సోనార్ బంగ్లాకు దారేదీ! | Bangladesh HC cancels registration of right-wing party Jamaat-e-Islami | Sakshi
Sakshi News home page

సోనార్ బంగ్లాకు దారేదీ!

Published Wed, Aug 7 2013 11:51 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

సోనార్ బంగ్లాకు దారేదీ!

సోనార్ బంగ్లాకు దారేదీ!

విశ్లేషణ: ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయింది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది.  
 
 భారత్‌ను గాయపరుస్తూ, తనూ గాయపడి పుట్టిన దేశం పాకిస్థాన్. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు కూడా చరిత్ర పునరావృతమైంది. ఆ చిన్నదేశం పెద్ద గాయంతోనే పుట్టింది. మాతృభాషాభిమానం (బెంగాలీ), ఆత్మగౌరవ నినాదం రగులుకుని అంతర్యు ద్ధంగా పరిణమించి దాని నుంచి బంగ్లాదేశ్ 1971, డిసెం బర్ 16న అవతరించింది. 1971 నాటి ఆ పరిణామాలు ఇప్పటికీ బంగ్లాను వెంటాడుతూనే ఉన్నాయి. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. నాటి అంతర్యుద్ధంలో జరి గిన ఘోరాల మీద ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ యుద్ధ నేరాల విచారణ ట్రిబ్యునల్ ఒక్కొక్క తీర్పూ వెల్లడిస్తూ ఉంటే, ఆ చిన్న దేశం హింసతో, రక్తపాతంతో తల్లడిల్లిపోతోంది.
 
 అంతర్యుద్ధం లో పాకిస్థాన్ సైన్యాల అండతో, స్వతంత్ర బంగ్లాదేశ్ వాదులను, హిందువులను, స్వతంత్ర బంగ్లా వాదనను సమర్థించిన రచయితలను, మేధావులను, పత్రికా రచయితలను ఊచకోత కోసిన జమాతే ఇస్లామీని, ఇంకొన్ని ఇతర సంస్థలనూ హసీనా ప్రభుత్వం విచారణ ట్రిబ్యునల్ ఎదుట నిలబెట్టింది. దీనితో తీవ్ర పర్యవసానాలు చోటు చేసుకున్నాయి. పుట్టుక నాటి గాయాల లోతు ఎంతటిదో మళ్లీ అనుభవానికి వచ్చింది. స్వతంత్ర దేశ చరిత్రలో ఏనాడూ లేనంత అలజడి, రక్తపాతాలతో బంగ్లా తల్లడిల్లిపోతున్నది. అంతర్యుద్ధం తొమ్మిది మాసాల కాలంలో జరి గిన అకృత్యాలు మానవతకు మచ్చ తెచ్చేవే. దీనికి కేంద్రబిందువు జమాత్. ఇది బంగ్లాలో అతి పెద్ద మత రాజకీయాల వేదిక. 1971లో జమాత్ పాక్ సేనలతో, బంగ్లాలో పాక్ సేనలకు తొత్తులుగా ఉన్న రజాకార్లు, అల్ బదర్, అల్ షామ్స్ వంటి మత సంస్థలతో కలిసి ఈ అకృత్యాలకు పాల్పడిందని ఆరోపణ.
 
 పాక్‌సేనలు ఢాకాలో లొంగిపోయిన తరువాత బంగ్లాదేశ్ స్వతంత్ర గడ్డగా నిలబడింది. కొత్తలో బంగ్లా విముక్తి పోరాట యోధుడు, అవామీ లీగ్ నాయకుడు, ‘బంగ్లాబంధు’ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో కలకత్తాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కొద్దికాలం(1971 ఏప్రిల్) ఆ చారిత్రక నగరం నుంచే నడిచింది. కానీ మూడేళ్లకి, 1975, ఆగస్టు 15న ముజిబుర్ రె హమాన్‌నూ, కుటుంబ సభ్యులనూ తిరుగుబాటు బృందం ఢాకాలోనే కాల్చి చంపింది. ముజిబుర్ ఐదుగురు కుమార్తెలలో ఇద్దరు విదేశాలలో ఉండటంతో బతికి బయటపడ్డారు. ప్రస్తుత అధ్యక్షురాలు, యుద్ధ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పా టు చేసిన షేక్ హసీనా బంగ్లా బంధు పెద్ద కుమార్తె. బం గ్లాదేశ్ అవామీ లీగ్ ప్రస్తుత నేత హసీనాయే.
 
 అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) బంగ్లా ప్రధాన పక్షాలు. బీఎన్‌పీకీ, జమాత్‌కూ పొత్తు ఉంది. ప్రస్తుత ఘర్ణణలో ఈ మూడు పార్టీలు అనుసరిస్తున్న వైఖరికి పునాది వాటి ఆవిర్భావంలోనే ఉంది. జమాత్‌ను 1941, ఆగస్టు 26న అబుల్ అలా మౌదుది లాహోర్‌లో స్థాపించాడు. పాకిస్థాన్ విభజన నినాదం ఊపందుకున్న నేపథ్యంలో ఇది జరిగింది. ఇస్లామిజమ్, ఇస్లామిక్ డెమోక్రసీలు లక్ష్యమని ఇది చెబుతుంది. షరి యత్ అమలు, సామాజిక - రాజకీయ ఇస్లాం కూడా ఆశయంగా చెప్పుకుంటుంది. కానీ సాంఘికంగా యథాపూర్వ వ్యవస్థ నిర్మితం కావాలన్నదే దాని అసలు లక్ష్యం. ఈజిప్ట్‌లోని ‘బ్రదర్‌హుడ్’తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. మరో మూడు చోట్ల జమాత్ ఉనికి కనిపిస్తుంది. బంగ్లా జమాత్, జమాతే ఇస్లామీ హింద్ (భారత్), జమా త్ ఇస్లామీ అఫ్ఘానిస్థాన్. ఈ మూడింటి మధ్య సంబంధాలున్నాయి. 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటాన్ని పాకిస్థాన్ జమాత్ వ్యతిరే కించింది.
 
 బీఎన్‌పీని 1978లో జియావుర్ రెహమాన్ స్థాపించాడు. ప్రస్తుత నేత ఖలేదా జియా, రెహమాన్ సతీమణి. జాతీయవాదం మినహా మిగిలిన సిద్ధాంతాలలో జమాత్‌కూ, బీఎన్‌పీకీ దగ్గర పోలికలున్నాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి షేక్ హసీనా రాజకీయ కక్షకు పాల్పడుతున్నారనీ, విపక్షాలను బలహీనం చేయచూస్తున్నారని బీఎన్‌పీ నేత ఖలేదా జియా ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ 1949, జూన్ 23న మౌల్వీ అబ్దుల్ హమీద్ ఖాన్ బాషానీ స్థాపించాడు. లౌకికవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం దీని ఆశయాలు. అందుకే ముక్తివాహిని స్థాపకుడు ఎంఏజీ ఉస్మానీతో కలిసి అంతర్యుద్ధం చేసింది. షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ పార్టీ నాయకుడే.  
 
 ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి 2008 ఎన్నికల ప్రచారంలో హసీనా వాగ్దానం చేశారు. ఆమె ప్రభుత్వం ఏర్ప డిన తరువాత 2010లో ఈ ట్రిబ్యునల్ పని ప్రారంభమైం ది. ఐక్యరాజ్యసమితి చట్టం మేరకు సమితికి చెందిన హ్యూ మన్ రైట్స్ వాచ్ మద్దతుతోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 2008లోనే ఏర్పాటు చేసిన యుద్ధ నేరాల నిజనిర్ధారణ సంఘం తన నివేదికను కూడా అప్పుడే సిద్ధం చేసింది.
 
 ఈ నివేదిక మొత్తం 1,600 మందిని అనుమానితులుగా నమో దు చేసింది. 2012 సంవత్సరానికి తొమ్మిది మంది మీద అభియోగాలు నమోదైనాయి. ఒక్కొక్కరిమీద ఐదు నుంచి ఏడు వరకు అభియోగాలు నమోదయ్యాయి. వాటిలో ఐదు వరకు రుజువైనట్టు ప్రకటిస్తూ ట్రిబ్యునల్ ఆ తీర్పు లు వెల్లడిస్తున్నది. ఇందులో ఏడుగురు జమాత్ పార్టీ వారు కాగా, బీఎన్‌పీ వారు ఇద్దరు. 2008కి ముందు జమాత్‌తో కలిసి బీఎన్‌పీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఒక్క పార్టీయే ఇప్పుడు జమాత్ రక్షణకు పూనుకుంది. జమాత్ విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శిబిర్ 2012, డిసెంబర్ 4న ఆందోళనలను ఆరంభించింది. తమ నాయకులను విడిచిపెట్టి, ట్రిబ్యునల్‌ను శాశ్వతంగా మూసివేయాలని శిబిర్ కోరుతోంది.
 
 2013, జనవరి 1న ట్రిబ్యునల్ తన తొలి తీర్పును ప్రకటిస్తూ, అబుల్ కలాం ఆజాద్ (బచూచు)కు ఉరిశిక్ష విధించింది. కానీ ఇతడు ఎప్పుడో దేశం విడిచిపెట్టి పారి పోయాడు. ఆజాద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని బంగ్లా పోలీ సులు వాదిస్తున్నారు. మొదటి తీర్పు వెలువడిన నాటి నుంచే ప్రధానంగా శిబిర్ రక్తపాతం మొదలుపెట్టి ఎడతెరిపిలేకుండా సాగిస్తోంది. ఫిబ్రవరి, 2013లో జమాత్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్ మొల్లాకు ట్రిబ్యునల్ జీవిత ఖైదు విధించింది. 1971లో ఖాదిర్ 344 మందిని కాల్చి చంపాడన్నది అభియోగం.
 
 ఈ ఫిబ్రవరి 28న మరో ప్రముఖుడు దెల్వర్ హుసేన్ సయ్యిద్‌కూ, మే 9న మహమ్మద్ ఖమ్రుద్దీన్ అనే మరో నాయకుడికి కూడా మరణ శిక్ష పడింది. జూలై 15న గులాం ఆజం అనే జమాత్ నాయకుడికి 90 సంవత్సరాల కారాగారశిక్ష విధించారు. రెండు రోజుల తరువాత అలీ హసన్ అనే మరో నాయకుడికి కూడా మరణదండన విధించారు. మరో ఏడుగురి శిక్ష ఖరారు కావలసి ఉంది. ఆ తీర్పులన్నీ కొన్ని మాసాలలోనే వెలువడతాయి. హసీనా ప్రభుత్వం, కొందరు ఇతర మేధావుల ప్రకారం, పాకిస్థాన్ 1971 అంతర్యుద్ధంలో 30 లక్షల మంది బంగ్లా దేశీయులను చంపింది. 2 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 10 లక్షల మంది బంగ్లా పౌరులు భారత సరిహద్దులలో తలదాచుకున్నారు. బంగ్లా శరణార్థుల అంశం అప్పుడు మనదేశం ఎదుర్కొన్న పెద్ద సమస్యలలో ఒకటి.
 
 ఒక్కొక్క తీర్పూ వెలువడుతూ ఉంటే బంగ్లా ప్రజలు, ముఖ్యంగా హిందువులు, మేధావులు గడగడలాడిపోతున్నారు. 1971 నాటి రక్తపాతాన్ని గుర్తుకు తెచ్చేందుకు జమాత్ కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలు రెచ్చి పోతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి, మార్చి 7 వరకు జరిగిన హింసాకాండలో వందమంది చనిపోయారు. మూడో తీర్పు వెలువడిన తరువాత మరో 67 మంది వరకు చని పోయారు. 10 వేల మంది జమాత్ మద్దతుదారులు ఆయుధాలతో ప్రభుత్వ కార్యాలయాల మీద, పోలీసు స్టేషన్ల మీద దాడులకు దిగడంతో చాలా ప్రాంతాలలో రక్షక దళాలను మోహరించవలసి వచ్చింది.
 
 ఈ నేపథ్యం లోనే జమాత్‌ను నిషేధించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనితో మళ్లీ హింస చెలరేగింది. ప్రపంచ దేశాలలో ఈ ట్రిబ్యునల్ మీద ఏకాభిప్రాయం లేదు. టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా అభియోగాలను ఎదుర్కొంటున్నవారికి క్షమాభిక్ష పెట్టాలని లేఖ రాయగా, యూరోపియన్ పార్లమెంట్ ఈ విచారణ పట్ల హర్షం వ్యక్తం చేసింది. కానీ బంగ్లాదేశ్ పౌరులు జమాత్ మీద పెంచుకున్న ఆగ్రహాన్ని బట్టి చూస్తే హసీనాలో కక్ష సాధిం పు యోచన కంటె రాజకీయంగా, చారిత్రకంగా, దేశ రక్షణ కోసం నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతను నెరవేర్చే పనిలో ఉన్నారని అనిపిస్తుంది. బంగ్లా న్యాయస్థానాల వైఖరి కూడా జమాత్‌కు వ్యతిరేకమే. జమాత్ మీద నిషే ధం ‘సంతోషం కలిగించే వార్త’ అని వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్ వ్యాఖ్యానించింది.
 
 లౌకికవాదం పునాదిగా ముందడుగు వేయాలన్న బంగ్లా ఆకాంక్షకు జమాత్ అతి పెద్ద అవరోధమన్న వాదన సర్వత్రా బలం పుంజుకుంది. మతోన్మాదాన్ని ఆశ్రయించి మనుగడ సాగిస్తున్న సంస్థలను నిషేధించాలని కోరుతూ ఈ జనవరిలో ఢాకాలోని షాబాగ్ కూడలిలో పెద్ద ప్రజా ప్రదర్శన జరిగింది. తరీఖత్ సమాఖ్య 2009, జనవరి 25న జమాత్ గుర్తింపును రద్దుచేయాలని ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తరీఖత్ సూఫీ సిద్ధాం తాన్ని నమ్మే చిన్న మత సంస్థ. అంతగా పేరు లేని ఈ సంస్థ మరో 24 మందితో కలిసి కోర్టుకెక్కింది.
 
  దీనితో ఈ ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయిం ది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది. ప్రస్తుత పరిణామాలు బంగ్లాదేశ్‌కు అగ్నిపరీక్ష. వీటి నుంచి బంగ్లా బయటపడటం అంటే మతోన్మాదం పిడికిలి నుంచి బయటపడటమే. అది బంగ్లాకు పెద్ద వరమైతే, భారత్‌కు పెద్ద ఊరట.     
 - డాక్టర్ గోపరాజు నారాయణరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement