యేటి సేత్తామ్.. అందరికి అనుకున్నట్లు అవుతాదేటీ.. ఎవలికి ఏది ప్రాప్తమో.. అదే దక్కుతాది.. నువ్వెంత ఎగిరినా కాణీ ఎక్కువ రాదు.. అంటాడు నారాయణ. అచ్చం రజనీ కాంత్ చెప్పినట్లే చెప్పాడు.. దక్కేది దక్కకుండా పోదు.. దక్కనిది ఎన్నటికీ దక్కదు అనే మాటను నారాయణ సింపుల్‌గా చెప్పేసాడు.
అవును.. ఇద్దరు మగపిల్లలు.. ఒక ఆడపిల్ల ఉన్న నారాయణకు అరవయ్యేళ్లపైనే ఉంటుంది.. అప్పట్లో చిట్టివలస జూట్ మిల్లులో పని చేశాడట.. అది మూసేసాక ఇక వేరే పనేం లేక.. ఆనందపురం దగ్గర్లోని తాళ్ల వలసలో ఊరకనే ఇంట్లో ఉండడం ఎందుకని కూరగాయలు.. ఆకుకూరలు, పూలు.. మార్కెట్లో కొనుక్కుని మళ్ళా మారు అమ్మకానికి మోపెడ్ మీద తిరుగుతాడు. రోజూ దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు తిరుగుతాడు.
పెద్దగా తెలివితేటలు లేవు .. ఎక్కువ రేటు చెప్పడు.. మార్కెట్ రేటుకు మరి కాసింత పైన వేసుకుని అమ్ముతాడు.. ఇదేంటి నారాయణ ఇంత అమాయకుడివి.. తెలివి లేదు ఎలా బతుకుతావు అంటే.. పల్లకుందూ ఎవడినైనా ముంచాలంటే తెలివుండాలి గానీ.. మామ్మూలుగా బతకడానికి తెలివెందుకు.. మనం కొన్న సరుకుమీద కేజీకి ఐదో పదో వస్తే చాల్లే.. నాకెందుకు తెలివి.. మేడలు కట్టాలా.. మిద్దెలు కట్టాలా అంటాడు.. అవునులే.. బతకడానికి తెలివి అక్కర్లేదు.. రెక్కలకష్టం చాలు.. ఎవరినో మోసం చేయాలంటే తెలివి ఉండాలి.. అనేశాను.
నారాయణతో వాదించలేం.. తెలివి లేదంటాడు.. కొత్త లాజిక్కులు తీస్తాడు.. నారాయణ ఇద్దరు కొడుకులూ మేస్త్రీలే.. రోజూ పని.. డబ్బులు ఉంటాయి.. ఇద్దరి బతుకులకు ఎక్కడా సమస్య లేదు.. ఆడపిల్లను కూడా దగ్గిరోళ్లకే ఇచ్చాను.. దాని బతుక్కి పర్లేదు.. అల్లుడు మంచోడే.. పండక్కి కూతురికి మూడువేల ఇచ్చాను.. నా కొడుకులు కూడా తలా వెయ్యేసి ఇచ్చారు.. మొత్తం ఐదువేలు.. దానికి దాని పిల్లలకు గుడ్డముక్కలకు సరిపోతాయి.. ఇంకేటి కావాలి చెప్మి అంటాడు.. అంత దిలాసాగా ఉన్నవాడితో మనం నెగ్గుకురాలేం.. అవును నారాయణ జీవితానికి ఇంకేటి కావాలి అన్నాను.
పిల్లలు బాగున్నారు కదా మరి నువ్వెందుకు తిరగడం అంటే.. మా బాగా చెప్పినావ్.. మన బతుకు మనది.. నేను మా ముసల్ది .. నా జీవితం వేరే.. పిల్లలతో మనకెందుకు.. ఒంట్లో సత్తువున్నంత వరకు మనం పంజేయాలా. పైసా తెచ్చుకోవాలా.. మనం ఆళ్ళమీద చెరబడ్డం ఎందుకు.. నాకసలు అలాంటివి నచ్చదు.. రోజూ ఇలాగే తిరుగుతా నాకు మా ఇంటిదానికి సరిపోతాయి.. ఇంకా వందా యాభై మిగిలితే మానవరాళ్లకు గట్రా ఇస్తుంటా అంటాడు.. యేటి మరి పండక్కి బట్టలు కొన్నావా అంటే.. ఆ.. రెండు కొత్త నిక్కర్లు.. చొక్కా కొన్నా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.. మరేటి ఐతే కనుమకు ఏర్పాట్లు అంటే.. ఉంటుందిలే.. ముక్కలు గట్రా.. ఉండవేటి మరి.. అన్నీ ఉంటాయి.
కనుమంటే కనుమే అంటాడు.. మరి కనుమకు మా ఇంటికి వచ్చేరాదూ నారాయణా అంటే.. గొప్పగ చెప్పినావ్.. మనవళ్లు.. మనవరాళ్లు కొడుకులు.. కోడళ్ళు.. ఓస్.. ఎంతమంది ఉన్నారనుకున్నావ్.. మా ఇల్లే పెద్ద జాతర తెలుసా.. నువ్వే మా ఇంటికి వచ్చిద్దు.. మంచి మాంసం కూర వండుకుందుము అని ఎదురు ఆహ్వానిస్తాడు.. అప్పుడంతే జగనన్న ఉన్నప్పుడు పండుక్కి ఏదో పధకం డబ్బులొచ్చేవి.. పండుగ గడిసిపోయేది.. ఇప్పుడవేటి లేవు.. ఇంట్లో పైసా లేదు. జనాల దగ్గర డబ్బుల్లేవు.. మనమే ఏదో చేసి తెచ్చుకోవాలి.. అంటూ ఎకనామిక్స్ మొదలెట్టాడు.. ఆ ఓహో అన్నాను. సర్లే.. నీతోటి మాట్లాడుకుని కూకుంటే నా యాపారం లాసైపోద్ది .. ఎల్తాను.. మళ్ళా పండుగ.. కనుమల తరువాత వస్తాను.. అంటూ కూరగాయల సంచితో బయల్దేరాడు..
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment