మార్కెట్లో ఏసీలు, ఫ్రిజ్‌లకు కొరత!
రోజురోజుకి పెరుగుతున్న భానుడి ఉగ్రరూపం, చాలా ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఏసీలు, ఫ్రిజ్‌లతో పాటు.. కూల్‌డ్రింకులు, ఐస్ క్రీమ్‌లను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వీటి అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీపావళి వరకూ తక్కువ స్థాయిలో నమోదైన ఈ అమ్మకాలు, ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఏసీల అమ్మకాలు గత ఏడాది కంటే 50 శాతం పెరిగాయి. ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా 18శాతం మేర ఎక్కువ నమోదవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కూల్‌డ్రింక్స్ 15 నుంచి 20 శాతం, ఐస్ క్రీమ్ లు 30 నుంచి 40 శాతం మేర పుంజుకున్నాయని పేర్కొన్నాయి. కానీ పెరిగిన డిమాండ్ మేర ఏసీలు, ఫ్రిజ్‌లు మార్కెట్లో కనిపించడం లేదు. వీటికి కొరత ఏర్పడింది. కావాలనుకునేవారు ముందుగా బుక్ చేసుకుంటే తప్ప వెంటనే దొరికే పరిస్థితి లేదు.
చివరి ఏడాది ఏప్రిల్ లో అమ్మిన ఏసీల కంటే ఈ ఏడాది ఏప్రిల్ లో రెండింతలు అమ్మినట్లు వోల్టాస్ కంపెనీ తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో ముందంజలో ఉన్న ఎల్‌జీ కంపెనీ, ఈ ఏడాది ఏసీల అమ్మకాలో 50 శాతం వృద్ధి కనబరిచింది. పటియాలా, ఆనంద్, విజయవాడలలో వీటికి డిమాండ్ అధికంగా ఉందని పేర్కొంది. ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే బెంగళూరులో కూడా ఈసారి ఏసీల అమ్మకాలు పెరిగినట్లు ఎల్‌జీ తెలిపింది. ఏసీలు, ఫ్రిజ్‌ల డిమాండ్ పెరుగుతుండటంతో వాటి కంపెనీల షేర్లు కూడా మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నే కొనసాగిస్తున్నాయి.