Islamic jihad
-
Israel-Hamas War: ఆ కిరాతకం మీదే..
గాజా స్ట్రిప్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: గాజా సిటీలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఘటనపై ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం నిందలు మోపుకుంటున్నాయి. దాదాపు 500 మందిని బలిగొన్న కిరాతకులు మీరంటే మీరేనని వాదులాటకు దిగాయి. ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, ముమ్మాటికీ ఇజ్రాయెల్ సైన్యమే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని హమాస్ ఆరోపించింది. అల్–అహ్లీ ఆసుపత్రి ప్రాంగణంలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను ఎక్కడికి తరలించాలో తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే గాజాలో ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయానని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం బుధవారం 12వ రోజుకు చేరింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 3,478 మంది మరణించారని, 12,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 1,300 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నామని, వారు ప్రాణాలతో బయటపడతారన్న నమ్మకం లేదని వెల్లడించింది. హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. దాదాపు 200 మంది బందీలు ఇప్పటికీ హమాస్ అ«దీనంలోనే ఉన్నారు. వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇరుపక్షాలు మెట్టు దిగిరావడం లేదు. దాంతో బందీల పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. గత 12 రోజుల్లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై 450 రాకెట్లు ప్రయోగించారని అంచనా. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు కొనసాగించింది. భయంకరమైన ఊచకోత: హమాస్ అల్–అహ్లీ హాస్పిటల్లో పేలుడుకు తాము కారణం కాదని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఆ పేలుడుతో తమకు సంబంధం లేదన్నారు. పేలుడు జరిగిన సమయంలో తాము ఆ ప్రాంతంపై అసలు ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం 6.59 గంటల సమయంలో సమీపంలోని ఓ శ్మశాన వాటిక నుంచి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన ఇస్లామిక్ జిహాద్ సభ్యులు రాకెట్‌ను ప్రయోగించినట్లు తమ రాడార్ గుర్తించిందని తెలిపారు. ఈ రాకెట్ గురితప్పి, ఆసుపత్రి బయట పార్కింగ్ ప్రాంతంలో పేలిందని వెల్లడించారు. ఆసుపత్రిలో పేలుడు ఘటనను ‘భయంకరమైన ఊచకోత’గా హమాస్ అభివర్ణించింది. ఈ దురాగతానికి ఇజ్రాయెల్ సైన్యమే కారణమని పే ర్కొంది. ఈ మారణకాండకు బాధ్యత వహించకుండా ఇజ్రాయెల్ తప్పించుకోవాలని కుట్ర పన్నుతోందని ఆరోపించింది. అల్– అహ్లీ ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ కొన్ని రోజుల క్రితమే ఆదేశించిందని గుర్తుచేసింది. ఆసుపత్రిలో పేలుడులో 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆ సంఖ్యను 471గా సవరించింది. బైడెన్‌తో సమావేశాలు రద్దు గాజా ఆసుపత్రిలో పేలుడు ఘటనకు నిరసనగా జోర్డాన్ కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరగాల్సిన సమవేశాన్ని జోర్డాన్ రాజు అబ్దుల్లా–2 రద్దు చేసుకున్నారు. పాలస్తీనా నేత మొహమ్మద్ అబ్బాస్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ కూడా ఇదే బాటలో నడిచారు. బైడెన్‌తో తాము భేటీ కావడం లేదని తేలి్చచెప్పారు. దాంతో బైడెన్ తన పర్యటనను కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని జోర్డాన్ విదేశాంగ మంత్రి సపాధీ చెప్పారు. హమాస్ లావాదేవీలపై ఆంక్షలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగి, వెయ్యి మందికిపైగా జనాన్ని బలి తీసుకున్న మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అగ్రరాజ్యం అమెరికా కఠిన చర్యలు ప్రారంభించింది. 10 మంది హమాస్ మిలిటెంట్ల బృందం ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం అమెరికా ప్రకటించింది. అలాగే హమాస్ ఆర్థిక నెట్‌వర్క్‌పైనా ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. గాజా, సూడాన్, తుర్కియే, అల్జీరియా, ఖతార్‌లో ఈ ఆంక్షలు అమలవుతాయని వెల్లడించింది. ఈ ఆంక్షల వల్ల విదేశాల నుంచి హమాస్‌కు నిధులు అందకుండా కట్టడి చేసినట్లు అవుతుందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జానెట్ చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం హమాస్ మిలిటెంట్లకు అండగా నిలుస్తూ, భారీ ఎత్తున ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇకపై నిధులు ఇవ్వడం సులభం కాదు. వివిధ దేశాల్లో హమాస్ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయా ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ పేలుడుకు కారణం ఇజ్రాయెల్ కాదు: బైడెన్ గాజా హాస్పిటల్లో భీకర పేలుడుకు ఇజ్రాయెల్ ఎంతమాత్రం కారణం కాదని, ‘మరో బృందం’ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఆయన బుధవారం ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, తాజా పరిణామాలు, గాజా ప్రజలకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చించుకున్నారు. అల్–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఉదంతం ప్రస్తావనకు వచి్చంది. ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ప్రయోగించిన రాకెట్ మిస్‌ఫైర్ కావడం వల్లే ఈ పేలుడు జరిగిందన్న ఇజ్రాయెల్ వాదనతో బైడెన్ ఏకీభవించారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల ధైర్యసాహసా లు, అంకితభావం, శౌర్యాన్ని గౌరవిస్తూ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానంటూ బైడెన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ప్రజల దుఃఖాన్ని అమెరికన్లు సైతం పంచుకున్నారని చెప్పారు. ఇజ్రాయెల్–హమస్ ఘర్షణ మరింత విస్తరించకూడదన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఈజిప్టు నుంచి మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వివరించారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల సాయం: బైడెన్ టెల్ అవీవ్: గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల (రూ.832.87 కోట్లు) మానవతా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ప్రకటన బుధవారం ప్రకటించారు. గాజా ప్రజలకు ఇప్పుడు ఆహారం, నీరు, ఔషధాలు, వసతి చాలా అవసరమని అన్నారు. గాజాకు ఇతర దేశాల నుంచి మానవతా సాయం చేరడానికి అంగీకరించాలని ఇజ్రాయెల్ కేబినెట్‌ను కోరానని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాము అందించే 100 మిలియన్ డాలర్ల సాయం హమాస్‌కు, ఉగ్రవాద సంస్థలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, బాధిత పాలస్తీనియన్లకు మాత్రమే అందేలా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని బైడెన్ పునరుద్ఘాటించారు. -
గాజాలో ఇస్లామిక్ జిహాద్ అగ్రనేత హతం
గాజా సిటీ: ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ మధ్య ఘర్షణ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి అడ్డాగా మారిన గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆదివారం మూడో రోజుకు చేరాయి. శుక్రవారం దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో తాజాగా ఇస్లామిక్ జిహాద్ ఉద్యమ అగ్రనేత ఖలీద్ మన్సూర్ హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత మూడు రోజుల్లో ఇజ్రాయెల్ ప్రకోపానికి బలైన వారి సంఖ్య 31కు చేరింది. ఖలీద్ మన్సూర్ దక్షిణ గాజాలో రఫా శరణార్థుల శిబిరంలోని ఓ అపార్టుమెంట్‌పై నివసిస్తున్నాడు. అదే అపార్టుమెంట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగింది. మరోవైపు ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న ఇస్లామిక్ జిహాద్ సంస్థ కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ నడుమ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, గాజాలో అధికారం చెలాయిస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనం పాటిస్తోంది. -
సౌదీ సంపద చీకటి నీడల్లో...
సౌదీ అసమ్మతివాది ఫాద్ అల్ ఫాఖీ అన్నట్టుగా సౌదీ పేదరికం ‘‘సాపేక్షికమైనది కాదు, అసలు సిసలైన కటిక పేదరికమే. రాచరిక పాలన సాగినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు’’. సౌదీ అరేబియా అంటేనే అష్టఐశ్వర్యాలతో తులతూగే దేశం కళ్లకు కడుతుంది. సౌదీ పౌరులంటేనే పెట్రో డాలర్లపై తప్ప నేలపై నడవని షేక్లని భావిస్తాం. ప్రపంచ చమురునిల్వలలో 18 శాతం ఉన్న అత్యంత సంపన్న దేశం అది. పెట్రోలియం ఎగుమతుల్లో అగ్రస్థానం దానిదే. రాజధాని రియాద్‌లోని సుందర సౌధాలు, షాపింగ్ మాల్స్ ధగధగలను సినిమాల్లో, టీ వీల్లో చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. ఆ విలాస వైభోగపు వెలుగుల మాటున పరుచుకున్న నీలి నీడల్లో కలిసిపోయిన ఇరుకు సందులుగానీ, కొద్ది కిలోమీటర్ల దూరంలో నగరానికి దక్షిణాన ఉన్న మురికి వాడలుగానీ ఎప్పుడూ కనిపించవు. విదేశీ మీడియా ప్రతినిధులు, పర్యాటకులు అటు తొంగి చూడటం దాదాపు అసాధ్యం. పేదరికాన్ని దాచేసే కనికట్టు విద్యలో సౌదీ తర్వాతే ఎవరైనా. సౌదీ పేదరికంపై 2011లో ఒక డాక్యుమెంటరీని నిర్మించిన నేరానికి ముగ్గురు యువకులు కటకటాలు లెక్కించాల్సివచ్చిం ది. నగర కేంద్రంలోని ఇరుకు సందులు బిచ్చగాళ్ల వాడలు. అక్కడ తప్ప ఎక్కడైనా బిచ్చమెత్తడం నేరమే. ఇక మురికివాడల్లో పగుళ్లువారిన చీకటి గుయ్యారాల్లాంటి ఇళ్లల్లోని ప్రజల లో అత్యధికులు పేదలే. జనాభాలో 25 నుం చి 30 శాతం దారిద్య్రరేఖకు (అక్కడి లెక్కన రోజుకు 17 డాలర్లు) దిగువన నివసిస్తున్నారనే చేదు వాస్తవానికి, సౌదీ చ మురు వైభోగానికి లంగరు అందదు. భూమి, నీరు, ఖనిజ సంపదలను అల్లా మానవాళికి వరంగా ఇచ్చాడని ఇస్లాం చెబుతుంది. ప్రపంచానికి ఇస్లామిక్ జిహాదీ ఉద్యమాలను ఎగుమతి చేస్తున్న సౌదీ రాచరిక కుటుంబాలే 70 నుంచి 80 శాతం చమురు నిక్షేపాలకు యజమానులు. కాకపోతే వారు ఇస్లాం బోధించినట్టు తమ సంపదలో కొంత భాగంతో దానధర్మాలు చేస్తారు. వారి భవనాల వద్ద పడిగాపులు పడేవారికి, సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకొన్నవారికి తృణమో పణమో ఇచ్చి పుణ్యాన్ని కొనుక్కుంటారు. వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ రెండు చరణాల కవిత్వాన్ని కట్టి వినిపించి మెప్పించినవారికి కార్లు సైతం అనుగ్రహిస్తారు. అయితే అప్పులు తీర్చడం కోసం, నీటి బిల్లు, కరెంటు బిల్లు చెల్లింపులకోసం, ఆహా రం కోసం వచ్చేవారే ఎక్కువ. ‘సౌదీ అరేబియాలో బతకడమంటే ధార్మిక సంస్థలో జీవితమని అర్థం. దాన ధర్మాలు చేయనివారు ముస్లింలు కానే కారు’ అని రాజు అబ్దుల్లా కుమారుడు ప్రిన్స్ సుల్తాన్ ఉవాచ. కానీ సౌదీ ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యసదుపాయాలను అందిస్తోందేగానీ... పేదరికం వాతబడ్డ వారికి ఉచిత ఆహారం అందించదు. యూరప్‌లోని సూప్ కేంద్రాలు, అమెరికాలోని ఆహార కూపన్లవంటి ఏర్పాట్లు లేవు. చే యి చాచడానికి సిగ్గుపడే కుటుంబాలు అర్థాకలితో చావకుండా బతక్కుండా అన్నట్టే బతకాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిధులన్నీ ఇస్లామ్ నిర్దేశించిన ‘జకత్’ అనే ధార్మిక విధిపై ఆధారపడినవే. వ్యక్తులు, కార్పొరేషన్లు తమ సంపదలో 2.5 శాతాన్ని ప్రభుత్వ ధార్మికనిధికి జమచేయాలి. అలా సమకూరే నిధులలో అత్యధిక భాగం అవి నీతి, ఆశ్రీత పక్షపాతాల దారులగుండా పయనించి, రాచరిక కుటుంబ సభ్యులకే చేరుతుం ది. అవినీతి, పేదరికం, నిరుద్యోగాల పట్ల ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెచ్చుపెరిగి పోతోంది. 2010లో బద్దలైన అర బ్బు విప్లవం భయానికి ప్రభుత్వం ఇటీవల పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతోంది. అయితే ప్రభు త్వ నిధులను సుందర భవనాల నిర్మాణం కోసం, ఆయుధ సంపద కోసమే ఎక్కువగా వెచ్చిస్తున్నారు. పైగా అంతర్జాతీయ ప్రాబ ల్యం కోసం వందల కోట్ల డాలర్లను తమకు అనుకూలమైన ఇస్లామిక్ ప్రభుత్వాలకు, గ్రూపులకు, ప్రభుత్వాలకు అందిస్తోంది. నేటికీ 90 శాతం ప్రభుత్వ రాబడికి ఆధారం చమురే. ఉపాధి అవకాశాలు విస్తరించడం లేదు. సౌదీ అరేబియా, ఖతార్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, బహ్రెయిన్‌లతో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీవోసీ) దేశాలన్నిటిలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. సౌదీ అరేబియాది రెండు అంచెల ఆర్థిక వ్యవస్థ. 1.6 కోట్ల మంది సౌదీలు కాగా మిగతా వారిలో అత్యధికులు విదేశీ కార్మికులు. సౌదీలో నిరుద్యోగం 10 శాతానికి పైగా ఉంది. ఏటా లక్ష మంది కొత్త శ్రామికులు తయారవుతున్నారు. నిరుద్యోగులలో 75 శాతం 30 ఏళ్లలోపు వారే. ప్రజలందరికి చెందాల్సిన సహజ సంపదలను విలాసాలకోసం రాచరికం తగలేస్తుండగా, త్వరత్వరగా చమురు నిల్వలు తరిగిపోతున్నాయి. మరో ఇరవై ఏళ్లకే సౌదీ చమురు దిగుమతి దేశంగా మారవచ్చని అంటున్నారు. ఆ తర్వా త పరిస్థితి ఏమిటనేది అంతు చిక్కడం లేదు. సౌదీకి ఆప్త మిత్రులైన అమెరికా, ఈయూలుగానీ, ఐఎంఫ్ వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలుగానీ ఇదేమిటని సౌదీ రాజును ప్రశ్నించరు. సౌదీ అసమ్మతివాది, ‘మూవ్మెంట్ ఫర్ ఇస్లామిక్ రిఫార్మ్’ నేత డాక్టర్ ఫాద్ అల్ ఫాఖీ అన్నట్టుగా సౌదీ పేదరికం ‘‘సాపేక్షికమైనది కాదు, అసలు సిసలైన కటిక పేదరికమే. రాచరిక పాలన సాగినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు’’. - పిళ్లా వెంకటేశ్వరరావు