15 ఏళ్లు నిండిన పాత వాహనాలు
నిబంధనల ప్రకారం తుక్కుగా మారాలి
అన్నీ స్క్రాపేజీ కిందకు రాకపోవచ్చు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా
ముంబై: దేశంలో ఈ ఏడాది మార్చి నాటికి 15 ఏళ్ల జీవిత కాలం పూర్తయిన మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు (ఎంఅండ్‌హెచ్‌సీవీలు) 11 లక్షల మేర ఉంటాయని, నిబంధనల ప్రకారం ఇవన్నీ తుక్కు కిందకు వెళ్లాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. కానీ, గడువు ముగిసిన తర్వాత కూడా వాటిని నడిపిస్తుండడం వల్ల తుక్కు కిందకు మారేవి వాస్తవంగా ఇంతకంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.
వీటిల్లో కొంత మేర తుక్కుగా మారినా కానీ, వాణిజ్య వాహన అమ్మకాల డిమాండ్‌కు కొంత మేర మద్దతుగా నిలవొచ్చని పేర్కొంది. ‘వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరేషన్ ప్రోగ్రామ్’ లేదా స్క్రాపేజీ పాలసీని 2021 మార్చిలో ప్రకటించగా.. 2023 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తుండడం గమనార్హం. మొదటి దశలో 15 ఏళ్ల జీవిత కాలం ముగిసిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వచి్చన రెండో దశలో భాగంగా.. వాహనం వయసుతో సంబంధం లేకుండా ఫిట్‌నెస్ ఆధారంగా తుక్కుగా మార్చడం తప్పనిసరి చేశారు. అంటే నిబంధనలకు మించి కాలుష్యం విడుదల చేసే వాహనాలను కాలంతో సంబంధం లేకుండా తుక్కుగా మార్చనున్నారు.
మరో 5.7 లక్షల వాహనాలు..
2027 మార్చి నాటికి మరో 5.7 లక్షల వాహనాలు 15 ఏళ్ల జీవిత కాలం పూర్తి చేసుకుంటాయని ఇక్రా తెలిపింది. మొదటి దశలో భాగంగా 9 లక్షల ప్రభుత్వ వాణిజ్య వాహనాలు తుక్కుగా మార్చడం వంటివి కొత్త వాహన కొనుగోళ్ల డిమాండ్‌ను పెంచనున్నట్టు అంచనా వేసింది. ఇక ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల వినియోగం తక్కువగా ఉన్నందున ఈ విభాగాల నుంచి తుక్కుగా మారేవి తక్కువగానే ఉండొచ్చని ఇక్రా తెలిపింది. స్క్రాపేజీ పాలసీ అమల్లోకి వచ్చినప్పటికీ వాహన యజమానుల నుంచి స్పందన పరిమితంగానే ఉన్నట్టు ఇక్రా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 ఆగస్ట్ 31 నాటికి వాహన తుక్కు కేంద్రాలు కేవలం 44,803 ప్రైవేటు వాహనాలు, 41,432 ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన స్క్రాప్ దరఖాస్తులనే అందుకున్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది.
దీర్ఘకాలంలో ప్రయోజనాలు..
‘‘వాహన తుక్కు విధానంతో దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలున్నాయి. పాత వాహనాలను తుక్కు గా మార్చడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. ఫ్లీట్ ఆధునికీకరణ (కొత్త వాహన కొనుగోళ్లు) కార్యక్రమానికి ఇది దారితీస్తుంది. మొత్తం మీద ఆటో పరిశ్రమలో అమ్మకాలకు మద్దతుగా నిలుస్తుంది. ఆటోమోటివ్ ఓఈఎంలకు ముడి సరుకుల వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజాల్ షా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment