AC sales
-
ఏసీల డిమాండ్ ఎలా ఉండనుందంటే..
కోల్‌కతా: ఉష్ణోగ్రతల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో దేశంలో రూమ్ ఏసీల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) పరిశ్రమ అసాధారణ వృద్ధిని చూడనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 20–25 శాతం అధికంగా 1.2–1.25 కోట్ల రూమ్ ఏసీ యూనిట్లు అమ్ముడుపోవచ్చని పేర్కొంది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంత్సరంలోనూ (2025–26) రూమ్ ఏసీల అమ్మకాలు 10–12 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఒక ఇంట్లోనే ఒకటికి మించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటుండటం, పట్టణీకరణ, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, సులభతర కన్జ్యూమర్ ఫైనాన్స్ (రుణాలపై కొనుగోలు) సదుపాయాలు... ఇవన్నీ వచ్చే కొన్నేళ్ల పాటు రూమ్ ఏసీల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ‘‘దేశీ రూమ్ ఏసీ పరిశ్రమ కరోనా ముందు నాటి విక్రయాల పరిమాణాన్ని 2023–24లోనే అధిగమించింది. వాతావారణంలో వచి్చన మార్పులు, సానుకూల వినియోగ ధోరణులు మద్దతుగా నిలిచాయి’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి వివరించారు. ఏడాదిలో అధిక వేడి ఉండే సగటు రోజులు గడిచిన మూడు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది వేసవి సీజన్లో అయితే రూమ్ ఏసీలకు సంబంధించి కొన్ని కంపెనీలు (ఓఈఎంలు) 40–50 శాతం వరకు అధిక అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. సామర్థ్యాల పెంపుపై దృష్టి.. ‘‘సరఫరా వైపు చూస్తే దేశీ రూమ్ ఏసీ సామర్థ్యం వచ్చే మూడేళ్లలో 40 శాతం పెరగనుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఓఈఎంలు, కాంట్రాక్టు తయారీదారులు రూమ్ ఏసీల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు’’అని కృష్ణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరబుల్ విడిభాగాలకు పీఎల్ఐ పథకం కింద ప్రకటించిన ప్రయోజనాల ప్రభావాన్ని సైతం ఇక్రా నివేదిక గుర్తు చేసింది. రూమ్ ఏసీ పరిశ్రమలో స్థానిక తయారీ పెరగడానికి పీఎల్ఐ పథకం దోహదం చేసినట్టు తెలిపింది. మూడు లిస్టెడ్ రూమ్ ఏసీ కంపెనీలు జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 53 శాతం మేర ఆదాయ వృద్ధిని నమోదు చేయడాన్ని ప్రస్తావించింది. వేసవి సీజన్లో డిమాండ్ గరిష్ట డిమాండ్‌కు నిదర్శనంగా పేర్కొంది. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం మేర ఆదాయంలో వృద్ధిని సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 25 శాతం అధిక ఆదాయాన్ని నమోదు చేస్తాయని ఇక్రా అంచనా వేసింది. తీవ్ర పోటీ, తయారీకి వినియోగించే విడిభాగాల ధరల్లో అస్థితరలు ఉన్నప్పటికీ.. రూమ్ ఏసీ కంపెనీల లాభాల మార్జిన్లు రానున్న కాలంలో క్రమంగా మెరుగుపడతాయని పేర్కొంది. -
మార్కెట్లో ఏసీలు, ఫ్రిజ్‌లకు కొరత!
రోజురోజుకి పెరుగుతున్న భానుడి ఉగ్రరూపం, చాలా ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఏసీలు, ఫ్రిజ్‌లతో పాటు.. కూల్డ్రింకులు, ఐస్ క్రీమ్‌లను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వీటి అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీపావళి వరకూ తక్కువ స్థాయిలో నమోదైన ఈ అమ్మకాలు, ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఏసీల అమ్మకాలు గత ఏడాది కంటే 50 శాతం పెరిగాయి. ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా 18శాతం మేర ఎక్కువ నమోదవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కూల్‌డ్రింక్స్ 15 నుంచి 20 శాతం, ఐస్ క్రీమ్ లు 30 నుంచి 40 శాతం మేర పుంజుకున్నాయని పేర్కొన్నాయి. కానీ పెరిగిన డిమాండ్ మేర ఏసీలు, ఫ్రిజ్‌లు మార్కెట్లో కనిపించడం లేదు. వీటికి కొరత ఏర్పడింది. కావాలనుకునేవారు ముందుగా బుక్ చేసుకుంటే తప్ప వెంటనే దొరికే పరిస్థితి లేదు. చివరి ఏడాది ఏప్రిల్ లో అమ్మిన ఏసీల కంటే ఈ ఏడాది ఏప్రిల్ లో రెండింతలు అమ్మినట్లు వోల్టాస్ కంపెనీ తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో ముందంజలో ఉన్న ఎల్జీ కంపెనీ, ఈ ఏడాది ఏసీల అమ్మకాలో 50 శాతం వృద్ధి కనబరిచింది. పటియాలా, ఆనంద్, విజయవాడలలో వీటికి డిమాండ్ అధికంగా ఉందని పేర్కొంది. ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే బెంగళూరులో కూడా ఈసారి ఏసీల అమ్మకాలు పెరిగినట్లు ఎల్జీ తెలిపింది. ఏసీలు, ఫ్రిజ్‌ల డిమాండ్ పెరుగుతుండటంతో వాటి కంపెనీల షేర్లు కూడా మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నే కొనసాగిస్తున్నాయి. -
మండు వేసవిలో చల్లని గాలి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ (ఏసీ) అనేది ఇప్పుడు అవసరాల జాబితాలో చేరిపోయింది. మెట్రో నగరాల్లోనే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ వైఖరి పెరిగిపోయింది. నెలసరి వాయిదా చెల్లింపులు (ఈఎంఐ), సులువైన ఫైనాన్స్ విధానం, ఇంధన సామర్థ్య ఏసీలతో మెట్రో నగరాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్కెట్ వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. ఆన్లైన్ అమ్మకాల్లోనూ జోరందుకుంటుందని భావిస్తోంది. మొత్తంగా గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏసీ అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల మార్కెట్ వైపు ఏసీ కంపెనీలు ప్రత్యేక దృష్టిసారించాయని ప్యానసోనిక్ ఇండియా అండ్ సౌత్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మనీష్ కుమార్ చెప్పారు. మెట్రో నగరాల విషయానికొస్తే.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో హైఎండ్, యాప్ కంట్రోల్ ఏసీలు, ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ విభాగం అమ్మకాల వాటా 15 శాతం మేర ఉంటుందని అంచనా. ఫిబ్రవరి నుంచే ఎండలు మండేస్తున్నాయ్..: గత నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు ప్రభావం ఏసీ కంపెనీలపై ఏమాత్రం పడలేదని ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయబాబు చెప్పారు. గతేడాది మార్చి నెలల్లో ప్రారంభ రోజుల్లో ఉత్తరాది ప్రాంతాల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి కూడా. కానీ, ఈ ఏడాది దేశంలో వేసవికాలం కాస్త ముందుగానే వచ్చింది. ఫిబ్రవరి నుంచే ఎండలు మండేస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏసీ అమ్మకాలు పెరుగుతాయని శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ బుటానీ చెప్పారు. ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చాలా వరకు వాతావారణ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ప్యానసొనిక్ ఇండియా అండ్ సౌత్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మనీష్ కుమార్ చెప్పారు. ఈ సానుకూల వాతావరణ పరిస్థితులు ఏసీ పరిశ్రమకు కలిసిరానున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ, ఆన్లైన్ వ్యాపారంపై దృష్టి.. గ్రామీణ, నాన్ మెట్రో ప్రాంతాల్లో సులువైన ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా కస్టమర్లకు చేరువయ్యేందుకు, వారిని అప్‌గ్రేడ్ అయ్యేందుకు అవకాశాల్ని కల్పిస్తున్నాయని రాజీవ్ బుటానీ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీ అమ్మకాలు 60:40 శాతం మేర ఉంటాయని అంచనా వేశారాయన. అదేవిధంగా ఆన్లైన్లో ఏసీ అమ్మకాల్లోనూ వృద్ధి కనబరుస్తుందని ఏసీ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. ‘‘ఈ ఏడాది ఆన్లైన్ అమ్మకాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని’’ హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు. స్ప్లిట్, ఇన్వర్టర్ ఏసీలదే హవా.. ఇదిలా ఉంటే ఏసీల మార్కెట్లో ఇప్పుడు స్ప్లిట్, ఇన్వర్టర్ ఏసీలకు మంచి డిమాండ్ ఉంది. కొనుగోలుదారులు స్ప్లిట్ ఏసీలు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీలు ఖరీదు సంబంధం లేకుండా శీతలీకరణ విషయంలో అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అందుకే చాలా మంది విండో ఏసీ కొనుగోలుదారులు ఇప్పుడు స్ప్లిట్ ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారని ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. చెప్పారు. గతంలో విండో, స్ప్లిట్ ఏసీల అమ్మకాల శాతం 50:50 గా ఉంటే ఇప్పుడది 70:30 శాతానికి మారిందని వివరించారాయన. గతేడాది ఇన్వెస్టర్ ఏసీలు 27 శాతం వృద్ధిని నమోదు చేశాయని.. ఈ ఏడాది కూడా అదే వృద్ధిని ఆశిస్తున్నామని ప్యానాసొనిక్ అంచనా వేస్తుంది. పెపైచ్చు కొనుగోలుదారులు ఏసీలు కేవలం చల్లదనంతోనే సరిపెట్టుకోవట్లేదని.. తమ ఏసీ చూడ్డానికి అందంగా ఉండాలని.. కనిష్ట శబ్ధం వద్ద పనిచేయాలని కోరుకుంటున్నారని చెప్పారు.స్ప్లిట్ ఏసీల్లోనూ ఫ్లోరల్ ప్యాట్రన్ ఏసీలకు మంచి డిమాండ్ ఉందని.. వీటినే కొనుగోలుదారులు మొదటి చాయిస్ ఇస్తున్నారన్నారు. యాప్ నియంత్రణ ఏసీలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయని.. అవి కూడా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయని తెలియజేశారు.