న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెలిపింది. సరఫరా అంతరాయాలతో ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ పనితీరుకు ఆటంకం కలిగింది. 2024 మొదటి రెండు త్రైమాసికాల్లో ఎదుర్కొన్న సరఫరా సవాళ్ల నుండి కోలుకుని వచ్చే సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం పెరుగుతాయని ఆడి అంచనా వేస్తోంది.
‘భారత్‌లో 2024లో లగ్జరీ కార్ల పరిశ్రమ వృద్ధి 8–10 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ సైతం ఇదే విధమైన వృద్ధిని ఆశిస్తోంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. గత మూడేళ్లలో భారీ వృద్ధిని కనబరిచిన తర్వాత పరిశ్రమ విక్రయాల వృద్ధి క్షీణించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో పరిశ్రమ వృద్ధి దాదాపు 5 శాతంగా ఉంది. గత మూడేళ్లలో 30 శాతం వార్షిక వృద్ధిని సాధించిందని తెలిపారు.
అత్యధిక వార్షిక విక్రయాలు..
లగ్జరీ కార్ల పరిశ్రమ ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అత్యధిక వార్షిక విక్రయాలు 50,000 యూనిట్ల మార్కును దాటుతుందని విశ్వసిస్తున్నామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. మొదటి రెండు త్రైమాసికాల్లో కార్ల సరఫరా తగినంతగా లేనందున 2024 ఆడి ఇండియాకు కఠిన సంవత్సరంగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ఏడాది ఎదగలేమని, వచ్చే సంవత్సరం బలంగా తిరిగి పుంజుకుంటామని వివరించారు.
కాగా, ఎస్‌యూవీ క్యూ7 కొత్త వెర్షన్‌ను సంస్థ పరిచయం చేసింది. కంపెనీ ఇప్పటి వరకు భారత్‌లో 10,000 యూనిట్లకు పైగా క్యూ7 మోడల్ కార్లను విక్రయించింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను కలిగి ఉండాలనే కస్టమర్ల నిరంతర కోరిక ఇందుకు నిదర్శనమని ధిల్లాన్ పేర్కొన్నారు. క్యూ7 రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.88.66 లక్షల నుంచి ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment