వృద్ధి 7.4-7.6 శాతం ఉండొచ్చు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా
న్యూఢిల్లీ : భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం నుంచి 7.6 శాతం వృద్ధిని సాధించగలదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అంచనాలను మించిన వర్షాల కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని, ఫలితంగా భారత్ ఈ స్థాయి వృద్ధి సాధిస్తుందని ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని, గ్రామీణ వినియోగం, సెంటిమెంట్‌లు మెరుగుపడతాయని పేర్కొంది. మద్దతు ధరల్లో స్వల్ప పెరుగుదల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం నియత్రణలోనే ఉండొచ్చని వివరించింది. గ్రీస్ సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడం వంటి అంశాల కారణంగా విదేశీ మారక ద్రవ్య రేట్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది.