ద్రవ్య క్రమశిక్షణ లేకపోతే గ్రీసు సంక్షోభాలొస్తాయ్: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రభుత్వాలకు ద్రవ్య క్రమశిక్షణ లేకపోతే గ్రీసు సంక్షోభాల్లాంటివాటిని ఎదుర్కోవలసి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తొలి భారత కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక సరళీకరణ తర్వాత సంస్థల ఉనికికి, వృద్ధికి పోటీతత్వం, వ్యయ నియంత్రణ, సమర్థవంతంగా నిర్వహించడం కీలకం అయ్యాయని పేర్కొన్నారు. ఏ దేశ ప్రభుత్వానికైనా సమర్థ వ్యయ నిర్వహణ అత్యంత ముఖ్యమైనదని వివరించారు. అధికంగా సంపాదించడం లేదా తక్కువగా ఖర్చు చేయడం వల్ల ద్రవ్య క్రమశిక్షణ సాధించవచ్చని చెప్పారు. రెండింటిని సాధించడం ఉత్తమమైన విధామని పేర్కొన్నారు. కాస్ట్ అకౌంట్స్ తమ వృత్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు, కార్యకలాపాల్లో అత్యున్నత వ్యయ నియంత్రణకు సలహాలు ఇవ్వాలని సూచించారు.