గ్రీస్.. గుబుల్! | Why Aren't the Markets Freaking Out More About the Greek Crisis? | Sakshi
Sakshi News home page

గ్రీస్.. గుబుల్!

Published Tue, Jun 30 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

గ్రీస్.. గుబుల్!

గ్రీస్.. గుబుల్!

 అప్పుకోసం తిప్పలు    షరతుల వద్దే అసలు పేచీ  
 వడ్డీలు కట్టడానికి కొత్త రుణాలు   నేడు రుణం అందకపోతే దివాలా!
 ఈ రుణంపై జూలై 5న రిఫరెండం   ఇది చూసి ప్రపంచ మార్కెట్లలో ఆందోళన

 
 అప్పు తీర్చడానికి మరో అప్పు. వడ్డీ కట్టడానికి మరో అప్పు. కొత్త అప్పు కోసం ఏ షరతుకైనా ఓకే!! అంతలోనే రాజకీయ మార్పు. షరతులకు లొంగేది లేదని బింకాలు పోయిన పార్టీకి ప్రజల పగ్గాలు!. తీరా ఇప్పుడేమైంది? బింకాలు పోయినా ఆ నాయకుడు చేతులెత్తేశాడు. షరతులకు లొంగాలో వద్దో మీరే తేల్చుకోండంటూ ప్రజల కోర్టులోకే బంతి విసిరేశాడు! అదీ క్లుప్తంగా గ్రీస్ సంక్షోభం. ఈ సంక్షోభం పూర్వాపరాలు... అది చూపించబోయే ప్రభావంపై ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది...
 
 ఇప్పటివరకూ 19 సభ్యదేశాల యూరోజోన్‌కే పరిమితమైన గ్రీసు సంక్షోభం... సోమవారం ప్రపంచాన్నంతటినీ చుట్టుముట్టడంతో ఈక్విటీ, బాండు మార్కెట్లు పతనమయ్యాయి. ఇందుకు దారితీసిన కారణమేంటంటే... ఐదేళ్ల క్రితం యూరప్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం గ్రీసునూ చుట్టుముట్టింది. బయటపడటానికి ఆ దేశం ఎడాపెడా అప్పులు చేసింది. ఒక రుణాన్ని, వడ్డీని చెల్లించేందుకు మరో రుణాన్ని, దానికోసం ఇంకో రుణాన్ని....ఇలా తీసుకుని అప్పుల కుప్పలా మారింది. 566 బిలియన్ డాలర్లకు చేరిన అప్పు... ఆ దేశపు జీడీపీ 242 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపునకు పైనే. ఈ రుణాలు తీర్చడానికి గ్రీసు కనీసం 130 ఏళ్లు వాయిదాలు కట్టాలి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి, యూరప్‌లోని  జర్మనీ, ఫ్రాన్స్ తదితర ధనిక దేశాల నుంచి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకూ 480 బిలియన్ డాలర్లు తీసుకుంది.
 
 ఇదికాక గ్రీసు బ్యాంకులు ఇతర దేశాల బ్యాంకుల నుంచి 43 బిలియన్ డాలర్లవరకూ రుణాలు తీసుకున్నాయి. అంతేమొత్తం ఐఎంఎఫ్‌కూ  బకాయి పడింది. ఈ ఐఎంఎఫ్ వాయిదా చెల్లింపులు దగ్గరే సంక్షోభం ముదిరి, ప్రస్తుతం ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది.
 
 వాయిదా సమస్య...
 ఐఎంఎఫ్ వద్ద తీసుకున్న రుణానికి, ఇతర రుణాలకు ప్రతినెలా వాయిదా చెల్లించాలి. ఇందుకోసం యూరప్ దేశాలు గ్రీసుకు కొత్త అప్పులిస్తున్నాయి. ఇలా ఏ నెలకు ఆ నెల గ్రీసు డిఫాల్ట్ కాకుండా నెట్టుకొస్తోంది. ఇదేరీతిలో ఈ నెల 30కల్లా ఐఎంఎఫ్‌కు గ్రీసు 1.6 బిలియన్ యూరోల (1.8 బిలియన్ డాలర్ల) రుణ వాయిదాను చెల్లించాల్సి ఉంది. చెల్లించకపోతే గ్రీసు దివాలా తీసినట్లు లెక్క. దివాలా తీస్తే గ్రీసుకు కొత్త అప్పు పుట్టదు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పటికే 25 శాతం వున్న నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించడం కష్టమైపోతుంది. ఆస్తుల ధరలు కుప్పకూలి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అందుకని ఐఎంఎఫ్ వాయిదా చెల్లించడానికి యూరోపియన్ యూనియన్ నుంచి తాజా అప్పు కోసం గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ రోజుల తరబడి చర్చలు జరిపారు. ఈ అప్పు కోసం యూనియన్ విధిస్తున్న షరతుల్ని అంగీకరించలేక, ఆ బాధ్యతను ప్రజలకే అప్పగించేందుకు జూలై 5న రిఫరెండం ప్రకటించారు. వాయిదా చెల్లింపునకు చివరి తేదీ జూన్ 30. కానీ ఐదురోజుల తర్వాత రిఫరెండం నిర్వహించేందుకు నిర్ణయించడంతో యూరోపియన్ యూనియన్ భగ్గుమంది. గ్రీసుతో చర్చల్ని నిలిపివేసింది. ఇదే ఇప్పటి సంక్షోభానికి మూలకారణం.
 
 కఠిన షరతులతో ప్రధాని హ్యాండ్సప్
 తాజాగా రుణాలకు ఈయూలోని ఇతర దేశాలు గ్రీసుకు కొన్ని షరతులు విధించాయి. పెన్షన్లను మరింత తగ్గించాలని, ఆహారోత్పత్తులు, రెస్టారెంట్లపై పన్నులు పెంచాలని, టాక్స్‌ఫ్రీ టూరిజం స్పాట్లపై పన్నులు వేయాలన్నవి వీటిలో కొన్ని. ఇప్పటికే ఐదేళ్ల నుంచి ఇలాంటి షరతులతో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఆ దేశంలో మూడోవంతు పెన్షన్ల మీద ఆధారపడిన నేపథ్యంలో ఇప్పటికే పెన్షన్లు 40 శాతం మేర తగ్గిపోయాయి. ప్రజలు విసిగిపోయి ఉన్న ఇలాంటి సమయంలో వామపక్ష సిరిజా పార్టీ ఈ ఏడాది జనవరిలో అక్కడ అధికారంలోకి వచ్చింది. అంతర్జాతీయ రుణ దాతల కఠిన షరతుల్ని పునఃచర్చించి, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామనే హామీతో ఆ పార్టీ పగ్గాలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ రుణదాతలు దిగిరాకపోవడంతో ఇప్పుడు సమస్యను రిఫరెండమ్ పేరుతో ప్రధాని ప్రజల ముందుకే తోసి, చేతులెత్తేశారు.
 
 సంక్షోభ తీవ్రత ఎందాకా...
 అంతాకలిసి గ్రీసు ఇప్పుడు కట్టాల్సిన వాయిదా 1.6 బిలియన్ యూరోలు. గ్రీసు జనాభా కోటి. జీడీపీ 242 బిలియన్ డాలర్లు. ఈ సమస్య మొత్తం యూరప్‌ను, ప్రపంచాన్ని తిరిగి ఆర్థిక సంక్షోభంలో ముంచేసేంతటి పెద్దది కాదన్నది కొందరు విశ్లేషకుల మాట. అయితే 2007లో అమెరికాలో బ్యాంకుల రుణ సంక్షోభాన్నీ అలానే తక్కువ చేశారన్నది మరికొందరి వాదన. ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ లేమన్ బ్రదర్స్ దివాలా తీసినా పెద్ద ఇబ్బందేమీ కాదనే భరోసాతో చిక్కుల్లో వున్న ఆ సంస్థను 2008లో అమెరికా అధికార యంత్రాంగం ముంచేసింది. ఎనిమిదేళ్లైయినా ఆ ప్రభావం నుంచి ఇప్పటికీ అమెరికాతో సహా ప్రపంచమంతా కోలుకోలేకపోతోంది. లేమన్ కుప్పకూలటంతో ఒక సంస్థను మరో సంస్థ, ఒక బ్యాంకును మరో బ్యాంకు నమ్మని పరిస్థితి వచ్చింది. గ్రీసు సమస్య కూడా అదే పరిస్థితికి దారితీసి సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందన్న భయాలు ఫైనాన్షియల్ మార్కెట్లను వణికిస్తున్నాయి.
 
 సంక్షోభం... సంక్షిప్తంగా  యూరోజోన్ అంటే...?
 ఈ దేశాలన్నిటా ఒకటే కరెన్సీ (యూరో) చెలామణిలో ఉంది. దీన్లోని మొత్తం దేశాలు - 19(ఆస్ట్రియా, బెల్జియం, సైప్రస్, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్)
 
 గ్రీస్ అప్పుల కథేంటి?
 ఆ దేశ జీడీపీ 242 బిలియన్ డాలర్లు. అప్పులు మాత్రం 566 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 36,79,000 కోట్లు. దీన్లో ఐఎంఎఫ్ ఇచ్చినవి 43 బిలియన్ డాలర్లు. దీనికి నెలకు చెల్లించాల్సిన వాయిదా 1.8 బి. డాలర్లు.
 
 మరి చెల్లించొచ్చుగా! గొడవేంటి?
 ఈ వాయిదాల కోసం నెలనెలా గ్రీస్ కొత్త అప్పులు చేస్తోంది. కొత్త అప్పులొస్తేనే అక్కడ జీతాలతో సహా బండి నడుస్తుంది. కానీ ఈ అప్పులకోసం ఐఎంఎఫ్, ఈయూ షరతులు పెడుతున్నాయి. మంగళవారంలోగా ఇవ్వాల్సిన అప్పుకు ఇలాగే షరతులు పెడితే గ్రీస్ ఒప్పుకోలేదు. 5న జనానికి రిఫరెండం పెట్టి చెబుతానంది. అందుకే సంక్షోభం.
 
 గ్రీస్ పాలకులెవరు?
 అధ్యక్షుడు ప్రొకోపిస్ పౌలోపొలస్, ప్రధాని అలెక్సిస్ సిప్రాస్.
 
 కొత్త అప్పు రాకపోతే ఏం జరుగుతుంది?
 నిరుద్యోగం మరింత పెరుగుతుంది. పెన్షన్లు చెల్లించలేరు. ఆర్థిక సంస్థలు ఒకదాన్ని మరొకటి నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రీస్ లాంటి దేశం డిఫాల్ట్ అయితే ఆ ప్రభావం యూరోజోన్‌కు, అక్కడి నుంచి యూరోపియన్ యూనియన్‌కు వ్యాపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేయొచ్చు.
 
 అయితే... మనకేంటట?
 గ్రీస్ దేశమనేది మనకు చాలా దూరంలో ఉంది. అలాంటి దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగితే మనకొచ్చే నష్టమేంటి? అని చాలామంది అనుకుంటారు.  వారు చెల్లింపులు చేయలేరు కనక ఆర్థిక సంస్థలు దివాలా తీస్తాయని, నగదు రాక తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. కానీ ఇది సామాన్యులపైనా ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే...
 
 పెట్టుబడులకు విఘాతమే: 2008లో అమెరికాలో ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ లేమన్ బ్రదర్స్ కుప్పకూలటంతో ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. విదేశాల నుంచి వచ్చిన భారీ సొమ్ముతో అప్పటిదాకా కొన్ని సంవత్సరాల పాటు మన స్టాక్‌మార్కెట్లు పరుగులు తీశాయి. సంక్షోభం దెబ్బకు ఇన్వెస్టర్లు అంతా డబ్బు వెనక్కి తీసుకెళ్లిపోవడంతో  మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల షేర్లు వారి కొనుగోలు ధరకన్నా తక్కువకు పడిపోయాయి. నష్టానికి అమ్మలేక చాలామంది దీర్ఘకాలం అలాగే కొనసాగారు. ఈ ఏడాది కూడా మార్కెట్లలోకి భారీ విదేశీ పెట్టుబడులొచ్చాయి. నిపుణులైతే లాభాల్లో ఉన్నపుడు వైదొలగటమే మంచిదని సూచిస్తున్నారు.
 
జీతాలూ తగ్గొచ్చు: లేమన్ బ్రదర్స్ కుప్పకూలిన సమయంలో అంతర్జాతీయంగా వ్యాపారాలు సరిగా సాగలేదు. కంపెనీల లాభాలు కూడా తగ్గాయి. ఫలితంగా వారు ఉద్యోగుల జీతాలూ పెద్దగా పెంచలేదు. పలు భారతీయ కంపెనీలు కొత్త నియామకాలు నిలిపేసి కొందరిని తొలగించాయి. జీతాల్లో కోతలు వేశాయి కూడా. సంక్షోభ సమయాల్లో జీతాలు పెరిగే అవకాశాలు తక్కువ.
 
పసిడి ధర పెరుగుతుంది!: ఇది కాస్త శుభవార్తే. భారతీయుల దగ్గర బంగారం ఎక్కువ. సంక్షోభం ముదిరితే దాని ధర పెరగొచ్చు. ఎందుకంటే సురక్షిత పెట్టుబడిగా అంతా బంగారంవైపు పరుగుపెడతారు కాబట్టి.
 
విదేశీ డిగ్రీలు ప్రియం!: సంక్షోభం వల్ల భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి నిధులు వెనక్కెళతాయి. దీంతో రూపాయి బలహీనమవుతుంది. అందుకని విదేశాల్లో చదువుకోవాలంటే డాలర్లలో చెల్లింపు చేయాలి కనక మునుపటికన్నా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది.
 
ఇంధన బిల్లు తగ్గుతుంది!: అంతర్జాతీయంగా ఏ సంక్షోభం వచ్చినా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయి. ఫలితంగా చమురు సహా ఆర్థిక వ్యవస్థను నడిపే వస్తువులన్నిటికీ డిమాండ్ పడిపోతుంది. దీంతో క్రూడ్ ధరలు తగ్గుతాయి. దీంతో ఇంధన బిల్లూ తగ్గుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement