ఆ ఇద్దరు మహానేతల మృతికి మోదీనే కారణం.. | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి సంచలన ఆరోపణలు

Published Fri, Apr 2 2021 9:30 PM

 Udhayanidhi Stalin Says Sushma Swaraj And Arun Jaitley Died Due To Modis Torture - Sakshi

చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి.

సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి గారూ, మీ ఎన్నికల ప్రచారం కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ ఆరోపణలన్నీ అవాస్తవం. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారో మాకు తెలుసు. కష్ట సమయాల్లో ప్రధానితో పాటు పార్టీ కూడా మా కుటుంబానిక అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి అంటూ పేర్కొన్నారు.

మరోవైపు జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ బక్షీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఉదయనిధి గారూ, మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకోను. ప్రధాని మోదీ, నా తండ్రి మధ్య ఎంతో గాఢమైన బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. అంతటి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని విశ్వసిస్తున్నాను'' అంటూ సొనాలీ జైట్లీ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement