Pilla Venkateshwara Rao
-
‘తాలిబన్ రాజధాని’లో అఫ్ఘాన్ క్రీడ
విఫలం కానున్న పాక్ సైనిక చర్యలోనే అమెరికా అఫ్ఘాన్‌లోని తన భవితను వెతుక్కుంటోంది. పాక్ కోరుతున్నట్టు అమెరికా - అఫ్ఘాన్ -పాక్‌ల కూటమి తప్ప గత్యంతరం లేదని భావిస్తోంది. దాని అర్ధం అఫ్ఘాన్ ‘శాంతి ప్రక్రియ’ నుంచి భారత్‌ను మినహాయించడమే. నరేంద్రమోడీ ప్రభుత్వానికి అమెరికా పంపుతున్న ‘ప్రేమ సందేశాల’పై మన మీడియాకు చిన్న చూపున్నట్టుంది. లేకపోతే 2008 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ మొహ్మద్ సయీద్ నేతృత్వంలోని ‘ధార్మిక సంస్థ’ జామతే ఉద్ దవాను గత నెల 26న ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటుందా? హఫీజ్‌ను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల జాబితాకు ఎక్కించి, అతని తలపై కోటి డాలర్ల నజరానాను ప్రకటించి మూడేళ్లు గడచింది. అయినా పాకిస్థాన్‌లో బహిరంగంగానే యథేచ్ఛగా భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్న హఫీజ్ ఇకపై కూడా అలాగే నిక్షేపంగా ఉంటాడు, జమాతే ఉద్ దవా కూడా నిక్షేపంగా ఉంటుందనేది నిజమే. లష్కరే తోయిబా, దాని ముసుగు సంస్థ జమాతే ఉద్ దవా భారత్‌లో ప్రత్యేకించి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర చర్యలపైనే దృష్టిని కేంద్రీకరించే సంస్థ లు. ‘‘జమాతే ఉద్ దవా అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలను కుంటోంది. ఆర్భాటం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా తన పని తాను చేసుకుపోయే అది ఆ పనిని మనం అనుకునే దాని కంటే త్వరగానే చేయగలుగుతుంది’’అని అమెరికన్ పాకిస్థానీ అరీఫ్ జమాల్ గట్టి విశ్వాసం. ఇటీవలే వెలువడిన ఆయన రాసిన ‘కాల్స్ ఫర్ ట్రాన్స్‌నేషనల్ జిహాద్: లష్కరే తోయిబా’ అమెరికా ఊహిస్తున్న దానికంటే జమాతే ఉద్ దవా చాలా ప్రమాదకరమైన సంస్థని పేర్కొంది. అమెరికాది కంటి తుడుపు చర్యేనని పెదవి విరిచేయడం సహజమే. కానీ ఆరేళ్లపాటూ ఆ పని చేయలేని అమెరికా ‘ఇప్పుడే’ ఎందుకు చేసినట్టు? సమాధానాన్ని గత నెల 15 నుంచి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పాక్ తాలిబన్‌గా పిలిచే తెహ్రికే తాలిబన్ పాకిస్థాన్ (టీపీపీ) ఉగ్రవాదులపై ఉత్తర వజీరిస్థాన్‌లో చేపట్టిన సైనిక దాడుల్లో వెతుక్కోవాలి.అప్ఘానిస్థాన్లో గద్దె నెక్కనున్న అమెరికా అనుకూల ప్రభుత్వంలో వెదుక్కోవాలి. పాక్ వాయవ్య సరిహ ద్దుల్లోని కేంద్ర పాలిత ఆదివాసి ప్రాంతాల్లోని (ఎఫ్ఏటీఏ) ఉత్తర వజీరిస్థాన్ ‘ప్రపంచ తాలిబన్ రాజధాని.’ అఫ్ఘాన్‌లోని నాటో దళాలపై దాడులు సాగించి, సరిహద్దులు దాటడం తాలి బన్లు ఏళ్ల తరబడి ఆడుతున్న ఆట. ఈ ఆటను కట్టించడానికి అమెరికా బలవంతం మీద 2009లో స్వాత్‌పై సైనిక చర్యను ప్రారంభించిన పాక్ సైన్యం ఉత్తర వజీరిస్థాన్ జోలికి పోలేదు. అలాంటిది నేడు వజీరిస్థాన్‌పై సైనిక చర్యకు సిద్ధం కావడంతో ఉగ్రవాదంపై పాక్ వైఖరిలో మార్పువచ్చిందని విశ్లేషకులు తొందరపాటు నిర్ధారణలు చేసేస్తున్నారు. రెండు వారాల్లో టీపీపీని తుడిచి పెట్టేస్తామంటూ సైన్యం ప్రారంభించిన ఈ చర్య 5 లక్షల మంది ప్రజలను నిర్వాసితులను చేసింది. 376 మంది మిలిటెంట్లు, 17 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యపు అధికారిక సమాచారం. సోమవారం నాటికి గానీ పాక్ సైన్యం భూతల పోరుకు సిద్ధం కాలేకపోయింది. ఇంతా చేసి పాక్ సైన్యం చేస్తున్న పోరంతా పాక్‌లో దాదాపు 50 వేల మందిని బలిగొన్న టీపీపీకి వ్యతిరేకంగా చేస్తున్న దాడులే. పాక్ అనుకూల అఫ్ఘాన్ తాలిబన్, హఖానీ నెట్వర్క్, హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపులతో పాక్ సైన్యం అనధికార శాంతి మంత్రం జపిస్తూనే ఉంది. సైనిక చర్య మొదలు కాగానే టీపీపీ అధినేత ముల్లా ఫజులుల్లా సహా కీలక నేతలంతా సరిహద్దు దాటేశారు. ఎట్టకేలకు నవాజ్ సైనిక చర్యకు సిద్ధం కావడానికి ప్రధాన కారణం గత నెల 9న కరాచీ విమానాశ్రయంపై టీపీపీ జరిపిన ఉగ్రదాడే . పాకిస్థాన్ తెహ్రికె ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ సైనిక చర్య విఫలం కాక తప్పదని ముందే జోస్యం చెప్పారు. ఇమ్రాన్ కోరుతున్న శాంతి చర్చల కోసమే నవాజ్ నెలల తరబడి సమయాన్ని వృథా చేశారు. ఆ కాలంలోనే టీపీపీ సైన్యంతో తలపడటానికి సన్నద్ధమైంది. అందుకే సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటించగలుగుతోంది. ఇప్పటికే కీలక నేతలను బలగాలను సరిహద్దులను దాటించేసింది. ఎట్టకేలకు సైన్యం ఉత్తర వజీరిస్థాన్ను కైవసం చేసుకున్నా దాన్ని అక్కడే నిలిపి ఉంచక తప్పదు. ఉపసంహరించిన వెంటనే టీపీిపీ తిరిగి తిష్టవేయక తప్పదు. విఫలం కానున్న ఈ సైనిక చర్యలోనే అమెరికా అఫ్ఘాన్‌లో తన భవితను వెతుక్కుంటోంది. నాటో సేనల ఉపసంహరణ గడువు దగ్గరపడుతుండగా దానికి ఒకే ఒక్క దారి మిగిలింది. అది పాక్ సైన్యం, ఐఎస్ఐలు కోరుతు న్న అమెరికా-అఫ్ఘాన్-పాక్‌ల కూటమికి అంగీకరించడం. అం టే అఫ్ఘాన్ ‘శాంతి ప్రక్రియ’ నుంచి భారత్‌ను మినహాయించ డం. అందుకు భారత్‌కు చెల్లిస్తున్న చెల్లని చెక్కులలో మొదటిది జమాతే ఉద్ దవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం. పిళ్లా వెంకటేశ్వరరావు -
అమెరికా ‘గీత’... చమురు వాత!
అమెరికా ఆదేశాల మేరకు చౌకగా లభించే ఇరాన్ చమురు దిగుమతుల్లో కోత విధించారు. దక్షిణ ఆసియా పరిస్థితుల్లో భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంకాగల ఇరాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలను కాలదన్నుకోవడం ప్రమాదకరం. అవసాన దశలో ఉన్నంత మాత్రాన యూపీఏ ప్రభుత్వం చేతులు ముడుచుకు కూచోలేదు, చల్లగా కానిచ్చేయాల్సిన పనులను కానిచ్చేస్తోంది. గత నెల 28న ఇరాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ జారిఫ్‌తో భేటీ అయిన మన ప్రధాని మన్మోహన్సింగ్ ఇరాన్‌తో సంబధాలలో సర్వతోముఖ వృద్ధిని కాంక్షించారు. అమెరికా-ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలతో ఉద్రిక్తతలు సడలినట్లనిపిస్తున్న నేపథ్యంలో మన్మోహన్ మాటలు నిజమేననుకున్నాం. ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మనకు ఇరాన్ అంటే ముడి చమురు గుర్తుకు రావడం సహజం. ఇకపై ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులు జోరుగా సాగి, పెట్రో ధరల మోత కాస్త తగ్గుతుందని ఆశపడ్డాం. రిబేటు ధరతో, ఉచిత రవాణా సౌలభ్యంతో లభించే ఇరాన్ చమురు దిగుమతులను తగ్గించాలని నిర్ణయించారు! ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతల సడలింపుల జోరుతో మన దిగుమతిదారులు జనవరి-మార్చి మధ్య రోజుకు 3,22,000బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోడానికి కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. తదుపరి త్రైమాసికలో (ఏప్రిల్-జూన్) మరింత పెరుగుతాయని అంచనాలు కట్టారు. కానీ ఏప్రిల్ నుంచి ఇరాన్ నుంచి దిగుమతుల్లో భారీ కోత పడనుంది. సగటున రోజుకు 1,95,000 బ్యారెల్స్‌కు మించకుండా నియంత్రిం చడానికి ఆపసోపాలు పడుతున్నారు. మరే దేశమైనా ఇరాన్ కంటే చౌకగా చమురును సరఫరా చేస్తోనంటుందా అంటే అదీ లేదు. రోజుకి 1,95,000 బ్యారెళ్ల ‘లక్ష్మణ రేఖ’ ఎవరు గీసింది? అడిగినా మన్మోహన్ చెప్పరు. అడక్కపోయినా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలే చెప్పారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరేవరకు దానిపై తాము విధించిన ఆంక్షలలో 95 శాతం యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేశారు. అంటే భారత్ కోసం తాము గీసిన ‘లక్ష్మణ రేఖ’కు మించి ఇరాన్నుంచి చమురు దిగుమతి చేసుకోరాదు. గీత దాటితే ఏమౌతుంది? ఏమీ కాదని టర్కీ, ఒమన్, ఖతార్, ఇరాక్, తుర్కుమెనిస్థాన్ లాంటి దేశాలు అమెరికా ఆంక్షలను అసలు పట్టించుకోలేదు. భారత్ ‘ఆసియా శక్తి’, ‘ఆసియా సూపర్ పవర్’ అని చెప్పే మన్మో హన్ ఇలా అమెరికా ముందు సాష్టాంగపడాల్సిన అగత్యమేమిటి? అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లడం, ఉపశమించడంపై ఆధారపడి ఇరాన్‌తో సంబంధాలను ఎప్పటికప్పుడు పునర్విచించుకోవడం సాధ్యంకాదంటూ అప్పట్లో ఆయన వేసిన రంకెలన్నీ ఏమైపోయాయి? అమెరికా ఇంధన మంత్రి ఎర్నెస్ట్ మోనిజ్ జనవరి మొదట్లోనే ఈ విషయమై హెచ్చరించారని, దీంతో అమెరికా వత్తిడులకు లొంగాల్సి వచ్చిందని వినవస్తోంది. నిజమే. కానీ ఈ వ్యవహారానికి మరో పార్శ్వం కూడా ఉంది. అది ఫాస్ట్‌ట్రాక్‌పై అమెరికా నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) దిగుమతుల కోసం యుద్ధ ప్రాతిపదికపై సాగుతున్న సన్నాహాలు. అమెరికా నుంచి అంటే గల్ఫ్ ప్రాంత ముడి చమురును శుద్ధి చేసి, పైపుల ద్వారా రవాణాకు వీలుగా ఎల్పీజీగా మార్చి సరఫరా చేస్తారు. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులకు బదులుగా అమెరికా చమురు, గ్యాస్ రంగంలోకి ప్రత్యేకించి షేల్ గ్యాస్ రంగంలోకి భారత చమురు సంస్థలకు ప్రవేశం లభిస్తుందని చెబుతున్నారు. తద్వారా షేల్ గ్యాస్ అన్వేషణ, వెలికితీత సాంకేతిక పరిజ్ఞానం మనకు లభిస్తుందని మన విదేశాంగ శాఖ సెలవిస్తోంది. అతి పెద్ద భారత చమురు సంస్థ రిలయన్స్‌కు ఇప్పటికే అమెరికా షేల్ గ్యాస్ ఆస్తులలో 20 శాతంపై యాజమాన్యం ఉంది. ఇరాన్ నుంచి దిగుమతుల కోతకు మన్మోహన్‌ను చెవి మెలిపెట్టి ఒప్పించడంలో రిలయన్స్ హస్తం ఉందని వినవస్తోంది. భారత ఇంధన భద్రతను అమెరికా చేతిలో పెట్టడం కంటే అవివేకమైన విషయం మరొకటుండదు. అన్నిటికీ మించి మరో అంశం కూడా ఉంది. భారత్‌లాగే ఇరాన్ కూడా పాకిస్థాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం సమస్యను ఎదుర్కుంటోంది. పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ అధికారంలో ఉండగా అమెరికాను ధిక్కరించి మరీ ఇరాన్-పాక్ లైన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమెరికా ఒత్తిడి మేరకే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. గత 35 ఏళ్లుగా దిగజారుతున్న ఆరెండు దేశాల మధ్య సంబంధాలు నేడు అథఃపాతాళానికి చేరాయి. రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్న దక్షిణ ఆసియా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంకాగల ఇరాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలను కాలదన్నుకోవడం ప్రమాదకరం. పిళ్లా వెంకటేశ్వరరావు -
పుతిన్ మెడకు ‘ఉక్రెయిన్’ ఉరి!
సిరియాలో ఆశించినట్టుగా, వెనిజులాలో చేద్దామనుకుంటున్నట్టుగా, ఉక్రెయిన్‌లో చేసి చూపినట్టుగా... రష్యాలో కూడా విప్లవం పేరిట పుతిన్ ప్రభుత్వాన్ని కూల్చడమే ఉక్రెయిన్ సంక్షోభం లోగుట్టు. నేడు యానుకోవిచ్ మెడకు వేసిన ఉచ్చు రేపు పుతిన్‌కు ఉరితాడు కాగలదని అమెరికా ఆకాంక్ష, దీర్ఘకాలిక లక్ష్యం. ‘ఏది సత్యం ఏదసత్యం’ అని సదసత్సంశయంలో పడ్డ మహాకవికి సత్యం బోధపడిందో లేదో తెలియదు. ఉక్రెయిన్ సంక్షోభంపై అంతర్జాతీయ మీడియా వినిపిస్తున్న కథనాల తీరును చూస్తే ఎవరికైనా అలాంటి విచికిత్స తప్పదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనే ఉక్రెయిన్ను చెరపడితే ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకుడైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దాన్ని ఉద్దరిస్తున్నారనేది బహుళ ప్రచారంలో ఉన్న కథనాల సారాంశం. ఇక రష్యావైపు నుంచి వినవస్తున్న కథనాల సారం... ఉక్రెయిన్ ప్రజాస్వామ్య కన్యను అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు చెరచి, ఛిద్రం చేస్తుంటే పుతిన్ క్రిమియాలోకి సైన్యాన్ని దింపారు. ఈ జానపద, పౌరాణిక కథల నడుమనుంచి కూడా కనిపిస్తున్న కొన్ని వాస్తవాలు కాదనలేనివి. పాశ్చాత్య ప్రపంచం హఠాత్తుగా కనిపెట్టిన నియంత విక్టర్ యాను కోవిచ్ 2010 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యారు. ఆ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జరిగాయని ఈయూ పర్యవేక్షకులే కితాబులిచ్చారు. అమెరికా అండదండలతో నేడు తాత్కాలిక అధ్యక్షగిరి వెలగబెడుతున్న అలెగ్జాండర్ తుర్చియనేవ్ మాజీ ప్రధాని ట్యామెషెంకోకు నమ్మినబంటు. ఆమె 2010 ఎన్నికల్లో యానుకోవిచ్ చేతిలో చిత్తుగా ఓడారు. ఆమె 2003లో అమెరికా అండతో సాగిన ఆరెంజ్ విప్లవ నేత్రి కూడా! అదే రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడైన యానుకోవిచ్ ఈయూలో చేరాలని ఉవ్విళ్లూరారు. చేరనని పిల్లిమొగ్గలూ వేశారు. ఈయూలో చేరుతానంటే ప్రజాస్వామ్యం, చేరనంటే నియంతృత్వం! హిట్లర్ మార్కు ప్రజాస్వామ్యం మొహం చూసి మనిషిని అంచనా వేయొచ్చంటారు. అదేమోగానీ ఇప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మొహం చూస్తే ‘విప్లవం’ విజయవంతమయ్యాక నెలకొనబోయే ‘ప్రజాస్వామ్యం’ తీరు మొత్తం తెలుస్తుంది. ప్రధాని యాట్సెన్యుక్ ‘ఫాదర్లాండ్’ పార్టీకి గత ఎన్నికల్లో లభించినవి 7 శాతం ఓట్లు. ఉక్రెయిన్ వ్యవహారమంతా అమెరికా ఆడుతున్న ఆటేనని చెబుతూ అందులో ఈయూ పాత్ర పానకంలో పుడకలాంటిదేనని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా న్యూలాండ్ అన్నారు. యాట్సెన్యుక్కు ‘ఆర్థిక, పరిపాలనాపరమైన అనుభవం ఉన్నదని’ కూడా కితాబునిచ్చారు. భావి అధ్య క్షునిగా భావిస్తున్న త్యహ్నీబాక్ నేతృత్వంలోని స్వోబోదా పార్టీ గత ఎన్నికల్లో 10 శాతం ఓట్లు సంపాదించింది. ప్రధాని, హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ విధానాలు సహా 8 కీలక శాఖలలో ఈ రెండు పార్టీల నేతలే ఉన్నారు. ఈ రెండు పార్టీలను జాతీయోన్మాద పార్టీలుగా గత ఏడాది వరకు పాశ్చాత్య మీడియా దుమ్మెత్తి పోసింది. 2012లో స్వోబోదాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఈయూను డిమాండు చేసినది రష్యా కాదు... అమెరికాకు బహిఃప్రాణం ఇజ్రాయెల్! తాత్కా లిక ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయాలలో ఒకటి దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల లోనూ ఉక్రేనియన్ భాషనే వాడాలి. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన నిషిద్ధం. ఉక్రెయిన్ జనాభాలో కనీసం సగం మంది రష్యన్ మాట్లాడేవాళ్లే. ‘ఒకే దేశం ఒకే భాష. ఒకేజాతి’ ప్రజాస్వామ్య పరిరక్షక విప్లవ ప్రభుత్వ నినాదం. పాశ్చాత్య మీడియాకు ఈ ‘అల్ప’ విషయాలను చెప్పే తీరుబడిలేకపోవడాన్ని అర్థం చేసుకోగలం. నిన్నటిదాకా అది ఈ రెండు పార్టీలను పచ్చి మితవాద పార్టీలుగా ఎండగట్టింది. యూదులు, రష్యనులు, రోమాలను విదేశీయులుగా భావించి దాడులకు తెగబడే స్వోబోదా పార్టీ గుర్తు కూడా 2006 వరకు హిట్లర్ స్వస్తికే! కండోలిజా చెప్పిన సత్యం ఉక్రెయిన్ సంక్షోభం మూలాలు ఇంధన వనరులపై ఆధిపత్యపు పోరులో ఉన్నా యని వినవస్తున్న మాట నిజమే. నేటి సంఘర్షణ గల్ఫ్ ప్రాంతంలోని చమురు నిక్షేపాల కోసం కాదు. ఉక్రెయిన్‌లోని గ్యాస్ పైపులైన్లపై ఆధిపత్యం కోసం అన డం తక్షణ వాస్తవాన్ని ప్రతిఫలిస్తుంది. రష్యాలోని సైబీరియాలో సహజవాయు నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. అక్కడి నుంచి పశ్చిమ యూరప్‌కు సరఫరా అయ్యే గ్యాస్ పైపులైన్లలో అత్యధికం ఉక్రెయిన్ గుండానే సాగుతాయి. సహజ వాయు క్షేత్రాలు రష్యాలో ఉండగా ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తే ఒరిగేదేముంది? అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌ను అడిగితే సూటిగా చెబు తారు. ‘మనం రష్యా యువతకు ప్రత్యేకించి విద్యార్థులకు, యువ వృత్తి నిపు ణులకు దగ్గరకావాలి. మీ ఆశయాలకు, ఆకాంక్షలకు అమెరికా అండగా ఉన్నదని రష్యాలోని ప్రజాస్వామిక శక్తులకు తెలియజెప్పాలి. రష్యా భవితవ్యం వారే తప్ప పుతిన్ కాదు’. కండోలిజా మాట్లాడుతున్నది సిరియాలో ఆశించినట్టుగా, వెనిజులాలో చేద్దా మనుకుంటున్నట్టుగా, ఉక్రెయిన్‌లో చేసి చూపినట్టుగా... రష్యాలో కూడా విప్లవం పేరిట పుతిన్ ప్రభుత్వాన్ని కూల్చడం. అప్పుడే ఉక్రెయిన్ను చేజిక్కిం చుకోడానికి పెడుతున్న బిలియన్లకొద్దీ డాలర్ల పెట్టుబడికి ఫలితాలు లభిం చేది. నేడు యానుకోవిచ్ మెడకు వేసిన ఉచ్చు రేపు పుతిన్‌కు ఉరి తాడు కాగలదని అమెరికా ఆకాంక్ష, దీర్ఘకాలిక లక్ష్యం. తలుపులు మూసిన గదిలో పిల్లి ఉక్రెయిన్ విషయంలో పుతిన్ తెగేదాకా లాగుతున్నారని, అనవసరంగా అణ్వస్త్ర ప్రమాదపు అంచులకు ప్రపంచాన్ని నెడుతున్నారని తిట్టేవారికి కొదవలేదు. క్రిమియా రష్యాకు అత్యంత కీలకమైన నావికా, సైనిక స్థావరం. అంతకుమించి నల్ల సముద్రం ద్వారా పశ్చిమానికి ఉన్న ఏకైక నావికా మార్గం. గడ్డకట్టిపోకుండా ఏడాది పొడవునా నౌకాయానానికి అను కూలంగా ఉన్న తీరం రష్యాకు అదొక్కటే. పుతిన్ సైనిక దురాక్రణకు పాల్పడ్డాడంటున్న క్రిమియా అసలు ఉక్రెయి న్లో భాగమెలా అయింది? పూర్వపు సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ప్రధాని కృశ్చెవ్ 1956లో ఉక్రెయిన్‌కు కానుకగా ఇచ్చారు కాబట్టి. నాడు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న రిపబ్లిక్ కాబట్టి. ఈ నెల 15న క్రిమియాలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అది రష్యాలో భాగంగా ఉండాలనే తీర్పు వెలువడటం తథ్యం. ప్రజలు ఎన్నుకున్న యానుకోవిచ్‌ను గద్దెదించి, ఎవరూ ఎన్నుకోని ప్రభుత్వంతో ‘ప్రజాస్వామ్యాన్ని’ నిలిపిన ఒబామా ఆ తీర్పు చెల్లదని ముందే తేల్చి చెప్పేశారు. దౌత్యమార్గంతో పరిష్కారం అంటూ గాలి కబుర్లు చెబుతున్నారేకానీ అసలు ఇప్పుడు రష్యాలో అమెరికా రాయబారే లేడు. 1962 క్యూబా మిస్సైళ్ల సంక్షోభం పరిష్కారానికి అమెరికా మాజీ రాయబారి జార్జి ఎఫ్ కెన్నన్ సలహాలు తోడ్పడ్డాయి. ఒబామాకు అలాంటి సలహాదారులూ లేరు, ఆయన జాన్ ఎఫ్ కెన్నడీ కారు. ఉక్రెయిన్ సంక్షోభం సందర్భంగా పాశ్చాత్య మీడియా ‘చరిత్ర పునరావృతమవుతుంది, మొదట విషాదంగా, రెండోసారి ప్రహసనంగా’ అనే మార్క్స్ మాటలను ఎడాపెడా ప్రయోగిస్తోంది. 1853-56నాటి క్రిమియా యుద్ధంలో ఓడినట్టుగానే నేటి ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా రష్యా ఓడిపోవాల్సిందేననే శాపనార్థమే తప్ప అందులోని సందర్భశుద్ధి శూన్యం. మార్క్స్ మాటలు ‘లూయీ నెపోలియన్ 18వ బ్రూమెరీ’ లోనివి. 1851లో లూయి నెపోలియన్ కుట్రతో ఫ్రాన్స్‌లోని ప్రజాస్వామిక రిపబ్లిక్‌ను కూల్చిన కుట్ర గురించి రాశారు. అందులోని 18వ బ్రూమెరీ నెపోలియన్ బోనపార్టీ నవంబర్ 9, 1799లో జరిపిన కుట్రను ఉద్దేశించినది. నేడు ఉక్రెయిన్‌లో ఒబామా లాయీ నెపోలియన్ పాత్రనే నిర్వహి స్తున్నారు. అంగుష్టమాత్రులైన వ్యక్తులు ఫ్రాన్స్ కీలక పాత్రధారులుగా మారిన నాటి చారిత్రక పరిస్థితులను మార్క్స్ వర్ణిస్తూ ఆ వాక్యాలు రాశారు. కాకపోతే నేటి అంగుష్టమాత్రులు విదూషకులే గాక... ప్రపంచాన్ని అణు విధ్వంసం అంచులకు నెట్టగలిగిన మూర్ఖులు. అలాగే, ఒకప్పటి క్రిమియా యుద్ధంలో ‘యూరప్ రోగిష్టి’ అట్టోమన్ సామ్రాజ్యం (నేటి టర్కీ) కాగా నేటి ప్రపంచ రోగిష్టులు ఈయూ, అమెరికాలు కావడమే ఆ విపత్తునుంచి కాపాడగలిగిన అంశం. - పిళ్లా వెంకటేశ్వరరావు -
నయా కోల్డ్‌వార్ కొలిమి ఉక్రెయిన్
అమెరికా, యూరోపియన్ శక్తులు 2004లో ‘ఆరెంజ్ విప్లవం’ పేరిట ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోశాయి. నేటి ఘటనల వెనుక కూడా అవే శక్తులున్నాయి. రష్యా, అమెరికాల అధిపత్య పోటీ ఉక్రెయిన్ను అంతర్యుద్ధంలోకి ఈడ్చే ప్రమాదం ఉంది. ‘చరిత్రలో పునరావృతమవుతున్నట్టు కనిపించే ప్రతి ఘటనా ముందటి ఘటన నుంచి నేర్చుకున్నామనుకున్న గుణపాఠాలను తప్పని నిరూపిస్తుంది.’ ఇలాంటి మాటలను నిరాశావాదమని కొట్టిపారేసేవాళ్లకు దుర్వార్త. ఉక్రెయిన్‌లో సరిగ్గా అదే జరుగుతోంది. రష్యా పశ్చిమ సరిహద్దుల్లోని తూర్పు యూరోపియన్ దేశం ఉక్రెయిన్ గత కొద్ది రోజు లుగా ఈజిప్ట్ విప్లవ ఘటనలను గుర్తుకు తెచ్చింది. ఈజిప్ట్ విప్లవంలో ‘తెహ్రీర్’లో బైఠాయించిన నిరసనకారులను చెదరగొట్టక నాడు హోస్నీ ముబారక్ చేసిన ‘తప్పు’ తాను చేయకూడదని పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యానుకోవిచ్ ‘గుణపాఠం’ తీసి, తుపాకులకు పనిచెప్పారు. ఈజిప్ట్ ‘పాఠం’ తప్పని తేలింది. ప్రస్తుత ఘటనలను ఒక విప్లవమని, ప్రజాస్వామ్య విజయమని విశ్లేషణలు చేస్తున్న వాళ్లు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షునిగా యానుకోవిచ్‌కు యూరోపియన్ యూనియన్‌లో చేరడానికైనా, మానడానికైనా సకల అధికారాలు ఉన్నాయి. తాత్కాలిక అధ్యక్షుడైన అలెక్సాండర్ తుర్చియనేవ్... తక్షణం 13,000 కోట్ల డాలర్ల సహాయం అందించకపోతే విదేశీ చెల్లింపులకు దిక్కులేక ప్రభుత్వం దివాలా తీస్తుందని అర్థించారు. దివాలా తీస్తున్న ఈయూలో చేరకపోవడమే అపరాధమన్నట్టు మాట్లాడుతున్న అమెరికా, ఈయూలు ‘విప్లవానికి’ అభయం ఇస్తాయనడంలో సందేహం లేదు. కాకపోతే మనబోటివాళ్లకు అర్థం కాని అతి సరళమైన ప్రశ్న ఒక్కటే... అదేదో గత ఏడాదే చేసి ఉంటే ఇప్పుడీ ‘విప్లవం’ జరిగేదే కాదు గదా? ఉక్రెయిన్ను తన ఉపగ్రహంగా భావించే రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను ధిక్కరించి మరీ నేటి విలన్ యానుకోవిచ్ గత ఏడాది ఈయూలో చేరడానికి స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఇక ఉక్రెయిన్‌లో వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను కుమ్మరించి ఆర్థిక సంక్షోభం నుంచి వెసులుబాటు సంపాదించవచ్చని అమెరికా, ఈయూలు ఆశలు పెట్టుకున్నాయి. అంతేగానీ పుట్టి మునిగినా చిల్లి గవ్వ విదిల్చేదని యూనుకోవిచ్కు మొండి చెయ్యి చూపాయి. గత్యంతరం లేక వద్దనుకున్న పుతిన్‌నే ఆయన ఆశ్రయించాల్సి వచ్చింది. గత ఏడాది చివర్లో పుతిన్ ఉక్రెయిన్‌కు 15,000 కోట్ల డాలర్ల సహాయంతో పాటూ, సహజ వాయువు ధరను మూడో వంతు మేరకు తగ్గించారు. దీంతో యూనుకోవిచ్ ఈయూకు మొహం చాటేశారు. అమ్మ పెట్టనూ పెట్టదు, అడుక్కు తినా నివ్వదు అన్నట్టున్న ఈ వ్యవహారం లోగుట్టును అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి విక్టోరియా న్యూలాండ్ ఈ నెల 6న జరిపిన టెలిఫోన్ సంభాషణ బయటపెట్టింది. అప్పటికే జోరుగా సాగుతున్న ఉక్రెయిన్ విప్లవం గురించి ఆమె... ‘గత రెండు దశాబ్దాలుగా మనం ఉక్రెయిన్ ప్రజాస్వామ్యీకరణ కోసం 5 వందల కోట్ల డాలర్లను కుమ్మరించాం. అవును. ఇది మనం ఆడుతున్న ఆట. ఈయూ ఒక న్యూసెన్స్ మాత్రమే. మన ఆటను చెడగొట్టే శక్తి’ రష్యా. రాజధాని కీవ్‌లోని ఇండిపెండెన్స్ స్క్వేర్ను ఆక్రమిం చిన నిరసనకారుల ప్రధాన నేత ఎవరు? విటాలీ కిలిష్కో. జాతీయోన్మాదం తలకెక్కిన నియోనాజీ శక్తులకు కేంద్రమైన ఆప్రావీ సెక్టార్(మితవాదపక్షం)కు అధినేత. ఆయన తాత్కాలిక అధ్యక్షుడు కాకపోవడమే న్యూలాండ్ చెప్పిన ‘ఈయూ న్యూసెన్స్.’ కాగా మాజీ ప్రధాని, 2004లో ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూడదోయడానికి జరిగిన సీఐఏ ‘ఆరెంజ్ విప్లవ’ నేత్రి. తాత్కాలిక అధ్యక్షుడు తుర్చియనేవ్ ఆమెకు నమ్మినబంటు. నేటి ఈయూ కీలుబొమ్మ స్థానంలో ‘సుస్థిరమైన’ అమెరికా కీలుబొమ్మ రావడంతో విప్లవం ముగుస్తుంది! మార్కెట్ సూత్రాలను గుడ్డిగా నమ్మిన యానుకోవిచ్ ఎక్కువ ధర పలికే వారికే తన విధేయత అంటూ బొర్లాపడ్డారు. పుతిన్ చేతిలోని రొట్టె ముక్కను వదిలేసుకోడానికి సిద్ధపడే బాపతు కాదు. ఇక ఆయన ‘ఆట’ మొదలవుతుంది. నేటి ప్రశాంతత తుపాను ముందటి ప్రశాంతతలాగా అంతర్యుద్ధానికి సంకేతం కావచ్చు. జనాభాలో సగానికిపైగా రష్యా జాతీయులు, రష్యాతో అనుబంధాన్ని కోరుకుంటున్నవారు. ఉక్రెయిన్ దేశం అమెరికా, రష్యాల్లో ఎవరికి కీలుబొమ్మ కావాలో తేల్చడం కోసం సాగుతున్న ఈ పోరు ప్రచ్ఛన్న యుద్ధం రోజులను గుర్తుకు తేవడంలో తప్పులేదు. 2004 ఆరెంజ్ విప్లవం పేరిట జరిగిన ప్రహసనంలో దగాపడ్డ ఉక్రేనియన్లు మరోసారి మోసపోయారు. గతం నుంచి నేర్చుకోగలగేది తప్పుడు గుణపాఠాలను మాత్రమేనని నమ్మక తప్పదా? - పిళ్లా వెంకటేశ్వరరావు -
అఫ్ఘాన్‌లో ఆపదమొక్కులు!
అఫ్ఘానిస్థాన్‌లో ఎలాగైనా ఎన్నికలను నిర్వహించి, అక్కడ తమ సైన్యాన్ని నిలిపి ఉంచగలిగేలా కొత్త ప్రభుత్వంతో ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు కర్జాయ్ 2014 తదుపరి కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని యత్నిస్తున్నారు. దీంతో అఫ్ఘాన్‌లో అమెరికా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘తప్పుల నుంచి నేర్చుకునే వాడివైతే అసలు ఓడిపోయేవాడివే కావు’ అని అంటే అన్నారేమో. అమెరికాకు అది వర్తించాలని లేదు. తప్పులు చేయడమే తప్ప నేర్చుకోవడమన్నది ఎరగని అమెరికా తప్పులు చేస్తూనే గెలిచి చూపించగలనని అఫ్ఘానిస్థాన్‌లో రుజువు చేసి చూపిస్తానంటోంది. ఏప్రిల్ 5న జరగనున్న అఫ్ఘాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఐదుగురు ప్రధాన అభ్యర్థుల మధ్యన ఈ నెల 4న టీవీ చర్చ జరిగింది. తాలిబన్లకు, నాటో బలగాలకు మధ్య యుద్ధం సాగుతుండగానే, బాంబు దాడులు, ఆత్మాహుతి దాడుల విధ్వంస కాండ జోరు తగ్గకుండానే ఎన్నికలేమిటి? అని అనుమానం అక్కర్లేదు. అమెరికా తలిస్తే ఏమైనా జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థులు విడి విడిగా ఎవరు ఏం మట్లాడినా అంతా ఒక్క గొంతుకతో చెప్పింది ఒక్కటే. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, దాని సేనలను నిలిపి ఉంచుతామని. ఆ ఒప్పందం కోసమే అమెరికా, అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కాళ్లూ, గడ్డం పట్టి ఒప్పించాలని తంటాలు పడింది. 13 ఏళ్లుగా యుద్ధం సాగిస్తున్న తాలిబన్ ‘ఉగ్రవాదు’లతో సయోధ్య కోసం నానా అగచాట్లు పడింది అందుకోసమే. అదంతా వృధా ప్రయాసే అయినా... కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడ తాడన్నట్టు జరిగింది. రేపు ఎవరు అధ్యక్షులైనా అమెరికా ‘రక్షణ’ను కోరేవారే కావడానికి మించి దానికి కావాల్సింది ఏముంది. అమెరికా ఆశీర్వాద ‘బలం’తో 2001లో దేశాధ్యక్షుడైన ఒకప్పటి అనామకుడు కర్జాయ్ గతి ఏమిటి? ఆయన ఏ అథోగతి పాలైనా అమెరికాకు చింతలేదు. కానీ అధ్యక్ష భవనంలోనే రక్షణ లేక బిక్కుబిక్కుమని బతికే ఆయన కాబూల్‌లో నిర్మిస్తున్న భారీ నివాస భవనం అమెరికా కంటికి కనుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ తర్వాత దేశం విడిచి పారిపోవడానికి బదులుగా ఆయన అఫ్ఘాన్ రాజకీయాల్లో సూత్రధారిగానో లేక అధికారానికి అతి సన్నిహితునిగానో ఉండగలనని విశ్వసిస్తున్నారని దాని అర్థం. కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారం అఫ్ఘాన్ ‘వాతావరణ పరిస్థితుల’ను అంచనా కట్టడంలో కర్జాయ్‌ని మించిన వారు లేరు. అమెరికా, నాటో బలగాల సత్తా ఏ పాటిదో కర్జాయ్ 2007లోనే గ్రహించారు. అమెరికాతో ఎలాంటి రక్షణ ఒప్పందాన్నైనా తిరస్కరిస్తామన్న తాలిబన్ల వైఖరికి అనుగుణంగానే ఆయన దానితో ద్వైపాక్షిక రక్ష ణ ఒప్పందాన్ని ‘ఆమోదించారు.’ దానిపై సంతకాలు చేసే సర్వాధికారాలున్నా కొత్త అధ్యక్షుడే ఆ పని చేస్తాడంటూ తిరకాసు పెట్టారు. తాలిబన్లతో అమెరికా సాగించిన ఏకపక్ష చర్చలపై కన్నెర్ర చేసిన కర్జాయ్ ఏకపక్షంగా తాలిబన్లతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల తదుపరి లేదా ఈ ఏడాది చివరికి అమెరికా సేనల ఉపసంహరణ జరిగాక కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని ఆయన భావిస్తున్నారు. కర్జాయ్ తాలిబన్లతో రహస్యంగా చర్చలు జరుపుతుండటం నిజమేనని అమెరికా ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ఫిబ్రవరి 3న అంగీకరించారు. ‘ఈ చర్చలను మేం వ్యతిరేకిస్తున్నామనడం సరైనది కాదు’ అని అసత్యం చెప్పారు. అదే రోజున అధ్యక్షుడు బరాక్ ఒబామా అఫ్ఘాన్‌లోని తమ సేనాధిపతి జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్, రక్షణ మంత్రి చుక్ హ్యాగెల్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్టిన్ డెంప్సీలతో సమావేశమయ్యారు. త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కుదుర్చుకోబోయే ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కాపాడుకోవడమెలాగని వ్యూహ రచన గురించి చర్చించారు. జరుగుతాయో లేదో తెలియని ఎన్నికలు, ఆ తదుపరి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారో తెలియకముందే వారితో కుదుర్చోకోబోయే ఒప్పందం, దానికి ఇప్పుడే ముప్పు వచ్చి పడ్డం, దాన్ని కాపాడుకోడానికి వ్యూహం! అఫ్ఘాన్‌తో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని 2014 తర్వాత అక్కడ కనీసం 10,000 సైన్యాన్ని నిలిపి ఉంచాలని అమెరికా భావిస్తోంది. సేనలను పూర్తిగా ఉపసంహరించడానికి ముందు అమెరికాతో ఒప్పందం కాదుగదా, చర్చలు సైతం వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలను జరగనిచ్చేది లేదని, రక్తపాతం తప్పదని పదేపదే హెచ్చరిస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. కానీ తుపాకులతో ఎలాగోలా ఎన్నికలు జరిగాయనిపించేసి, ఎవరో ఒకరికి అధ్యక్ష పీఠం కట్టబెట్టేసి ఒప్పందంపై సంతకాలు పెట్టించేయాలనే వ్యూహం ఎప్పుడో తయారు చేశారు. తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని, అది చేసుకునే ఒప్పందాలను తిరస్కరిస్తారని, తాలిబన్లతో పోరు కొనసాగక తప్పదని కూడా ముందే తెలుసు. ఇంకా కొత్తగా వచ్చే ముప్పేమిటి? కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారానికి ముస్తాబవుతుండటమే! తాలిబన్లతో రహస్య మంతనాలు కొలిక్కి వస్తే కర్జాయ్ మధ్యవర్తిగా మారతారు. తాలిబన్లతో సయోధ్య కోసం కొత్త ప్రభుత్వం అమెరికాతో ఒప్పందాన్నిన రద్దు చేసుకునే త్యాగం చేయక తప్పదని ఒప్పిస్తారనే భయం ఇప్పుడు అమెరికాను పట్టి పీడిస్తోంది. చేతికి, నోటికి మధ్య అతి పెద్ద అగాధంగా కర్జాయ్ మారగలరని అమెరికా ఊహించలేదు. కథ అడ్డం తిరిగింది కాబట్టి త్రిమూర్తులతో అధ్యక్షుని సమావేశం తదుపరి విడుదల చేసిన అధికారిక ప్రకటన ‘2014 తర్వాత అఫ్ఘాన్‌లో అమెరికా పాత్రపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు’ అని ముక్తసరిగా ముగించింది. తాలిబన్ రాజ్యం నాటో బలగాలు తాలిబన్లపై పైచేయి సాధించలేవని అమెరికా కంటే చాలా ముందుగా 2007లోనే కర్జాయ్ గ్రహించారు. సంప్రదాయకమైన పాకిస్థాన్ వ్యతిరేక వైఖరిని చేపట్టారు. ఒకవంక అమెరికాతో నెయ్యం సాగిస్తూనే పాక్‌లోని వాయవ్య ప్రాంతంలోని తెగల ప్రాంతంలోని పష్తూన్ల దుస్థితిపై ధ్వజమెత్తారు. అఫ్ఘాన్, పాక్‌లలో ఉన్న ఫష్తూ ప్రజల ఐక్యతను చాటే పష్తూన్ దినోత్సవాన్ని అట్టహాసంగా జరపడం ప్రారంభించారు. ఒప్పందానికి మోకాలడ్డి అమెరికా వ్యతిరేకి గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. గత డిసెంబర్లో అమెరికా రక్షణ మంత్రి హ్యాగెల్ అఫ్ఘాన్ పర్యటనకు వచ్చి వెళ్లిన వెంటనే ఆయన హఠాత్తుగా ఇరాన్‌కు వెళ్లి అధ్యక్షుడు హస్సన్ రుహానీతో రహస్య మంతనాలు సాగించారు. ప్రస్తుతం అమెరికా, నాటోల బలగాలు ముమ్మరంగా సైనిక చర్యలు సాగిస్తున్న పర్వాన్ రాష్ట్రంలో వందల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసి అమెరికాకు పుండు మీద కారం రాసినంత పని చేశారు. గత ముప్పయ్యేళ్లుగా రెండు అగ్రరాజ్యాలు రష్యా, అమెరికాలతో పాటూ పాకిస్థాన్ కూడా అఫ్ఘాన్ లో నెత్తుటి విధ్వంస క్రీడను సాగించింది. అది మెజారిటీ జాతి పష్తూన్లలో బలంగా నాటుకుపోయింది. 2014 తర్వాతి అఫ్ఘాన్‌కు అంతర్గతంగా తాలిబన్ల నుంచి ముప్పు కంటే బయటి నుంచే ముప్పే ఎక్కువని చాలా మంది అఫ్ఘాన్లలాగే కర్జాయ్ కూడా భావిస్తున్నారు. ఇరాన్, చైనా, భారత్‌లలో ఎవరితో వ్యూహాత్మక బంధం లాభసాటి అనే విషయాన్ని అతి జాగ్రత్తగా బేరీజు వేస్తున్నారు. దక్షిణ ఆసియాలో అత్యంత దౌత్య చాతుర్యం ప్రదర్శిస్తున్న నేత కర్జాయేననడంలో సందేహం లేదు. తాలిబన్లు ఆయన ఎత్తుగడలను వ్యతిరేకించడం లేదు. సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అలా అని 2014 తర్వాతికి ఆయన రూపొం దిస్తున్న ‘శాంతి’ పథకం ప్రకారం నడవాలని భావిస్తున్న దాఖలాలు లేవు. అతి తెలివిగా ఆయన్ను వాడుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత తాలిబన్, అల్‌కాయిదా ఎత్తుగడలను కర్జాయ్ కంటే బాగా బుష్, ఒబామా ప్రభుత్వాల్లో రక్షణ మంత్రిగా పనిచేసిన రాబర్ట్ గేట్స్ అర్థం చేసుకున్నట్టుంది. ‘శత్రువులు (తాలిబన్లు) ఇప్పుడు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వేచి చూస్తే సరిపోతుంది.’ అమెరికా బలగాల నిష్ర్కమణ ప్రకటన వారికి కొత్త ఊపిరులూదిందని గేట్స్ భావిస్తున్నారు. ‘అఫ్ఘాన్‌లో ఓటమి పాలైనామన్న అపప్రథ’ను అల్‌కాయిదా తనకు అనుకూలంగా మలుచుకొని మధ్యప్రాచ్యంలో చెలరేగిపోతోందని వాపోయారు. ఏది ఏమైనా 2014 తర్వాతి తాలిబన్ల పాలనను అందరూ కలిసి ఇప్పుడే అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అఫ్ఘాన్ పార్లమెంటు ముందున్న ఒక చట్టం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అది ఆమోదం పొందితే అఫ్ఘాన్ పురుషులకు తమ బంధువులైన మహిళలను హింసించే, అత్యాచారం చేసే హక్కులు లభిస్తాయి. అయినా కొత్త చట్టాలతో పనేముంది? అత్యాచారాలకు గురైన మహిళలను వ్యభిచార నేరం కింద శిక్షించి హంతకులకు వేసే శిక్షల కంటే కఠిన శిక్షలను విధిస్తూనే ఉన్నారు. 1917లోనే 18 ఏళ్ల లోపు వివాహాలను, బురఖాలను నిషేధించిన దేశంలో పాతికేళ్ల అమెరికా జోక్యం సాధించిన ప్రగతి ఇది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
నయా పేదల దేశంలో ‘నాజీల’ హవా!
పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని గ్రీస్ సంక్షోభం దేశంలో సగం జనాభాను నయా పేదలుగా దిగజారుస్తోంది. విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, పేదరికాలను ఆసరాగా చేసుకోని జాతీయోన్మాద ‘గోల్డెన్ డాన్’ మూడో అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. గ్రీస్ ఎంతటి ఘన చరిత్ర గలిగిన దేశమైనా నేడు మాత్రం అది యూరోపియన్ యూనియన్ సంక్షోభాన్ని కొలిచే థర్మామీటరు, బారోమీటరు. గ్రీస్‌లో ఫ్యాక్టరీ ఉత్పత్తి గత ఏడేళ్లలో మొట్టమొదటిసారిగా తల పెకైత్తి చూసిందని సంబరపడిపోతున్న వారు లేకపోలేదు. అలాంటి వారిని ఉద్దేశించే గామోసు ఈయూ మకుటం లేని మహారాణి ఏంజెలా మర్కెల్ గత నెల 29న ఇది ‘తుపాను ముందటి ప్రశాంతత’ అని వ్యాఖ్యానించారు. యూరో రుణ సంక్షోభం ప్రమాద తీవ్రత ఏమీ తగ్గలేదని హెచ్చరించారు. ‘తుపాను’ తాకిడికి గురయ్యే మొదటి దేశంగా గ్రీస్‌కు ఇప్పుడు తక్షణమే మరో బెయిలవుట్ అవసరమని యూరో విశ్లేషకులు ఎప్పుడో తేల్చేశారు. తేల్చాల్సిన జర్మనీ ఛాన్స్లర్ మర్కెల్ పెదవి విప్పలేదు. జర్మన్ ఆర్థిక శాఖ గ్రీస్ కోసం రూపొందించిన మూడో బెయిలవుట్ విషయం వారం క్రితం బయటపడింది. గ్రీస్ కోసం ఒకటి నుంచి రెండు వేల కోట్ల డాలర్ల రుణాన్ని సిద్ధం చేశారు. కాకపోతే అది మరింత కఠినమైన పొదుపు చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ‘క్యారట్లు కావాలిగానీ, కట్టె మాత్రం వద్దంటే ఎట్లా కుదురుతుంది?’ అని ఈయూ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ బుధవారం మరో సందర్భంగా ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిపుణులు కొందరు వారితో విభేదిస్తున్నారు. ‘గ్రీస్‌కు ఇప్పుడు కావాల్సింది బెయిలవుట్ రుణ ప్యాకేజీ కాదు. రుణ పునర్వ్యవస్థీకరణ. ప్రభుత్వ వ్యయంలో ఇంకా కోతలు విధించడం గానీ, ప్రజలపై ఇంకా పన్నులు విధించడం గానీ అసాధ్యం’ అని వారి వాదన. గ్రీస్ రుణాన్ని మాఫీ చేయడం తప్ప గత్యంతరం లేదని వారు అంటున్నారు. ‘ధార్మికత’తో సంక్షోభాలు పరిష్కారం కావని మర్కెల్ దృఢ విశ్వాసం. గ్రీస్, స్పెయిన్, సైప్రస్‌ల వంటి దేశాలకు ఇచ్చిన రుణాలను ముక్కు పిండి, వడ్డీతో సహా వసూలు చేయకపోతే... అక్కడి సంక్షోభానికి కాళ్లొచ్చి స్వదేశంలోకే ప్రవేశిస్తుందని ఆమె ఆందోళన. పైగా ఆధునిక యుగంలో రుణాన్ని మించిన ఆధిపత్య సాధనం ఇంకేముంది? గ్రీస్ వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ వ్యయంలో 15 వందల కోట్ల యూరోల కోతలు విధించాలి. కానీ జనాభాలో 28 శాతం, యువతలో 60 శాతం నిరుద్యోగులుగా ఉన్న దేశంలో పన్నులను ఎంతగా పెంచినా పన్నుల రాబడి మాత్రం తగ్గిపోతూనే ఉంది. అసలు ఉద్యోగమే లేకపోతే పన్నులు ఎక్కడి నుంచి కడతారు? అందుకే ప్రభుత్వం ఆస్తిపన్నుల రూపంలో ఇంత ఇల్లో, స్థలమో ఉన్న చిన్న ఆస్తిపరులను దివాలా తీయిస్తోంది. ఆదాయపు పన్ను, దానిపై విధించే సౌహార్ద్రతాపన్ను, వృత్తి పన్నులుగాక ఆస్తి యాజమాన్యంపై కనీసం 40 రకాల పన్నులు విధిం చారు. కాబట్టే 2010-13 మధ్య ఆస్తి పన్ను రాబడి 5 కోట్ల యూరోల నుంచి 350 కోట్ల యూరోలకు పెరిగింది. గ్లోరియా అలియియాన్ని గోడు వింటే నయా పేదలుగా దిగజారుతున్న భద్రజీవుల బాధలు అర్థమవుతాయి. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు దక్షిణ ఆఫ్రికాకు వెళ్లి, జీవితాంతం రాగి గనుల్లో పని చేశారు. వారు కొన్న ఇల్లూ, స్థలమే కాదు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కూడా పన్ను బకాయిలకు గానూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆస్తుల విలువ కంటే పన్నుల బకాయిలు ఎక్కు గా ఉంటే జైలు శిక్షలు కూడా వేస్తామంటున్నారు. అందుకోసం తాజాగా పన్ను బకాయిలను క్రిమినల్ నేరంగా మార్చేశారు. దీంతో ఆర్థిక భద్రతగా భావించిన ఆస్తులు గుదిబండలుగా మారుతున్నాయి. పన్నుల బకాయిల కోసం ప్రజలను వీధులపాలు చేసి ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను కొనేవారెవరు? గత ఏడాది కాలంలో వంద ఆస్తులు కూడా వేలంలో అమ్ముడుపోలేదు. మరి ఎందుకీ దౌర్జన్యం? ప్రభుత్వం పేరున ఆస్తులుంటే విదేశీ రుణాలకు హామీలవుతాయని సమాధానం. ఇలాంటి ఆధిపత్య ధోరణులే రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయని సుప్రసిద్ధ జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త జూజెన్ హాబర్మాన్ బుధవారం హెచ్చరించారు. ‘‘మర్కెల్ పెట్టుబడి అనుకూల విధానాలు ప్రజాస్వామ్యాన్ని లోతుగా గాయపరుస్తున్నాయి. సంక్షోభ దేశాలకు ఆమె చేస్తున్న విపరీతపు చికిత్స చెప్పనలవిగాని సామాజిక దుష్పర్యవసానాలకు, యూరప్ అంతటా జాతీయోన్మాదపు సరికొత్త వెల్లువకు దారి తీస్తోంది’’ అని అన్నారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే ఆచరణాత్మకవాద తత్వవేత్త హాబర్మాన్ చెప్పినదే గ్రీస్‌లో అక్షరాలా జరుగుతోంది. పచ్చి మితవాద జాతీయోన్మాద పక్షం ‘గోల్డెన్ డాన్’ వలస వచ్చిన విదేశీయులపై దాడులు సాగిస్తోంది. అధికారంలోకి వస్తే విదేశీయులను పారదోలేసి నిరుద్యోగం, పేదరికం, తదితర సకల రోగాలను చిటికెలో మటు మాయం చేస్తానంటూ ఊదరగొడుతుంది. హిట్లర్ స్వస్తిక గుర్తును తలపించే జెండా పట్టిన ఆ నియో-నాజీ పార్టీ అప్పుడే గ్రీస్‌లో మూడో అతి పెద్ద రాజకీయ పక్షంగా మారింది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
కొత్త పొత్తులు... పాత చిచ్చులు
ఇరాక్‌లోని అతి పెద్ద రాష్ర్టం అంబర్‌లోని ఫాలూజా, రమాదీ నగరాలు అల్‌కాయిదా మిలిటెంట్ల వశమయ్యాయి. సౌదీ మద్దతుతో అల్‌కాయిదా మిలిటెంటు సంస్థలు ‘ఇస్లామిక్ లెవాంత్’ లక్ష్యంతో ఇరాక్, సిరియా, లెబనాన్లలో ఉమ్మడి వ్యూహంతో కదులుతున్నాయి. సంసారం సరిహద్దులను దాటి పొంగి పొర్లిన ‘ప్రేమ’ కారణంగా అమెరికా ప్రథమ దంపతుల పెళ్లి పెటాకులు కానుండగా... బరాక్ ఒబామాకు ఇరాక్ నుంచి మరో ప్రేమ సందేశం అందింది. అది కూడా 2011లో కాదు పొమ్మని, చెంప పెట్టు పెట్టినంత పని చేసిన ప్రధాని నూరి అల్ మాలికీ నుంచి. అమెరికా అధ్యక్షుని సంసార ఖేదం ఎలా ఉన్నా విదేశాంగ నీతి మాత్రం ‘కొత్త’ ప్రేమ రాగాలను పలుకుతోంది. జనవరి 4న ఇరాక్‌లోని అతి పెద్ద రాష్ట్రం అల్ అంబర్ రాజధాని రమాదీ, మసీదుల నగరం ఫాలూజా ఇరాకీ అల్‌కాయిదా ‘ఇరాక్, లెవాంత్ల ఇస్లామిక్ ప్రభుత్వ’ (ఐఎస్ఐఎల్) మిలిటెంట్ల వశమయ్యాయి. దీంతో మాలికీ అమెరికా సైనిక సహాయం కోసం అర్థించక తప్పింది కాదు. సున్నీ మిలిటెంట్ల ‘ఇరాక్, సిరియాల ఇస్లామిక్ ప్రభుత్వం’, వారి లెవాంత్లు మధ్య ప్రాచ్య రాజకీయాల్లో చాలా కాలమే ప్రముఖ వార్తగా ఉండబోతున్నాయి. ముందుగా పాత ప్రేమికుల మధ్య కొత్త ప్రేమ చిగుళ్లు వేయడం గురించి చూద్దాం. ‘ఉగ్రవాదుల’ నుంచి ఇలాంటి ముప్పు వస్తుందనే ఒబామా ప్రభుత్వం సేనలను నిలిపి ఉంచనివ్వమని మాలికీ కాళ్లా వేళ్లా పడి బతిమలాడింది. ఆయన ససేమిరా అన్నారు. 2003లో సైనిక దురాక్రమణతో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోసిన అమెరికా ‘విభజించి పాలించు’ సూత్రాన్ని పాటించి ప్రధాన ముస్లిం శాఖలైన సున్నీ, షియాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది. సద్దాం సున్నీ మద్దతుదార్లకు విరుగుడుగా షియాల ప్రతినిధి మాలికీకి పట్టంగట్టింది. ఆ ‘కృతజ్ఞతైనా’ లేకుండా గడుపు ముగిసిన వెంటనే అమెరికా సేనలకు ఇంటి తోవ చూపారు. దీంతో 2011 చివర్లో అవమాన భారంతో ఇరాక్ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. తిరిగి ఇరాక్‌లో సేనలను దించే ప్రసక్తే లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. నాడు ఇరాక్‌లోనే కాదు నేడు అఫ్ఘానిస్థాన్‌లో సైతం అమెరికా సేనలను నిలిపి ఉంచడానికి ఎదురవుతున్న అడ్డంకి ఒక్కటే.. ‘సరిహద్దులకు అతీతమైన హక్కులు’. అంటే స్వతంత్రంగా సోదాలు సైనిక చర్యలు చేపట్టే హక్కులతో పాటూ ఆయా దేశాల న్యాయవ్యవస్థకు, చట్టాలకు అతీతమైన పూర్తి రక్షణ. అందుకు మాలికీ సిద్ధపడలేదు. పైగా అమెరికా అభీష్టానికి విరుద్ధంగా ఇరాన్‌తోనూ, సిరియాలోని అసద్ ప్రభుత్వంతోనూ మైత్రి నెరపారు. అదే మాలికీ నేడు తిరిగి అమెరికాతో చెట్టపట్టాలకు సిద్ధం కావడానికి మించి దానికి ఏం కావాలి? అయితే ఈ కొత్త పొత్తుతో పాటూ ఐఎస్ఐఎస్ చిచ్చుకు కూడా మూల కారణం... ఇరాన్‌పై అమెరికా, ఈయూల ఆంక్షల ఎత్తివేత చర్యల్లో కనిపిస్తుంది. అమెరికా దాదాపు నాలుగు దశాబ్దాలపాటూ షియా ఇస్లామిక్ దేశం ఇరాన్‌ను ఆంక్షల దిగ్బంధంతో నరకయాతనకు గురిచేసింది. నేడు దానితో శాంతిని, మైత్రిని కోరుతోంది. దానికి నమ్మకమైన మిత్రునిగా ఉన్న సౌదీ అరేబియా షియా వ్యతిరేక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా, అల్‌కాయిదా లాంటి సంస్థలను ప్రోత్సహించడం ద్వారా సున్నీలపై తిరుగులేని ఆధిపత్య శక్తిగా నిలవాలని ప్రయత్నిస్తూ వచ్చింది. ‘హఠాత్తుగా అమెరికా విదేశాంగ నీతి షియాల కూటమి వేపు మొగ్గింది’ అని సౌదీ అరేబియా నేడు వాపోతోంది. ఈ పరిణామాలను ఇజ్రాయెల్ సైనిక ఇంటిలిజెన్స్ బ్లాగ్ ‘డెబ్కాఫైల్స్’ విస్పష్టంగా విడమరిచింది. ‘సున్నీ శత్రువులు మధ్యప్రాచ్యంలోని విశాల ప్రాంతాలను స్వాధీనం చేసుకునే కృషిలో పెద్ద ఊపుతో కాలూనుకున్నారు. వారి మార్గం బాగ్దాద్, డమాస్కస్‌ల మీదుగా బీరూట్‌కు చేరుతోంది. సౌదీ అరేబియా ఈ అల్‌కాయిదా మిలిటెంట్లకు మద్దతునిస్తోంది. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున చెలరేగనున్న హింస జోర్డాన్, ఇజ్రాయెల్లలోకి కూడా వ్యాపించవచ్చు’. డెబ్కాఫైల్స్ పేర్కొన్న ఆ ప్రాంతమే ఐఎస్ఐఎల్ మిలిటెంట్లు చెబుతున్న సిరియా, ఇరాక్, లెబనాన్, జోర్డా న్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌లతో కూడిన ఒకప్పటి లెవాంత్. నిన్నటి వరకు అమెరికా కూడా మద్దతునిచ్చిన సిరియా అల్ కాయిదా ‘అల్ నజ్రా ఫ్రంట్’, ఇరాకీ అల్ కాయిదా ఐఎస్‌ఐఎల్‌లు నేడు ఒకే వ్యూహంతో కదులుతున్నాయి. అమెరికా విదేశాంగ నీతి సిరియాలో పిల్లి మొగ్గ వేసినది మొదలు సౌదీ అరేబియా సూత్రధారిగా... మధ్య ప్రాచ్యంలోని అల్‌కాయిదా బృందాలన్నీ కలసి లెవాంత్ లేదా గ్రేటర్ సిరియా వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. నేడు లెబనాన్‌లో రగులుతున్న చిచ్చు సైతం అందులో భాగమే. ఇరాన్, సిరియాలలోని అమెరికా తాజా ైవె ఖరి అమెరికాకు కొత్త మిత్రులను సంపాదించబోతున్నా చిరకాల మిత్రుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. నేడు మాలికీ అడిగిందే తడవుగా అమెరికా హెల్ఫైర్ క్షిపణులు, అపాచీ హెలికాప్టర్లు, ఎఫ్-16 విమానాలను పంపుతున్నది. వాటిని ప్రయోగించబోయేది ఒకప్పుడు అమెరికా సేనాని డేవిడ్ పెట్రాస్ చెలిమి చేసి ప్రోత్సహించిన వారిపైనే. పిళ్లా వెంకటేశ్వరరావు -
నెత్తుటేరుల్లో వజ్రాల వేట
యుద్ధ ప్రభువుల దేశంలో సుస్థిరతకు హామీ వజ్రాలను కొల్లగొట్టుకునే హక్కుల వికేంద్రీకరణే. దాన్ని బొజిజే ఉల్లంఘించారు. పైగా విదేశీ వజ్రాల సంస్థలను ముసేయించారు. అప్పటి నుంచే తిరుగుబాటుదార్లకు అత్యాధునిక ఆయుధాలు వెల్లువెత్తుతుండటం, దాడులు పెరగడం కాకతాళీయం కాదు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (కార్)మీద ప్రకృతికి ఎంత ప్రేమోగానీ అర కోటి జనాభా లేని దేశానికి ఉబాంగీ, షారీ అనే రెండు పెద్ద నదులను ప్రసాదించింది. దేశమంతటా వజ్రాలని పిలిచే ‘రక్త పిశాచుల’ను వెదజల్లింది. వాటి రక్త దాహానికి గత డిసెంబర్లోనే వెయ్యి మందికి పైగా హతమైపోయారు. గత మార్చి నుంచి ఇంత వరకు పది లక్షల మంది నిర్వాసితులై అల్లాడుతున్నారు. ‘పెద్ద మనసు’తో శాంతిని పరిరక్షించే బాధ్యతను ఫ్రాన్స్ స్వీకరించింది. దాని 1,600 మంది సైనికులకు తోడు, ఆఫ్రికన్ యూనియన్ పంపిన 6 వేల సైన్యం అక్కడే ఉంది. నెలల గడుస్తున్నాయేగానీ శాంతి, సుస్థిరతలు కనుచూపు మేరలో కనబడటం లేదు. కానీ కార్ సంక్షోభం అసలు మూలాల వేపు కన్నెత్తి చూడటానికి ప్రపంచ పెద్దలు సిద్ధంగా లేరు. ఆఫ్రికన్ ‘నెత్తుటి వజ్రాల’ లాభాల రుచి మరిగిన వారికి ఆఫ్రికా ఖండపు అశాంతి ఎప్పటికీ నిగూఢ రహస్యమే. అంతర్జాతీయ మీడియా చెబుతున్న కార్ కథ ప్రకారం... చాద్, సూడాన్ సరిహద్దులలోని ఉత్తరాది ముస్లిం తెగల తిరుగుబాటుదార్లు గత మార్చిలో అధ్యక్షుడు ఫ్రాంకోయిజ్ బొజిజె ప్రభుత్వాన్ని కూలదోయడంతో ఈ మారణకాండ మొదలైంది. సెలెకా తిరుగుబాటుదార్ల నేత, నేటి తాత్కాలిక అధ్యక్షుడు మైఖేల్ జొటోడియా కథనం ప్రకారం... 2003లో బొజిజె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంఘర్షణ కొనసాగుతోంది. బహు తెగల నిలయమైన కార్లో బొజిజె తన గబయా తెగను ఆదరించి మిగతా తెగలను నిర్లక్ష్యం చేశారు. తిరుగుబాటుదార్లతో శాంతి ఒప్పందాలను ఉల్లంఘించారు. బొజిజె దేశ వజ్రాల పరిశ్రమను పిడికిట పట్టారు. యుద్ధ ప్రభువుల కలహాలకు ఆలవాలంగా ఉన్న దేశంలో సుస్థిరతకు హామీ వజ్రాలను కొల్లగొట్టుకునే హక్కుల వికేంద్రీకరణే. దాన్ని బొజిజే ఉల్లంఘించారు. పైగా 2008లో వజ్రాల ఎగుమతుల విదేశీ వ్యాపార సంస్థలన్నిటినీ ముసేయించారు. అప్పటి నుంచే కార్ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి అత్యాధునిక ఆయుధాలు వెల్లువెత్తుతుండటం, వారి దాడులు పెరగడం కాకతాళీయం కాదు. వజ్రాల విలువ తెలియని అనాగరిక తెగల దేశానికి ‘నాగరిక ప్రపంచం’ యూరప్ మధ్య యుగాలలోనే వ్యాపారులను పంపింది. 16-19వ శతాబ్దాలలో కార్ ప్రజలను పట్టి, బంధించి బానిసల ఎగుమతి వ్యాపారం సాగించింది. నేడు కార్ శాంతి పరిరక్షణకు పూనుకున్న ఫ్రాన్స్ వలస గుత్తాధిపత్యం నెరపింది. 1960లో అది స్వతంత్ర దేశమయ్యాక అధ్యక్షుడు డేవిడ్ డాకోకు వ్యతిరేకంగా 1965లో తొలి సైనిక తిరుగుబాటు జరిగింది. దానికి సూత్రధారి ఫ్రాన్సే. నాటి నుంచి సాగుతున్న అస్థిరత, తెగల కలహాల చరిత్ర పాశ్చాత్య వజ్రాల వ్యాపార సంస్థలకు బహు లాభసాటిగా మారింది. అది కార్కే పరిమితం కాదు. ప్రపంచ వజ్రాల ఎగుమతుల్లో 50 శాతం మధ్య, దక్షిణ ఆఫ్రికాల నుంచి జరుగుతున్నవే. అంతర్జాతీయ సంస్థలు కారు చౌకకు వజ్రాలను కొల్లగొట్టడం కోసం అంతర్గత కలహాలను రాజేస్తూనే ఉన్నాయి. తిరుగుబాటుదార్లకు ఆయుధాలు అందిస్తున్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్ అంగోలా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కోటే డి ఐవరీ లైబీ రియా, జింబాబ్వే తదితర దేశాలన్నీ నెత్తుటి వజ్రాల వ్యాపారానికి బలైనవే. డి.ఆర్.కాంగో, సియర్రా లయోన్, అంగోలా ముడింటిలోనే ఈ ‘రాజకీయాలకు’ 35 లక్షల మంది బలైపోయారు. కార్లో ఆ కథ నేడు తీవ్ర స్థాయికి చేరింది. ప్రపంచ పెద్దల జోక్యంతో జొటోడియా గద్దె దిగడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. బొజోజీ, జొటోడియాల మధ్య సయోధ్య కుదిరితే ఆ ‘శాంతి ఒప్పందం’తో పాటే కార్ వజ్రాల గనుల పరిశ్రమలోకి బహుళజాతి సంస్థల ప్రవేశానికి తలుపులు కూడా తెరుచుకుంటాయి. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ప్రపంచమే ‘మాయా’ బజారు?!
విశ్లేషణ: ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాలబుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురు చూస్తూనే కాటికి చేరుతారు. కూటికి లేని పేదల దగ్గర కూడా ఉండే అమూల్య సంపద బిడ్డలు. ఆ బిడ్డలనూ దోచుకునే దొంగలు భారత్ నుంచి ఇథియోపియా వరకు వర్ధమాన ప్రపంచమంతా విస్తరించారు. 2012లో మన దేశంలో 65 వేల మంది పిల్లలు ‘కనబడుట లేద’ని ఏలినవారి కాకి లెక్కల కథనం. అందులో దాదాపు సగం మంది ఎప్పటికీ ‘కనబడనివారే’నట. 30 శాతానికి మించి కేసులు నమోదు కావని అంచనా. అంటే 2 లక్షలకు పైగా కనబడకుండా పోగా, అందులో లక్ష మంది పిల్లలు కనబడకుండానే మిగిలిపోతున్నారు. మరి గల్లంతయి పోతున్న పిల్లలు ఏమైపోతున్నారు? బడికి వెళ్లే కిలకిల నవ్వులు, మురికివాడల్లోని సొమ్మసిల్లిన గాజుకళ్లు, ప్రభుత్వం చొరబడలేని మహారణ్యాల ఆదివాసి కడుపు పంట లు ఎలా మాయమైపోతున్నాయి? ఏమైపోతున్నాయి? చెన్నై శివార్లలోని ఓ మురికివాడలో నివసించే నీళ్లింకిన కళ్ల నాగరాణిని కదిపితే... మన మురికివాడల నుంచి అమెరికా వరకు విస్తరించిన పిల్లల మాయా బజారు డొంక కదులుతుంది. పద్నాలుగేళ్ల క్రితం కూలిపని చేసి వచ్చి, రాత్రి ఆదమరచి నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి నెలల బిడ్డడు అలిగి వెళ్లి ... ‘అమ్మలగన్న అమ్మ’ లాంటి ఓ ఎన్జీవో ఒడి చేరి అనాథనని చెప్పుకున్నాడనిపించే కాకమ్మ కథను నమ్మలేక కుములుతున్న కన్న పేగు వ్యథ ఆమెది. నాలుగేళ్ల క్రితం ఓ విదేశీ పరిశోధనాత్మక పత్రికా రచయిత వెలుగులోకి తెచ్చిన నాగరాణి కొడుకు సతీష్ కథ పాతదే. దొంగిలించిన బిడ్డలను కొని, అంతర్జాతీయ పిల్లల దత్తత సంస్థలకు ఇచ్చే ఆ ‘అనాధాశ్రమం’ నిర్వాకం అప్పట్లోనే రచ్చకెక్కింది. ఇప్పుడు మళ్లీ ఆ గోల ఎందుకు? అప్పోసప్పో చేసి నాగరాణి రెండు సార్లు కొడుకు దత్తత పోయిన నెదర్లాండ్స్‌కు వెళ్లివచ్చింది. దత్తత చట్ట ప్రకారమే జరిగిందని తేల్చిన నెదర్లాండ్ కోర్టులు డిఎన్ఏ పరీక్షలకు నిరాకరించగా కన్నకొడుకు కంటి చూపుకైనా నోచుకోక తిరిగి వచ్చింది. ఇలాంటి మరో అభాగ్యురాలు జబీన్ కూడా ఇలాగే ఆస్ట్రేలియాకు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చింది. నాగమణులు, ఫాతీమాలు ‘అదృష్టవంతులు.’ మనుషుల అక్రమ తరలింపు కార్యకలాపాల వ్యతిరేక అంతర్జాతీయ సంస్థలు వారి కోసం పోరాడుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో నాగమణి కేసు యూరోపియన్ మానవ హక్కుల న్యాయ స్థానం ముందు దాఖలైంది. దత్తత వలసవాదం తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు దేశవ్యాప్తంగా 1.15 కోట్ల మంది ఉన్నారని అంచనా. అలాంటి వారిని విదేశీ యులకు దత్తత ఇవ్వడానికి వందల కొలదీ సంస్థలు న్నాయి. అవి దొంగిలించిన పిల్లలని తెలిసి కూడా వారిని విదేశీయులకు దత్తత ఇస్తాయి. వేలల్లో పిల్లలు వారి వద్ద దత్తతకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర దత్తత వనరుల కేంద్రం (సిఏఆర్ఏ) నిర్దేశన ప్రకారం దత్తత తీసుకునే విదే శీ తల్లిదండ్రులు 3,500 డాలర్లకు మించి సదరు దత్తత సంస్థకు చెల్లించడానికి వీల్లేదు. కాగా నాగరాణి కొడుకు దత్తత కోసం నెదర్లాండ్స్ తల్లిదండ్రులు చెల్లించినది అంతకు పది రెట్లు... 35,000 డాలర్లు. ఆఫ్రికా, ఆసియా దేశాల పిల్లల దత్తతకు పాశ్చా త్య దేశాల శ్వేతజాతి తల్లిదండ్రులు ఎక్కువగా మక్కువ చూపుతారు. చాలా సందర్భాల్లో అక్రమంగానే దత్తత జరుగుతుందని వారికి తెలుసు. ఇథియోపియా, కంబోడియా లు అంతర్జాతీయ దత్తత వ్యాపారానికి ప్రధాన కేంద్రాలు. చాలా ఆఫ్రికా దేశాల్లో పశువుల సంతలో లాగా పిల్లల్ని ఎంచుకుని మరీ కొనుక్కోవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ... ‘జహారా’ దత్తత కోసం 25,000 డాల ర్లు చెల్లించగా ఇథియోపియాకు చెందిన కన్నతండ్రికి చేరిం ది 300 డాలర్లే. ఆమె కంబోడియా నుంచి దత్తత తీసుకున్న మరో బిడ్డ విషయంలోనూ అదే జరిగింది. మన దేశంలో సైతం పేదరికంతో, ఆడపిల్లల పట్ల సాంఘిక వివక్షతో పిల్లల్ని అమ్మే తల్లిదండ్రులకు గాలం వేసే ‘అనాధాశ్రమాలు’ చాలానే ఉన్నాయి. విదేశీ దత్తతదార్లు మెచ్చే గుణాలు ఉండాలేగానీ బిడ్డ దొంగలించినదైనా, కొన్నదైనా ‘బంగారమే’. బడుగుదేశాల పేద పిల్లలపై పాశ్చాత్యులకు ఎందుకింత వల్లమాలిన ప్రేమ? సంపన్న దేశాల్లో దత్తత తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు స్పష్టమైన నిబంధనావళి ఉంటుంది. ‘దత్తత తీసుకున్నవారు బిడ్డకు కన్న తల్లిదండ్రుల గురించి తెలియజేయాలి, కలుసుకునే అవకాశం కల్పించాలి’ అనేది వాటిలో ఒకటి. వెనుకబడిన దేశాల నుంచి దత్తతలో ఇలాంటి బాదరబందీలు ఏమీ ఉండవు. దత్తత తతంగం లేకుండా పూర్తి అక్రమంగా రవాణా అయ్యే పిల్లలు గల్ఫ్ దేశాలకు చేరి బానిస చాకిరీ చేస్తున్నారు, సెక్స్ బానిసలుగా బతుకుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు, చట్టాలు ఏమి చేస్తున్నాయని అడగకండి. తిండికి బట్టకులేని పేద తల్లిదండ్రులు పిల్లలపై ఒలకబోస్తున్న ప్రేమంతా దత్తతదార్ల నుంచి డబ్బు గుంజ డానికేననే సమాధానం సదా సిద్ధంగా ఉంటుంది. అధిక ఆదాయ, సంపన్న వర్గాల పిల్లలకు ఉండే భద్రతా ఎక్కు వే. కానీ వారు సురక్షితమనడానికి వీల్లేదు. సొంత దేశం, జాతి, వర్ణం, భాష, సంస్కృతులకు దూరంగా దత్తత పేరిట పిల్లల్ని విసిరేయడం అమానుషమని వాదించే వారిని ఎవరు పట్టించుకుంటారు. ‘లేత మాంసం’ మార్కెట్లు దత్తత వ్యాపారం ‘మర్యాదస్తులు’ చేసేది. అలా ఎగుమతి అయ్యే ‘భాగ్యం’ కొందరికే. మిగతావారు ఏమౌతారు? ఆడపిల్లలు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతారు. అన్ని నగరాలను ముంచెత్తి, చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న ఆధునిక సెక్స్ పరిశ్రమకు ముడి సరుకులవుతారు. దేశంలో అధికారికంగా వ్యభిచార వృత్తిలో ఉన్నవారు 30 లక్షల మంది. వారిలో 40 శాతం 18 ఏళ్లలోపు బాలికలే. హెచ్ఐవీ, తది తర వ్యాధులు, ‘వృత్తిపరమైన ప్రమాదాల’ కారణంగా సెక్స్ వర్కర్ల వృత్తి కాలం బాగా పడిపోతోంది. దీంతో సెక్స్ పరిశ్రమ మైనర్ ఆడపిల్లల కోసం ఆవురావురుమంటోంది. క్షామ పీడిత ప్రాంతాల నుంచి, అంతర్గత తిరుగుబాట్లు సాగుతున్న ప్రాంతాల నుంచి ఆడపిల్లల సరఫరా జోరుగా సాగుతోంది. కోల్‌కతా ఈ వ్యాపారానికి జాతీయ రాజధాని, ఎగుమతుల కేంద్రం. ఆ నగర శివార్ల నుంచి బడికి వెళ్లివస్తున్న పన్నెండేళ్ల దీపను మూడేళ్ల క్రితం మత్తు మందిచ్చి ఎత్తుకుపోయారు. రోజుకు 12 నుంచి 14 మం ది మగాళ్ల మృగవాంఛను తీరుస్తూ క్షణం క్షణం తాను మరణించిన వైనాన్ని ఆ బాలిక ఇటీవల కళ్లకు కట్టింది. ఒక్కొక్క ఆడపిల్ల అమ్మకంపైనా వెయ్యి డాలర్ల లాభమని కోల్‌కతాకు చెందిన ఒక ఆడపిల్లల వ్యాపారి జనవరిలో బీబీసీ వార్తాసంస్థకు తెలిపాడు. తాను కోల్‌కతా, ఢిల్లీ, హర్యానాలకు ఆడపిల్లలను సరఫరా చేస్తాననీ, ఆ విష యం పోలీసులకు కూడా తెలుసని వెల్లడించాడు. బెంగాల్‌కే చెందిన మరో మైనరు ఆడపిల్ల రుక్సానా కథ కాస్త వేరు. ఆమెను హర్యానాలోని ఒక కుటుంబానికి అమ్మేసారు. ఆమెను గదిలో పెట్టి తాళం వేసి, ఇంట్లోని ముగ్గురు మగాళ్లూ నిత్యమూ రేప్ చేసేవారు. ఆడపిల్లలను హతమార్చిన ‘పాపానికి’ మగాళ్లు సెక్స్ దాహంతో అల్లాడిపోతున్న ప్రాంతాలు దేశంలో పెరుగుతున్నాయి. ‘లేత ఆడ మాంసా నికి’ అవి సరికొత్త మార్కెట్లు. ‘మర్యాదస్తుల’ బానిసలు అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా కార్యకలాపాలు 127 నుంచి 137 దేశాలకు విస్తరించాయని, ఇది ఏటా 1,000 కోట్ల డాలర్ల విలువైన వ్యాపారమని అంతర్జాతీయ మాననహక్కుల సంఘం అంచనా. అయితే మనుషుల అక్రమ తరలింపు 90 శాతం వరకు స్వదేశంలోనే జరుగుతుంది. అంటే ఏటా పిల్లల ప్రపంచ మార్కెట్ లావాదేవీల విలువ 10,000 కోట్ల డాలర్లకు పైనే. సెక్స్ పరిశ్రమకు చేరని పిల్లలు ఏమవుతున్నారు? రాజధాని ఢిల్లీసహా అన్ని పెద్ద నగరాల్లోనూ ఇప్పుడు సరికొత్త బానిసలు తయారయ్యారు. పిల్లల దొంగల మాఫియా వారిని ఇంటిపని బానిసలుగా అమ్మేస్తుంది. ఆడపిల్లలైతే ఇంటిపని చేయడంతో పాటూ, మగ దాహర్తిని తీర్చే సాధనాలుగా కూడా పనికొస్తారు. అస్సాం నుంచి పన్నెండేళ్ల ప్రాయంలో రాజ ధానికి చేరిన ఎలైనా కుజార్... యజమాని తన ముందే బూతు చిత్రాలను చూస్తూ తనను రేప్ చేసేవాడని చెప్పిం ది. ఆమె ఒక ఎన్జీవో పుణ్యమాని విముక్తిని సాధించింది. పారిపోయిన ‘బానిసలను’ కట్టి, కొట్టి యజమానికి అప్పగించే బాధ్యత కూడా మాఫియా గ్యాంగులదే. అలాంటి ఆడామగా పిల్లలు ఎన్నివేల మంది నగరాల్లో విద్యావంతులు, గౌరవనీయులైన పెద్దమనుషుల ఇళ్లల్లో బానిసలుగా పడి ఉన్నారో లెక్కల్లేవు. గత మూడేళ్లల్లో కనిపించకుండా పోయే పిల్లల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతోంది. పాలకులకు అది పట్టించుకునే తీరుబడి లేదు. ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాల బుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురుచూస్తూనే కాటికి చేరుతారు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
థాయ్ ‘క్షమా’ క్షోభ
అవినీతి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్య తరగతి యువత, ప్రజలు వీధులకెక్కి ఆందోళనలు చేపట్టారు. ఆ ఆందోళనలను ఆధారంగా చేసుకొని తస్కిన్ వ్యతిరేకశక్తులు, రాచరికవాదులు యింగ్లుక్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల పోరాటం ఎప్పుడో హైజాక్ అయింది. ‘నవ్వులు చిందించే దేశం’ థాయ్‌లాండ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని యింగ్లుక్ షినావత్ర ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు కోరుతున్నారు. 1947లో స్వాంతంత్య్రం సాధించుకున్న థాయ్ ప్రజాస్వామ్యం ‘పునరపి జననం పునరపి మర ణం’ అన్నట్టు పుడుతూ గిడుతూ బతుకీడుస్తోంది. పద్దెనిమిది సైనిక తిరుగుబాట్లను చూసిన ఆ దేశంలో సైనిక, పౌర ప్రభుత్వాలు రుతువుల్లా వచ్చి పోతుంటాయి. నేడు అధికారంలో ఉన్న ప్యూథాయ్ పార్టీ నేత్రి యింగ్లుక్ 2011 ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రధాని. యింగ్లుక్ ప్రభుత్వం గిట్టిపోవాలని కోరుతున్న ప్రతిపక్ష నేత సుతెప్ తౌగ్సుబెన్ గత ప్రభుత్వంలో ఉప ప్రధాని. ఆయనకు అవినీతి ఆరోపణలతో పార్లమెంటు సభ్యత్వా న్ని కోల్పోయిన ఘనతే కాదు, 2006 సైనిక తిరుగుబాటుకు సూత్రధారి అన్న ఖ్యాతి కూడా ఉంది. అ తిరుగుబాటులో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని తక్సిన్ షినావత్ర నేటి ప్రధాని యింగ్‌లుక్‌కు స్వయానా తోడబుట్టినవాడు. రెండు దఫాలు అదికారంలో ఉండి ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. ఆయన పలుకుబడి నేటికీ గ్రామీణ ప్రాంతా ల్లో చెక్కుచెదర లేదు. ఆ పలుకుబడితోనే చెల్లెల్ని అధికారంలోకి తేగలిగారు. అన్నీ ఉన్నా... అన్నట్టు ఆయన మాత్రం దుబాయ్‌లో స్వచ్ఛంద ప్రవాస జీవితం గడపా ల్సివస్తోంది. అవినీతి కేసుల్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే అందుకు కారణం. తక్సిన్ కీలుబొమ్మగా అధికారాన్ని నెరపుతున్న యింగ్లుక్ ఇటీవల తన సోదరుడు స్వదేశానికి రావడానికి వీలుగా ‘క్షమాభిక్ష చట్టాన్ని’ ప్రతి పాదించారు. దీంతో తక్సిన్పట్ల, అవినీతిపట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్యతరగతి ప్రజలు యింగ్‌లుక్‌కు వ్యతి రేకంగా వీధులకెక్కి ఆందోళన చేపట్టారు. ఆ ఉద్యమంలో ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీకి, దాని నేత సుతెప్కు అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు కనిపించాయి. థాయ్ ‘ఆనవాయితీ’కి విరుద్ధంగా సైనిక కుట్ర లేకుండానే యింగ్లుక్ ప్రభుత్వా న్ని కడతేర్చే ఘట్టాన్ని ప్రారంభించారు. కారణం... 1950ల నుంచి రాచరికానికి, సైన్యానికి మధ్యన పెనవేసుకున్న బలీ యమైన బంధం సడలిపోవడమే. ‘నవ్వు ఎరుగని రాజు’గా పేరుమోసిన రాజు భూమిబల్ అదుల్యదేజ్ నామమాత్రపు దేశాధినేతే. అయినా కీలక రాజకీయ పాత్రధారి. ఆయన మంచం పట్టగా చక్రం తిప్పిన రాణి సిరికితే కూడా ఇటీవల మంచమెక్కారు. దీంతో థాయ్ రాజకీయ సమీకరణాలు మారడం మొదలైంది. సైన్యానికి కీలక నేత జనరల్ ప్రయు త్ చాన్-ఓచా సుదీర్ఘకాలంగా రాజుకు విధేయులు. ఆయ న ఇప్పుడు తస్కిన్‌తో సయోధ్య కుదుర్చుకున్నారు. బదులుగా యింగ్లుక్ భారీ ఎత్తున సైనికాధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. మేజర్ జనరల్స్ సంఖ్య హఠాత్తుగా రెట్టిం పై 464కు చేరింది. వారిలో విధుల్లో ఉన్నవారు 230 మంది కాగా మిగతావారు ‘ఉపగ్రహ జనరల్స్.’ సైన్యం ‘తటస్థత’ లోని రహస్యం ఇదే. ‘ప్రజాస్వామిక సంస్కరణల ఉద్య మ’ నేత సుతెప్... యింగ్లుక్ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించాలని కోరడంలేదు. ఎన్నికలతో సంబంధంలేని రాజ్యాంగేతర ‘ప్రజామండలి’కి అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా, నిర్ణీత వ్యవధి ప్రకా రం 2014లోనైనా ఎన్నికలు జరిగితే తస్కిన్ ఎర్ర చొక్కాల గెలుపు ఖాయం. మెజారిటీ ప్రజల మద్దతున్న తస్కిన్, మద్దతులేని సుతెప్లు ఇద్దరి చరిత్రలు నలుపే. అప్రజాస్వామిక, రాజ్యాంగేతర అధికారం కోరుతు న్న సుతెప్ వెంట పట్టణ మధ్యతరగతి, విద్యావంతులు ఎందుకు పోతున్నట్టు? నిజానికి వాళ్లు ఆయనకంటే ముం దే వీధుల్లోకి వచ్చారు. వారిని వీధుల్లోకి తెచ్చినది ప్రధాని యింగ్లుక్ క్షమాభిక్ష! తస్కిన్ చట్టానికి అందకుండా శిక్షను తప్పించుకోవడానికి యింగ్లుక్ దొడ్డి దోవను తెరవడానికి నిరసనగా అవినీతి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పట్టణ మధ్య తరగతి యువత, ప్రజలు వీధులకెక్కి ఆందోళన చేపట్టా రు. ఆ ఆందోళనలను ఆధారంగా చేసుకొని తస్కిన్ వ్యతిరేకశక్తులు, రాచరికవాదులు సైన్యం అండలేకుండా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు. గురువారం రాజు పుట్టిన రోజు. ఆదివారం వరకు ఆ వేడుకలు కొనసాగుతాయి. అంతవరకు ఆట విడుపు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలైన ‘ఆట.’ ఈ ఆటలో గెలుపు ఎవరిదో నిర్ణయించేది చివరికి సైన్యమే. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల పోరాటం ఎప్పుడో హైజాక్ అయింది. పసు పు చొక్కాలు, ఎర్రచొక్కాలు ధరించి తలలు పగలగొట్టుకోడానికి సిద్ధమవుతున్న పట్టణ, గ్రామీణ ప్రజలకు మిగిలేది పగిలిన తలలే. యింగ్‌లుక్‌కు పదవీ గండం తప్పినాగానీ తక్సిన్ ఆట కట్టయినట్టే. క్షమాభిక్షకు తెరపడినట్టే. - పిళ్లా వెంకటేశ్వరరావు -
యుద్ధం కోసం‘ శాంతి’
వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఎవరికి? ఇస్తారో లేదో గానీ ఇవ్వాల్సింది మాత్రం నిస్సంశయంగా బరాక్ ఒబామాకే. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు 2009లో ఆ పురస్కారాన్ని అందుకున్నారనే శంక అనవసరం. రెడ్ క్రాస్ మూడు సార్లు ఆ పురస్కారాన్ని అందుకుంది. నిన్న సిరియాపై యుద్ధాన్ని విరమించిన ఒబామా... నేడు ఈ చేత్తో ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకొని, ఆ చేత్తో అఫ్ఘానిస్థాన్‌తో భద్రతా ఒప్పందంపై అంగీకారానికి వచ్చారు. వచ్చే ఏడాది అఫ్ఘాన్ నుంచి సేనల ‘ఉపసంహరణ’కు దారి తెరిచారు. నోబెల్ శాంతికి ఇంతకన్నా అర్హతలు కావాలా? 2009లో ఆయనకు నోబెల్ ఇచ్చినది ఎక్కువ యుద్ధాలను ప్రారంభించినందుకేనని వాదించే వాళ్లు తక్కువేమీ కాదు. అలాంటి వాళ్లను సంతృప్తి పరచడానికేనన్నట్టుగా మంగళవారం అమెరికా బీ-52 యుద్ధ విమానాలు చైనా ‘గగనతల రక్షణ గుర్తింపు ప్రాంతం’లోకి (ఏడీఐజెడ్) ప్రవేశించి కాలు దువ్వాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్నాయని అనుకుంటుండగా... 4,500 కిలో మీటర్ల దూరంలో మరో అగ్నిగుండాన్ని సృష్టిస్తానని ఒబామా హామీని ఇచ్చారు. జెనీవాలో ఇరాన్‌కు, ఐదు భద్రతా మండలి శాశ్వత దేశాలకు మధ్య అణు ఒప్పందం కుదిరిన రోజునే, నవంబర్ 24నే చైనా... తూర్పు చైనా సముద్ర ప్రాంత ఏడీఐజెడ్ను ప్రకటించింది. తమకు తెలియకుండా తమ గగన తలంలోకి ప్రవేశించే విమానాలను కూల్చే హక్కు తమకు ఉన్నదని ప్రకటించింది. రెండు రోజులైనా గడవక ముందే అమెరికా... చైనా హక్కుల ప్రకటనను బేఖాతరు చేసి కాలుదువ్వి, సవాలు విసిరింది. చైనాకు అతి సమీపంలోని దియాయు (సెనెకాకు) దీపుల విషయంలో గత కొంతకాలంగా జపాన్, చైనాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒకప్పుడు చైనాను దురాక్రమించిన జపాన్ ఆ దీవులపై తన వలసవాద హక్కుల కోసం పట్టుబడుతోంది. చైనా అవి తమవేనని వాదించడమే గాక తరచుగా ఆ దీవులపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి చూపుతోంది. జపాన్‌కు అమెరికా అండ ఉన్న మాట నిజమే. అయినా అది ఇలా ప్రత్యక్షంగా రంగ ప్రవేశం చేసి తనకు ధీటైన ప్రత్యర్థిగా ఎదుగుతున్న చైనాకు సవాలు విసరడం జపాన్ను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘ఒప్పందం కోసం సిరియా బలి’ఈ పరిణామాలు ఇరాన్ అణు ఒప్పందం సమయంలోనే జరగడం కాకతాళీయం కాదు. ఇరాన్ అణు ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మండిపాటు ‘సమంజసమే.’ ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివే తకు దారి తెరచిన జెనీవా ఒప్పందం ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి ఉన్న ‘అస్తిత్వ ప్రమాదాన్ని’ నిర్లక్ష్యం చేసిందని ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందుకే అది ఇరాన్‌కు ‘లొంగుబాట’ని, దాని అణు బాంబు కార్యక్రమానికి పచ్చజెండా చూపడమేనని మండిపడుతున్నారు. ఒకవిధంగా చూస్తే నెతన్యాహూ అంటున్నది నిజమే. ఒప్పందం ప్రకారం ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కుదించుకున్నా, అంతర్జాతీయ శల్య పరీక్షలను అనుమతించినా... రెండు దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ కోరుతున్నట్టు దాని అణు కార్యక్రమం పూర్తిగా నిలిచి పోదు. ఇరాన్ అణు ఒప్పందం కోసం అమెరికా ‘సిరియాను బలిపెట్టిందని’ ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలు చేస్తున్న ఆరోపణను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఆ ఆరోపణే అమెరికా విదేశాంగ విధానంలో వస్తున్న పెనుమార్పులను అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది. అమెరికా రక్షణశాఖ పెంట గాన్ సలహాలను పెడచెవిన పెట్టి సెప్టెంబర్‌లో ఒబామా సిరియాపై యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో రష్యా, చైనాలతో ఘర్షణకు దిగడానికి సిద్ధపడలేక వెనుదిరగాల్సి వచ్చింది. అమెరికా దురాక్రమణ జరగక సిరియా ‘ప్రజాస్వామ్యం’ ఏమైపోతోంది? అసద్ ప్రభుత్వ సేనలు బలం పుంజుకున్నాయి. నానా గోత్రీకులైన ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలు సహా తిరుగుబాటు దళాలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక దశలో రష్యా మధ్యవర్తిత్వంతో గద్దె దిగడానికి కూడా అంగీకరించిన అసద్ వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు! ఇంతకూ ‘సిరియా బలికి’ ఇరాన్ అణు ఒప్పందానికి ఉన్న సంబంధం ఏమిటి? ‘శాంతి’ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇరాన్, అమెరికా వైరం సమస్యను అణు సమస్యగా చూస్తున్న వారు జెనీవా ఒప్పందంతో అమెరికా సాధించిన రెండు కీలక ప్రయోజనాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఒకటి, ఇరాన్ తన చమురు పరిశ్రమ సహా ఆర్థిక వ్యవస్థను అమెరికా, ఈయూ దేశాలకు తెరవడానికి ఆంగీకరించడం. ఆర్థికమాంద్యంతో, ఇం దన సమస్యతో సతమతమవుతున్న ఈయూకు ఇది ప్రత్యేకించి కీలకమైనది. ఇక రెండవది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలతో ముడిపడినది. విశాల మధ్యప్రాచ్యంగా పిలిచే అఫ్ఘానిస్థాన్ నుంచి సిరియా వరకు ఉన్న ప్రాంతంలో సుస్థిర పరిస్థితులను నెలకొల్పడంలో అమెరికాకు సహకరిస్తానని అది వాగ్దానం చేసింది. అంటే సిరియాలో అధ్యక్షుడు అసద్ స్థానంలో అమెరికా ప్రయోజనాలకు కూడా హామీని కల్పించే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కు కృషి చేయడం. సిరియా సంక్షోభకాలం అంతటా అసద్‌కు మద్దతుగా నిలిచిన ఇరాన్... అమెరికాతో నెయ్యం కోసం అతన్ని బలిపెట్టే అవకాశం లేదు. పైగా రష్యా ప్రమేయం లేకుండా సిరియాలో అధికార మార్పిడికి అవకాశాలు తక్కువ. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పాటుకు ఇరాన్ సహాయపడగలుగుతుంది. 2001లో హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పాటులో ఇరాన్ కీలక పాత్ర వహించింది. ఇటు సిరియాలోనూ అటు అఫ్ఘాన్‌లోనూ కూడా పలుకుబడి గల ఇరాన్ నేడు సైతం అఫ్ఘాన్ ‘శాంతి’లో కీలక పాత్రధారిగా నిలుస్తుంది. అందరూ అంటున్నట్టుగా ఇరాన్ జెనీవా ఒప్పందానికి కట్టుబడుతుందా లేదా అనేది ప్రశ్న కానే కాదు. ఆ ఒప్పందమేమీ దాని అణు శక్తి కార్యకలాపాలను పూర్తిగా నిషేధించేది కాదు. ఆరునెలల తర్వాైతైనా అలాంటి ఒప్పందం కుదిరే అవకాశం లేదు. కాకపోతే ఇరాన్ ఈ రెండు అంశాలలో మాత్రం మాట నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసం అఫ్ఘాన్ ‘సుస్థిరీకరణ’కు సహకరించాల్సి వస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్, సౌదీలు ఒబామాపై తమ ఆరోపణ ను ‘అఫ్ఘాన్ కోసం సిరియాను బలి పెట్టారు’ అని సవరించుకోవాలి. 2024 వరకు అఫ్ఘాన్‌లో తిష్ట గత ఏడాది విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ అఫ్ఘాన్ తాలిబన్లతో జరిపిన చర్చలు విఫలమైనప్పటి నుంచి అమెరికా పశ్చిమ ఆసియా విధానం మారుతోంది. అప్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్‌ని కాదని స్వయంగా తాలిబన్లతో శాంతి చర్చలకు దిగిన అమెరికా లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి కర్జాయ్నే నమ్ముకుంది. ఎట్టకేలకు కర్జాయ్ అమెరికా సేనలు అప్ఘాన్లో మరో పదేళ్లు పాటు నిలిపి ఉంచడానికి అంగీకరించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో సరిగ్గా జెనీవా చర్చల సమంలోనే , ఈ నెల 20న ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం’ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందానికి అప్ఘాన్ తెగల మండలి ‘లోయా జిర్గా’ ఈ నెల 24నే ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందంపై ఇప్పుడు సంతకాలు చేసేది లేదని, వచ్చే ఏడాది నూతన అధ్యక్షుడే సంతకాలు చేస్తారని కర్జాయ్ తిరకాసు పెట్టారు. దీని అంతరార్థం... 2024 వరకు అప్ఘాన్లో అమెరికా సైన్యం నిలిపి ఉంచాలంటే వచ్చే ఏడాది కర్జాయ్ గానీ ఆయన ఆమోదించినవారు గానీ అధ్యక్షులు కావాలి. తాలిబన్లు ఈ భద్రతా ఒప్పందాన్ని, రానున్న ఎన్నికలను కూడా తిరస్కరిస్తున్నారు. కాబట్టి అఫ్ఘాన్ మారణ హోమం కొనసాగుతూనే ఉంటుంది. అప్ఘాన్లో కర్జాయ్ తెర ముందో వెనుకో ఉండి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఇరాన్ అండదండలు కావాలి. అందుకు దానికి పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. అప్ఘాన్ ‘సుస్థిరీకరణ’ వ్యూహంలో భాగంగానే అమెరికా ఇరాన్ పట్ల తన వైఖరిని మార్చుకుంది. ఇరాన్ నూతన అధ్యక్షుడు హసన్ రుహానీ పట్టువిడుపుల కారణంగానే అణు ఒప్పందం కుదిరిందని బావిస్తున్నవారు పొరబడుతున్నారు. ఆయన గద్దెనెక్కింది ఆగస్టులో కాగా అమెరికా మార్చిలోనే ఇరాన్‌తో సఖ్యతకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఒమన్‌లో అమెరికా విదేశాంగశాఖ ఉప మంత్రి విలియం బరన్స్ సహా అత్యున్నత స్థాయి అధికారుల బృందం ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సాగించింది. ఆ తర్వాత ఇరాన్ ఎన్నికలకు ముందు మేలో విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఒమన్‌లో రహస్యంగా అణు ఒప్పందానికి ‘ప్రాతిపదికను’ తయారు చేసిన విషయం రచ్చకెక్కింది. ఇటు అఫ్ఘాన్‌లో రష్యా, చైనాల ప్రాబల్యానికి కళ్లెం వేయడానికి, అటు తనకు ప్రత్యర్థిగా నిలుస్తున్న చైనాకు బుద్ధి చెప్పడానికి ఇరాన్ తురుపు ముక్కను ఒబామా ప్రయోగించారు. ఫలితం వేచి చూడాల్సిందే! - పిళ్లా వెంకటేశ్వరరావు -
‘యూరో’ సర్కస్
సంక్షోభం వల్ల నిరుద్యోగం, అల్ప వేతనాలు, పేదరికంతో అల్లాడుతున్న ప్రజలలో ఈయూ, యూరో కరెన్సీల పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. విదేశీయుల పట్ల గుడ్డి వ్యతిరేకత, జాత్యహంకారం వ్యాపిస్తున్నాయి. యుద్ధానంతర కాలపు మహా విషాదంలో యూరో అధినేతలు బఫూన్లలా వినోదం పంచుతున్నారు. ఎంతటి విషాదంలోనైనా వినోదాన్ని పంచగల సమర్థత యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధినాయకులకు, దేశాధినేతలకే సాధ్యం. ఇటలీ ప్రధాని ఎర్నికో లెట్టా రేపెప్పుడో యూరోపియన్ యూనియన్ పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో పొంచి ఉన్న ముప్పును గురించి దిగులు పడిపోతున్నారు. వచ్చే మేలో జరిగే ఆ ఎన్నికల్లో ‘యూరో సంశయవాదులు, ఈయూ వ్యతిరేకులు’ అధికారంలోకి రానున్నారని బెంగ పెట్టేసుకున్నారు. ఇంతకూ రేపు ఆయన అధికారంలో ఉంటారో లేదో తెలియదు! మధ్యేవాద వామపక్షమైన డెమోక్రటిక్ పార్టీ (పీడీ) అధినేత లూగీ బెర్సానీ స్వయంగా మితవాదులతో చేతులు కలిపి ‘మడి’ మంటగలుపుకోలేక... ఫిబ్రవరిలో లెట్టాను ప్రధానిని చేసారు. ఆ ‘అంటరాని’ పార్టీ (పీడీఎల్) అధినేత, మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ దయాదాక్షిణ్యాలపై బతుకుతున్న ప్రభుత్వానికి ముప్పు రానేవచ్చింది. ఎన్నికల కోసం తెగ ఆరాటపడుతున్న బెర్లుస్కోనీ ‘మహా కూటమి’ ప్రభుత్వంలోని తమ మంత్రుల చేత రాజీనా మాలు చేయించారు. ఈ చర్యను వ్యతిరేకించే కొందరు ఆయన ఆదేశాలను ధిక్కరిస్తారని వినవస్తోంది. ఆ చీలిక వస్తుందో లేదో గానీ బెర్లుస్కోనీయే ‘చీలిక’కు రంగం సిద్ధం చేశారు. పార్టీ పేరును ‘ఫోర్జా ఇటాలియా’గా (ఇటలీ, లేచి రా) మార్చేశారు. ఎన్నికల కోసం అంగలారుస్తున్న నే త పార్టీ చీలికకు యత్నించడం మూర్ఖత్వం కాదా? బెర్లుస్కోనీ మూర్ఖుడు కాడు. లెట్టా గత నెల 30న హెచ్చరించిన ‘యూరో సంశయవాదులు, ఈయూ వ్యతిరేకుల’ ముప్పును బెర్లుస్కోనీ ముందుగానే గ్రహించారు. యూరో సంక్షోభం ఫలితంగా నిరుద్యోగం, అల్ప వేతనాలు, పేదరికంతోనూ, సంక్షేమ వ్యయాల కోతల తోనూ అల్లాడుతున్న యూరోపియన్లలో ఈయూ పట్ల, యూరో ఉమ్మడి కరెన్సీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. వలస వచ్చిన విదేశీయుల పట్ల గుడ్డి వ్యతిరేకత, జాత్యహంకారం వ్యాపిస్తున్నాయి. లెట్టా హెచ్చరించిన ఆ ‘ముప్పు’ను ముద్దు చే సి పచ్చి మితవాద శక్తుల మద్దతుతో అధికారాన్ని అందుకోగలనని బెర్లుస్కోనీ ఆశ. దాన్ని వ్యతిరేకించేవారు దారికి రావడమో లేక బయటకు పోవాలనో ఆయన అభిమతం. ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్నికలు జరిగితే ఫిబ్రవరి ఫలితాలు పునరావృతంగాక తప్పదు. ‘వీళ్లంతా అవినీతిపరులే. మూడు దశాబ్దాలుగా దేశాన్ని భ్రష్టు పట్టించారు. న్యాయం కోసం యుద్ధం ఇప్పుడే మొదలైంది’ అంటూ గత ఎన్నికల్లో గర్జించిన బెప్పే గ్రిల్లే (ఫైవ్ స్టార్ మూవ్మెంట్ స్వతంత్ర ఉద్యమం) మళ్లీ ప్రతాపాన్ని చూపనున్నారు. అప్పటిలాగే ఈ సుప్రసిద్ధ విదూషక చక్రవర్తి సునాయాసంగా 25 శాతం ఓట్లు సాధించగలుగుతారు. మళ్లీ రాజకీయ సంక్షోభం తప్పదు. బెర్లుస్కోనీ సృష్టించిన అస్థిర రాజకీయ పరిస్థితి ఈయూ, యూరోల నిరాశామయ భవితకు అద్దం పడుతుంది. ఇటలీ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 1.5 శాతంగా ఉంటుం దని లెట్టా అంటుంటే... ఊహించనదానికంటే వేగంగా క్షీణించిపోతోందని ప్రభుత్వ గణాంక శాఖ (మైనస్ 1.8 శాతం) గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌లో లెట్టే ప్రభుత్వం ఈయూ బెయిలవుట్ సహాయాన్ని స్వీకరించినప్పుడే ఆరు నెలల్లో మరో బెయిలవుట్ తప్పదని నిపుణులు హెచ్చరించారు. యూరో జోన్‌లోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ క్షీణతతో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌కు గండం తప్పదని కూడా హెచ్చరించారు. ఆ గండం రానే వచ్చింది. రేటింగ్స్ సంస్థ ‘స్టాండర్డ్ అండ్ పూర్’ ఫ్రాన్స్ పరపతి స్తోమత రేటింగ్స్‌ను ఏఏ ప్లస్ నుంచి ఏఏకు తగ్గించింది. సోషలిస్టు అధ్యక్షునిగా ఫ్రాంకోయిస్ హాలెండే జనాదరణ రేటింగ్స్ 55 ఏళ్ల కనిష్టానికి... 25 శాతానికి ముందే పడిపోయాయి. ఈయూ నేతలు గ్రీస్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, ఐర్లాండ్, సైప్రస్ తదితర ‘రెండో తరగతి’ ఈయూ దేశాలలోనూ, స్వదేశాల్లోనూ అమలుచేస్తున్న ‘పొదుపు’ చర్యల పర్యవసానమిది. యూరో సంక్షోభ దేశాల్లో ఎక్కడా వృద్ధి అన్నదే కనిపించకున్నా జర్మనీ, బ్రిటన్ల వంటి దేశాల నామమాత్రపు వృద్ధితోనే సంక్షోభం నుంచి గట్టెక్కిపోయామని నాలుగు నెలల క్రితమే ఈయూ ప్రకటించింది. 2014లోయూరో జోన్ వృద్ధి రేటు 1.4 శాతంగా ఉంటుందని యూరోపియన్ కమిషన్ అంచనా వేసింది. దాన్ని రెండోసారి సవరించి సోమవారం 1.1 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమేనని ప్రకటించింది. అయినా నిస్సిగ్గుగా ‘స్పష్టమైన సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి,’ ‘మలుపు తిరుగుతున్నాం’ అంటోంది. అంతే నిస్సిగ్గుగా హాలెండే సైతం 0.5 శాతం వృద్ధికే సంబరపడుతూ పరిస్థితి ఆశావహంగా ఉన్నదని అంటున్నారు. యుద్ధానంతర యూరప్‌లోని గొప్ప విషాద పరిస్థితుల్లో యూరో అధినేతలు బఫూన్లుగా మారి వినోదం పం చడం విశేషం. - పిళ్లా వెంకటేశ్వరరావు -
మయన్మార్ మాఫియా రాజ్
చైనా నేటి ఆసియా అద్భుతమైతే రేపు ఆ ఖ్యాతి మయన్మార్‌దే. కాకపోతే అది తన అపార ఖనిజ సంపదను ‘వినియోగంలోకి’ తేవాల్సి ఉంటుంది. మయన్మార్ వనరులను కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాలు... సైనిక నియంత థాన్ ష్వేకు ప్రజాస్వామ్య అధ్యక్షుని కిరీటం తగిలించాయి. నేడు బహుళజాతి కంపెనీలు మైనారిటీ జాతుల ప్రాంతాలను ‘అభివృద్ధి’ చేసేస్తున్నాయి. విదేశీ గనుల కంపెనీలను నిరోధించే లక్ష్యంతో స్థానిక బడా వ్యాపారుల ముఠా బాంబు దాడులను చేయించింది. ప్రపంచంలోకెల్లా అంధత్వం అతి ఎక్కువగా ఉన్న దేశాల్లో మయన్మార్ అగ్రశ్రేణిలో ఉంది. అర్థ శతాబ్దిగా అక్కడ సాగుతున్న సైనిక జుంటా నిరంకుశ, జాత్యహం కార పాలనపట్ల ప్రపంచశక్తులు ప్రదర్శిస్తున్న అంధత్వం అంతకంటే చాలా ఎక్కువ. అందుకేనో ఏమో అక్టోబర్ 11-17 మధ్య దేశవ్యాప్తంగా 13 చోట్ల సంభవించిన బాం బు పేలుళ్ల ప్రత్యేక తను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అది కరెన్ నేషనలిస్టు యూనియన్ (కేఎన్‌యూ) మిలి టెంట్ల దుశ్చర్యగా లెక్కగట్టేసారు. కానీ కరెన్ జాతీయవాదులకు ఆ పేలుళ్ళకు సంబంధంలేదని మయన్మార్ పోలీసులే చెబుతున్నారు. ప్రత్యేక భాషా సంస్కృతిగలిగిన కరెన్లు (జనాభాలో 7 శాతం) తూర్పు రాష్ట్రం కాయిన్‌లోనే ప్రధానంగా నివశిస్తున్నారు. జాతుల ప్రదర్శన శాలగా చెప్పుకోదగిన మైన్మార్‌లో 135 గుర్తింపు పొందిన జాతుల ప్రజలున్నారు. ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ మయన్మార్ సైనిక జుంటా బర్మీ జాతీయతను (68 శాతం) అందరిపై రుద్దాలని ప్రయత్నిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ జాత్యహంకా రం బౌద్ధమతోన్మాదం ముసుగు తొడిగింది. దీంతో తరచుగా వార్తలకెక్కుతున్న రోహింగియా లు సహా ఇతర జాతులపై జరుగుతున్న దాడులన్నిటినీ మత సంఘర్షణలుగా లెక్కగట్టేస్తున్నారు. అక్టోబర్ పేలుళ్లు మయన్మార్ జాతుల అణచివేత సమస్యను నగ్నంగా ప్రదర్శిస్తున్నాయి. కచిన్లలో 65 శాతం బౌద్ధులే. ఇస్లాం వారి లో వ్యాప్తి చెందలేదు. జాతి అణచివేతకు వ్యతిరేకంగా, స్వయం నిర్ణయాధికారం కోరుతూ వారు 1949 నుంచి సాయుధంగా పోరాడుతున్నారు. పర్వతవాసులైన కరెన్లతోపాటూ, షాన్, కచిన్, కయన్ తదితర జాతులు కూడా ఆయుధాలు పట్టాయి. 2007 నాటికి సైనిక జుంటాతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న జాతుల సంస్థలే పది హేడు! నేటికీ కరెన్, షాన్, కచిన్ జాతుల పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఇంతకూ అక్టోబర్ దాడులకు పాల్పడినది ఎవరు? బడా వ్యాపారులు! కచెన్ల ప్రాంతంలోని బర్మీ బడా వ్యాపార వర్గాలే ఈ పేలుళ్లకు సూత్రధారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఇటీవలి మయన్మార్ ‘ప్రజాస్వామీకరణ’ ఫలితంగా చాప కింది నీరులా వ్యాపిస్తున్న సరి కొత్త సంఘర్షణను ఇది సూచిస్తోంది. జపాన్ నిన్నటి ఆసియా అద్భుతమైతే నేడు ఆ ఖ్యాతి చైనాది. మరి రేపు ఆ ఖ్యాతి ఎవ రికి దక్కనుంది? మయన్మార్కేనని ‘ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’ తాజా అంచనా. కాకపోతే అది తన అపార ఖనిజ సంపదను ‘వినియోగంలోకి’ తేవాల్సి ఉంటుంది. అందుకోసం చైనా, జపాన్, భారత్లతోపాటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ పోటీపడుతున్నాయి. సైనిక నియంతృత్వ మయన్మార్ వనరులను కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాలు ప్రజాస్వామ్యం ‘మడి’ అడ్డురాకుండా... సైనిక నియంత థాన్ ష్వే చేత పౌర దుస్తులు తొడిగించి, ప్రజాస్వామ్య ప్రభుత్వ అధ్యక్షుని కిరీటం తగిలించారు. ప్రతిగా బతికుండగానే పీక్కుతినే బహుళజాతి రాబందుల దం డుకు మయన్మార్ తలుపులు తెరిచారు. ఆ రాబందులన్నీ మైనారిటీ జాతుల ప్రాంతాలను ‘అభివృద్ధి’ చేసేస్తున్నా యి. బొగ్గు, చమురు, సహజవాయు నిక్షేపాలు బర్మీ ప్రాం తాల్లో ఉండగా నికెల్, రాగి, బంగారం, బాక్సైట్, మణిమాణిక్యాలువంటి ఖనిజాలలో అధికభాగం అక్కడే ఉన్నాయి. జాతుల అణచివేతలో భాగంగా సైనిక జుంటా ఉద్దేశపూర్వకంగానే వారి ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేసింది. ఇప్పుడా ప్రాంతాల్లోకి విదేశీ పెట్టుబడులు జోరుగా ప్రవేశిస్తున్నాయి. కరెన్ల ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న విదేశీ గనుల కంపెనీలను నిరోధించే లక్ష్యంతోనే స్థానిక బడా వ్యాపారుల ముఠా బాంబు దాడులను చేయించింది. అలా అని సైనిక జుంటాకు వ్యాపారవర్గాలకు ఏ సం బంధాలూ లేవనీకాదు. మైన్మార్లోకెల్లా అత్యంత సంపన్నుడు, అతిపెద్ద వ్యాపారవేత్త తే జా, థాన్ ష్వేలు కుటుం బ మిత్రులు. బడా వ్యాపారవేత్త జయగ్బా ఖిన్ ష్వే మాజీ ప్రధాని జనరల్ ఖిన్ న్యంట్కు సన్నిహిత మిత్రుడు. దేశంలోని అతిపెద్ద టీవీ నెట్వర్క్ ‘స్కైనెట్’లో ప్రధాన వాటాదారు థేన్ ష్వేనే. జాతీయస్థాయి కుబేరులంతా జుంటాకు సన్నిహితులు, ‘సంస్కరణవాదులు.’ వెనుకబడిన ప్రాం తాలకే పరిమితమైన స్థానిక వ్యాపారవేత్తలంతా బర్మీయు లే. అయినా విదేశీ కంపెనీల, ఆశ్రీత పెట్టుబడిదారులతో పోటీలో దివాలా తప్పదని భయపడుతున్నారు. జాతీయ స్థాయి బర్మీ కుబేరులంతా ‘వెనుకబడిన ప్రాంతాల’పై పడుతున్నారు. మధ్య, ఈశాన్య మయన్మార్‌లోని కచిన్ ప్రాంతాల్లో బంగారం, రాగి, ఇనుము, జింకు, వెండి కోసం వేట త్రీవంగా సాగుతోంది. ఆధునిక వ్యవసాయ క్షేత్రాల కోసం మైనారిటీ జాతుల రిజర్వు భూములను ఆశ్రీత కుబేరులకు కట్టబెడుతున్నారు. ఫలితంగా 2011లో తీవ్రమైన కచెన్ గెరిల్లాల పోరాటంపై సైన్యం పాశవిక అణచివేత సాగించింది. 30 వేలకు పైగా కచిన్ శరణార్థులు చైనాలో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి కచిన్, కాయెన్, షాన్ రాష్ట్రాల్లో జాతి ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నా యి. వాటితోపాటే స్థానిక వ్యాపారవర్గాలకూ, జాతీయ స్థాయి కుబేరులకు, విదేశీ కంపెనీలకు మధ్య సంఘర్షణ పదునెక్కుతోంది. కరెన్ వ్యాపారుల దాడులతో మయ న్మార్ బడా కుబేరులంతా సొంత సేనలతో మైనారిటీ జాతుల ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఆశీస్సులతో మయన్మార్ ‘ప్రజాస్వామీకరణ’ మాఫియా రాజ్ అవతరణగా వికసిస్తోంది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
దగాపడ్డ లంక తమిళులు
అర్థరహితమైన చర్చలను రేకెత్తించి అనర్థదాయకమైన విధానాలను కప్పిపుచ్చుకోవచ్చు. శ్రీలంకలో ఈ నెల 15-17 తేదీలలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల (చోమ్) సమావేశానికి ప్రధాని మన్మోహన్సింగ్ హాజరు కావాలా? వద్దా? అంటూ సాగుతున్న అర్థరహితమైన చర్చే అందుకు నిదర్శనం. లంక అధ్యక్షుడు మహీందా రాజపక్స చైనా బుట్టలో పడకుండా చూడాలంటే మన్మోహన్ చోమ్ సమావేశాలకు హాజరు కాకతప్పదని కొందరి వాదన. 2014 ఎన్నికల వైతరణిని దాటాలంటే తమిళనాడు ప్రజల సెంటిమెంట్‌ను నిర్లక్ష్యం చేయరాదనేది మరో వాదన. ఇది ఎన్నికల సీజన్ వాదన కాగా, మొదటిది ‘చైనా ఫోబియా’ (భయం జబ్బు) నుంచి పుట్టుకొచ్చిన వాదన. యూపీఏ ప్రభుత్వానికిగానీ, తమిళ ఛాంపియన్లైన డీఎంకే, అన్నా డీఎంకేలకుగానీ లంక తమిళుల సంక్షేమంపై కంటే అధికార సోపానాలను ఎక్కడంపైనే శ్రద్ధ. రెండు వందల ఏళ్ల బ్రిటన్ వలసవాద ఊడిగానికి సంకేతమైన చోమ్ ఒక నిరర్థక సంస్థ. రెండేళ్లకోసారి పెట్టే ఆ తద్దినానికి వెడితే ఒరిగేదీ లేదు. వెళ్లకపోతే పోయేదీ లేదు. రాజపక్సే కాదు దాదాపు లంక అధ్యక్షులందరూ భారత్‌ను బుట్టలో పెట్టగలవారే తప్ప మరెవరి బుట్టలోనూ పడే బాపతు కాదు. నేటి మన లంక విధానం రాజపక్స బుట్టలోనే ఉంది. కాబట్టే ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఒకప్పుడు మనం పెంచి పోషించిన వేర్పాటువాద తమిళ టైగర్లపై నిర్మూలనా యుద్ధాన్ని పరోక్షంగా సమర్థించాల్సి వచ్చింది. నేడు లంక తమిళులపై సాగుతున్న అమానుష జాతి అణచివేతను, హక్కుల ఉల్లంఘనను చూసీ చూడనట్టు నటించాల్సి వస్తోంది. మన్మోహన్నాటకం తమిళ టైగర్లపై యుద్ధంలో (2009) లంక సైన్యం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చిలో అభిశంసన తీర్మానం ఆమోదించింది. ఆ సమావేశాలకు ముందు కూడా నేటిలాగే రచ్చ జరిగింది. అది కూడా ఎన్నికల కాలమే... మొసలి కన్నీళ్లు కార్చిన కాలమే. అయినా ఆనాడు మన్మోహన్ ‘ద్రవిడ పార్టీలకు,’ ‘తమిళ దురహంకారానికి’ లొంగిపోడానికి సిద్ధంగా లేనని పదేపదే ప్రకటనలు గుప్పించారు. చివరికి అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు. నేడు ఆయన ఎలాంటి ప్రకటనలు చేయకుండా గుంభనంగా ఉన్నారు. ‘ద్రవిడ పార్టీలకు లొంగిపోతారో లేదో’ వేచి చూడాలి. ప్రధాని చోమ్ సమావేశాలకు వెళ్లడంపై ఇక్కడ చర్చ సాగుతుండగా లంక సైన్యం తమిళ టైగర్ల సమాధులను నేలమట్టం చేసే పనిలో మునిగి ఉంది. నవంబర్ 27 తమిళ టైగర్ల ‘గ్రేట్ హీరోస్ డే.’ మరణించిన తమిళ పోరాటకారుల సంస్మరణ దినం ఒకప్పుడు ఘనంగా వారం రోజుల పాటూ జరిగేది. నేడు పులులూ లేరు, పెద్ద పులి ప్రభాకరనూ లేడు. ఈలం కల యుద్ధ జ్వాలల్లో, యుద్ధానంతర నరమేధ ంలో కరిగిపోయింది. టైగర్లు రాజపక్సను పీడ కలలై వేధిస్తున్నట్టున్నారు. టైగర్ల స్మశాన వాటికలపై పడ్డారు. అక్టోబర్ 19 నుంచి ఇంకా మిగిలి ఉన్న స్మశానాలను నేలమట్టం చేసి, టైగర్ల సమాధులపై సైనిక కట్టడాలను నిర్మించే పని చేయిస్తున్నారు. బిడ్డల సమాధులపై పడి విలపిస్తూ జీవచ్ఛవాల్లా బతికే తమిళ తల్లులకు ఇక ఆపాటి భాగ్యం కూడా ఉండదు. ఒకప్పుడు టైగర్లు మన ప్రభుత్వానికి తమిళుల విముక్తి ప్రదాతలు. 1991లో రాజీవ్‌గాంధీ హత్యకు గురైనప్పటి నుంచి వారు ఉగ్రవాదులు. లంక తమిళులకు మాత్రం వారు ముద్దు బిడ్డలే. బిడ్డలు ఎన్నుకున్న దారి తప్పయినా, ఒప్పయినా నెత్తురు ధారపోసింది తమ కన్నీరు తుడవడానికేగా? ఇది గుర్తించగలిగితే రాజపక్స ప్రభుత్వంలాగే యూపీఏ సర్కారు కూడా తమిళులను అందరినీ ఉగ్రవాదులుగా పరిగణించి వారిపై జరుగుతున్న జాతి అణచివేతకు, అత్యాచారాలకు, హక్కుల హరణకు అడ్డు చెప్పకుండా ఉండదు. ‘ప్రజాస్వామ్య విజయం’ సెప్టెంబర్ 21న జరిగిన ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు ప్రజాస్వామ్య విజయమని ప్రపంచ మీడియా కోడై కూసింది. ఈ ఎన్నికలతో లంక తమిళుల ‘చిరకాల స్వప్నం’ సాకారం కానున్నదని జోస్యాలు చెప్పారు. ఊహించినట్టే గెలిచిన తమిళ్ నేషనల్ ఎలయన్స్ (టీఎన్ఏ) ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ ఆ ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు కౌన్సిల్ ‘లంకలో భాగంగా ఫెడరల్ స్వభావం గలిగిన స్వయం నిర్ణయాధికార హక్కుకు హామీ’ని కల్పించేది కాదు. ఆయన ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నీ లాంఛనప్రాయమైనవే. అధ్యక్షుడు నియమించే గవర్నర్ చేతిలోనే సకల అధికారాలు ఉంటాయి. ప్రాంతీయ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా తోసిరాజనే అధికారమే కాదు, నిర్ణయాలను తీసుకునే అధికారాలు సైతం గవర్నర్‌కే ఉంటాయి. ‘ఈ అధికారంతో తమిళులకు ఏమీ చేయలేమని మాత్రమే విఘ్నేశ్వరన్ రుజువు చేయగలరు’ అని టీఎన్ఏ ప్రముఖ నేత ఒకరు అన్నారు. లంక అంతర్యుద్ధం చివర్లో లొంగిపోవడానికి వ స్తున్న టైగర్లను పాశవికంగా కాల్చిచంపిన సైన్యపు ైపైశాచికత్వాన్ని, పదిహేనేళ్ల మైనర్ ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్‌ను కాల్చి చంపిన తీరును ప్రపంచమంతా తప్పు పట్టినా మన ప్రభుత్వం నీళ్లు నములుతూ కూచుంది. ఆ యుద్ధంలో లంక ప్రభుత్వానికి సహాయం అందించామన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఐరాస అభిశంసన తీర్మానం రాజపక్స యుద్ధ నేరాలను దాటవేసి హక్కుల కాలరాచివేతపై చేసిన తీర్మానమే. అయినా దానికి అయిష్టంగానే మన్మోహన్ అంగీరించారు. పిల్లిమొగ్గల విదేశాంగ నీతి 1960లలో మన లంక విధానాన్ని చైనాతో వైరమే శాసిం చింది. తమిళ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ వంటి సంస్థలను, అమృతలింగం వంటి ఉదారవాద తమిళ నేతలను లంక జాత్యహంకార, తమిళ అణచివేత విధానాలను ప్రతిఘటించకుండా నిరోధిస్తూవచ్చింది. నేపాల్‌లో నేపా లీ కాంగ్రెస్, కొయిరాలాల ప్రతిష్టను దిగజార్చినట్టే... లంకలో తుల్ఫ్ వంటి పార్లమెంటరీ పార్టీల ప్రతిష్ట దిగజారిపోవడానికి కారణమైంది. తమిళ పార్లమెంటరీ పార్టీలపై విశ్వాసం కోల్పోయిన తమిళులు మిలిటైన్సీ వైపు మొగ్గా రు. వివిధ ఈలం సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థలన్నిటికీ ఇందిరాగాంధీ ప్రభుత్వం అనుమతితో తమిళనాడులో ఆశ్రయం లభించింది. ఎల్టీటీఈ అప్రజాస్వామిక, ఆధిపత్యవాద సంస్థగా వృద్ధి చెందుతున్నా విచక్షణారహితంగా దాన్ని సమర్థించారు. 1987లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆనాటి లంక అధ్యక్షుడు జేఆర్ జయవర్థనేతో కలిసి లంక తమిళులకు, ఎల్టీటీఈకి ప్రాతినిధ్యంలేని చర్చల్లో... టైగర్లుసహా మిలిటెంటు సంస్థలన్నీ ఆయుధాలు అప్పగించి స్వయం ప్రతిపత్తిగల ప్రాంతీయ అధికారానికి అంగీకరించేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే ప్రాంతీయ కౌన్సిళ్ల కోసం లంక 13వ రాజ్యాంగ సవరణకు అంగీకరించింది. టైగర్లపై బలవంతంగా రుద్దిన ఆ ఒప్పందాన్ని అమలుచేయడానికి లక్ష మంది సైన్యంతో మనం యుద్ధంలో కూరుకుపోవాల్సి వచ్చింది. 1200 మంది భారత సైనికులను కోల్పోయిన ఆ సైనిక దుస్సాహసం గురించి ఎవరూ పెదవి మెదపరు. నాటి ఒప్పందం ప్రకారం కౌన్సిళ్లకు అధికారాల బదలాయింపు జరగనే లేదు. పైగా ఉన్న అధికారాలను కూడా ఊడబెరికారు. రాజీవ్‌గాంధీ హత్యపట్ల ఆగ్రహాన్ని కనబరచడం సబబే అయినా, టైగర్లను నిర్మూలించచడం తప్ప శాంతికి ప్రత్యామ్నాయాలను అన్వేషించకపోవడం మన్మోహన్ దౌత్య నీతి వైఫల్యమే. ఆ వైఫల్యం కారణంగానే నేటికీ వందలాది మంది తమిళ మహిళలపై సైన్యం అత్యాచారాలు సాగిస్తున్నా, వందలాదిగా యువతీ యువకులను మాయం చేస్తున్నా మనకు పట్టడం లేదు. ప్రభాకరన్ పదిహేనేళ్ల చిన్న కుమారుడు బాలచంద్రన్‌ను దుర్మార్గంగా హతమార్చిన దృశ్యాలను కళ్లకు కట్టిన బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 నేడు తిరిగి లంక సైన్యపు మరో ఘాతుకాన్ని ప్రపంచానికి చూపింది. శోభ (ఇసాయ్ప్రియ) అనే ఎల్టీటీఈ పాత్రికేయురాలిని లంక సైన్యం నిర్బంధించి, చిత్ర హింసల పాలు చేసి చంపేసిన ఘాతుకాన్ని, ఆమె నగ్న మృత దే హం వీడియోను అది బయటపెట్టింది. ఆమెపై లంక సైనికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు. ప్రభాకరన్ కుమార్తె ద్వారక (23) శోభేనని అనుమానాలు బలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని తమిళ వర్గాలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. మనకు అప్రియమైనవైనా వాస్తవాలు ఎప్పటికీ దాగిపోవు. విశ్లేషణ : పిళ్లా వెంకటేశ్వరరావు -
ఏదీ అఫ్ఘాన్ శాంతి తీరం?
‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. కొత్త అధ్యక్షుడైనా తమ మాట వింటాడని దాని ఆశ. ఆలూ లేదూ చూలూ లేదూ... అంటారే సరిగ్గా అలా ఉంది అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష ఎన్నికల సంరంభం. సెప్టెంబర్ 18-అక్టోబర్ 6 మధ్య నామినేషన్లకు గడువు ముగిసిపోవడమే కాదు, అర్హులుగా బరిలో నిలిచిన వారి జాబితా కూడా ఖరారైంది. యుద్ధ ప్రభువులు, మాజీ మంత్రులుసహా అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు ఖయూం కర్జాయ్ కూడా పోటీపడుతున్న పది మందిలో ఉన్నారు. ఇంతకూ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న జరగాల్సిన ఎన్నికలు అసలు జరుగుతాయా? ఎన్నికలను జరగనిచ్చేది లేదని తాలిబన్ల అధినేత ముల్లా మొహ్మద్ ఒమర్ సోమవారం హెచ్చరించారు. తాలిబన్లే కాదు ఏ మిలిటెంటు గ్రూపూ పాల్గొనని ఈ ఎన్నికల ప్రహసం జరిగినా... వచ్చే ఏడాది చివరికి అమెరికా సహా నాటో బలగాలన్నీ నిష్ర్కమించిన తదుపరి తాలిబన్లను ఎదుర్కొని కొత్త ప్రభుత్వం నిలవగలదా? 2014 తర్వాత ‘శిక్షణ అవసరాల కోసం’ అమెరికా సేనలను నిలిపి ఉంచడానికి అవకాశం కల్పించే ‘అమెరికా-అఫ్ఘాన్ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఇటీవల అఫ్ఘాన్‌కు వెళ్లారు. అక్టోబర్ 11-12 తేదీల్లో ఆయన కర్జాయ్‌తో చర్చలు జరిపారు. ప్రధానాంశాలన్నిటిపైన ‘అంగీకారం’ కుదిరిందని కెర్రీ ప్రకటించారు. ఏ అంశాలపై అంగీకారం కుదిరిందో, ఆ ఒప్పందంలో అసలు ఏముందో వెల్లడించ లేదు. కెర్రీ దౌత్య విజయం ఎంతటి ఘనమైనదో... పత్రికా సమావేశంలో సైతం కాసింత నవ్వును పులుముకోలేకపోయిన ఆ ఇద్దరి మొహాలే వెల్లడించాయి. అవినీతిపరుడు, నమ్మరానివాడు అయిన కర్జాయ్ మొండి పట్టు వల్లనే చర్చలు విఫలమయ్యాయనేది అమెరికా ప్రభుత్వ అనధికారిక కథనం. కర్జాయ్ ‘మొండి పట్టు’ దేనిపైన? 2014 తర్వాత అఫ్ఘాన్‌లో ఉంచే అమెరికా సేనలకు అఫ్ఘాన్ చట్టాలు వర్తించకుండా ‘రక్షణ’ కల్పించడంపైన. ఆ రక్షణ లేనిదే తమ సేనలను నిలపడం అసాధ్యమని అమెరికా అంటోంది. అమెరికా తయారు చేసిన అఫ్ఘాన్ భద్రతా బలగాల ఉన్నత సైనికాధికారుల మండలి సైతం అధ్యక్షుని మొండి పట్టు వల్లనే ఒప్పందం కుదరలేదని అంటోంది. అమెరికా అండ లేకుంటే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి ‘జాతీయ భద్రత’కు ముప్పు తప్పదని వారి వాదన. లేని విదేశీ ముప్పును చూడగలుగుతున్న సైనికాధికార మండలికి ఉన్న అసలు ముప్పు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. 2001లో అమెరికా దురాక్రమణతో అధికారం కోల్పోయిన నాటి కంటే నేడు తాలిబన్ల బలం అనేక రెట్లు పెరిగిందని, వారి ప్రాబల్యం దేశమంతటికీ విస్తరించిందని అంతా అంగీకరించేదే. ఏడాదికి 50 వేల మంది సైనికులు పారిపోయే సైన్యంపై ఆధారపడి ఏ ప్రభుత్వానికైనా, అసలు తమకే అయినా ముప్పు తప్పదనేదే వారి నిజమైన ఆందోళన. సైన్యం నుంచి పారిపోతున్న వారిలో చాలామంది తాలిబన్లలో చేరుతున్నారనేది వేరే సంగతి. కర్జాయ్ అవినీతిపరుడు నిజమేగానీ అఫ్ఘాన్‌ను అవినీతిమయం చేసిన ఖ్యాతి అమెరికాదే. కర్జాయ్‌కి అది డబ్బు సంచులను చేరవేస్తున్న విషయం కూడా రచ్చకెక్కింది. ఎంత డబ్బు పోసినా కర్జాయ్‌ని పూర్తిగా కొనేయలేకపోయామనేదే అమెరికా బాధ. అమెరికా సేనలకు ‘రక్షణ’ అఫ్ఘాన్ ప్రభుత్వ అధికారాల పరిధిలోనిది కాదని, వచ్చే నెల్లో జరుగనున్న తెగల పెద్దల మండలి సమావేశం... ‘లోయా జిర్గా’ మాత్రమే ఆ సమస్యపై నిర్ణయం తీసుకోగలదని కర్జాయ్ వాదన. ఆయన మొండితనం ఏదన్నా ఉందంటే అది అమెరికా చెప్పినట్టు వినకపోవడమే. కర్జాయ్‌తో గత ఏడాది కుదుర్చుకున్న ‘వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని’ నేడు గౌరవించని అమెరికాను కర్జాయ్ ఎందుకు నమ్మాలి? ఆ ఒప్పందం ప్రకారం తమ సైనిక నిర్బంధ కేంద్రాల్లో ఉన్న బందీలనందరినీ వెంటనే అఫ్ఘాన్ దళాలకు బదలాయించాల్సి ఉన్నా అమెరికా ససేమిరా అంటోంది. అమెరికాతో కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందాన్నీ అంగీరించేది లేదని కెర్రీ పర్యటనకు ముందే ముల్లా ఒమర్ ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షునితో సైతం సంబంధం లేకుండా తాలిబన్లతో చర్చల కోసం నానా పాట్లూ పడ్డ బరాక్ ఒబామా ప్రభుత్వమే వారితో సయోధ్య కోసం కర్జాయ్ స్వయంగా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించిం ది. కర్జాయ్ ప్రభుత్వంతో రహస్య దౌత్యం సాగిస్తున్న సీనియర్ తాలిబన్ నేత లతీఫ్ మెహసూద్‌ను అమెరికా అరెస్టు చేసింది. ఘోర పరాజయంతో అఫ్ఘాన్ నుంచి నిష్ర్కమిస్తున్నట్టు అనిపించకుండా పరువు దక్కించుకునేలా ఏదో ఒక ఒప్పందం కోసం, తమ సేనలను నిలిపి ఉంచే అవకాశం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవంక రష్యా 2014 తదుపరి అఫ్ఘాన్ నుంచి తమ దేశానికి విస్తరించనున్న జిహాదీ ముప్పును ఎదుర్కోడానికి సిద్ధమౌతోంది. అఫ్ఘాన్‌కు పొరుగు నున్న తజకిస్థాన్‌తో ఇటీవలే అది 40 ఏళ్ల పాటూ ఆ దేశంలో తమ సేనలను నిలిపి ఉంచడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్ఘాన్ ‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల ప్రహసనం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. కర్జాయ్ తదుపరి అధ్యక్షుడైనా అమెరికా మాట వింటాడని దాని ఆశ. తాలిబన్లు ఈ క్రీడను చూస్తూ ఉంటార నే భ్రమ. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ఉగాండాకు ‘రైతు’ గండం
‘ఆఫ్రికా ప్రధాన సమస్య నాయకులే కానీ ప్రజలు కారు’ అని నిస్సంకోచంగా చెప్పినవాడు... ఉగాండా దేశాధినేత యొవేరీ ముసెవెని. ఆ మాటలు నేటివి కావు పాతికేళ్ల క్రితం నాటివి. నేటి ఉగాండా ప్రధాన సమస్యగా మారి మరీ ఆయన తన మాటలను రుజువు చేస్తున్నారు! అలా అని ఇతర ఆఫ్రికా దేశాధినేతల్లాగా ఆయన జాతి సంపదను కొల్లగట్టి కోట్లకు పడగలెత్తినవాడు కాడు. గత 27 ఏళ్లుగా దేశాధినేతగా ఉన్న ఆయన నేటికీ ‘మంచి రైతు.’ రాజధాని కంపాలాలో కంటే తన వ్యవసాయ క్షేత్రంలో, పశువుల మందలతోనే ఎక్కువగా గడుపుతారు. అక్కడి నుంచే చాలా వరకు పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఆ ‘మంచి రైతు’ పాలనే వ్యవసాయంపై ఆధారపడ్డ 90 శాతం ప్రజలను పెద్ద పామై కాటేస్తుండటమే విషాదం. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (89)లాంటి వారి అవినీతి, ఎన్నికల అక్రమాలను గోరంతలు కొండంతలు చేసి గగ్గోలు పెట్టే అమెరికాలాంటి దేశాలకు ముసెవెని నియంతృత్వం కనిపించదు. 2005లో రాజ్యాంగాన్ని సవరించి అధ్యక్ష పదవిని ఎన్నిసార్లయినా చేపట్టడానికి ఆయన దారిని సుగమం చేసుకున్నారు. తాజాగా అధ్యక్ష పదవికి 75 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేశారు. ఉగాండాలోని ఎన్నికల్లో రిగ్గింగు, ప్రత్యర్థుల దేశబహిష్కారం, వారిని మటుమాయం చేయ డం పరిపాటి. ఇవేవీ పాశ్చాత్య దేశాలకు కనడకపోవడానికి తగిన కారణమే ఉంది. 1979లో నరహంతక నియంత ఈదీ అమీన్‌ను కూలదోయడంలోనూ, 1985లో మిల్టన్ ఒబొటె నియంతృత్వాన్ని కూలదోయడంలోనూ ముసెవెనీ కీలక పాత్ర పోషిం చారు. ‘తూర్పు ఆఫ్రికా సింహం’గా 1986లో దేశాధ్యక్షుడైన ఆయన అంతర్గత సైనిక కుమ్ములాటలను, ప్రాంతీయ యుద్ధాలను అధిగమించి సుస్ధిర పాలన నెలకొల్పారు. ఆ పై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వంది మాగధులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉగాండా అనినీతికి, అసమర్థ పాల నకు మారుపేరయింది. అల్బర్ట్, విక్టోరియా సరస్సులేగాక, తెల్ల నైలు ప్రవహించే ఉగాం డా ఒకప్పుడు తూర్పు ఆప్రికాలోని సంపన్న దేశం. దేశమంతటా వర్షాలు కురిసేవి. 90 శాతం ప్రజలకు నేటికీ వ్యవసాయం, పశుపోషణలే ఆధారం. ప్రపంచబ్యాంకు వృద్ధి మార్గం పట్టిన ముసెవెని ప్రభుత్వం సువిశాల పచ్చిక మైదానాలను పాశ్చాత్య దేశాల హరిత ఇంధన అవసరాల కోసం కార్పొరేట్ గుత్త సంస్థల పరం చేస్తోంది. సంచార పశుపాలకులను స్థిర వ్యవసాయం చేపట్టాలని నిర్బంధిస్తోంది. తూర్పు ఆఫ్రికాపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలి తంగా ఉగాండా తరచుగా దుర్భిక్షానికి, వరదలకు గురవుతోంది. అధిక ఉష్ణోగ్రతలకు ఉపరితల జల వనరుల ఇంకిపోతున్నాయి. ‘పచ్చిక బీళ్ల వెంబడి సంచరించే పశుపాలక సంచార జీవితమే ఉగాండాలోని వాతావరణ మార్పులను తట్టుకొని, కరువును, ఆకలి చావులను నివారించడానికి హామీ’ అని ‘ఇం టర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్’ ఘోషిస్తోంది. పైగా ఉగాండా, కెన్యా, ఇథియోపియాలలోని సంప్రదాయక పశుసంపద అత్యాధునికమైన ఆస్ట్రేలియా, అమెరికా పశు క్షేత్రాలకంటే శ్రేష్టమైన మాంసాన్ని, ఎక్కువగా అందిస్తాయని, హెక్టారుకు వచ్చే రాబడి కూడా చాలా ఎక్కువని ఆ సంస్థ రుజువు చేసింది. అయితేనేం, పాశ్చాత్య దేశాల జీవ ఇంధనాల కోసం సంప్రదాయక పశు సంతతి, పశుపాలకులు అంతరించిపోక తప్పదు. పరాధీనమైన ఆధునిక డెయిరీ ఫార్మ్‌ల విస్తరణ రైతు కుటుంబాల, పశుపాలకుల ఆహారపు అలవాట్లపై దుష్ర్పభావం చూపుతోంది. ఉగాండా, కైన్యా, ఇథియోపియాలలో ఆవుల నెత్తురును క్రమబద్ధంగా తీసి, పాలతో కలిసి ‘ఎకాసెల్’ అనే సంప్రదాయక పౌష్టికాహారా న్ని తయారుచేస్తారు. సంప్రదాయక పశుసం పదతోపాటూ ‘ఎకాసెల్’ రుచిని కూడా తూర్పు అఫ్రికా మరిచిపోక తప్పదు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతుల కోసం పరిశోధనలు సాగిస్తున్న పాశ్చా త్య దేశాలే ఇంధన అవసరాల కోసం వాతావరణ మార్పులను తట్టుకునే సంప్రదాయ పశుసంపదను, పశుపోషక జీవనవిధానాన్ని నిర్మూలిస్తున్నాయి. తూర్పు ఆఫ్రికా ప్రజలను కరువు రక్కసి నోట్లోకి నెడుతున్నాయి. అం దుకు సహకరించే ముసెవెని లాంటి నేతలంటే అందుకే వారికి అంత ముద్దు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’
చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాగే అబే కూడా ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. అంతర్జాతీయ వాణిజ్యం చైనా ప్రధాన అస్త్రం. జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. ‘ఒకే పర్వతంపై రెండు పులులు మనలేవు.’ప్రాచీన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల చైనాపై విరుచుకుపడ్డారు. విపరీతంగా పెరిగిపోతున్న జపాన్ రక్షణ వ్యయం పట్ల గత నెల చివర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జపాన్ ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద సైనిక బడ్జెట్గల దేశం. ఈ ఏడాది అది సైనిక దళాలపై 5 వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయనుంది. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో (జీడీపీ) 10 శాతాన్ని సైన్యంపై ఖర్చు చేస్తుండగా, తాము 3 శాతాన్నే ఖర్చు చేస్తున్నామని అబే అక్కసు. ప్రపంచంలోని మూడవ అతి పెద్ద దేశమైన చైనాతో 65వ స్థానంలో ఉన్న జపాన్ రక్షణ వ్యయాన్ని పోల్చడం అర్థరహితం. చైనా గత కొన్నేళ్లుగా 10 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుండగా, జపాన్ ఈ ఏడాదే వృద్ధి బాట పట్టింది. ప్రపంచంలోని రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని చైనా నుంచి తిరిగి దక్కించుకోగలమని అబే విశ్వాసం! అందుకే అబే ‘ఆసియా పర్వతంపై’ చైనా స్వేచ్ఛా విహారాన్ని సహించలేకుండా ఉన్నారు. ఆయన తరచుగా జపాన్ ‘గత వైభవాన్ని’ గుర్తుచేసుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఇతర దేశాలపై సాగించిన దురాక్రమణ యుద్ధాలకు ఒకప్పటి ప్రధాని తమీచి మురయామా క్షమాపణలు చెప్పడాన్ని సమర్థించడం లేదని అబే సెలవిచ్చారు. అసలు ‘దురాక్రమణ’ అంటేనే ఎవరూ ఇదమిత్థంగా నిర్వచించలేదని వాదించారు. ‘వివిధ దేశాల మధ్య ఘటనలు మనం ఎక్కడ నిలబడి చూస్తున్నాం అనే దాన్ని బట్టి విభిన్నంగా కనిపిస్తాయి’ అని అన్నారు. 1910 నుంచి 1945 వరకు జపాన్ కొరియాను దురాక్రమించి, అత్యంత పాశవిక అణచివేత సాగించింది. 1931-37 మధ్య అది చైనాలోని సువిశాల భాగాన్ని ఆక్రమించింది. ఒక్క నాంకింగ్లోనే రెండు లక్షల మంది చైనీయులను ఊచకోత కోసింది. 1941లో పెరల్ హార్బర్ (అమెరికా) దాడితో ప్రారంభించి థాయ్‌లాండ్, మలయా, బోర్నియా, బర్మా, ఫిలిప్పీన్స్‌లపై దండెత్తింది. ఆసియా దేశాల మహిళలను సైన్యపు లైంగిక బానిసలుగా దిగజార్చిన హేయ చరిత్ర నాటి జపాన్‌ది. జీవ, రసాయనిక ఆయుధాల తయారీ కోసం అది ‘యూనిట్ 731’ను ఏర్పాటు చేసింది. కొరియా, చైనా, రష్యా తదితర దేశాలకు చెందిన లక్షలాది మందిని ‘ప్రయోగాల’ కోసం హతమార్చింది. అబే ఆ స్థానం నుంచి ‘గత వైభవాన్ని’ చూస్తున్నారు. ఈ ఏడాది ‘731 యూనిట్’ సంస్మరణ సభకు హాజరై ‘731’ అని ప్రముఖంగా రాసి ఉన్న యుద్ధ విమానం కాక్‌పిట్‌లో ఎక్కి మరీ ఫొటోలు దిగారు! ‘అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి బెదిరింపులను లేదా బలప్రయోగాన్ని జపాన్ శాశ్వతంగా తిరస్కరిస్తుంది’ అనే రాజ్యాంగంలోని నిబంధనకు తిలోదకాలివ్వడానికి ‘దేశ రక్షణకు చట్టపరమైన ప్రాతిపదిక పునర్నిర్మాణ సలహా మండలిని’ అబే నియమించారు. జపాన్ ‘రక్షణకు’ ఇప్పటికే ఐదు లక్షల సేనలతో త్రివిధ దళాలున్నాయి. ఆత్యాధునిక క్షిపణులు తప్ప సకల సాయుధ సంపత్తి ఉంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులపై ఫిలి ప్పీన్స్, వియత్నాం వంటి దేశాలకు చైనాకు మధ్య వివాదాలు రగులుతున్నాయి. జపాన్ ఇదే అదనుగా ఒకప్పటి తన వలసవాద అవశేషమైన సెనెకాకు దీవులను ‘జాతీయం’ చేసి చైనాతో కయ్యానికి కాలుదువ్వింది. ఆ సాకుతో చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. తనలాగే అమెరికా సైనిక స్థావరాలున్న దేశమైన ఫిలిప్పీన్స్‌తో జపాన్ చేయి కలిపింది. భారత్‌తో సైనిక సహకారానికి ఉవ్విళ్లూరుతోంది. అణు వ్యాపా ర భాగస్వామ్యంతో భారత్‌ను అమెరికా, జపాన్ల చైనా వ్యతిరేక వ్యూహంలో భాగస్వామిని చేయాలని అశిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలాగే అబే కూడా వర్తమాన ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. చైనా ‘శాంతియుతంగా’ ఆధిపత్యపోరు సాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం దాని ప్రధాన అస్త్రం. ప్రపంచ వాణిజ్యం లో చైనాదే అగ్రస్థానం. జపాన్ విదేశీ వాణిజ్యంలో సైతం అమెరికా తర్వాత ద్వితీయ స్థానం చైనాదే. ఏటా ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ 30,000 కోట్ల డాలర్లు! జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. గత వారం ఇండోనేసియాలోని బాలీలో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో (ఎపెక్) చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ కేంద్ర బిందువుగా నిలవడం అదే సూచిస్తోంది. చైనాను చూసి కాకపోయినా జర్మనీని చూసైనా అబే ‘శాంతియు తం’గా ఆర్థిక ప్రాభవం కోసం ప్రయత్నించడం ఉత్తమం. - పిళ్లా వెంకటేశ్వరరావు -
‘కోలా రాజ్’ ఏక పార్టీ పాలన
ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి కంబోడియా రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ప్రధాని హున్ సెన్, ప్రతిపక్ష నేత శామ్ రైన్సీల మధ్య చర్చల వల్ల రాజకీయ ప్రతిష్టంభన తొలగినా, తొలగకపోయినా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు. కపాలాల గుట్టల ఫొటోలతో ఒకప్పుడు మొదటి పేజీ వార్తగా ‘కళకళలాడిన’ కంబోడియా ఇప్పుడు ఎవరికీ పట్టని దేశం. అయినా ఈ మధ్య దానికి ప్రపంచ వార్తల్లో కాస్త చోటు దక్కింది. ఆగ్నేయ ఆసియాలోని ఆ నిరుపేద దేశంలో జూలై చివర్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని హున్ సెన్ మరోమారు ఎన్నిక కావడంలో విశేషమేమీ లేదు. క మ్యూనిస్టు ఖ్మేర్ రూజ్ రక్తసిక్త పాలనస్థానే వియత్నాం సైన్యం నిలిపిన (1985) ‘సోషలిస్టు’ ప్రభుత్వానికి ఆయన ప్రధాని. నాటి నుంచి ఆయనే ఆ దేశానికి తిరుగులేని రాజు. లాంఛనప్రాయపు దేశాధినేత రాజు నరోదమ్ సిహమొని సెప్టెంబర్ 23న హున్ చేత మరోమారు ప్రమాణ స్వీకారం చేయించేసరికి... కంబోడియా హఠాత్తుగా ఏకపార్టీ ప్రజాస్వామ్యంగా మారిపోయింది. పార్లమెంటులో ఉన్నవారంతా హున్ నేతృత్వంలోని కంబోడియన్ పీపుల్స్ పార్టీ (సీపీపీ) సభ్యులే! 1993లో మొదటిసారి జరిగిన ఎన్నికల నుంచి ప్రధాన ప్రతిపక్షమైన కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ (సీఎన్‌ఆర్‌పీ) అస్తిత్వం పార్లమెంటులో నామమాత్రమే. ఈసారి ఎన్నికల్లో అది అందరి అంచనాలను మించి, 123 సీట్ల పార్లమెంటులో 55 స్థానాలను గెలుచుకొని హున్‌ను ఖంగు తినిపించింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మీడియా ఎలుగెత్తింది. ఇరాన్‌లాంటి దేశాల్లో సంతృప్తికరంగా జరిగిన ఎన్నికలను సైతం అక్రమమని నానా అల్లరి చేసే పాశ్చాత్య దేశాల కళ్లకు కంబోడియా ఎన్నికలు ‘స్వేచ్ఛగా, సక్రమంగా’ జరిగినట్టే కనిపించాయి. ఎన్నికల అక్రమాలు అక్కడ అలవాటే. కాకపోతే ఈసారి అవి శృతిమించాయి. దీంతో సీఎన్ఆర్పీయే గాక, రాజు సిహమొని సైతం నిరసనకు దిగాల్సివచ్చింది. హున్ తమ గెలువును దౌర్జన్యంగా తస్కరించాడని నమ్ముతున్న సీఎన్‌ఆర్‌పీ ససేమిరా పార్లమెంటుకు హాజరుకానని భీష్మించుకు కూచుంది. దీంతో హున్ సొంత పార్టీ సభ్యులతోనే పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే గుడ్డిలో మెల్ల అన్నట్టున్న కంబోడియా ప్రజాస్వామ్యం పూర్తి గుడ్డిది అయ్యే ప్రమాదం ఉంది. మరో ఐదేళ్ల వరకు తమకు ఎదురులేకున్నా 2018 ఎన్నికల్లో ఓటమి తప్పదని హున్‌కు బెంగ. చేతికి అంది నోటికి కాకుండా పోయిన గెలుపు ఇక ఎన్నటికీ తమ మొఖం చూడదని సీఎన్ఆర్పీకి బెంగ. రెండు పార్టీల బెంగలకు కారణం ఒక్కటే... చెరకు! ఒకటిన్నర కోట్ల కంబోడియన్లలో అత్యధికులకు జీవనోపాధి వ్యవసాయమే. అత్యంత సారవంతమైన వరి పండించే భూములను, నీటి వనరులను గత కొన్నేళ్లుగా ‘చెరకు’ కబళించేస్తోంది. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు వారు సాగు చేస్తున్న భూములు వారివి కావని ప్లాంటేషన్ కంపెనీలు ‘కనువిప్పు’ కలిగిస్తున్నాయి. ఒకప్పుడు ఖ్మేర్ రూజ్ కమ్యూనిస్టులు పాత భూముల రికార్డులను తగులబెట్టేశారు. రైతులకు యాజమాన్య ధృవీకరణ పత్రాలు లేవు. దీంతో చెరకు ప్లాంటేషన్ల ఆక్రమణ నిరాఘాటంగా సాగుతోంది. అంతర్జాతీయ విపణిలో గత కొన్నేళ్లుగా చక్కెర ధరలు బాగా పెరిగాయి. 2020 నాటికి చెరకు డిమాండు 25 శాతానికి పైగానే పెరుగుతుందని అంచనా. బయో ఇంధనం మిథేన్‌గా కూడా చెరకు ప్రాధాన్యం పెరగుతోంది. దీంతో పాశ్చాత్య గుత్త సంస్థలు ఆగ్నేయ ఆసియాపై కన్నేశాయి. కంబోడియా, వియత్నాం, మైన్మార్, థాయ్‌లాండ్‌లలో గుత్తసంస్థల చెరకు ప్లాంటేషన్లు విస్తరిస్తున్నాయి. కంబోడియాలోలాగే అన్ని చోట్లా తరతమ స్థాయిల్లో రైతుల భూములను ప్లాంటేషన్లు మింగేస్తున్నాయి. కంబోడియా రైతుల నోళ్లల్లో మన్నుకొట్టి పండిస్తున్న చెరకు థాయ్‌ల్యాండ్‌లో చక్కెరగా మారి, యూరప్‌కు చేరుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర కొనుగోలుదార్లయిన ‘పెప్సీ కోలా’, ‘కోకో కోలా’ కంపెనీల చక్కెర దాహాన్ని తీర్చడానికి రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారమే 2010 నాటికి కంబోడియాలోని 61 పెద్ద ప్లాంటేషన్లకు లక్ష హెక్టార్ల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఫలితంగా దాదాపు 7 లక్షల కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయి. నేతల, అధికారుల అండదండలతో విస్తరిస్తున్న చిన్న ప్లాంటేషన్లకు లెక్క లేదు. ప్రసుత్తం మధ్య కంబోడియాలోని కోమ్పాంగ్ స్ప్యూ రాష్ట్రంలోని పది గ్రామాల్లో చెరకు ప్లాంటేషన్ల వల్ల వీధినపడ్డ వెయ్యి కుటుంబాలు తమ భూముల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఈ రైతాంగ అసంతృప్తే ఎన్నికల్లో ప్రతిఫలించింది. అందుకే భవిష్యత్తుపట్ల రెండు ప్రధాన పార్టీలకు బెంగ. రైతుల వద్ద భూ యాజమాన్యాన్ని రుజువుచే సే పత్రాలు లేవని, కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఎలాంటి చర్యలు తేసుకోలేమని ప్రభుత్వం సెలవిస్తోంది. ప్లాంటేషన్లకు భూములపై 99 ఏళ్ల హక్కులను దఖలు పరుస్తున్న ప్రభుత్వం ఏక పంటగా చెరకును దశాబ్దాలపాటు సాగుచేయడానికి అంగీకరిస్తోంది. భూసారం నశించిపోవడంతోపాటూ ఇది పర్యావరణానికి తీవ్ర హానిని చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2005 నుంచి విదేశాల్లో ప్రవాసంలో ఉండి దేశానికి తిరిగి వచ్చిన సీఎన్‌ఆర్‌పీ నేత శామ్ రైన్సీ సైతం ఈ ‘అభివృద్ధి’కి అనుకూలురే. కాబట్టి సీఎన్‌ఆర్‌పీ, సీపీపీల మధ్య అధికార పంపకం చర్చలు ఫలించినా ఫలించకున్నా కంబోడియాలో కొలారాజ్‌కు ఢోకా లేదు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
కటకటాల కథకు వెనుక...
బో కథలోని చాలా చిక్కు ప్రశ్నలకు బీజింగ్‌లోని విలాసవంతమైన ఒక భవనం సమాధానాలను చెబుతుంది. అది పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ది. ముచ్చటపడి బో దాన్ని జియాంగ్‌కు కట్టించి ఇచ్చాడు! అంత డబ్బు బోకి ఎక్కడిదని అడగటం అమాయకత్వం. భావి చైనా అధినేతగా 2011 చివరి వరకు ఒక్క వెలుగు వెలిగి గత ఏడాదే మలిగిపోయిన బో క్సిలాయ్ ‘కథ’ ఎట్టకేలకు ముగిసింది. బో ‘తలరాత’ మారడానికి ముందు ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) అత్యున్నత నాయకత్వ సంస్థ పొలిట్ బ్యూరోలో కీలక నేత. గత నెల 22న వెలువడ్డ కోర్టు ‘తీర్పు’ ఆయనకు జీవిత ఖైదును విధించింది. ఆ సందర్భంగా బో అన్నట్టు... తీర్పు వాస్తవాలపై ఆధారపడినదీ కాదు, విచారణ సజావుగా, న్యాయంగా జరిగిందీ కాదు. అలా అని బో అవినీతి మకిలి అంటని పవిత్రుడూ కాడు. అవినీతికి పాల్పడ్డ నేతలను జైళ్లకు పంపేట్టయితే కొత్త జైళ్లను కట్టాల్సివస్తుంది. చైన్ లింగ్యూ అనే ఓ ఛోటా నేత ఆ మధ్య 40 కోట్ల డాలర్ల షాంఘై పెన్షన్ నిధులను కైంకర్యం చేసి పట్టుబడ్డారు. భావి చైనా అధినేత హోదా వెలగబెట్టిన బో ఇంకెంత భారీ మొత్తం దిగమింగి ఉండాలి? 44 లక్షల డాలర్లు! ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిం చిన అంతర్జాతీయ హత్య, గూఢచర్యం, అమెరికాలో ఆశ్ర యం కోసం ప్రయత్నం, పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకోడానికి కుట్ర, మరో సాంస్కృతిక విప్లవం, వగైరా హాటు హాటు ఘాటు సీరియల్ కేసు కాస్తా అవినీతి కేసుగా ‘తేలిపోయింది.’ బో అవినీతి కేసు అవినీతి కేసు కానే కాదు. చైనా నేతల అవినీతి అతి పదిలంగా ఉంది. బ్రిటన్ ఎమ్16 గూఢచారి సంస్థతో సంబంధాలున్నాయని అందరికీ తెలి సిన నీల్ హేవుడ్తో బో కుటుంబానికి సంబంధాలుఉండేవి. బ్రిటన్ జాతీయుడైన అతడ్ని బో భార్య గు కాయ్లాయ్ హత్య చేయలేదనేది బహిరంగ రహస్యం. హేవుడ్ హత్యానేరంపై గత అక్టోబర్‌లో ఆమెకు మరణశిక్ష పడింది. ఆ శిక్ష ఇంకా అమలుకాలేదు, కాదు. న్యూయార్క్‌లో చదువుతున్న కొడుకు గువాగువా జోలికి పోకుండా వదిలేస్తే, బుద్దిగా పార్టీ నూతన నేతలు చెప్పినట్లు నోరు కుట్టేసుకోడానికి గు ఒప్పందం కుదుర్చుకుంది. 2007లో చనిపోయిన తండ్రి బో యావో ప్రభావంతోనే బో క్సిలాయ్ రాజకీయ హత్యలు, గూఢచర్యం, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని అప్పట్లో పార్టీ నేతలు బాకాలూదారు. డెంగ్ హయాంలోని ‘చిరస్మరణీయమైన ఎనిమిది మంది నేతల’లో యావో ఒకడు! మావో సాంస్కృతిక విప్లవ కాలంలో అతడు జైలు పాలయ్యాడు. ఆ యావో ప్రోత్సాహంతోనే బో తాను కార్యదర్శిగా ఉన్న క్సింజియాంగ్‌లో మావోయిజాన్ని, సాంస్కృతిక విప్లవాన్ని పునరుద్ధరించ యత్నించాడని ప్రచారం సాగింది! గత ఏడాది నవంబర్‌లో లాంఛనంగా పార్టీ 18వ కాంగ్రెస్ జరిగేలోగానే నూతన నాయకత్వ ప్రకటన జరిగింది. ఆ తదుపరి బో పై సంధిస్తున్న ఆరోపణల అస్త్రాలన్నీ ఆగిపోయాయి. బో అవినీతికి పాల్పడి, నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణపైనే విచారణ తతంగం సాగింది. బో కథలోని చాలా చిక్కు ప్రశ్నలకు బీజింగ్‌లోని ఒక విలాసవంతమైన భవనం సమాధానాలను చెబుతుంది. అది పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ది. ముచ్చటపడి బో దాన్ని జియాంగ్‌కు కట్టించి ఇచ్చాడు! అంత డబ్బు బోకి ఎక్కడిదని అడగటం అమాయకత్వం. జియాంగ్‌తో పాటూ, మాజీ ప్రధాని వెన్ జియావో బావోకు కూడా బో అనుయాయి. వారి అండతోనే అతడు ఒక్కొక్క మెట్టే ఎక్కి పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ వాకిట నిలిచాడు. అక్కడ నుంచి కథ అడ్డం తిరిగింది. బోకి పార్టీలో ప్రధాన ప్రత్యర్థి, నేటి అధ్యక్షుడు క్సీ జింగ్పింగ్ తెలివిగా పావులు కదిపి, జియాంగ్, వెన్లను ప్రసన్నం చేసుకున్నాడు. అయినా బోలాంటి గట్టి పిండాన్ని వదుల్చుకోడం తేలికేం కాదు. క్సీకి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. బో కుడి భుజం వాంగ్ లిజున్ ఆశ్రయం కోసం అమెరికా కాన్సలేట్‌ను ఆశ్రయించి సంచలనం రేపాడు. చాంగ్కిగ్యాంగ్ పోలీస్ బాస్ అయిన వాంగ్ ప్రత్యర్థులను గుట్టుగా హతమార్చడంలో సిద్ధహస్తుడు. వాంగ్లాంటి పోలీసు బాసులను వాడుకొని, తర్వాత వారిని బలి పశువులను చేయడం చైనా అగ్రనేతలకు అలవాటే. వాంగ్ మిగతావారికంటే రెండాకులు ఎక్కువే చదివాడు, దీపం ఉండగానే అమెరికాకు పారిపోవాలని ప్రయత్నించాడు. హేవుడ్ అసలు హంతకుడైన వాంగ్‌కు అవినీతి ఆరోపణలపై 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఓ రెండేళ్లు గడిచేసరికే వాంగ్ ‘సత్ప్రవర్తన’కు మెచ్చి విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. వాంగ్‌ను తురుపు ముక్కగా వాడి క్సి, బో ఆట కట్టించాడు. పనిలో పనిగా పార్టీలోని మరో ప్రత్యర్థి జౌ యాంగ్ కాంగ్‌ను పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలోకి రాకుండా చేశాడు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశానికి కొద్ది మంది నేతృత్వమే సమర్థవంతమైనదని సూత్రీకరించారు. పీబీ స్టాండింగ్ కమిటీని ఏడుగురికి కుదించి జౌను సాధారణ పీబీ సభ్యునిగా మిగిల్చారు. 2022 వరకు పార్టీలో క్సీకి తిరుగు లేదు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
యూరప్ మహా సామ్రాజ్ఞి!
మర్కెల్‌కు ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ మీద గానీ, యూరోపియన్ సంయుక్త రాష్ట్రాలనే పగటి కల మీద గానీ ఎలాంటి భ్రమలూ లేవు. జర్మనీ, జర్మనీ ప్రయోజనాలు మాత్రమే ఆమెకు సత్యం. జరగరానిది జరగక తప్పదని తెలిసి కూడా జరగరాదని ఆఖరు వరకు ఎదురు చూడటం, ఆపై నిరాశతో నిట్టూర్చడం మానవ నైజం. సెప్టెంబర్ 22న అదే జరిగింది. ‘ప్రతి ఒక్కరూ ద్వేషించాలని కోరుకునే మహిళ’ (‘టైం’ పత్రిక) వరుసగా మూడో మారు జర్మనీకి ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. జర్మన్లు ఏంజెలా మర్కెల్‌కు ఘనంగా పట్టంగట్టారు. కానీ, జర్మనీ మినహా యూరప్ అంతటా విచారపడ్డవారే ఎక్కువ. మర్కెల్‌ను ‘యూరో నియంత’, ‘అభినవ హిట్లర్’ అని తిట్టిపోసేవారికి కొదవలేదు. యూరో సంక్షోభానికి విరుగుడుగా మర్కెల్ అమలు చేయిస్తున్న కఠోరమైన ప్రభుత్వ పొదుపు చర్యల ధాటికి సామాన్యులే కాదు యూరో అధినాయక ‘త్రయం’-యూరోపియన్ కమిషన్ (ఈసీ). యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం ఆమె అంటేనే హడలెత్తిపోతున్నాయి. ‘పొదుపుల’ భారం పెరిగే కొద్దీ నిరుద్యోగం పెరగుతుందని, కొనుగోలుశక్తి పడిపోయి సంక్షోభం మరింత విషమిస్తుందని, కాబట్టి ఇప్పటికైనా కాస్త పొదుపు చర్యల్లో ‘మెతకదనం’ చూపాలని ‘త్రయం’ సైతం భావి స్తోంది. అందుకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మర్కె ల్ మితవాద కూటమికి పూర్తి ఆధిక్యతను కట్టబెడతాయన్న తొలి అంచాలను చూసి ఈయూఈసీ అధ్యక్షుడు గుంతర్ ఓటింగర్ ‘బాప్రే బాప్!’ అంటూ గుడ్లు తేలేశారు. కానీ, మర్కెల్ పూర్తి ఆధిక్యతకు ఐదు సీట్ల దూరంలో నిలిచిపోయారు. సోషల్ డెమోక్రాట్లతో, గ్రీన్ పార్టీతో కలిసి మర్కెల్ ‘మహా కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సి రావటం యూరప్‌కు శుభ సూచకమంటూ ఈయూ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ ‘త్రయం’ అభిమ తాన్ని వెల్లడించారు. మర్కెల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తలపడ్డ ఎస్పీడీ 2005లో మర్కెల్తో ‘మహా కూటమి’ ప్రభుత్వం నిర్మించిన ఫలితంగా... 2009 కంటే ఘోరపరాజయం పాలైంది. అయినా మర్కెల్తో మళ్లీ సంకీర్ణానికి వెనుకాడకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికలు నిజానికి మర్కెల్ ఈయూ విధానంపై జనాభిప్రాయ సేకరణలాంటివి. ఎస్పీడీయే కాదు, గ్రీన్ పార్టీ సైతం మర్కెల్ ఈయూ విధానాన్ని సమర్థిస్తున్నవే. ఇతర ఈయూ దేశాలకు సం క్షోభ పరిష్కారంగా మర్కెల్ ఏమి శాసిస్తున్నారో వాటికి విరుద్ధమైన విధానాలను దేశంలో అవలంబిస్తున్నారు. 2007 సంక్షోభం మొదలైన వెంటనే ఆమె పొదుపర్లకు ఎలాంటి ముప్పు లేదని అభయహస్తం ఇచ్చారు. సైప్రస్‌లో అందుకు విరుద్ధంగా పొదుపర్ల డిపాజిట్లకు కత్తెర వేయించారు. ప్రభుత్వ వ్యయాల కోతలను శాసిస్తున్న మర్కెల్ 150 కోట్ల యూరోలను ఒక్క కార్ల పరిశ్రమకు ‘తుక్కు బోనస్’గా ఇచ్చారు. తద్వారా 5 లక్షలకు పైగా పాత కార్లను తుక్కు చేయించారు. ఆరు లక్షల కొత్త కార్లను ఒక్కొక్కదానికి 2,500 యూరోల సబ్సిడీని ప్రకటించి మరీ అమ్మించారు! సంక్షోభంలో కూడా జర్మనీది ఆర్థికంగా తిరుగులేని స్థానం. మిగతా యూరో జోన్ దేశాల ఎగుమతులన్నీ కలిసి జర్మనీ ఎగుమతుల్లో 42 శాతం మాత్రమే. భారీ ఎత్తున ఇతర యూరోపియన్ దేశాలతో వాణిజ్య మిగులు, భారీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నా మర్కెల్ యూరో సంక్షోభం పరిష్కారానికి పైసా పైసా లెక్కబెట్టి మరీ దులపరిస్తా రు. యూరో సంక్షోభానికి పరిష్కారంగా చెబుతున్న యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజంకు (యూరో శాశ్వత బెయిలవుట్ నిధి) జర్మనీ 27 శాతం నిధులను సమకూరుస్తోంది. కానీ జనాభాను లెక్కలోకి తీసుకొని చూస్తే అది చాలా తక్కువ. ఎనిమిది కోట్లకు పైగా జనా భా ఉన్న యూరప్‌లోని అత్యంత బలమైన దేశం జర్మనీ పౌరులు తలసరిన 265 యూరోలను ఈఎస్ఎమ్ నిధికి చెల్లిస్తుంటే, 53 లక్షల జనాభా ఉన్న లగ్జెంబర్గ తలసరిన 373 యూ రోలను చెల్లిస్తోంది. యూరో జోన్లో ఇస్తోనియా ఒక్కటే జర్మనీకన్నా తక్కువగా చెల్లిస్తున్నది. మర్కెల్‌కు ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ మీద గానీ, యూరోపియన్ సంయుక్త రాష్ట్రాలనే పగటి కల మీదగానీ ఎలాంటి భ్రమలూ లేవు. ఆమెకు జర్మనీ, జర్మనీ ప్రయోజనాలు మాత్రమే సత్యం. అలా అని ఆమె ‘నియంతలా’ ఏ నిర్ణయాన్ని ఇతరులపై రుద్దరు. కాకపోతే, ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిని సృష్టించి ఏది కావాలో మీరే ‘ఎంచుకోమంటారు.’ గ్రీస్ విషయంలో ఆమె చేసిం దదే. గ్రీస్‌కు యూరో బహిష్కారమా? కఠోరమైన పొదుపు చర్యలతో బెయిలవుటా? తేల్చుకోమన్నారు. రెండోది ఎంచుకోకపోతే... ఆమె చెప్పకపోయినా జరిగేది అందరికీ తెలి సిందే. జర్మనీ యూరోకు గుడ్‌బై చేప్పేయటం. కాబట్టే గత మూడు నెలలుగా ‘త్రయం’ చేతులు ముడుచుకొని జర్మనీ ఎన్నికల కోసం వేచి చూస్తోంది. యూరో అధినాయక త్రయం సహా అంతా మర్కెల్ ఏర్పరచబోయో సంకీర్ణ ప్రభుత్వం కారణంగా ఆమె కాస్త ‘మెత్తబడతారని’ ఆశిస్తున్నారు. అదేమోగానీ ‘నుయ్యో గొయ్యో’ తేల్చుకోవాల్సింది సోషల్ డెమోక్రాట్లే. మర్కెల్‌ను వ్యతిరేకించి ఎన్నికలకు వెళి తే మర్కెల్‌కు తిరుగులేని ఆధిక్యత ఖాయం. కాబట్టి మర్కెల్ జర్మనీకి ఏది మేలనుకుంటే ఆదే చేస్తారు. అంతా మర్కెల్ చేతుల్లోనే ఉం ది. నేటి యూరప్‌కు మర్కెల్ ఒక శాపం... ఉన్న ఒకే ఒక్క ఆశ! - పిళ్లా వెంకటేశ్వరరావు -
కనుమరుగవుతున్న కాశ్మీర్ శాలువ!
సుతిమెత్తగా, అతి పలుచగా, ఎంతటి చలినైనా తట్టుకోవడంలో కాశ్మీర్ శాలువాలకు ఎదురులేదు. వాటి తయారీకి లడఖ్ పాశ్మినా మేకల ఉన్ని కావాలి. వాతావరణ మార్పుల వల్ల అవి అంతరించిపోతున్నాయి. ప్రభుత్వం తీరు చూస్తే పరిస్థితి విషమించాక పాశ్మినా మేకను అంతరించిపోతున్న జాతిగా ప్రకటించి, అధికారికంగా కాశ్మీర్ శాలువాకు చరమగీతం పాడేట్టుంది. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ ముచ్చటపడి తన ముద్దుల భార్య జోసెఫిన్‌కు ఇచ్చిన కానుక... కాశ్మీర్ శాలువా! నేడు ప్రపంచవ్యాప్తంగా అంతస్తుకు, హోదాకు, విలాసానికి అది గుర్తు. సుతిమెత్తగా, అతి పలుచగా, ఎంతటి చలినైనా తట్టుకోవడంలో దానికి ఎదురు లేనేలేదు. పంజాబు తదితర రాష్ట్రాల్లో తయారవుతున్న నకిలీలు ఎన్నున్నా అవేవీ అసలు సిసలైన కాశ్మీర్ శాలువాకు సరిరావు. ఏమైతేనేం, కాశ్మీర్ శాలువా ఒకటి, రెండు తరాలు గడిచే సరికి చరిత్రగా మారిపోయే ప్రమాదం ఉంది. అసలు సిసలైన కాశ్మీర్ శాలువా తయారీకి పాశ్మినా మేకల ఉన్ని కావాలి. ఆ మేకలు జమ్మూకాశ్మీర్ లడఖ్ ప్రాంతానివే కావాలి. అవి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తున ఉండే చాంగ్తాంగ్ పర్వతాలపై, మైనస్ 35 డిగ్రీల అతి శీతల వాతావరణంలో బతికే మేకలు. అందుకే దూది పింజకంటే తేలికగా ఉన్నా, చలిని ఆపడంలో ఆ ఉన్నికి ధీటైంది లేదు. టిబెట్, నేపాల్, మంగోలియాలలో కూడా పాశ్మినా మేకలు లేకపోలేదు. కానీ వాటి ఉన్ని లడఖ్ పాశ్మినా ఉన్నికి సరిపోలదు. ఇక్కడి ఉన్ని దారం మందం 9-11 మైక్రాన్లుంటే, ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉన్ని దారం మందం 12-16 మైక్రాన్లుంటుంది (మైక్రాన్ అంటే మిల్లీ మీట రులో వెయ్యోవంతు). అందుకే పాశ్మినా ఉన్నిని యంత్రాలతో నేయడం అసాధ్యం. ఆ ఉన్నికి కాశ్మీర్ లోయలోని పాశ్మినా నేత పనివారి నైపుణ్యం, అద్భుతమైన చేతి అల్లిక పని తోడైతే దానికి ఎదురేలేదు. అతి మృదువుగా, పలుచగా, నాజూగ్గా, కళాత్మకత ఉట్టిపడేలా ఉండే పాశ్మినా ధర లండన్, న్యూయార్క్ లాంటి నగరాలలో రూ.5,00,000 వరకు పలుకుతుంది. చాంగ్తాంగ్లోని చాంగ్పా సంచార తెగ ఈ మేకల పెంపకంపైనే ఆధారపడి బతుకుతుంది. వాతావరణ మార్పుల దుష్ఫలితాలకు చాంగ్పాల జీవిత విధానంతోపాటూ వారి మేకల ఉనికి కూడా నేడు ప్రమాదంలో పడింది. ఆ ప్రాంతంలో శీతాకాలంలో 5 సెంటీమీటర్ల మంచు కురుస్తుంటుంది. అలాంటిది ఈ ఏడాది 121 సెంటీ మీటర్ల మంచు కురిసింది. గడ్డిపరకలు, చెట్టూచేమా మంచుతో కప్పబడిపోయాయి. మేత కరువై, చలికి గడ్డకట్టుకుపోయి 27,000 మేకలు (13 శాతం) చనిపోయాయి. దీంతో 17 శాతం చాంగ్పా కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వలస పోవాల్సివచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా ఆప్రాంతంలో ఉన్న 2 లక్షలకు పైగా పాశ్మినా మేకలు కూడా అంతరించిపోక తప్పదని, కాశ్మీరీ శాలువాను మరచిపోవాల్సి వస్తుందని లడఖ్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధిపతి రిగ్జెన్ స్పాల్బార్ అన్నారు. ఇది చాంగ్పాల మనుగడ సమస్య మాత్రమే కాదు, కాశ్మీర్ లోయలో పాశ్మినా ఉన్ని నేత పనిపై ఆధారపడ్డ 3 లక్షల వృత్తి కుటుంబాల జీవన్మరణ సమస్య కూడా. ఐదుగురు పిల్లల కుటుంబానికి ఆధారంగా ఉన్న మొనీషా అహ్మద్ (45) నేడు పాశ్మినా వడకే వృత్తిని వదులుకోక తప్పలేదు. పాశ్మినాతో నెలకు రూ.10,000 వరకు ఆదాయాన్ని కళ్ల జూసిన ఆమె సాధారణ ఉన్నిని వడుకుతూ నెలకు రూ.3,000 కంటే తక్కువతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. పాశ్మినా ఊలు దారంతో బట్టను నేసే చేనేత పనివాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏటా కాశ్మీర్లో 60 వేల పాశ్మినా శాలువాలు తయారవుతున్నాయని, వాటి ఎగుమతుల ద్వారా 16 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యం (2011-12) లభిస్తోందని అధికారిక సమాచారం. అయితే కాశ్మీర్ లేదా పాశ్మినా శాలువాపై పేటెంటు హక్కుల పట్ల ప్రభుత్వ ఉదాసీనత ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యంత్రాలపై భారీ ఎత్తున ‘కాశ్మీర్’, ‘కాశ్మీర్ పాశ్మినా’ శాలువాలు తయారవుతున్నాయి. ప్రభుత్వం తీరు చూస్తే పరిస్థితి మరింత విషమించాక పాశ్మినా మేకను అంతరించిపోతున్న జంతు జాతిగా ప్రకటించి, అధికారికంగా కాశ్మీర్ శాలువాకు చరమగీతం పాడేట్టుంది. కాశ్మీర్ శాలువా గత వైభవ ఘనకీర్తిగా మిగిలిపోవాల్సిందేనా? - పిళ్లా వెంకటేశ్వరరావు -
అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు
విశ్లేషణ: ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహజ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి. వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రాలకు, ప్రజాస్వామ్యానికి మారు పేరు గా చెప్పుకునే అమెరికాకు స్వదేశంలోనూ, పరదేశాల్లోనూ పౌరు ల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే దీర్ఘకాలిక వ్యాధి ఉన్నదని రచ్చకెక్కించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటీవలి వార్తల్లోని వ్యక్తి. స్నోడెన్ వెల్లడించిన, వెల్లడించనున్న రహస్యాలపై పుంఖానుపుంఖాలుగా కథనాలను వెలువరించిన మీడియా ఒక కీలక అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. స్నోడెన్‌కు ఆశ్రయం కల్పించడానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు నెలరోజులు ఎందుకు పట్టింది? అమెరికాతో సంబంధాలు బెడుస్తాయన్న భయం అందుకు కారణం కానేకాదు. అవి ఇప్పటికంటే మెరుగుపడే ఆశా లేదు, దిగజారే అవకాశమూ లేదు. జూలై ఒకటిన మాస్కోలో రష్యా నేతృత్వంలోని ‘గ్యాస్ ఎగుమతి దేశాల వేదిక’ (జీయీసీఎఫ్) వార్షిక సమావేశాలు మొదలయ్యాయి. మూడేళ్లక్రితం అమెరికా తనకు చేసిన అవమానానికి స్నోడెన్ ఆశ్రయం రూపంలో బదులు తీర్చుకోవడానికి అదే రోజు పుతిన్‌కు సరైన ‘ముహూర్తం’ కుదిరింది. అందుకే నెల రోజులు స్నోడెన్ మాస్కో విమానాశ్రయంలో పడిగాపులు పడాల్సివచ్చింది. 2010 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ షేల్ గ్యాస్ ఇనిషియేటివ్ (జీఎస్జీయీ)ని ప్రారంభించి భారత్, చైనాలతో సహా నలభైకి పైగా దేశాలను ఆహ్వానించారు. ‘నిరపాయకరమైన’, లాభదాయకమైన పద్ధతుల్లో షేల్ గ్యాస్ వెలికితీత పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకునే ‘సహకారానికి’ నాంది పలికారు. భారీ షేల్ నిల్వలున్న రష్యాను మాత్రమే మినహాయించారు. పుతిన్ కూడా జీయీసీఎఫ్ అంతర్జాతీయ సమావేశం జరుగుతుండగా స్నోడెన్‌కు ఆశ్రయాన్ని ప్రకటించి బదులు తీర్చుకున్నారు. సహజవాయు నిక్షేపాలపై ‘భల్లూకం’ పట్టు షేల్ చమురు, షేల్ గ్యాస్‌లను ప్రత్యామ్నాయ చమురు, వాయువులుగా పిలుస్తున్నారు. రష్యా ప్రపంచంలోనే అతి ఎక్కువ సహజవాయు నిక్షేపాలున్న దేశం. రష్యా ఆధిపత్యంలోని జీఈసీఎఫ్ దేశాల చేతుల్లోనే ప్రపంచ సహజ వాయు నిక్షేపాలలో 70 శాతానికి పైగా ఉన్నాయి. అందుకే రష్యా, ఇరాన్, కతార్, బొలీవియా, వెనిజులా, లిబియా, అల్జీరియా తదితర 13 దేశాల జీఈసీఎఫ్ను చమురు ఎగుమతి దేశాల సంస్థ ‘ఒపెక్’తో పోలుస్తూ ‘గ్యాస్ ఒపెక్’గా పిలుస్తారు. రష్యా, ఇరాన్, ఖతార్‌లలో ప్రపంచ సహజవాయు నిక్షేపాలలో 57 శాతానికి పైగా ఉన్నాయి. పైగా ప్రపంచ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిలో 85 శాతం జీఈసీఎఫ్ చేతుల్లోనే ఉంది. అమెరికా ఇంధనావసరాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఈ అవసరాల కోసం గ్యాస్ వినియోగించే యూరోపియన్ దేశాలు జీఈసీఎఫ్పైనే ఆధారపడి ఉన్నాయి. సహజవాయువేగాక పెట్రోలియం రవాణాకు వీలుగా ఉండే ఎల్పీజీ తయారీ మార్కెట్టుపైనా, రవాణా చేసే గ్యాస్ పైపులైన్లపైనా దాని ఆధిపత్యమే కొనసాగుతోంది. అటు గల్ఫ్‌లోనూ, ఇటు నాటో కూటమిలోనూ ఉన్న పలు అమెరికా మిత్రదేశాలు ఇంధన అవసరాలకోసమో, మార్కెట్కోసమో రష్యాపై ఆధారపడాల్సివస్తోంది. 1990లలో కుప్పకూలిన రష్యా దశాబ్ది తిరగకముందే కోలుకోవడం ప్రారంభించింది. పూర్వ ప్రాభవం కోసం పావులు కదుపుతోంది. 2001లో జీఈసీఎఫ్కు నాంది పలికి, 2008 నాటికి దాన్ని ఆర్థిక కూటమిగా మార్చింది. ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల్లో అమెరికా కూరుకుపోయిన కాలంలోనే రష్యా తన ‘సామ్రాజ్యాన్ని’ పునర్నిర్మించే ప్రయత్నాలు సాగించింది. అమెరికా మరో ‘సౌదీ అరేబియా’ క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక ప్రాబల్యంతోపాటే దాని అంతర్జాతీయ ప్రతిష్ట కూడా ఇటీవలి కాలంలో దిగజారుతోంది. పైగా సోవియెట్ యూనియన్ పతనానంతర రష్యాతో సంబంధాలను పలు యూరోపియన్ దేశాలు పునర్నిర్వచించుకుంటున్నాయి. రష్యాను ఎదుర్కోడానికి అమెరికాకు షేల్ గ్యాస్ ‘మంత్రదండం’ దొరికింది. ప్రపంచ ఇంధన అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో విస్తృతంగా ఉన్న వివాదాస్పదమైన షేల్ గ్యాస్ నిల్వలను వాణిజ్యపరంగా వెలికి తీసే కార్యక్రమాన్ని ఒబామా వేగవంతం చేశారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇప్పటికే అది గ్యాస్ ఎగుమతి దేశంగా మారాల్సింది. కానీ వివిధ రాష్ట్రాల్లో షేల్ బావులకు వ్యతిరేకంగా తలెత్తుతున్న ఆందోళనలు, సుదీర్ఘ చర్చలతో ‘అనవసర’ జాప్యాలు తప్పడం లేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మూడు గ్యాస్ ఎగుమతి టెర్మినల్స్ నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 2020 నాటికే అమెరికాను ‘గ్యాస్ సౌదీ అరేబియా’గా మార్చాలనేది ఒబామా కల. 2012లో రష్యా వాయు ఉత్పత్తి 65,300 కోట్ల క్యూబిక్ మీటర్లు కాగా, అమెరికా కూడా దానికి ధీటుగా 65,100 కోట్ల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తిని సాధించింది. అమెరికా షేల్ గ్యాస్ దూకుడు కంటే వేగంగా అంచనాలపై నడిచే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు తగ్గాయి. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు చమురును ఎల్పీజీగా మార్చి అమ్ముకునే మార్కెట్లు కుంచించుకుపోతాయనే ఆందోళనలో పడ్డాయి. ఆ ఆందోళన చైనాకు దారులు తెరిచింది. చైనాలో కూడా విస్తారంగా షేల్ నిల్వలున్నా దానికి షేల్ జ్వరం సోకలేదు. సమీప భవిష్యత్తులో కూడా అది సంప్రదాయక చమురు నిల్వలపైనే ఆధారపడాలని యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు ఇతర దేశాల వనరులను కొని లేదా దబాయించి ప్రస్తుత అవసరాలకు విని యోగించుకుంటూ, తమ వనరులను పొదుపుగా వాడుకుంటోంది. జీఈసీఎఫ్తోపాటూ, అరబ్బు, ఆఫ్రికా దేశాల నుంచి కూడా అది చమురు, ఎల్పీజీలను దిగుమతి చేసుకోడానికి ప్రాధాన్యం ఇస్తోంది. అమెరికా షేల్ గ్యాస్‌తో పోటీ మూలంగా డిమాండు కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న గల్ఫ్ దేశాలకు చైనా అంతులేని ఇంధన దాహం ఆసరా అవుతోంది. ‘ఇంధనానికి బదులు ఆయుధాల’ ఒప్పందాలతో అమెరికా కోటలోకి చైనా వాణిజ్య మార్గంలో చొరబడిపోతోంది. రష్యా సైతం సౌదీ అరే బియా వంటి దేశాలతో అలాంటి భారీ ఒప్పందాలను చేసుకుంటోంది. గల్ఫ్‌లోని అమెరికా కోట బీటలు వార డం ప్రపంచ ఇంధన ఆధిపత్యపు పోరుకు ఒక పార్శ్వం. ఒబామా పగటి కల... పలువురు అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఒబామా షేల్ స్వప్నాన్ని పగటి కలగా కొట్టిపారేస్తున్నారు. అమెరికా చెబుతున్నట్టు దాని షేల్ నిల్వలు వంద ఏళ్లకు సరిపడేంత ఘనమైనవేమీ కావని సవాలు చేస్తున్నారు. షేల్ గ్యాస్ ప్రబోధకులు, ప్రచారకులు దాచిపెడుతున్న ఒక ఆర్థిక వాస్తవాన్ని పోస్ట్ కార్బన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు డేవిడ్ హ్యూస్ బయటపెట్టారు. 1990ల నుంచి అమెరికాలోని పనిచేస్తున్న గ్యాస్ బావుల సంఖ్య 90 శాతం పెరిగిందిగానీ, ఒక్కో బావి సగటు ఉత్పాదకత 38 శాతానికి పడిపోయిందని డేవిడ్ తన ‘డ్రిల్ బేబీ, డ్రిల్’ నివేదికలో వెల్లడించారు. షేల్... భూమిలో బాగా లోతున, సువిశాల విస్తీర్ణంలో బల ్లపరుపుగా వ్యాపించి ఉండే నేల పొరల మధ్య ఇరుక్కుని ఉంటుంది. కాబట్టి సంప్రదాయక బావుల నుంచి 70 నుంచి 100 ఏళ్ల వరకు తక్కువ వ్యయాలతో వెలికితీత సాధ్యమైతే, షేల్ బావులు 10 నుంచి 20 ఏళ్లల్లోనే అడుగంటుతాయి. ఏటికేడాది ఉత్పాదకత పడిపోతూ, వ్యయాలు పెరిగిపోతుంటాయి. ఎప్పటికప్పుడు సమీపంలో కొత్త బావులు తవ్వుతూనే ఉండాలి, భారీగా కొత్త పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. దీంతో దీర్ఘకాలంలో షేల్ గ్యాస్ వ్యయాలు పెరిగి వాణిజ్యపరంగా లాభసాటి కాకుండాపోతుంది. ఈ ముప్పు తెలుసు కాబట్టే అమెరికాలోని షేల్ లాబీ త్వరత్వరగా గ్యాస్ ఎగుమతులు చేసేయాలని ఆరాటపడిపోతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి భారత్ వరకు అంటించిన షేల్ జ్వరానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రసామాగ్రిని, రాయల్టీలను నొల్లేసుకోవాలని తొందరపడుతోంది. ఇతర దేశాలు షేల్ గ్యాస్ మార్కెట్లోకి వచ్చేసరికే షేల్ మార్కెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. ఒబామా షేల్ కలను అమ్మి అమెరికన్ పెట్రో గుత్త సంస్థలు లాభాలు చేసుకుంటాయి. అప్పటికల్లా కాస్పియన్ సముద్ర తీరంలోని రష్యా ఇంధన కోటలో పాగవేయాలనేది అమెరికా దీర్ఘకాలిక వ్యూహం. రష్యా ప్రాబ ల్యం కింద ఉన్న మధ్య ఆసియా దేశాల చమురు, గ్యాస్ నిక్షేపాలపై ఆధిపత్యం సంపాదించడానికి అది ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మానవహక్కుల ఉల్లంఘనకు ప్రసిద్ధి చెందిన అజర్బైజాన్లో మే నెల చివర్లో అది ‘అమెరికా-అజర్బైజాన్: విజన్, ప్యూచర్’ అనే సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి ఒబామా ప్రభుత్వ అత్యున్నతాధికారులు, కాంగ్రెస్ సభ్యులు, ప్రపంచ బ్యాం కు ప్రతినిధులు, మంత్రుల భార్యలు తదితరులు దాదాపు 400 మంది హాజరయ్యారు. అజర్‌బైజాన్‌ను కేంద్రంగా చేసుకొని ఆ దేశంలోని బాకూ తీరం నుంచి టర్కీకి అటు నుంచి ఇతర యూరప్ దేశాలకు గ్యాస్‌ను ఎగమతి చేయడానికి ట్రాన్స్‌కాస్పియన్ పైపులైన్ నిర్మాణానికి అమెరికాకు అజార్బైజాన్ స్థావరంగా మారింది. ఇంతవరకు రష్యా ప్రాబల్యం కింద ఉన్న తుర్కుమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్లలోని చమురు కేంద్రాలపైకి అమెరికా వల విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహ జ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ఈజిప్ట్‌లో ‘ఫారో’ పునరుత్థానం!
ఈజిప్ట్ అంతర్యుద్ధం దిశగా పయనిస్తోంది. అల్‌కాయిదాకు పట్టున్న సినాయ్‌లో మిలిటెంట్ల దాడిలో 25 మంది పోలీసులు మరణించడం దానికి నాంది. ‘ఈజిప్ట్‌ను నాశనం చేయాలని భావిస్తున్న వారి పట్ల ఇంకా సంయమనాన్ని పాటించలేం. వాళ్లు దేశాన్ని నాశనం చేస్తుంటే చేతులు ముడుచుకు కూచునేదిలేదు. దాడులకు పాల్ప డుతున్నవారిని ఇక మా బలగాల పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొంటాం’ అని ఈజిప్ట్ ఆర్మీ చీఫ్, రక్షణ మంత్రి జనరల్ అబ్దుల్ ఫతా అల్ సిసీ సోమవారం ప్రకటించారు. ఈ నెల 14న రాజధాని కైరోలో రెండు వేలకు పైగా ముస్లిం బ్రదర్హుడ్ అసమ్మతివాదులను ఊచకోత కోసిన తర్వాత ఆయన ఆ ఘటనపై చేసిన మొట్టమొదటి ప్రకటన ఇదే. గత నెల 3న సైనిక తిరుగుబాటుతో అధికారం చేజిక్కిం చున్న సిసీ ఇకపై ‘సంయమన ం’ పాటించక, పీనుగుల పిరమిడ్లను నిర్మిస్తారు. రెండున్నరేళ్ల క్రితం అరబ్బు విప్లవవెల్లువకు కొట్టుకుపో యి కటకటాలు లెక్కిస్తున్న మాజీ నియంత హోస్నీ ముబారక్ త్వరలో విడుదల కానున్నారనే ప్రకటన కూడా సోమవారమే వెలువడ టం కాకతాళీయం కాదు. అభినవ ఫారో నిన్నటి ఫారోకు ఇస్తున్న కానుక ఇది. సైనిక తిరుగుబాటు జరిగిన రోజే సిసీ, అమెరికా విదేశాంగ మంత్రి చుక్ హ్యాగెల్తో ఫోన్లో సుదీర్ఘంగా చర్చించారు. ఆనాడు, ఆ తర్వాత సాగుతున్న హింసాకాండపై అమెరికా కోరి నది, కోరుతున్నది ఒక్కటే... సంయమనం! సిసీ తొలిరోజు నుంచే అమెరికా మాటను పెడచెవిని పెట్టి నిరసనకారులపై హత్యాకాం డ సాగిస్తున్నారు. సిసీ సైనిక ప్రభుత్వంతోపాటూ, కూలిన మొర్సీ ప్రభుత్వం కూడా అమెరికా నిలిపినవే. కాబట్టి ఈజిప్ట్‌లో అమెరికా విధానం... అటైనా ఇటైనా గెలుపు తమదేననే స్థితిలో ఉండాల్సింది. అలాంటిది అటు ఇటూ ఎటైనా ఓటమి తప్పదేమోనని భయపడాల్సిన స్థితిలో పడింది. అందుకే ఈజిప్టులో సైనిక కుట్ర జరిగిందనే సాహసం చేయలేకపోతోంది. సిసీ ‘సంయమనం’ కోల్పోయాక కూడా ఏమీ చేయలేని దుస్థితి దానిది. తెరవెనుక సాగుతున్న నాటకీయ పరిణామాల ఫలితమిది. సరిగ్గా సైనిక కుట్రకు ముం దు సిసీ చివరిసారిగా మొర్సీని అధికారం వదులుకోవాలని హెచ్చరించారు. తనకు అం తర్జాతీయ మద్దతు ఉన్నదని, అమెరికా చూస్తూ ఊరుకోదని మొర్సీ ధీమా వ్యక్తం చేశారు. మొర్సీ అంచనాలు తప్పాయి. ‘అంతర్జాతీయ మద్దతు’ ఉన్నది సిసీకే! సైనిక తిరుగుబాటు నాటికే ఈజిప్ట్ ఆకలితో అలమటిస్తోంది. పేదలు నెలల తరబడి ప్రభుత్వం సబ్సిడీకి అందిస్తున్న రొట్టెతోనే గడుపుతున్నారు. సిసీ అధికారం చేజిక్కించుకున్న వెం టనే సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ ఎమిరేట్స్ (యూఏఈ) 1,200 కోట్ల డాలర్ల తాత్కాలిక సహాయాన్ని ప్రకటించాయి. సౌదీ తోపాటూ ఇజ్రాయెల్ సైతం సిసీకి మద్దతు పలుకుతోంది. ఈజిప్టు-ఇజ్రాయెల్ క్యాంప్ డేవిడ్ ఒప్పందాన్ని సిసీ అంగీకరిస్తారు, మొర్సీ అంగీకరించరు. అమెరికా ఈ ఇద్దరు మిత్రులతో కలిసి ‘దుష్ట కూటమి’కి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. బుధవారం నరమేధానికి సరిగ్గా రెండురోజుల ముందు అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ చైర్మన్ జనరల్ మార్టిన్ డెంప్సీ ఇజ్రాయెల్ వెళ్లి ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కలిశారు. ‘ఈ ప్రాంతం నుంచి తలెత్తుతున్న ముప్పులను ఎదుర్కొని ఇరు దేశాలకు మరింత భద్రత చేకూరేట్టు చేయడం’ కోసం చర్చలు జరి పారు. ఆ ముప్పు ఇరాన్, సిరియా, లెబనాన్ల సరికొత్త ‘దుష్ట కూటమి’ నుంచేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మోషె యాలాన్ బహిరంగంగా ప్రకటించారు. సౌదీ, ఇజ్రాయెల్ రెం డూ ఆ ‘దుష్ట కూటమి’కి వ్యతిరేకమే. అలా ఏర్పడ్డ ఆ ఐక్యత సిరియా తిరుగుబాటుదార్లకు సహాయం నుంచి ఈజిప్టు సైనిక తిరుగుబాటు వరకు దినదిన ప్రవర్థమానమవుతోంది. అది అమెరికాకే భయం కలిగించేంతగా బలపడుతుండటం దానికి మింగుడు పడటం లేదు. మొదటి దఫా అధ్యక్షునిగా విదేశాంగ విధాన అధ్యక్షునిగా పేరుతెచ్చుకున్న ఒబామాకు రెండో దఫా ‘విధి’ వక్రీకరించింది. అడుగడుగునా వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈజిప్టుతో కలిసి సైనిక విన్యాసాలను నిలిపివేస్తున్నట్టుగా అమెరికా ప్రకటించిన వెంటనే... రష్యా అధ్యక్షుడు వ్లది మిర్ పుతిన్ ఈజిప్టుకు సైనిక సహాయాన్ని అందిస్తామంటూ ముందుకొచ్చారు. అన్వర్ సాదత్ హయాంలో రష్యాతో తెగదెంపులు చేసుకున్న ఈజిప్టుతో ఇప్పుడు మళ్లీ రష్యా నెయ్యం మొదలైంది. మరోవంక సౌదీ, రష్యానుంచి 15 బిలియన్ డాలర్ల ఆయుధాలను కొనడానికి శనివారం ఒప్పందం కుదుర్చుకుం ది. అది ఇప్పటికే చైనా నుంచి కొన్న క్షిపణులను ఇరాన్‌పైకి గురిపెట్టింది. ఇజ్రాయెల్ అం దించిన అణుబాంబులను వాటికి జోడించిం దని కూడా వినవస్తోంది. మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్యాల క్రీడ రసవత్తర ఘట్టానికి చేరిం ది. ఇజ్రాయెల్-సౌదీ-అమెరికా కూటమి ఒకపక్క ఉండగానే మరోపక్క ఇజ్రాయెల్-సౌదీ-రష్యా-చైనాల కూటమి రూపుదిద్దుకుం టోంది. ఆ రెండు కూటములు సిసీ నరహం తక ఫారో పాలనకు దన్నుగా నిలుస్తున్నాయి. ఈజిప్టు అనివార్యంగా అంతర్యుద్ధం దిశగా పయనిస్తోంది. అల్‌కాయిదాకు పట్టున్న సినాయ్ ద్వీపకల్పంలో మిలిటెంట్ల దాడిలో 25 మంది పోలీసులు మరణించడం దానికి నాంది కావచ్చు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
సౌదీ సంపద చీకటి నీడల్లో...
సౌదీ అసమ్మతివాది ఫాద్ అల్ ఫాఖీ అన్నట్టుగా సౌదీ పేదరికం ‘‘సాపేక్షికమైనది కాదు, అసలు సిసలైన కటిక పేదరికమే. రాచరిక పాలన సాగినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు’’. సౌదీ అరేబియా అంటేనే అష్టఐశ్వర్యాలతో తులతూగే దేశం కళ్లకు కడుతుంది. సౌదీ పౌరులంటేనే పెట్రో డాలర్లపై తప్ప నేలపై నడవని షేక్లని భావిస్తాం. ప్రపంచ చమురునిల్వలలో 18 శాతం ఉన్న అత్యంత సంపన్న దేశం అది. పెట్రోలియం ఎగుమతుల్లో అగ్రస్థానం దానిదే. రాజధాని రియాద్‌లోని సుందర సౌధాలు, షాపింగ్ మాల్స్ ధగధగలను సినిమాల్లో, టీ వీల్లో చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. ఆ విలాస వైభోగపు వెలుగుల మాటున పరుచుకున్న నీలి నీడల్లో కలిసిపోయిన ఇరుకు సందులుగానీ, కొద్ది కిలోమీటర్ల దూరంలో నగరానికి దక్షిణాన ఉన్న మురికి వాడలుగానీ ఎప్పుడూ కనిపించవు. విదేశీ మీడియా ప్రతినిధులు, పర్యాటకులు అటు తొంగి చూడటం దాదాపు అసాధ్యం. పేదరికాన్ని దాచేసే కనికట్టు విద్యలో సౌదీ తర్వాతే ఎవరైనా. సౌదీ పేదరికంపై 2011లో ఒక డాక్యుమెంటరీని నిర్మించిన నేరానికి ముగ్గురు యువకులు కటకటాలు లెక్కించాల్సివచ్చిం ది. నగర కేంద్రంలోని ఇరుకు సందులు బిచ్చగాళ్ల వాడలు. అక్కడ తప్ప ఎక్కడైనా బిచ్చమెత్తడం నేరమే. ఇక మురికివాడల్లో పగుళ్లువారిన చీకటి గుయ్యారాల్లాంటి ఇళ్లల్లోని ప్రజల లో అత్యధికులు పేదలే. జనాభాలో 25 నుం చి 30 శాతం దారిద్య్రరేఖకు (అక్కడి లెక్కన రోజుకు 17 డాలర్లు) దిగువన నివసిస్తున్నారనే చేదు వాస్తవానికి, సౌదీ చ మురు వైభోగానికి లంగరు అందదు. భూమి, నీరు, ఖనిజ సంపదలను అల్లా మానవాళికి వరంగా ఇచ్చాడని ఇస్లాం చెబుతుంది. ప్రపంచానికి ఇస్లామిక్ జిహాదీ ఉద్యమాలను ఎగుమతి చేస్తున్న సౌదీ రాచరిక కుటుంబాలే 70 నుంచి 80 శాతం చమురు నిక్షేపాలకు యజమానులు. కాకపోతే వారు ఇస్లాం బోధించినట్టు తమ సంపదలో కొంత భాగంతో దానధర్మాలు చేస్తారు. వారి భవనాల వద్ద పడిగాపులు పడేవారికి, సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకొన్నవారికి తృణమో పణమో ఇచ్చి పుణ్యాన్ని కొనుక్కుంటారు. వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ రెండు చరణాల కవిత్వాన్ని కట్టి వినిపించి మెప్పించినవారికి కార్లు సైతం అనుగ్రహిస్తారు. అయితే అప్పులు తీర్చడం కోసం, నీటి బిల్లు, కరెంటు బిల్లు చెల్లింపులకోసం, ఆహా రం కోసం వచ్చేవారే ఎక్కువ. ‘సౌదీ అరేబియాలో బతకడమంటే ధార్మిక సంస్థలో జీవితమని అర్థం. దాన ధర్మాలు చేయనివారు ముస్లింలు కానే కారు’ అని రాజు అబ్దుల్లా కుమారుడు ప్రిన్స్ సుల్తాన్ ఉవాచ. కానీ సౌదీ ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యసదుపాయాలను అందిస్తోందేగానీ... పేదరికం వాతబడ్డ వారికి ఉచిత ఆహారం అందించదు. యూరప్‌లోని సూప్ కేంద్రాలు, అమెరికాలోని ఆహార కూపన్లవంటి ఏర్పాట్లు లేవు. చే యి చాచడానికి సిగ్గుపడే కుటుంబాలు అర్థాకలితో చావకుండా బతక్కుండా అన్నట్టే బతకాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిధులన్నీ ఇస్లామ్ నిర్దేశించిన ‘జకత్’ అనే ధార్మిక విధిపై ఆధారపడినవే. వ్యక్తులు, కార్పొరేషన్లు తమ సంపదలో 2.5 శాతాన్ని ప్రభుత్వ ధార్మికనిధికి జమచేయాలి. అలా సమకూరే నిధులలో అత్యధిక భాగం అవి నీతి, ఆశ్రీత పక్షపాతాల దారులగుండా పయనించి, రాచరిక కుటుంబ సభ్యులకే చేరుతుం ది. అవినీతి, పేదరికం, నిరుద్యోగాల పట్ల ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెచ్చుపెరిగి పోతోంది. 2010లో బద్దలైన అర బ్బు విప్లవం భయానికి ప్రభుత్వం ఇటీవల పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతోంది. అయితే ప్రభు త్వ నిధులను సుందర భవనాల నిర్మాణం కోసం, ఆయుధ సంపద కోసమే ఎక్కువగా వెచ్చిస్తున్నారు. పైగా అంతర్జాతీయ ప్రాబ ల్యం కోసం వందల కోట్ల డాలర్లను తమకు అనుకూలమైన ఇస్లామిక్ ప్రభుత్వాలకు, గ్రూపులకు, ప్రభుత్వాలకు అందిస్తోంది. నేటికీ 90 శాతం ప్రభుత్వ రాబడికి ఆధారం చమురే. ఉపాధి అవకాశాలు విస్తరించడం లేదు. సౌదీ అరేబియా, ఖతార్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, బహ్రెయిన్‌లతో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీవోసీ) దేశాలన్నిటిలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. సౌదీ అరేబియాది రెండు అంచెల ఆర్థిక వ్యవస్థ. 1.6 కోట్ల మంది సౌదీలు కాగా మిగతా వారిలో అత్యధికులు విదేశీ కార్మికులు. సౌదీలో నిరుద్యోగం 10 శాతానికి పైగా ఉంది. ఏటా లక్ష మంది కొత్త శ్రామికులు తయారవుతున్నారు. నిరుద్యోగులలో 75 శాతం 30 ఏళ్లలోపు వారే. ప్రజలందరికి చెందాల్సిన సహజ సంపదలను విలాసాలకోసం రాచరికం తగలేస్తుండగా, త్వరత్వరగా చమురు నిల్వలు తరిగిపోతున్నాయి. మరో ఇరవై ఏళ్లకే సౌదీ చమురు దిగుమతి దేశంగా మారవచ్చని అంటున్నారు. ఆ తర్వా త పరిస్థితి ఏమిటనేది అంతు చిక్కడం లేదు. సౌదీకి ఆప్త మిత్రులైన అమెరికా, ఈయూలుగానీ, ఐఎంఫ్ వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలుగానీ ఇదేమిటని సౌదీ రాజును ప్రశ్నించరు. సౌదీ అసమ్మతివాది, ‘మూవ్మెంట్ ఫర్ ఇస్లామిక్ రిఫార్మ్’ నేత డాక్టర్ ఫాద్ అల్ ఫాఖీ అన్నట్టుగా సౌదీ పేదరికం ‘‘సాపేక్షికమైనది కాదు, అసలు సిసలైన కటిక పేదరికమే. రాచరిక పాలన సాగినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు’’. - పిళ్లా వెంకటేశ్వరరావు -
‘శాంతి చర్చల’ నాలుగు స్తంభాలాట!
అఫ్ఘాన్ శాంతి చర్చలలో కీలక పాత్రధారులుగా కనిపిస్తున్న అమెరికా, తాలిబన్, కర్జాయ్, పాక్‌లకు ఎవరికి వారికి సొంత అజెండా ఉంది. కాబట్టే శాంతి చర్చలు నాలుగు స్తంభాలాటగా మారాయి. భూమి గుండ్రంగా ఉన్నదని మరోసారి రుజువైంది. అమెరికా జూన్‌లో అట్టహాసంగా ప్రారంభించిన అఫ్ఘానిస్థాన్ శాంతి చర్చల నావ బయలుదేరిన తీరానికే తిరిగి చేరింది. శాంతి చర్చలు కొనసాగుతాయంటూ తాలి బన్ల అగ్రనేత ముల్లా ఒమర్ మంగళవారం చేసిన ప్రకటన అమెరికాతో చర్చలను ఉద్దేశించినదేనని పొరబడటానికి వీల్లేదు. అమెరికాతో చర్చలకోసం ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు తెరచిన కార్యాలయం జూలై 9నే మూతబడింది. మరి ఒమర్ చర్చలంటున్నది ఎవరితో? ఎవరితోనో ‘అసోసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్థ సోమవారంనాడే వెల్లడించింది. అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఏరికోరి నియమించిన అత్యున్నత శాంతి మండలి సభ్యులకు, తాలిబన్లకు మధ్య అనధికారికంగా చర్చలు జరుగుతున్నాయని అది తెలిపింది. జూన్ 19న అఫ్ఘాన్ శాంతిభద్రతల పరిరక్షణ విధులను జాతీయ భద్రతా బలగాలకు అప్పగించిన రోజునే కర్జాయ్ అమెరికాపై అలిగారు. కారణం శాంతి చర్చలే! కర్జాయ్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా దోహాలో తాలిబన్లతో అమెరికా నేరుగా చర్చలకు పూనుకున్నందునే ఆయన అలిగారు. అలిగి, అరచి, ఆగ్రహించి అమెరికాను కాళ్ల బేరానికి వచ్చేలా చేయడం ఎలాగో కర్జాయ్‌కి కొట్టిన పిండే. కాబట్టే సొంత బలం లేకుం డానే పదేళ్లుగా అఫ్ఘాన్ అధినేతగా కొనసాగుతున్నారు. 2010లోనే కర్జాయ్ నేరుగా తాలి బన్లతో తెరవెనుక చర్చలు ప్రారంభించారు. జూన్‌లో బెడిసికొట్టిన అమెరికా ‘శాంతి చర్చల’లో కర్జాయ్‌కు స్థానం లేనట్ట్టే, ఆనాటి కర్జాయ్ చర్చలు కూడా అమెరికా ప్రమేయం లేకుండా సాగినవి. అమెరికా బెదిరించి, బతి మాలి, బుజ్జగించి అప్పట్లో కర్జాయ్ చేత తాలి బన్లతో చర్చలను విరమింపజేసింది. నేడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. అఫ్ఘాన్ శాంతి చర్చల ప్రహసనంలోంచి అమెరికా నిష్ర్కమించి, కర్జాయ్ రంగ ప్రవేశం చేశారు. శాంతి చర్చలు జరుపుతామంటూనే, దాడులను ముమ్మరం చేస్తామని ఒమర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. అమెరికా, అప్ఘాన్ ప్రభుత్వాలే జూన్‌లో ప్రారంభమైన చర్చల ప్రక్రియను దెబ్బ తీశాయని ఆయన ఆరోపణ. పనిలో పనిగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా ఒమర్ అఫ్ఘాన్లకు పిలుపునిచ్చారు. 2014 చివరికి అమెరికా, నాటో బలగాలు నిష్ర్కమించనుండగా ఎన్నికల నిర్వహణ ‘అర్థరహిత, అనవసర కాలహరణమే’నని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఆమెరికా అఫ్ఘాన్ ‘ఎండ్ గేమ్’ (ముగింపు క్రీడ) అనుకున్నట్టు జరగదనేది స్పష్టమే. ఏప్రిల్ 5 ఎన్నికల్లోగానే, అంటే ఈ ఏడాది చివరికే తాలి బన్లతో ఒప్పందాన్ని కుదుర్చుకొని, ఎన్నికల ద్వారా ఏర్పడబోయే నూతన ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడం ‘ఎండ్ గేమ్’లో కీలక ఘట్టం. అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు హామీని కల్పించి, సైనిక స్థావరాల కొనసాగింపునకు అంగీకరించే నూతన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా భావిస్తోంది. అమెరికాతో శాంతి చర్చలకు తాలిబన్ల ప్రధాన షరతు కర్జాయ్ ప్రభుత్వాన్ని చర్చల ప్రక్రియ నుంచి, అధికార పంపకం నుంచి మినహాయించడమే. కానీ తాలిబన్లు అదే కర్జాయ్‌తో నేరుగా తెరచాటు సంబంధాలు నెరపుతూనే ఉన్నారు. ఎప్పుడు ఎవరితో చర్చలు సాగించాలో, విరమించాలో నిర్ణయించేది తాలిబన్లే. మరోవంక అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఈ నెల ఒకటిన తాలిబన్లతో చర్చలు తిరిగి మొదలు కావడానికి సహకరించాలని పాకిస్థాన్‌ను అభ్యర్థించారు. గత ఏడాది జరిపిన ‘శాంతి చర్చల’ నుంచి అమెరికా, కర్జాయ్‌లు పాక్‌ను మినహాయించాయి. నేడు అదే పాక్ సహా యంతో చర్చలకు అమెరికా తాపత్రయపడుతోంది. దోహా స్థాన బలం కలిసి రాలేదో ఏమో రెండు దేశాలూ కలిసి చర్చల వేదికను మరో దేశానికి మార్చాలని నిర్ణయించాయి! అఫ్ఘాన్ శాంతి చర్చలలో కీలక పాత్రధారులుగా కనిపిస్తున్న అమెరికా, తాలిబన్, కర్జాయ్, పాక్‌లకు ఎవరికి వారికి సొంత అజెండా ఉంది. కాబట్టే శాంతి చర్చలు నాలుగు స్తంభాలాటగా మారాయి. ఒమర్ ప్రకటనలో శాంతి చర్చలు ఎవరితోనో ప్రస్తావించకపోవడమేగాక, కర్జాయ్ ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించేదిలేదనే మూసపోత షరతును ఉపసంపహరించారు. అంటే తాలిబన్లు అటు కర్జాయ్ ప్రభుత్వంతోనూ, ఇటు అమెరికాతోనూ కూడా ఒకేసారి విడి విడిగా చర్చలు సాగించడమనే నూతన ఘట్టం ఆవిష్కృతం కానున్నదని భావించాలా? నిజానికి తాలిబన్లు కూడా చర్చల విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. సేనల ఉపసంహరణ తదుపరి అతి కొద్ది కాలంలోనే ప్రభుత్వ బలగాలను చిత్తుగా ఓడించగలమనే అంచనాతో చర్చలను ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మరో వర్గం మాత్రం అది సుదీర్ఘ అంతర్గత యుద్ధంగా మారుతుందని భయపడుతున్నారు. ఈ సందిగ్ధం నుంచి వెంటనే బయటపడాలన్న ఆదుర్దాగానీ, అగత్యంగానీ తాలిబన్లకు లేదు. అందుకే ఈ ఆటను కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా అఫ్ఘాన్‌లో పాక్‌కు ఎలాంటి పాత్రా లేకుండా చేయాలన్న కర్జాయ్ ఆశలు నెరవేరేలా లేవు. అమెరికా పరిస్థితి సైతం ఇరాక్‌లో లాగే అఫ్ఘాన్ నుంచి కూడా ఎలాంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందమూ లేకుండా, అవమానకరంగా నిష్ర్కమించాల్సిన దుస్థితిగా మారేట్టుంది. - పిళ్లా వెంకటేశ్వరరావు