2024–25లో 25 % వృద్ధి
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా
వేడి వాతావరణంతో పెరుగుతున్న నియోగం
కోల్‌కతా: ఉష్ణోగ్రతల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో దేశంలో రూమ్ ఏసీల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) పరిశ్రమ అసాధారణ వృద్ధిని చూడనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 20–25 శాతం అధికంగా 1.2–1.25 కోట్ల రూమ్ ఏసీ యూనిట్లు అమ్ముడుపోవచ్చని పేర్కొంది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంత్సరంలోనూ (2025–26) రూమ్ ఏసీల అమ్మకాలు 10–12 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఒక ఇంట్లోనే ఒకటికి మించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటుండటం, పట్టణీకరణ, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, సులభతర కన్జ్యూమర్ ఫైనాన్స్ (రుణాలపై కొనుగోలు) సదుపాయాలు... ఇవన్నీ వచ్చే కొన్నేళ్ల పాటు రూమ్ ఏసీల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ‘‘దేశీ రూమ్ ఏసీ పరిశ్రమ కరోనా ముందు నాటి విక్రయాల పరిమాణాన్ని 2023–24లోనే అధిగమించింది.
వాతావారణంలో వచి్చన మార్పులు, సానుకూల వినియోగ ధోరణులు మద్దతుగా నిలిచాయి’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి వివరించారు. ఏడాదిలో అధిక వేడి ఉండే సగటు రోజులు గడిచిన మూడు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది వేసవి సీజన్‌లో అయితే రూమ్ ఏసీలకు సంబంధించి కొన్ని కంపెనీలు (ఓఈఎంలు) 40–50 శాతం వరకు అధిక అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం.
సామర్థ్యాల పెంపుపై దృష్టి..
‘‘సరఫరా వైపు చూస్తే దేశీ రూమ్ ఏసీ సామర్థ్యం వచ్చే మూడేళ్లలో 40 శాతం పెరగనుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఓఈఎంలు, కాంట్రాక్టు తయారీదారులు రూమ్ ఏసీల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు’’అని కృష్ణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరబుల్ విడిభాగాలకు పీఎల్‌ఐ పథకం కింద ప్రకటించిన ప్రయోజనాల ప్రభావాన్ని సైతం ఇక్రా నివేదిక గుర్తు చేసింది. రూమ్ ఏసీ పరిశ్రమలో స్థానిక తయారీ పెరగడానికి పీఎల్‌ఐ పథకం దోహదం చేసినట్టు తెలిపింది.
మూడు లిస్టెడ్ రూమ్ ఏసీ కంపెనీలు జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 53 శాతం మేర ఆదాయ వృద్ధిని నమోదు చేయడాన్ని ప్రస్తావించింది. వేసవి సీజన్‌లో డిమాండ్ గరిష్ట డిమాండ్‌కు నిదర్శనంగా పేర్కొంది. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం మేర ఆదాయంలో వృద్ధిని సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 25 శాతం అధిక ఆదాయాన్ని నమోదు చేస్తాయని ఇక్రా అంచనా వేసింది. తీవ్ర పోటీ, తయారీకి వినియోగించే విడిభాగాల ధరల్లో అస్థితరలు ఉన్నప్పటికీ.. రూమ్ ఏసీ కంపెనీల లాభాల మార్జిన్లు రానున్న కాలంలో క్రమంగా మెరుగుపడతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment