింగ్‌ ఫెస్టివల్‌ కూడా చేరే సూచనలు కన్పిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement