సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) వెల్లడించింది. ఒప్పందం మేరకు కోవిషీల్డ్‌ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యంపై నోటీసులో ప్రశ్నించిందని ఎస్‌ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా బుధవారం తెలిపారు. ఈ విషయం కేంద్రానికి కూడా తెలుసన్నారు. దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్)
భారత్‌లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. టీకా అవసరమైన భారతీయులందరికీ దీన్ని అందజేయలేమని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు. ఎస్‌ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు. ‘భారత ప్రభుత్వ అభ్యర్థనపై భారత్‌కు సబ్సీడీ ధరకు సుమారు రూ. 150 రూ. 160 కే టీకా డోసు అందిస్తున్నాం. లాభాలు రావడం లేదని చెప్పలేం. కానీ గొప్పగా లాభాలేమీ రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment