సౌదీ సంపద చీకటి నీడల్లో... | saudi arabia opulence was in dark shadows | Sakshi
Sakshi News home page

సౌదీ సంపద చీకటి నీడల్లో...

Published Thu, Aug 8 2013 12:07 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

సౌదీ సంపద చీకటి నీడల్లో... - Sakshi

సౌదీ సంపద చీకటి నీడల్లో...

సౌదీ అసమ్మతివాది ఫాద్ అల్ ఫాఖీ అన్నట్టుగా సౌదీ పేదరికం ‘‘సాపేక్షికమైనది కాదు, అసలు సిసలైన కటిక పేదరికమే. రాచరిక పాలన సాగినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు’’.
 
 సౌదీ అరేబియా అంటేనే అష్టఐశ్వర్యాలతో తులతూగే దేశం కళ్లకు కడుతుంది. సౌదీ పౌరులంటేనే పెట్రో డాలర్లపై తప్ప నేలపై నడవని షేక్‌లని భావిస్తాం. ప్రపంచ చమురునిల్వలలో 18 శాతం ఉన్న అత్యంత సంపన్న దేశం అది. పెట్రోలియం ఎగుమతుల్లో అగ్రస్థానం దానిదే. రాజధాని రియాద్‌లోని సుందర సౌధాలు, షాపింగ్ మాల్స్ ధగధగలను సినిమాల్లో, టీ వీల్లో చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. ఆ విలాస వైభోగపు వెలుగుల మాటున పరుచుకున్న నీలి నీడల్లో కలిసిపోయిన ఇరుకు సందులుగానీ, కొద్ది కిలోమీటర్ల దూరంలో నగరానికి దక్షిణాన ఉన్న మురికి వాడలుగానీ ఎప్పుడూ కనిపించవు.
 
 విదేశీ మీడియా ప్రతినిధులు, పర్యాటకులు అటు తొంగి చూడటం దాదాపు అసాధ్యం. పేదరికాన్ని దాచేసే కనికట్టు విద్యలో సౌదీ తర్వాతే ఎవరైనా. సౌదీ పేదరికంపై 2011లో ఒక డాక్యుమెంటరీని నిర్మించిన నేరానికి ముగ్గురు యువకులు కటకటాలు లెక్కించాల్సివచ్చిం ది.  నగర కేంద్రంలోని ఇరుకు సందులు బిచ్చగాళ్ల వాడలు. అక్కడ తప్ప ఎక్కడైనా బిచ్చమెత్తడం నేరమే. ఇక మురికివాడల్లో పగుళ్లువారిన చీకటి గుయ్యారాల్లాంటి ఇళ్లల్లోని ప్రజల లో అత్యధికులు పేదలే. జనాభాలో 25 నుం చి 30 శాతం దారిద్య్రరేఖకు (అక్కడి లెక్కన రోజుకు 17 డాలర్లు) దిగువన నివసిస్తున్నారనే చేదు వాస్తవానికి, సౌదీ చ మురు వైభోగానికి లంగరు అందదు.  
 
 భూమి, నీరు,  ఖనిజ సంపదలను అల్లా మానవాళికి వరంగా ఇచ్చాడని ఇస్లాం చెబుతుంది. ప్రపంచానికి ఇస్లామిక్ జిహాదీ ఉద్యమాలను ఎగుమతి చేస్తున్న సౌదీ రాచరిక కుటుంబాలే 70 నుంచి 80 శాతం చమురు నిక్షేపాలకు యజమానులు. కాకపోతే వారు ఇస్లాం బోధించినట్టు తమ సంపదలో కొంత భాగంతో దానధర్మాలు చేస్తారు. వారి భవనాల వద్ద పడిగాపులు పడేవారికి, సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకొన్నవారికి తృణమో పణమో ఇచ్చి పుణ్యాన్ని కొనుక్కుంటారు. వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ రెండు చరణాల కవిత్వాన్ని కట్టి వినిపించి మెప్పించినవారికి కార్లు సైతం అనుగ్రహిస్తారు. అయితే అప్పులు తీర్చడం కోసం, నీటి బిల్లు, కరెంటు బిల్లు చెల్లింపులకోసం, ఆహా రం కోసం వచ్చేవారే ఎక్కువ.
 
 ‘సౌదీ అరేబియాలో బతకడమంటే ధార్మిక సంస్థలో జీవితమని అర్థం. దాన ధర్మాలు చేయనివారు ముస్లింలు కానే కారు’ అని రాజు అబ్దుల్లా కుమారుడు ప్రిన్స్ సుల్తాన్ ఉవాచ. కానీ సౌదీ ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యసదుపాయాలను అందిస్తోందేగానీ... పేదరికం వాతబడ్డ వారికి ఉచిత ఆహారం అందించదు. యూరప్‌లోని సూప్ కేంద్రాలు, అమెరికాలోని ఆహార కూపన్లవంటి ఏర్పాట్లు లేవు. చే యి చాచడానికి సిగ్గుపడే కుటుంబాలు అర్థాకలితో చావకుండా బతక్కుండా అన్నట్టే బతకాలి.
 
 ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిధులన్నీ ఇస్లామ్ నిర్దేశించిన ‘జకత్’ అనే ధార్మిక విధిపై ఆధారపడినవే. వ్యక్తులు, కార్పొరేషన్లు తమ సంపదలో 2.5 శాతాన్ని ప్రభుత్వ ధార్మికనిధికి జమచేయాలి. అలా సమకూరే నిధులలో అత్యధిక భాగం అవి నీతి, ఆశ్రీత పక్షపాతాల దారులగుండా పయనించి, రాచరిక కుటుంబ సభ్యులకే చేరుతుం ది. అవినీతి, పేదరికం, నిరుద్యోగాల పట్ల ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెచ్చుపెరిగి పోతోంది. 2010లో బద్దలైన అర బ్బు విప్లవం భయానికి ప్రభుత్వం ఇటీవల పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతోంది. అయితే ప్రభు త్వ నిధులను సుందర భవనాల నిర్మాణం కోసం, ఆయుధ సంపద కోసమే ఎక్కువగా వెచ్చిస్తున్నారు. పైగా అంతర్జాతీయ ప్రాబ ల్యం కోసం వందల కోట్ల డాలర్లను తమకు అనుకూలమైన ఇస్లామిక్ ప్రభుత్వాలకు, గ్రూపులకు, ప్రభుత్వాలకు అందిస్తోంది. నేటికీ 90 శాతం ప్రభుత్వ రాబడికి ఆధారం చమురే. ఉపాధి అవకాశాలు విస్తరించడం లేదు. సౌదీ అరేబియా, ఖతార్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, బహ్రెయిన్‌లతో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీవోసీ) దేశాలన్నిటిలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి.
 
 సౌదీ అరేబియాది రెండు అంచెల ఆర్థిక వ్యవస్థ. 1.6 కోట్ల మంది సౌదీలు కాగా మిగతా వారిలో అత్యధికులు విదేశీ కార్మికులు. సౌదీలో నిరుద్యోగం 10 శాతానికి పైగా ఉంది. ఏటా లక్ష మంది కొత్త శ్రామికులు తయారవుతున్నారు.
 
 నిరుద్యోగులలో 75 శాతం 30 ఏళ్లలోపు వారే. ప్రజలందరికి చెందాల్సిన సహజ సంపదలను విలాసాలకోసం రాచరికం తగలేస్తుండగా, త్వరత్వరగా చమురు నిల్వలు తరిగిపోతున్నాయి. మరో ఇరవై ఏళ్లకే సౌదీ చమురు దిగుమతి దేశంగా మారవచ్చని అంటున్నారు. ఆ తర్వా త పరిస్థితి ఏమిటనేది అంతు చిక్కడం లేదు. సౌదీకి ఆప్త మిత్రులైన అమెరికా, ఈయూలుగానీ, ఐఎంఫ్ వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలుగానీ ఇదేమిటని సౌదీ రాజును ప్రశ్నించరు. సౌదీ అసమ్మతివాది, ‘మూవ్‌మెంట్ ఫర్ ఇస్లామిక్ రిఫార్మ్’ నేత డాక్టర్ ఫాద్ అల్ ఫాఖీ అన్నట్టుగా సౌదీ పేదరికం ‘‘సాపేక్షికమైనది కాదు, అసలు సిసలైన కటిక పేదరికమే. రాచరిక పాలన సాగినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు’’.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement