
బెర్లిన్: రెండు వేర్వేరు కరోనా టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. నిపుణులు మాత్రం ఇలా రెండు వేర్వేరు టీకాలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక మన దేశంలో అక్కడక్కడా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకున్నవారు ఉన్నారు. అయితే వీరంతా వైద్య సిబ్బంది తప్పిదం వల్ల ఇలా రెండు వేర్వేరు కంపెనీలు వ్యాక్సిన్‌లు తీసుకున్నారు కానీ.. కావాలని కాదు.
ఈ క్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ సాహసం చేయడానికి ముందుకు వచ్చారు. ఏంజెలా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి డోస్‌లో భాగంగా ఆస్ట్రాజెనికా తీసుకున్న ఏంజెలా రెండో డోసులో భాగంగా మోడర్న టీకా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు.
మూడేళ్ల క్రితం ఏంజెలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆమెకు ఉన్నట్లుండి కళ్లు తిరగడంతో వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె తిరిగి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 16ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మెర్కెల్ ఈ ఏడాది పదవీవిరమణ చేయనున్నారు. ఇక గత రెండు వారాల నుంచి జర్మనీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగతుంది.
Comments
Please login to add a commentAdd a comment