Greece crisis
-
ద్రవ్య క్రమశిక్షణ లేకపోతే గ్రీసు సంక్షోభాలొస్తాయ్: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రభుత్వాలకు ద్రవ్య క్రమశిక్షణ లేకపోతే గ్రీసు సంక్షోభాల్లాంటివాటిని ఎదుర్కోవలసి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తొలి భారత కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక సరళీకరణ తర్వాత సంస్థల ఉనికికి, వృద్ధికి పోటీతత్వం, వ్యయ నియంత్రణ, సమర్థవంతంగా నిర్వహించడం కీలకం అయ్యాయని పేర్కొన్నారు. ఏ దేశ ప్రభుత్వానికైనా సమర్థ వ్యయ నిర్వహణ అత్యంత ముఖ్యమైనదని వివరించారు. అధికంగా సంపాదించడం లేదా తక్కువగా ఖర్చు చేయడం వల్ల ద్రవ్య క్రమశిక్షణ సాధించవచ్చని చెప్పారు. రెండింటిని సాధించడం ఉత్తమమైన విధామని పేర్కొన్నారు. కాస్ట్ అకౌంట్స్ తమ వృత్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు, కార్యకలాపాల్లో అత్యున్నత వ్యయ నియంత్రణకు సలహాలు ఇవ్వాలని సూచించారు. -
మద్దతు 27,500-నిరోధం 28,030
మార్కెట్ పంచాంగం ప్రపంచ స్టాక్ మార్కెట్లు గ్రీసు సంక్షోభంతో సతమతమవుతున్న సమయంలో నాటకీయంగా చైనా మార్కెట్ పతనం అల్లకల్లోలం సృష్టించింది. ముగిసిన గురు, శుక్రవారాల్లో చైనా మార్కెట్ కోలుకున్నప్పటికీ, దాదాపు సగం షేర్లలోనే ట్రేడింగ్ జరిగినందున, ఆ రికవరీ కొనసాగుతుందో, లేదో డౌటే. అక్కడ పతనం నేపథ్యంలో సగం షేర్లలో ట్రేడింగ్ రద్దుచేశారు. మరోవైపు గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ సమర్పించిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందన్న అంచనాలతో శుక్రవారం ప్రపంచంలో అన్ని మార్కెట్లూ ర్యాలీ జరిపాయి. కానీ గ్రీసుకు ప్యాకేజీ ఇచ్చే అంశమై యూరప్ దేశాల్లో చీలిక వచ్చినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీసు, చైనా అంశాలు రానున్న కొద్దిరోజుల్లో స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూలై 10తో ముగిసిన వారం ప్రథమార్ధంలో 28,335 పాయింట్ల గరిష్టస్థాయిని చేరిన తర్వాత ద్వితీయార్ధంలో 27,530 పాయింట్ల కనిష్టస్థాయికి బీఎస్ఈ సెన్సెక్స్ పడిపోయింది. చివరకు దాదాపు 1.53 శాతం నష్టంతో 27,661 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 27,500 స్థాయి వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన సెన్సెక్స్ ప్రారంభమైతే, వేగంగా జూన్ 29నాటి కనిష్టస్థాయి 27,209 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. రానున్న కొద్దిరోజుల్లో ఈ స్థాయిని వదులుకుంటే, తర్వాతి వారాల్లో 26,300 పాయింట్ల స్థాయికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ మొదలైతే 28,030 పాయింట్ల స్థాయి తొలి నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, ముగిస్తే 28,335 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే 28,700 స్థాయికి పెరిగే అవకాశాలుంటాయి. అటుపైన స్థిరపడితే కొద్ది వారాల్లో 29,090 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 8,300-నిరోధం 8,460 ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 8,500 పాయింట్లపైన స్థిరపడి, పాజిటివ్ ముగింపు కనపర్చినా, చైనా మార్కెట్ నాటకీయంగా పతనమయిన ప్రభావంతో ఈ సూచీ కూడా పడిపోయింది. చివరకు అంతక్రితం వారంకంటే 124 పాయింట్ల క్షీణతతో 8,361 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలైతే 8,300 పాయింట్ల స్థాయి తొలి మద్దతును అందించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే క్రమేపీ 8,195 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. గ్రీసు, చైనా సంక్షోభాలు తలెత్తి తీవ్రస్థాయిలో ప్రపంచ మార్కెట్లను చుట్టుముడితే 7,940 స్థాయి వద్దకు సైతం పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 8,460 పాయింట్ల స్థాయి వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, స్థిరపడితే క్రమేపీ 8,550 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే కొద్దివారాల్లో 8,845 పాయింట్ల స్థాయిని చేరే చాన్స్ వుంటుంది. -
డ్రాగన్.. షాక్!
గ్రీస్ ఎఫెక్ట్ నుంచి తేరుకుంటున్న సమయంలో భారత్ మార్కెట్‌కు దెబ్బ సెన్సెక్స్ 484 పాయింట్లు డౌన్; 27,688 వద్ద క్లోజ్ 148 పాయింట్లు తగ్గి 8,363కు నిఫ్టీ కరిగిపోయిన లోహ షేర్లు... లోహాలను ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే చైనాలో స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావడం లోహ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పతనం కారణంగా చైనాలో మందగమనం చోటు చేసుకునే అవకాశాలున్నాయన్న ఆందోళనతో లోహ షేర్లు కరిగిపోయాయి. వేదాంత 7.8 శాతం, సెయిల్ 6 శాతం, హిందాల్కో 5 శాతం, టాటా స్టీల్ 4.7%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.1 శాతం, ఎన్ఎండీసీ 2.3 శాతం, హిందుస్తాన్ జింక్ 1.9 శాతం, నాల్కో 1.9%, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 1% చొప్పున నష్టపోయాయి. ఒకే ఒక ‘షేర్’: ఒక్క హిందుస్తాన్ యూనిలీవర్ మినహా మిగిలిన 29 సెన్సెక్స్ షేర్లు నష్టపోయాయి. దీపక్ ఫెర్టిలైజర్స్ ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలన్న ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలతో ఈ షేర్ దాదాపు 8% లాభపడి రూ.143 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 13 శాతం ఎగసింది. డీలిస్టింగ్ వార్తలతో ఎస్సార్ ఆయిల్ షేర్ 4% వృద్ధితో రూ.189 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.197)ను తాకింది. ఈ నెల 3న రూ.148 వద్ద ఉన్న ఈ షేర్ కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలో 33% పెరగడం విశేషం. లక్ష కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరి: స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.33 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టయిన అన్ని షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.102.55 లక్షల కోట్లకు పడిపోయింది. గ్రీస్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత స్టాక్ మార్కెట్‌పై చైనా షాంఘై సూచీ భారీ పతనం తీవ్రమైన ప్రభావం చూపింది. చైనా స్టాక్ మార్కెట్ 6 శాతానికి పైగా క్షీణించడం, అదేబాటలో ఇతర ఆసియా మార్కెట్లు పతనంకావడం, గ్రీస్ సంక్షోభం మరింత ముదరనున్నదన్న ఆందోళనలతో బుధవారం భారత్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 28,000, నిఫ్టీ 8,400 స్థాయిల దిగువకు పడిపోయాయి. లోహ, వాహన షేర్లతో సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 484 పాయింట్ల నష్టం(1.72%)తో 27,688 పాయింట్ల వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు(1.74%) నష్టపోయి 8,363 పాయిం ట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడపోవడం కూడా ప్రభావం చూపింది. అన్ని రంగాల సూచీలు నష్టాల పాలయ్యాయి. మరింత పతనం...! నష్టాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 536 పాయింట్లు క్షీణించి 27,636 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పతనం కావడం నెలలో ఇదే మొదటిసారి. ఇక నిఫ్టీ 8,458-8,342 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి 148 పాయింట్ల నష్టంతో 8,363 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఒడిదుడుకుల కారణంగా స్టాక్ మార్కెట్ మరింతగా పతనమవుతుందని నిపుణులంటున్నారు. గురువారం నుంచి టీసీఎస్‌తో ప్రారంభం కానున్న ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఆర్థిక ఫలితాలు, గ్రీస్, చైనా అంశాలు భవిష్యత్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఏడాది కనిష్టానికి టాటా మోటార్స్ చైనాలో లగ్జరీ కార్ల మార్కెట్లో మందగమనం చోటు చేసుకుంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహన విక్రయాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందనే అంచనాలతో టాటా మోటార్స్ షేర్ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిని(రూ.400) తాకిన ఈ షేర్ చివరకు 6% నష్టపోయి రూ.405 వద్ద ముగిసింది. యస్ బ్యాంక్ టార్గెట్ ధరను రూ.1000 నుంచి రూ.740కు యూబీఎస్ తగ్గించడంతో ఈ షేర్ 7.4% క్షీణించి రూ.797 వద్ద ముగిసింది. 50 షేర్ల నిఫ్టీలో 3 మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.354 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.347 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ప్రపంచానికి చైనా బాధ చైనా స్టాక్ మార్కెట్లో 3 వారాల్లో 3.2 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు గ్రీస్కంటే ఇప్పుడు చైనాయే పెద్ద తలనొప్పిగా పరిణమించింది. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్... బుధవారం ఆసియా మార్కెట్లను వణికించిన ఈ చైనా స్టాక్ మార్కెట్ ఏడాది కాలంలో 155 శాతం వృద్ధిని సాధించిన తర్వాత గత మూడు వారాలుగా పతనమవుతూ వస్తోంది. ఈ పతనం బుధవారం పరాకాష్టకు చేరింది. 220 పాయింట్లు(6.2 శాతం) పతనమై 3,506 పాయింట్లకు చేరింది. గత నెల 12న ఏడాది గరిష్ట స్థాయి అయిన 5,166 పాయింట్లను షాంఘై తాకింది. అప్పటినుంచి చూస్తే 3 వారాల్లో 30 శాతానికి పైగా పడింది. ఎందుకీ పతనం...: ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. అయితే తాజాగా మార్జిన్ ట్రేడింగ్, షార్ట్ సెల్లింగ్ నిబంధనలను చైనా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ కఠినతరం చేసింది. దీంతోపాటు షేర్ల విలువలు అధికంగా ఉన్నాయన్న ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. చైనా మార్కెట్ల భారీ పతనానికి ఇది తక్షణ ప్రధాన కారణమని నిపుణులంటున్నారు. మూడు వారాల్లో 30% పతనం కారణంగా ఇప్పటికే 3.2 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు వచ్చాయని, ఈ నష్టాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనతో ఆ మార్కెట్లో అమ్మకాల సునామీ తలెత్తింది. మార్జిన్ ఫైనాన్సింగ్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మరీ స్టాక్ మార్కెట్లో అక్కడి రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు కంపెనీలూ పెట్టుబడి చేశాయి. ఇప్పుడా పెట్టుబడులే, అమ్మకాల రూపంలో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఫలించని ప్రయత్నాలు.. : ఈ పతనాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం చాలా చర్యలను ప్రకటించింది. కానీ అవేవీ ఇన్వెస్టర్ల అమ్మకాల వెల్లువను ఆపలేకపోయాయి. ఈ స్టాక్ మార్కెట్లో లిస్టయిన దాదాపు 40 శాతానికి (దాదాపు 1,300కు) పైగా కంపెనీల్లో ట్రేడింగ్‌ను ఆయా కంపెనీలే స్వచ్చందంగా సస్పెండ్ చేసుకున్నాయి. ఇన్ని కంపెనీల ట్రేడింగ్ సస్పెండ్ కావడం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ షేర్లు అందుబాటులో లేకపోవడంతో రిస్క్‌ను తగ్గించుకోవడానికి అందుబాటులో ఉన్న బ్లూ చిప్ షేర్లతో సహా అన్ని షేర్లలో ఏ ధరకు బడితే అ ధరకు ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేశారు. వెయ్యికి పైగా షేర్లు రోజువారీ పరిమితి 10 శాతం వరకూ నష్టపోయాయి. గత ఏడాది కాలంలో వచ్చిన షాంఘై ర్యాలీకి ఎలాంటి ఫండమెంటల్ పునాది లేదని నిపుణులంటున్నారు. మార్కెట్లకు అనుకూలమైన నిర్ణయాలను చైనా ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ, షాంఘై భారీ పతనం ఇప్పటికే మందగమనంలో ఉన్న చైనాపై మరింత ప్రభావం చూపనున్నదని అంచనా. ఈ ఉత్పాతం చైనా ఆర్థిక వ్యవస్థ అంతటికీ , ఆ తర్వాత ప్రపంచ దేశాలకు వ్యాపించే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది గ్రీస్ కంటే పెద్ద సంక్షోభం కానున్నదని నిపుణులంటున్నారు. వణికిన ఆసియా మార్కెట్లు చైనా మార్కెట్ పతనాన్ని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. షాంఘై సూచీ 6 .2% నష్టపోవడంతో ఆ ప్రభావం మిగిలిన ఆసియా మార్కెట్లపై పడింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 6%, జపాన్ నికాయ్ 3%, తైవాన్ మార్కెట్ 3%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 1.7%, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1 శాతం చొప్పున నష్టపోయాయి. -
వృద్ధి 7.4-7.6 శాతం ఉండొచ్చు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా న్యూఢిల్లీ : భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం నుంచి 7.6 శాతం వృద్ధిని సాధించగలదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అంచనాలను మించిన వర్షాల కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని, ఫలితంగా భారత్ ఈ స్థాయి వృద్ధి సాధిస్తుందని ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని, గ్రామీణ వినియోగం, సెంటిమెంట్లు మెరుగుపడతాయని పేర్కొంది. మద్దతు ధరల్లో స్వల్ప పెరుగుదల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం నియత్రణలోనే ఉండొచ్చని వివరించింది. గ్రీస్ సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడం వంటి అంశాల కారణంగా విదేశీ మారక ద్రవ్య రేట్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. -
మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం
న్యూఢిల్లీ: గ్రీసు సంక్షోభ ప్రభావం భారత్‌లోని ఐటీ కంపెనీల ఆదాయాలపై 1-2 శాతంగా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్’ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) తెలిపింది. యూరో-రూపీ మారకపు రేట్ల ప్రభావం, యూరప్‌లోని ఇతర దేశాల అభివృద్ధి వంటి అంశాలు ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతాయని వివరించింది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు యూరప్‌తో సంబంధాలను కలిగి ఉన్నాయని, గ్రీసుతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని పేర్కొంది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉత్తర యూరప్ దేశాలు, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో సంబంధాలను కలిగి ఉన్నాయని తెలిపింది. -
గ్రీస్.. గుబుల్!
అప్పుకోసం తిప్పలు షరతుల వద్దే అసలు పేచీ వడ్డీలు కట్టడానికి కొత్త రుణాలు నేడు రుణం అందకపోతే దివాలా! ఈ రుణంపై జూలై 5న రిఫరెండం ఇది చూసి ప్రపంచ మార్కెట్లలో ఆందోళన అప్పు తీర్చడానికి మరో అప్పు. వడ్డీ కట్టడానికి మరో అప్పు. కొత్త అప్పు కోసం ఏ షరతుకైనా ఓకే!! అంతలోనే రాజకీయ మార్పు. షరతులకు లొంగేది లేదని బింకాలు పోయిన పార్టీకి ప్రజల పగ్గాలు!. తీరా ఇప్పుడేమైంది? బింకాలు పోయినా ఆ నాయకుడు చేతులెత్తేశాడు. షరతులకు లొంగాలో వద్దో మీరే తేల్చుకోండంటూ ప్రజల కోర్టులోకే బంతి విసిరేశాడు! అదీ క్లుప్తంగా గ్రీస్ సంక్షోభం. ఈ సంక్షోభం పూర్వాపరాలు... అది చూపించబోయే ప్రభావంపై ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది... ఇప్పటివరకూ 19 సభ్యదేశాల యూరోజోన్‌కే పరిమితమైన గ్రీసు సంక్షోభం... సోమవారం ప్రపంచాన్నంతటినీ చుట్టుముట్టడంతో ఈక్విటీ, బాండు మార్కెట్లు పతనమయ్యాయి. ఇందుకు దారితీసిన కారణమేంటంటే... ఐదేళ్ల క్రితం యూరప్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం గ్రీసునూ చుట్టుముట్టింది. బయటపడటానికి ఆ దేశం ఎడాపెడా అప్పులు చేసింది. ఒక రుణాన్ని, వడ్డీని చెల్లించేందుకు మరో రుణాన్ని, దానికోసం ఇంకో రుణాన్ని....ఇలా తీసుకుని అప్పుల కుప్పలా మారింది. 566 బిలియన్ డాలర్లకు చేరిన అప్పు... ఆ దేశపు జీడీపీ 242 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపునకు పైనే. ఈ రుణాలు తీర్చడానికి గ్రీసు కనీసం 130 ఏళ్లు వాయిదాలు కట్టాలి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి, యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్ తదితర ధనిక దేశాల నుంచి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకూ 480 బిలియన్ డాలర్లు తీసుకుంది. ఇదికాక గ్రీసు బ్యాంకులు ఇతర దేశాల బ్యాంకుల నుంచి 43 బిలియన్ డాలర్లవరకూ రుణాలు తీసుకున్నాయి. అంతేమొత్తం ఐఎంఎఫ్కూ బకాయి పడింది. ఈ ఐఎంఎఫ్ వాయిదా చెల్లింపులు దగ్గరే సంక్షోభం ముదిరి, ప్రస్తుతం ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది. వాయిదా సమస్య... ఐఎంఎఫ్ వద్ద తీసుకున్న రుణానికి, ఇతర రుణాలకు ప్రతినెలా వాయిదా చెల్లించాలి. ఇందుకోసం యూరప్ దేశాలు గ్రీసుకు కొత్త అప్పులిస్తున్నాయి. ఇలా ఏ నెలకు ఆ నెల గ్రీసు డిఫాల్ట్ కాకుండా నెట్టుకొస్తోంది. ఇదేరీతిలో ఈ నెల 30కల్లా ఐఎంఎఫ్‌కు గ్రీసు 1.6 బిలియన్ యూరోల (1.8 బిలియన్ డాలర్ల) రుణ వాయిదాను చెల్లించాల్సి ఉంది. చెల్లించకపోతే గ్రీసు దివాలా తీసినట్లు లెక్క. దివాలా తీస్తే గ్రీసుకు కొత్త అప్పు పుట్టదు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పటికే 25 శాతం వున్న నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించడం కష్టమైపోతుంది. ఆస్తుల ధరలు కుప్పకూలి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అందుకని ఐఎంఎఫ్ వాయిదా చెల్లించడానికి యూరోపియన్ యూనియన్ నుంచి తాజా అప్పు కోసం గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ రోజుల తరబడి చర్చలు జరిపారు. ఈ అప్పు కోసం యూనియన్ విధిస్తున్న షరతుల్ని అంగీకరించలేక, ఆ బాధ్యతను ప్రజలకే అప్పగించేందుకు జూలై 5న రిఫరెండం ప్రకటించారు. వాయిదా చెల్లింపునకు చివరి తేదీ జూన్ 30. కానీ ఐదురోజుల తర్వాత రిఫరెండం నిర్వహించేందుకు నిర్ణయించడంతో యూరోపియన్ యూనియన్ భగ్గుమంది. గ్రీసుతో చర్చల్ని నిలిపివేసింది. ఇదే ఇప్పటి సంక్షోభానికి మూలకారణం. కఠిన షరతులతో ప్రధాని హ్యాండ్సప్ తాజాగా రుణాలకు ఈయూలోని ఇతర దేశాలు గ్రీసుకు కొన్ని షరతులు విధించాయి. పెన్షన్లను మరింత తగ్గించాలని, ఆహారోత్పత్తులు, రెస్టారెంట్లపై పన్నులు పెంచాలని, టాక్స్‌ఫ్రీ టూరిజం స్పాట్లపై పన్నులు వేయాలన్నవి వీటిలో కొన్ని. ఇప్పటికే ఐదేళ్ల నుంచి ఇలాంటి షరతులతో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఆ దేశంలో మూడోవంతు పెన్షన్ల మీద ఆధారపడిన నేపథ్యంలో ఇప్పటికే పెన్షన్లు 40 శాతం మేర తగ్గిపోయాయి. ప్రజలు విసిగిపోయి ఉన్న ఇలాంటి సమయంలో వామపక్ష సిరిజా పార్టీ ఈ ఏడాది జనవరిలో అక్కడ అధికారంలోకి వచ్చింది. అంతర్జాతీయ రుణ దాతల కఠిన షరతుల్ని పునఃచర్చించి, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామనే హామీతో ఆ పార్టీ పగ్గాలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ రుణదాతలు దిగిరాకపోవడంతో ఇప్పుడు సమస్యను రిఫరెండమ్ పేరుతో ప్రధాని ప్రజల ముందుకే తోసి, చేతులెత్తేశారు. సంక్షోభ తీవ్రత ఎందాకా... అంతాకలిసి గ్రీసు ఇప్పుడు కట్టాల్సిన వాయిదా 1.6 బిలియన్ యూరోలు. గ్రీసు జనాభా కోటి. జీడీపీ 242 బిలియన్ డాలర్లు. ఈ సమస్య మొత్తం యూరప్‌ను, ప్రపంచాన్ని తిరిగి ఆర్థిక సంక్షోభంలో ముంచేసేంతటి పెద్దది కాదన్నది కొందరు విశ్లేషకుల మాట. అయితే 2007లో అమెరికాలో బ్యాంకుల రుణ సంక్షోభాన్నీ అలానే తక్కువ చేశారన్నది మరికొందరి వాదన. ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమన్ బ్రదర్స్ దివాలా తీసినా పెద్ద ఇబ్బందేమీ కాదనే భరోసాతో చిక్కుల్లో వున్న ఆ సంస్థను 2008లో అమెరికా అధికార యంత్రాంగం ముంచేసింది. ఎనిమిదేళ్లైయినా ఆ ప్రభావం నుంచి ఇప్పటికీ అమెరికాతో సహా ప్రపంచమంతా కోలుకోలేకపోతోంది. లేమన్ కుప్పకూలటంతో ఒక సంస్థను మరో సంస్థ, ఒక బ్యాంకును మరో బ్యాంకు నమ్మని పరిస్థితి వచ్చింది. గ్రీసు సమస్య కూడా అదే పరిస్థితికి దారితీసి సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందన్న భయాలు ఫైనాన్షియల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. సంక్షోభం... సంక్షిప్తంగా యూరోజోన్ అంటే...? ఈ దేశాలన్నిటా ఒకటే కరెన్సీ (యూరో) చెలామణిలో ఉంది. దీన్లోని మొత్తం దేశాలు - 19(ఆస్ట్రియా, బెల్జియం, సైప్రస్, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్) గ్రీస్ అప్పుల కథేంటి? ఆ దేశ జీడీపీ 242 బిలియన్ డాలర్లు. అప్పులు మాత్రం 566 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 36,79,000 కోట్లు. దీన్లో ఐఎంఎఫ్ ఇచ్చినవి 43 బిలియన్ డాలర్లు. దీనికి నెలకు చెల్లించాల్సిన వాయిదా 1.8 బి. డాలర్లు. మరి చెల్లించొచ్చుగా! గొడవేంటి? ఈ వాయిదాల కోసం నెలనెలా గ్రీస్ కొత్త అప్పులు చేస్తోంది. కొత్త అప్పులొస్తేనే అక్కడ జీతాలతో సహా బండి నడుస్తుంది. కానీ ఈ అప్పులకోసం ఐఎంఎఫ్, ఈయూ షరతులు పెడుతున్నాయి. మంగళవారంలోగా ఇవ్వాల్సిన అప్పుకు ఇలాగే షరతులు పెడితే గ్రీస్ ఒప్పుకోలేదు. 5న జనానికి రిఫరెండం పెట్టి చెబుతానంది. అందుకే సంక్షోభం. గ్రీస్ పాలకులెవరు? అధ్యక్షుడు ప్రొకోపిస్ పౌలోపొలస్, ప్రధాని అలెక్సిస్ సిప్రాస్. కొత్త అప్పు రాకపోతే ఏం జరుగుతుంది? నిరుద్యోగం మరింత పెరుగుతుంది. పెన్షన్లు చెల్లించలేరు. ఆర్థిక సంస్థలు ఒకదాన్ని మరొకటి నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రీస్ లాంటి దేశం డిఫాల్ట్ అయితే ఆ ప్రభావం యూరోజోన్‌కు, అక్కడి నుంచి యూరోపియన్ యూనియన్‌కు వ్యాపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేయొచ్చు. అయితే... మనకేంటట? గ్రీస్ దేశమనేది మనకు చాలా దూరంలో ఉంది. అలాంటి దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగితే మనకొచ్చే నష్టమేంటి? అని చాలామంది అనుకుంటారు. వారు చెల్లింపులు చేయలేరు కనక ఆర్థిక సంస్థలు దివాలా తీస్తాయని, నగదు రాక తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. కానీ ఇది సామాన్యులపైనా ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే... పెట్టుబడులకు విఘాతమే: 2008లో అమెరికాలో ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ లేమన్ బ్రదర్స్ కుప్పకూలటంతో ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. విదేశాల నుంచి వచ్చిన భారీ సొమ్ముతో అప్పటిదాకా కొన్ని సంవత్సరాల పాటు మన స్టాక్‌మార్కెట్లు పరుగులు తీశాయి. సంక్షోభం దెబ్బకు ఇన్వెస్టర్లు అంతా డబ్బు వెనక్కి తీసుకెళ్లిపోవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల షేర్లు వారి కొనుగోలు ధరకన్నా తక్కువకు పడిపోయాయి. నష్టానికి అమ్మలేక చాలామంది దీర్ఘకాలం అలాగే కొనసాగారు. ఈ ఏడాది కూడా మార్కెట్లలోకి భారీ విదేశీ పెట్టుబడులొచ్చాయి. నిపుణులైతే లాభాల్లో ఉన్నపుడు వైదొలగటమే మంచిదని సూచిస్తున్నారు. ► జీతాలూ తగ్గొచ్చు: లేమన్ బ్రదర్స్ కుప్పకూలిన సమయంలో అంతర్జాతీయంగా వ్యాపారాలు సరిగా సాగలేదు. కంపెనీల లాభాలు కూడా తగ్గాయి. ఫలితంగా వారు ఉద్యోగుల జీతాలూ పెద్దగా పెంచలేదు. పలు భారతీయ కంపెనీలు కొత్త నియామకాలు నిలిపేసి కొందరిని తొలగించాయి. జీతాల్లో కోతలు వేశాయి కూడా. సంక్షోభ సమయాల్లో జీతాలు పెరిగే అవకాశాలు తక్కువ. ► పసిడి ధర పెరుగుతుంది!: ఇది కాస్త శుభవార్తే. భారతీయుల దగ్గర బంగారం ఎక్కువ. సంక్షోభం ముదిరితే దాని ధర పెరగొచ్చు. ఎందుకంటే సురక్షిత పెట్టుబడిగా అంతా బంగారంవైపు పరుగుపెడతారు కాబట్టి. ► విదేశీ డిగ్రీలు ప్రియం!: సంక్షోభం వల్ల భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి నిధులు వెనక్కెళతాయి. దీంతో రూపాయి బలహీనమవుతుంది. అందుకని విదేశాల్లో చదువుకోవాలంటే డాలర్లలో చెల్లింపు చేయాలి కనక మునుపటికన్నా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ► ఇంధన బిల్లు తగ్గుతుంది!: అంతర్జాతీయంగా ఏ సంక్షోభం వచ్చినా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయి. ఫలితంగా చమురు సహా ఆర్థిక వ్యవస్థను నడిపే వస్తువులన్నిటికీ డిమాండ్ పడిపోతుంది. దీంతో క్రూడ్ ధరలు తగ్గుతాయి. దీంతో ఇంధన బిల్లూ తగ్గుతుంది. -
మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: ఐసీఐసీఐ
గ్రీస్ సంక్షోభం తమ బ్యాంకుపై ఎటువంటి ప్రభావం చూపబోదని ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచర్ అన్నారు. 21వ ఏజీఎం సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, యూరప్‌లో తమకు వ్యాపార కార్యకలాపాలు ఏవీ లేవని అన్నారు. అక్కడి కంపెనీలకు తమ బ్యాంక్ ఎటువంటి రుణాలూ అందజేయలేదని వెల్లడించారు. -
ఆర్బీఐతో ఆర్థికశాఖ సంప్రదింపులు..
గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులు దేశం నుంచి బయటకువెళ్లే పరిస్థితులు ఉన్నాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక మంత్రిత్వశాఖ నిరంతరంగా ఈ సమస్యపై చర్చిస్తోంది. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ మహర్షి సోమవారం ఈ విషయం చెప్పారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ కూడా భారత్ ఈ ప్రభావానికి గురికాకుండా చేయాల్సిందంతా చేస్తుందని అన్నారు. అయితే గ్రీస్ సంక్షోభం ప్రత్యక్షంగా భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపబోదని ఆయన అంటూ... క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-అవుట్ఫ్లోస్కు సంబంధించి యూరోప్ ద్వారా దేశంపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా యూరో బాండ్లు పతనమైతే (ఈల్డ్స్ పెరగడం) ఈ ప్రభావం భారత్ క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-అవుట్ఫ్లోస్పై ఉంటుందని అన్నారు. పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో ఎవ్వరూ చెప్పలేరని సైతం అన్నారు. భారత్ కంపెనీ దేనికైనా గ్రీస్‌తో వ్యాపార సంబంధాలు ఏవైనా ఉన్నాయా..? అని అడిగిన ప్రశ్నకు ‘నాకు తెలియదు’ అని అన్నారు. అయితే ఈ విపరిణామాలు యూరోపియన్ యూనియన్‌పై పడితే, అది భారత్‌కూ మైనస్ అవుతుందని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అన్నారు. భారత్ దాదాపు 320 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో (2014-15) దాదాపు 130 బిలియన్ డాలర్ల వాటా ఈయూదే కావడం గమనార్హం. ఆందోళన అక్కర్లేదు-ఈసీఏ: కాగా ఈ విషయంపై చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (ఈసీఏ) అరవింద్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. గ్రీక్ సంక్షోభంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉంటుందో. భారత్ స్పందనా అదే రీతిలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ పరిణామాలపై ఆందోళన అక్కర్లేదని చెప్పారు. -
అప్రమత్తత అవసరం: అసోచామ్
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆర్థికమంత్రిత్వశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తత అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. భారత్ క్యాపిటల్ (పెట్టుబడులు) రాకపోకలు, కరెన్సీ కదలికలు, ఎగుమతులపై గ్రీస్ సంక్షోభ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయిలే, భయపడాల్సిందేమీ లేదని... సంక్షోభాన్ని తట్టుకుని నిలబడే సత్తా భారత్‌కు ఉందని రావత్ పేర్కొన్నారు. -
నయా పేదల దేశంలో ‘నాజీల’ హవా!
పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని గ్రీస్ సంక్షోభం దేశంలో సగం జనాభాను నయా పేదలుగా దిగజారుస్తోంది. విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, పేదరికాలను ఆసరాగా చేసుకోని జాతీయోన్మాద ‘గోల్డెన్ డాన్’ మూడో అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. గ్రీస్ ఎంతటి ఘన చరిత్ర గలిగిన దేశమైనా నేడు మాత్రం అది యూరోపియన్ యూనియన్ సంక్షోభాన్ని కొలిచే థర్మామీటరు, బారోమీటరు. గ్రీస్‌లో ఫ్యాక్టరీ ఉత్పత్తి గత ఏడేళ్లలో మొట్టమొదటిసారిగా తల పెకైత్తి చూసిందని సంబరపడిపోతున్న వారు లేకపోలేదు. అలాంటి వారిని ఉద్దేశించే గామోసు ఈయూ మకుటం లేని మహారాణి ఏంజెలా మర్కెల్ గత నెల 29న ఇది ‘తుపాను ముందటి ప్రశాంతత’ అని వ్యాఖ్యానించారు. యూరో రుణ సంక్షోభం ప్రమాద తీవ్రత ఏమీ తగ్గలేదని హెచ్చరించారు. ‘తుపాను’ తాకిడికి గురయ్యే మొదటి దేశంగా గ్రీస్‌కు ఇప్పుడు తక్షణమే మరో బెయిలవుట్ అవసరమని యూరో విశ్లేషకులు ఎప్పుడో తేల్చేశారు. తేల్చాల్సిన జర్మనీ ఛాన్స్లర్ మర్కెల్ పెదవి విప్పలేదు. జర్మన్ ఆర్థిక శాఖ గ్రీస్ కోసం రూపొందించిన మూడో బెయిలవుట్ విషయం వారం క్రితం బయటపడింది. గ్రీస్ కోసం ఒకటి నుంచి రెండు వేల కోట్ల డాలర్ల రుణాన్ని సిద్ధం చేశారు. కాకపోతే అది మరింత కఠినమైన పొదుపు చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ‘క్యారట్లు కావాలిగానీ, కట్టె మాత్రం వద్దంటే ఎట్లా కుదురుతుంది?’ అని ఈయూ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ బుధవారం మరో సందర్భంగా ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిపుణులు కొందరు వారితో విభేదిస్తున్నారు. ‘గ్రీస్‌కు ఇప్పుడు కావాల్సింది బెయిలవుట్ రుణ ప్యాకేజీ కాదు. రుణ పునర్వ్యవస్థీకరణ. ప్రభుత్వ వ్యయంలో ఇంకా కోతలు విధించడం గానీ, ప్రజలపై ఇంకా పన్నులు విధించడం గానీ అసాధ్యం’ అని వారి వాదన. గ్రీస్ రుణాన్ని మాఫీ చేయడం తప్ప గత్యంతరం లేదని వారు అంటున్నారు. ‘ధార్మికత’తో సంక్షోభాలు పరిష్కారం కావని మర్కెల్ దృఢ విశ్వాసం. గ్రీస్, స్పెయిన్, సైప్రస్‌ల వంటి దేశాలకు ఇచ్చిన రుణాలను ముక్కు పిండి, వడ్డీతో సహా వసూలు చేయకపోతే... అక్కడి సంక్షోభానికి కాళ్లొచ్చి స్వదేశంలోకే ప్రవేశిస్తుందని ఆమె ఆందోళన. పైగా ఆధునిక యుగంలో రుణాన్ని మించిన ఆధిపత్య సాధనం ఇంకేముంది? గ్రీస్ వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ వ్యయంలో 15 వందల కోట్ల యూరోల కోతలు విధించాలి. కానీ జనాభాలో 28 శాతం, యువతలో 60 శాతం నిరుద్యోగులుగా ఉన్న దేశంలో పన్నులను ఎంతగా పెంచినా పన్నుల రాబడి మాత్రం తగ్గిపోతూనే ఉంది. అసలు ఉద్యోగమే లేకపోతే పన్నులు ఎక్కడి నుంచి కడతారు? అందుకే ప్రభుత్వం ఆస్తిపన్నుల రూపంలో ఇంత ఇల్లో, స్థలమో ఉన్న చిన్న ఆస్తిపరులను దివాలా తీయిస్తోంది. ఆదాయపు పన్ను, దానిపై విధించే సౌహార్ద్రతాపన్ను, వృత్తి పన్నులుగాక ఆస్తి యాజమాన్యంపై కనీసం 40 రకాల పన్నులు విధిం చారు. కాబట్టే 2010-13 మధ్య ఆస్తి పన్ను రాబడి 5 కోట్ల యూరోల నుంచి 350 కోట్ల యూరోలకు పెరిగింది. గ్లోరియా అలియియాన్ని గోడు వింటే నయా పేదలుగా దిగజారుతున్న భద్రజీవుల బాధలు అర్థమవుతాయి. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు దక్షిణ ఆఫ్రికాకు వెళ్లి, జీవితాంతం రాగి గనుల్లో పని చేశారు. వారు కొన్న ఇల్లూ, స్థలమే కాదు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కూడా పన్ను బకాయిలకు గానూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆస్తుల విలువ కంటే పన్నుల బకాయిలు ఎక్కు గా ఉంటే జైలు శిక్షలు కూడా వేస్తామంటున్నారు. అందుకోసం తాజాగా పన్ను బకాయిలను క్రిమినల్ నేరంగా మార్చేశారు. దీంతో ఆర్థిక భద్రతగా భావించిన ఆస్తులు గుదిబండలుగా మారుతున్నాయి. పన్నుల బకాయిల కోసం ప్రజలను వీధులపాలు చేసి ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను కొనేవారెవరు? గత ఏడాది కాలంలో వంద ఆస్తులు కూడా వేలంలో అమ్ముడుపోలేదు. మరి ఎందుకీ దౌర్జన్యం? ప్రభుత్వం పేరున ఆస్తులుంటే విదేశీ రుణాలకు హామీలవుతాయని సమాధానం. ఇలాంటి ఆధిపత్య ధోరణులే రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయని సుప్రసిద్ధ జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త జూజెన్ హాబర్మాన్ బుధవారం హెచ్చరించారు. ‘‘మర్కెల్ పెట్టుబడి అనుకూల విధానాలు ప్రజాస్వామ్యాన్ని లోతుగా గాయపరుస్తున్నాయి. సంక్షోభ దేశాలకు ఆమె చేస్తున్న విపరీతపు చికిత్స చెప్పనలవిగాని సామాజిక దుష్పర్యవసానాలకు, యూరప్ అంతటా జాతీయోన్మాదపు సరికొత్త వెల్లువకు దారి తీస్తోంది’’ అని అన్నారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే ఆచరణాత్మకవాద తత్వవేత్త హాబర్మాన్ చెప్పినదే గ్రీస్‌లో అక్షరాలా జరుగుతోంది. పచ్చి మితవాద జాతీయోన్మాద పక్షం ‘గోల్డెన్ డాన్’ వలస వచ్చిన విదేశీయులపై దాడులు సాగిస్తోంది. అధికారంలోకి వస్తే విదేశీయులను పారదోలేసి నిరుద్యోగం, పేదరికం, తదితర సకల రోగాలను చిటికెలో మటు మాయం చేస్తానంటూ ఊదరగొడుతుంది. హిట్లర్ స్వస్తిక గుర్తును తలపించే జెండా పట్టిన ఆ నియో-నాజీ పార్టీ అప్పుడే గ్రీస్‌లో మూడో అతి పెద్ద రాజకీయ పక్షంగా మారింది. - పిళ్లా వెంకటేశ్వరరావు