నయా పేదల దేశంలో ‘నాజీల’ హవా! | Greece's Golden Dawn to form new party if banned from polls | Sakshi
Sakshi News home page

నయా పేదల దేశంలో ‘నాజీల’ హవా!

Published Thu, Feb 6 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

నయా పేదల దేశంలో ‘నాజీల’ హవా!

నయా పేదల దేశంలో ‘నాజీల’ హవా!

పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని గ్రీస్ సంక్షోభం దేశంలో సగం జనాభాను నయా పేదలుగా దిగజారుస్తోంది. విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, పేదరికాలను ఆసరాగా చేసుకోని జాతీయోన్మాద ‘గోల్డెన్ డాన్’ మూడో అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది.
 
 గ్రీస్ ఎంతటి ఘన చరిత్ర గలిగిన దేశమైనా నేడు మాత్రం అది యూరోపియన్ యూనియన్ సంక్షోభాన్ని కొలిచే థర్మామీటరు, బారోమీటరు. గ్రీస్‌లో ఫ్యాక్టరీ ఉత్పత్తి గత ఏడేళ్లలో మొట్టమొదటిసారిగా తల పెకైత్తి చూసిందని సంబరపడిపోతున్న వారు లేకపోలేదు. అలాంటి వారిని ఉద్దేశించే గామోసు ఈయూ మకుటం లేని మహారాణి ఏంజెలా మర్కెల్ గత నెల 29న ఇది ‘తుపాను ముందటి ప్రశాంతత’ అని వ్యాఖ్యానించారు. యూరో రుణ సంక్షోభం ప్రమాద తీవ్రత ఏమీ తగ్గలేదని హెచ్చరించారు. ‘తుపాను’ తాకిడికి గురయ్యే మొదటి దేశంగా గ్రీస్‌కు ఇప్పుడు తక్షణమే మరో బెయిలవుట్ అవసరమని యూరో విశ్లేషకులు ఎప్పుడో తేల్చేశారు. తేల్చాల్సిన జర్మనీ ఛాన్స్‌లర్ మర్కెల్ పెదవి విప్పలేదు. జర్మన్ ఆర్థిక శాఖ గ్రీస్ కోసం రూపొందించిన మూడో బెయిలవుట్ విషయం వారం క్రితం బయటపడింది. గ్రీస్ కోసం ఒకటి నుంచి రెండు వేల కోట్ల డాలర్ల రుణాన్ని సిద్ధం చేశారు.
 
 కాకపోతే అది మరింత కఠినమైన పొదుపు చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ‘క్యారట్‌లు కావాలిగానీ, కట్టె మాత్రం వద్దంటే ఎట్లా కుదురుతుంది?’ అని ఈయూ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ బుధవారం మరో సందర్భంగా ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిపుణులు కొందరు వారితో విభేదిస్తున్నారు. ‘గ్రీస్‌కు ఇప్పుడు కావాల్సింది బెయిలవుట్ రుణ ప్యాకేజీ కాదు. రుణ పునర్వ్యవస్థీకరణ. ప్రభుత్వ వ్యయంలో ఇంకా కోతలు విధించడం గానీ,  ప్రజలపై ఇంకా పన్నులు విధించడం గానీ అసాధ్యం’ అని వారి వాదన. గ్రీస్ రుణాన్ని మాఫీ చేయడం తప్ప గత్యంతరం లేదని వారు అంటున్నారు. ‘ధార్మికత’తో సంక్షోభాలు పరిష్కారం కావని మర్కెల్ దృఢ విశ్వాసం. గ్రీస్, స్పెయిన్, సైప్రస్‌ల వంటి దేశాలకు ఇచ్చిన రుణాలను ముక్కు పిండి, వడ్డీతో సహా వసూలు చేయకపోతే... అక్కడి సంక్షోభానికి కాళ్లొచ్చి స్వదేశంలోకే ప్రవేశిస్తుందని ఆమె ఆందోళన.
 
  పైగా ఆధునిక యుగంలో రుణాన్ని మించిన ఆధిపత్య సాధనం ఇంకేముంది?  గ్రీస్ వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ వ్యయంలో 15 వందల కోట్ల యూరోల కోతలు విధించాలి. కానీ జనాభాలో 28 శాతం, యువతలో 60 శాతం నిరుద్యోగులుగా ఉన్న దేశంలో పన్నులను ఎంతగా పెంచినా పన్నుల రాబడి మాత్రం తగ్గిపోతూనే ఉంది. అసలు ఉద్యోగమే లేకపోతే పన్నులు ఎక్కడి నుంచి కడతారు?  అందుకే ప్రభుత్వం ఆస్తిపన్నుల రూపంలో ఇంత ఇల్లో, స్థలమో ఉన్న చిన్న ఆస్తిపరులను దివాలా తీయిస్తోంది. ఆదాయపు పన్ను, దానిపై విధించే సౌహార్ద్రతాపన్ను, వృత్తి పన్నులుగాక ఆస్తి యాజమాన్యంపై కనీసం 40 రకాల పన్నులు విధిం చారు. కాబట్టే 2010-13 మధ్య ఆస్తి పన్ను రాబడి 5 కోట్ల యూరోల నుంచి 350 కోట్ల యూరోలకు పెరిగింది.
 
  గ్లోరియా అలియియాన్ని  గోడు వింటే నయా పేదలుగా దిగజారుతున్న భద్రజీవుల బాధలు అర్థమవుతాయి. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు దక్షిణ ఆఫ్రికాకు వెళ్లి, జీవితాంతం రాగి గనుల్లో పని చేశారు. వారు కొన్న ఇల్లూ, స్థలమే కాదు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్ కూడా పన్ను బకాయిలకు గానూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆస్తుల విలువ కంటే పన్నుల బకాయిలు ఎక్కు గా ఉంటే జైలు శిక్షలు కూడా వేస్తామంటున్నారు. అందుకోసం తాజాగా పన్ను బకాయిలను క్రిమినల్ నేరంగా మార్చేశారు. దీంతో ఆర్థిక భద్రతగా భావించిన ఆస్తులు గుదిబండలుగా మారుతున్నాయి. పన్నుల బకాయిల కోసం ప్రజలను వీధులపాలు చేసి ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను కొనేవారెవరు? గత ఏడాది కాలంలో వంద ఆస్తులు కూడా వేలంలో అమ్ముడుపోలేదు. మరి ఎందుకీ దౌర్జన్యం? ప్రభుత్వం పేరున ఆస్తులుంటే విదేశీ రుణాలకు హామీలవుతాయని సమాధానం.  
 
 ఇలాంటి ఆధిపత్య ధోరణులే రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయని సుప్రసిద్ధ జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త జూజెన్ హాబర్‌మాన్ బుధవారం హెచ్చరించారు. ‘‘మర్కెల్ పెట్టుబడి అనుకూల విధానాలు ప్రజాస్వామ్యాన్ని లోతుగా గాయపరుస్తున్నాయి. సంక్షోభ దేశాలకు ఆమె చేస్తున్న విపరీతపు చికిత్స చెప్పనలవిగాని సామాజిక దుష్పర్యవసానాలకు, యూరప్ అంతటా జాతీయోన్మాదపు సరికొత్త వెల్లువకు దారి తీస్తోంది’’ అని అన్నారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే ఆచరణాత్మకవాద తత్వవేత్త హాబర్‌మాన్ చెప్పినదే గ్రీస్‌లో అక్షరాలా జరుగుతోంది. పచ్చి మితవాద జాతీయోన్మాద పక్షం ‘గోల్డెన్ డాన్’ వలస వచ్చిన విదేశీయులపై దాడులు సాగిస్తోంది. అధికారంలోకి వస్తే విదేశీయులను పారదోలేసి నిరుద్యోగం, పేదరికం, తదితర సకల రోగాలను చిటికెలో మటు మాయం చేస్తానంటూ ఊదరగొడుతుంది. హిట్లర్ స్వస్తిక గుర్తును తలపించే జెండా పట్టిన ఆ నియో-నాజీ పార్టీ అప్పుడే గ్రీస్‌లో మూడో అతి పెద్ద రాజకీయ పక్షంగా మారింది.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement