Sheikh Mujibur Rahman
-
బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబ్ కాదు.. జియా!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆమె తండ్రి, బంగబంధు ముజిబుర్ రహా్మన్కు ప్రాధాన్యం తగ్గిస్తూ పాఠ్యాంశాలను మార్చాలని నిర్ణయించింది. పాఠ్యాంశాల్లో చారిత్రక ఘటనలను అతిగా చూపడం, కొందరు వ్యక్తులను అనవసరంగా కీర్తించడం వంటి వాటిని పూర్తిగా తొలగించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీని ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది బంగబంధుగా పిలిచే షేక్ ముజిబుర్ రహా్మన్ కాదు..జియా ఉర్ రహా్మన్ అని ఉంటుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ మిలటరీ అధికారిగా జియా పనిచేస్తున్నారు. అనంతర కాలంలో బంగ్లా ఆరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబుర్ రహా్మన్ కాగా, ఆయన ఆదేశాల మేరకు జియా ఉర్ రహా్మన్ ఆ ప్రకటనను చదివారనేది అవామీ లీగ్ మద్దతుదారుల వాదన. అయితే, జియా ఉర్ రహా్మనే స్వయంగా స్వతంత్ర ప్రకటనను తయారు చేసి, ప్రకటించారన్నది బీఎన్పీ వాదన. బీఎన్పీ చీఫ్‌గా మాజీ ప్రధాని ఖలేదా జియా ఉన్నారు. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా ముజీబ్ కుమార్తె కాగా ఖలేదా జియా కుమార్తె. 👉చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌కు నో బెయిల్ -
బంగ్లాదేశ్ అంటే భయపడాల్సిందేనా?
ముజిబుర్ రెహ్మాన్ కుటుంబానికి ఆగస్టు ఎప్పుడూ క్రూరమైన నెలగానే ఉంటోంది. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నిర్మాత షేక్ ముజిబుర్ రెహ్మాన్ తన మొత్తం కుటుంబంతో సహా 1975 ఆగస్టు 15 తెల్లవారు జామున సైనిక తిరుగుబాటులో మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు షేక్ హసీనా, షేక్ రెహానా భారతదేశానికి వలస రావలసి వచ్చింది.తన తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన షేక్ హసీనా, 2004 ఆగస్టు 21న తాను ప్రసంగిస్తున్న ర్యాలీపై గ్రెనేడ్ దాడిలో గాయపడి దాదాపు మరణం అంచులను తాకి వచ్చారు.బంగ్లాదేశ్‌లోని సిల్హెట్లో హర్కత్–ఉల్–జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో అవామీ లీగ్ కార్యకర్తలు చాలామంది మరణించారు. ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత ఆగస్టు మధ్యాహ్నం, హసీనాను ప్రధాని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఆమె నివాసంపై దాడి చేస్తామని బెదిరించిన నిరసనకారులను కాల్చి చంపడానికి ఇష్టపడని బంగ్లాదేశ్ సైన్యం, ఆమెను పదవి వీడి ఢాకా నుండి పారి పోవాలని కోరింది.బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం మేరకు కోటా కల్పిస్తున్నట్లు హసీనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోటాకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు సాగిన విద్యార్థి ప్రదర్శనల పట్ల షేక్ హసీనా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు. ఆ ఘటన... బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్– ఎ–ఇస్లామీ పార్టీల్లోని ఆమె ప్రత్యర్థుల మద్దతుతో పాలన మార్పు కోసం డిమాండ్‌గా మారిందని ఇక్కడ తిరిగి చెప్పాల్సిన పనిలేదు.బంగ్లాదేశ్ బాగుండాలని కోరుకునే వారికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, విద్యార్థుల ప్రతిఘటనా ఉద్యమం పాలనా మార్పు కోసం డిమాండ్‌గా మాత్రమే కాకుండా, భావజాల మార్పు కోసం ప్రతీకార యుద్ధంగా మారింది. హసీనా దేశం విడిచి పారి పోవడంతో, బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని ఇస్లాం విరుద్ధమని పేర్కొంటూ ఆందోళనాకారులు పగలగొట్టారు. అవామీ లీగ్ నాయకుల కార్యాలయాలను, ఇళ్లను కూడా తగలబెట్టారు. అంతకు ముందు రోజు రాత్రి రంగ్‌పూర్‌లో, ఇతర ప్రాంతాల్లో మైనా రిటీల ఇళ్లపై, గ్రామాలపై దాడులు జరి గాయి. ఇది బంగ్లాదేశ్‌కు, మరీ ముఖ్యంగా పొరుగు దేశా లకు ఏ సంకేతాలను ఇస్తోంది?గత రెండు ఎన్నికలలో రిగ్గింగ్ చేసిన ఆరోపణలతో సహా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, అవామీ లీగ్ దేశంలో లౌకిక పాలనను అందించింది. బంగ్లాదేశ్‌లో నివసించే మైనారిటీల భూములు కబ్జాకు గురై, అప్పుడప్పుడు దాడులు జరిగినప్పటికీ, ఏ సైనిక నియంతృత్వం లేదా దేశాన్ని పాలించిన మునుపటి పాలనా వ్యవస్ధల కంటే చాలా ఎక్కువ స్థాయిలో వాళ్లు సమాన అవకాశాలను పొందారన్నది వాస్తవం.చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో బౌద్ధ గిరిజనులపై దాడులు, బరిషల్, ఫరీద్‌పూర్‌లలో హిందూ గ్రామాలను తగులబెట్టడం తర చుగా జరుగుతూ వచ్చిన బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలించిన రోజుల్లోకి ప్రస్తుతం బంగ్లాదేశ్ దిగజారిపోవడం భారత్‌కు నిజంగానే ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామం ఇప్పటికే జనాభాపరంగా విస్తరించి ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోకి వేలాదిమంది శరణార్థులను నెట్టివేస్తుంది. బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలనలో, జిహాదీలను అఫ్గానిస్తాన్‌కు ఎగుమతి చేసి బంగ్లాదేశ్ అపఖ్యాతి పాలైంది. 2001లో తాలిబన్లను తరిమికొట్టిన తర్వాత, వారు బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చి, ఢాకాలోనే కాకుండా భారత గడ్డపై దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఇప్పుడూ అలా జరిగే అవకాశం గురించి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ‘తిరుగుబాటు’లో కొందరు పాకిస్తానీ యులను జోడించారని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. భారతదేశ ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదు లకు సురక్షితమైన స్వర్గధామాలను సృష్టించడానికి, బంగ్లాదేశ్‌లోని అనుకూల వాతా వరణాన్ని పాకిస్తాన్ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది.భారతదేశం వంటి పొరుగు దేశాలతో వాణిజ్యం, ప్రయాణ కనెక్టివిటీకి ప్రాధాన్యత నిస్తూనే స్వతంత్ర అలీన విదేశాంగ విధానాన్ని కోరుకునే వారికీ... చైనాతో సన్నిహిత సంబంధాలను నెరపడానికి అవసరమైతే భారతదేశ భద్రతా ప్రయోజనాలతో రాజీ పడటానికైనా సిద్ధపడేవారికీ మధ్య అవామీ లీగ్ పాలన విభజితమై ఉండింది. ఏదేమైనప్పటికీ, షేక్ హసీనా ఎల్లప్పుడూ ఇతరులకు ప్రాధాన్య తనిస్తూనే భారతదేశంతో మెరుగైన సంబంధాలను నిర్మించుకునే వైఖరిని తీసుకుంటూ వచ్చారు. తీస్తా నదిని దిగువకు అభివృద్ధి చేసే విషయంలో, చైనా ప్రతిపా దనను పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో భాగస్వామి కావాలనే భారత ప్రతిపాదనకు సూటిగా అంగీకరించారు. ఆ మేరకు బీజింగ్ ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కొట్టివేసిన కోటాలకు (బంగ్లా స్వాతంత్య్రోద్యమం కోసం పోరాడిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు) వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన నుండి, పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్ పాయింట్ పిలుపుగా విద్యార్థుల నిరసనలు రంగు మారుతున్న క్రమంలో ఇలా జరగటం అనేది మరొక విషయం. కానీ, చరిత్రకారులు, అంతర్జాతీయ సంబంధాల పరిశీలకులు ఏదో ఒక రోజు దీనిపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న చైనా కోరల గురించి భారతదేశమూ, గతంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అనేక అంశాలలో వ్యతిరేకించిన పాశ్చాత్య దేశాలూ జాగ్ర త్తగా పరిశీలించాల్సిన అవ సరం ఉంది. చైనాకు బంగ్లాదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల రుణా లను చెల్లించాల్సి ఉంది. దాని రుణ చెల్లింపులు ఇప్పటికే దాని విదేశీ మారక నిల్వలకు సంబంధించి సంక్షోభం సృష్టించాయి. ఇవి 2021 ఆగస్టు, 2024 జూన్ మధ్య కాలంలో 60 శాతం మేరకు పడి పోయాయి. శ్రీలంకను అనుసరించి బంగ్లాదేశ్ కూడా చైనా రుణ ఉచ్చులో మునిగిపోవచ్చు. రుణమాఫీకి బదులుగా రుణదాతకు వ్యూహాత్మక ఓడరేవులు, ఆర్థిక మండలాలను ఇవ్వవలసి వస్తుంది కూడా. చైనా ఓడలు నెలల పర్యంతం హిందూ మహాసముద్ర ప్రాంతాలను సర్వే చేస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంత దేశాలలో విస్త రించిన చైనా నావికాదళ ఉనికితో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. ఢాకాలో కొత్తగా రానున్న ప్రభుత్వంతో వ్యవహ రించేటప్పుడు ఈ అంశాలన్నింటినీ భారతీయ ఉన్నతాధి కారులు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ పరిస్థితులలో, భారతదేశం, ప్రజాస్వామ్య ప్రపంచం కాయవలసిన ఉత్తమమైన పందెం ఏమిటంటే బంగ్లా దేశ్ మిలిటరీకి మద్దతు ఇవ్వడం, ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం చైనా అనుకూల మంత్రులు లేదా కరడు గట్టిన ఛాందసవాదులతో నింపబడకుండా చూసుకోవడం. అవామీ లీగ్ పని ముగియలేదు. అది ఇప్పటికీ దేశంలో లోతైన మూలాలను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో మద్దతు దారులను కలిగి ఉంది. సైన్యం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో అవామీ లీగ్ తన స్థానాన్ని కోల్పోకూడదు.చివరగా, ప్రపంచం శరవేగంతో మారుతుంది. కమ్యూ నిజం రాత్రికి రాత్రే మరణించినట్లే, షేక్ హసీనా ప్రభుత్వం కూడా కుప్పకూలి పోయింది. ఏదేమైనప్పటికీ, భావజాలాలు పాలనా వ్యవస్థల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఇవి సరైన ‘వాతావరణ పరిస్థితుల’లో పునరాగమనం చేయ గలవు. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన భారతదేశం, ఇతర దేశాలన్నీ ఆ పాఠాన్ని గుర్తుంచుకోవడం మంచిది.జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త పీటీఐ తూర్పు రీజియన్ మాజీ హెడ్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఆసియా జట్టులో కోహ్లి
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రహమాన్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న రెండు మ్యాచ్‌ల ప్రత్యేక టి20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య మార్చి 21, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. కోహ్లి దీనిని అధికారికంగా ధ్రువీకరించకపోయినా అతను కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఆడతాడని సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత దీనిపై కోహ్లి స్పష్టతనిస్తాడు. భారత జట్టు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మార్చి 18న చివరి వన్డే ఆడనుండగా... మార్చి 29న ఐపీఎల్ ప్రారంభమవుతుంది. తన బిజీ షెడ్యూల్ నుంచి కోహ్లి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంది. కోహ్లి ఒక మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. మరో నలుగురు భారత క్రికెటర్ల పేర్లు మాత్రం ఖరారయ్యాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వెల్లడించింది. శిఖర్ ధావన్, రిషభ్ పంత్, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో ఆడనున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లతో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ఆసియా ఎలెవన్ టీమ్‌లో ఉంటారు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతున్నందున ఆ దేశపు ఆటగాళ్లను ఆహ్వానించడం లేదు. వరల్డ్ ఎలెవన్ జట్టు తరఫున డు ప్లెసిస్, గేల్, బెయిర్‌స్టో, పొలార్డ్ తదితరులు ఈ రెండు మ్యాచ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా ఎలెవన్: కోహ్లి, రాహుల్, ధావన్, పంత్, కుల్దీప్, షమీ(భారత్), తిసారా పెరీరా, మలింగ (శ్రీలంక), ముజీబుర్ రహమాన్, రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), సందీప్ లమిచానె (నేపాల్), ముస్తఫిజుర్ , తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మహ్ముదుల్లా (బంగ్లాదేశ్). వరల్డ్ ఎలెవన్: అలెక్స్ హేల్స్, బెయిర్‌స్టో (ఇంగ్లండ్), క్రిస్ గేల్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్), డు ప్లెసిస్, ఇన్‌గిడి (దక్షిణాఫ్రికా), ఆండ్రూ టై (ఆస్ట్రేలియా), మిచెల్ మెక్లీనగన్ (న్యూజిలాండ్). -
'పాక్ క్షమాపణలు చెప్పాల్సిందే'
ఢాకా: ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర వివాదానికి కారణమైంది. బంగ్లాదేశ్‌లోని పాక్ రాయబార కార్యాలయం అధికారి ఒకరు ఇటీవల ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. దాని ప్రకారం.. స్వతంత్ర బంగ్లాదేశ్‌ను ప్రకటించిన వారు షేక్ ముజిబుర్ రహ్మాన్ కాదు, జియా ఉర్రహ్మాన్ అని దాని సారాంశం. దీనిపై బంగ్లా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ హైకమిషనర్‌ను పిలిపించి సమన్లు అందజేసింది. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే, బంగ్లా ఆగ్రహాన్ని గ్రహించిన పాక్ అధికారులు ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించేశారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో బంగ్లా ఇంకా గుర్రుగానే ఉంది. గతంలోనూ పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే పలు తప్పిదాలు చేసిందని, ఇప్పటికీ అదే తీరు కొనసాగుతోందని విమర్శించింది. ఇదంతా కావాలనే చరిత్రను వక్రీకరిస్తూ తమను అప్రతిష్ట పాలు చేసేందుకు చేస్తున్న యత్నంగా అభివర్ణించింది. ఇలాంటి యత్నాలు ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే కాదు, మూడు మిలియన్ల మంది అమరవీరుల త్యాగాలను పల్చన చేయటమేనని తెలిపింది. పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్‌కు 1971లో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ స్వతంత్రాన్ని ప్రకటించిన విషయాన్ని తక్కువ చేయటం తగదని పేర్కొంది. -
సోనార్ బంగ్లాకు దారేదీ!
విశ్లేషణ: ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయింది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది. భారత్‌ను గాయపరుస్తూ, తనూ గాయపడి పుట్టిన దేశం పాకిస్థాన్. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు కూడా చరిత్ర పునరావృతమైంది. ఆ చిన్నదేశం పెద్ద గాయంతోనే పుట్టింది. మాతృభాషాభిమానం (బెంగాలీ), ఆత్మగౌరవ నినాదం రగులుకుని అంతర్యు ద్ధంగా పరిణమించి దాని నుంచి బంగ్లాదేశ్ 1971, డిసెం బర్ 16న అవతరించింది. 1971 నాటి ఆ పరిణామాలు ఇప్పటికీ బంగ్లాను వెంటాడుతూనే ఉన్నాయి. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. నాటి అంతర్యుద్ధంలో జరి గిన ఘోరాల మీద ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ యుద్ధ నేరాల విచారణ ట్రిబ్యునల్ ఒక్కొక్క తీర్పూ వెల్లడిస్తూ ఉంటే, ఆ చిన్న దేశం హింసతో, రక్తపాతంతో తల్లడిల్లిపోతోంది. అంతర్యుద్ధం లో పాకిస్థాన్ సైన్యాల అండతో, స్వతంత్ర బంగ్లాదేశ్ వాదులను, హిందువులను, స్వతంత్ర బంగ్లా వాదనను సమర్థించిన రచయితలను, మేధావులను, పత్రికా రచయితలను ఊచకోత కోసిన జమాతే ఇస్లామీని, ఇంకొన్ని ఇతర సంస్థలనూ హసీనా ప్రభుత్వం విచారణ ట్రిబ్యునల్ ఎదుట నిలబెట్టింది. దీనితో తీవ్ర పర్యవసానాలు చోటు చేసుకున్నాయి. పుట్టుక నాటి గాయాల లోతు ఎంతటిదో మళ్లీ అనుభవానికి వచ్చింది. స్వతంత్ర దేశ చరిత్రలో ఏనాడూ లేనంత అలజడి, రక్తపాతాలతో బంగ్లా తల్లడిల్లిపోతున్నది. అంతర్యుద్ధం తొమ్మిది మాసాల కాలంలో జరి గిన అకృత్యాలు మానవతకు మచ్చ తెచ్చేవే. దీనికి కేంద్రబిందువు జమాత్. ఇది బంగ్లాలో అతి పెద్ద మత రాజకీయాల వేదిక. 1971లో జమాత్ పాక్ సేనలతో, బంగ్లాలో పాక్ సేనలకు తొత్తులుగా ఉన్న రజాకార్లు, అల్ బదర్, అల్ షామ్స్ వంటి మత సంస్థలతో కలిసి ఈ అకృత్యాలకు పాల్పడిందని ఆరోపణ. పాక్‌సేనలు ఢాకాలో లొంగిపోయిన తరువాత బంగ్లాదేశ్ స్వతంత్ర గడ్డగా నిలబడింది. కొత్తలో బంగ్లా విముక్తి పోరాట యోధుడు, అవామీ లీగ్ నాయకుడు, ‘బంగ్లాబంధు’ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో కలకత్తాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కొద్దికాలం(1971 ఏప్రిల్) ఆ చారిత్రక నగరం నుంచే నడిచింది. కానీ మూడేళ్లకి, 1975, ఆగస్టు 15న ముజిబుర్ రె హమాన్నూ, కుటుంబ సభ్యులనూ తిరుగుబాటు బృందం ఢాకాలోనే కాల్చి చంపింది. ముజిబుర్ ఐదుగురు కుమార్తెలలో ఇద్దరు విదేశాలలో ఉండటంతో బతికి బయటపడ్డారు. ప్రస్తుత అధ్యక్షురాలు, యుద్ధ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పా టు చేసిన షేక్ హసీనా బంగ్లా బంధు పెద్ద కుమార్తె. బం గ్లాదేశ్ అవామీ లీగ్ ప్రస్తుత నేత హసీనాయే. అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) బంగ్లా ప్రధాన పక్షాలు. బీఎన్‌పీకీ, జమాత్‌కూ పొత్తు ఉంది. ప్రస్తుత ఘర్ణణలో ఈ మూడు పార్టీలు అనుసరిస్తున్న వైఖరికి పునాది వాటి ఆవిర్భావంలోనే ఉంది. జమాత్‌ను 1941, ఆగస్టు 26న అబుల్ అలా మౌదుది లాహోర్‌లో స్థాపించాడు. పాకిస్థాన్ విభజన నినాదం ఊపందుకున్న నేపథ్యంలో ఇది జరిగింది. ఇస్లామిజమ్, ఇస్లామిక్ డెమోక్రసీలు లక్ష్యమని ఇది చెబుతుంది. షరి యత్ అమలు, సామాజిక - రాజకీయ ఇస్లాం కూడా ఆశయంగా చెప్పుకుంటుంది. కానీ సాంఘికంగా యథాపూర్వ వ్యవస్థ నిర్మితం కావాలన్నదే దాని అసలు లక్ష్యం. ఈజిప్ట్‌లోని ‘బ్రదర్హుడ్’తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. మరో మూడు చోట్ల జమాత్ ఉనికి కనిపిస్తుంది. బంగ్లా జమాత్, జమాతే ఇస్లామీ హింద్ (భారత్), జమా త్ ఇస్లామీ అఫ్ఘానిస్థాన్. ఈ మూడింటి మధ్య సంబంధాలున్నాయి. 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటాన్ని పాకిస్థాన్ జమాత్ వ్యతిరే కించింది. బీఎన్పీని 1978లో జియావుర్ రెహమాన్ స్థాపించాడు. ప్రస్తుత నేత ఖలేదా జియా, రెహమాన్ సతీమణి. జాతీయవాదం మినహా మిగిలిన సిద్ధాంతాలలో జమాత్‌కూ, బీఎన్‌పీకీ దగ్గర పోలికలున్నాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి షేక్ హసీనా రాజకీయ కక్షకు పాల్పడుతున్నారనీ, విపక్షాలను బలహీనం చేయచూస్తున్నారని బీఎన్పీ నేత ఖలేదా జియా ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ 1949, జూన్ 23న మౌల్వీ అబ్దుల్ హమీద్ ఖాన్ బాషానీ స్థాపించాడు. లౌకికవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం దీని ఆశయాలు. అందుకే ముక్తివాహిని స్థాపకుడు ఎంఏజీ ఉస్మానీతో కలిసి అంతర్యుద్ధం చేసింది. షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ పార్టీ నాయకుడే. ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి 2008 ఎన్నికల ప్రచారంలో హసీనా వాగ్దానం చేశారు. ఆమె ప్రభుత్వం ఏర్ప డిన తరువాత 2010లో ఈ ట్రిబ్యునల్ పని ప్రారంభమైం ది. ఐక్యరాజ్యసమితి చట్టం మేరకు సమితికి చెందిన హ్యూ మన్ రైట్స్ వాచ్ మద్దతుతోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 2008లోనే ఏర్పాటు చేసిన యుద్ధ నేరాల నిజనిర్ధారణ సంఘం తన నివేదికను కూడా అప్పుడే సిద్ధం చేసింది. ఈ నివేదిక మొత్తం 1,600 మందిని అనుమానితులుగా నమో దు చేసింది. 2012 సంవత్సరానికి తొమ్మిది మంది మీద అభియోగాలు నమోదైనాయి. ఒక్కొక్కరిమీద ఐదు నుంచి ఏడు వరకు అభియోగాలు నమోదయ్యాయి. వాటిలో ఐదు వరకు రుజువైనట్టు ప్రకటిస్తూ ట్రిబ్యునల్ ఆ తీర్పు లు వెల్లడిస్తున్నది. ఇందులో ఏడుగురు జమాత్ పార్టీ వారు కాగా, బీఎన్పీ వారు ఇద్దరు. 2008కి ముందు జమాత్‌తో కలిసి బీఎన్పీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఒక్క పార్టీయే ఇప్పుడు జమాత్ రక్షణకు పూనుకుంది. జమాత్ విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శిబిర్ 2012, డిసెంబర్ 4న ఆందోళనలను ఆరంభించింది. తమ నాయకులను విడిచిపెట్టి, ట్రిబ్యునల్‌ను శాశ్వతంగా మూసివేయాలని శిబిర్ కోరుతోంది. 2013, జనవరి 1న ట్రిబ్యునల్ తన తొలి తీర్పును ప్రకటిస్తూ, అబుల్ కలాం ఆజాద్ (బచూచు)కు ఉరిశిక్ష విధించింది. కానీ ఇతడు ఎప్పుడో దేశం విడిచిపెట్టి పారి పోయాడు. ఆజాద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని బంగ్లా పోలీ సులు వాదిస్తున్నారు. మొదటి తీర్పు వెలువడిన నాటి నుంచే ప్రధానంగా శిబిర్ రక్తపాతం మొదలుపెట్టి ఎడతెరిపిలేకుండా సాగిస్తోంది. ఫిబ్రవరి, 2013లో జమాత్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్ మొల్లాకు ట్రిబ్యునల్ జీవిత ఖైదు విధించింది. 1971లో ఖాదిర్ 344 మందిని కాల్చి చంపాడన్నది అభియోగం. ఈ ఫిబ్రవరి 28న మరో ప్రముఖుడు దెల్వర్ హుసేన్ సయ్యిద్కూ, మే 9న మహమ్మద్ ఖమ్రుద్దీన్ అనే మరో నాయకుడికి కూడా మరణ శిక్ష పడింది. జూలై 15న గులాం ఆజం అనే జమాత్ నాయకుడికి 90 సంవత్సరాల కారాగారశిక్ష విధించారు. రెండు రోజుల తరువాత అలీ హసన్ అనే మరో నాయకుడికి కూడా మరణదండన విధించారు. మరో ఏడుగురి శిక్ష ఖరారు కావలసి ఉంది. ఆ తీర్పులన్నీ కొన్ని మాసాలలోనే వెలువడతాయి. హసీనా ప్రభుత్వం, కొందరు ఇతర మేధావుల ప్రకారం, పాకిస్థాన్ 1971 అంతర్యుద్ధంలో 30 లక్షల మంది బంగ్లా దేశీయులను చంపింది. 2 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 10 లక్షల మంది బంగ్లా పౌరులు భారత సరిహద్దులలో తలదాచుకున్నారు. బంగ్లా శరణార్థుల అంశం అప్పుడు మనదేశం ఎదుర్కొన్న పెద్ద సమస్యలలో ఒకటి. ఒక్కొక్క తీర్పూ వెలువడుతూ ఉంటే బంగ్లా ప్రజలు, ముఖ్యంగా హిందువులు, మేధావులు గడగడలాడిపోతున్నారు. 1971 నాటి రక్తపాతాన్ని గుర్తుకు తెచ్చేందుకు జమాత్ కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలు రెచ్చి పోతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి, మార్చి 7 వరకు జరిగిన హింసాకాండలో వందమంది చనిపోయారు. మూడో తీర్పు వెలువడిన తరువాత మరో 67 మంది వరకు చని పోయారు. 10 వేల మంది జమాత్ మద్దతుదారులు ఆయుధాలతో ప్రభుత్వ కార్యాలయాల మీద, పోలీసు స్టేషన్ల మీద దాడులకు దిగడంతో చాలా ప్రాంతాలలో రక్షక దళాలను మోహరించవలసి వచ్చింది. ఈ నేపథ్యం లోనే జమాత్‌ను నిషేధించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనితో మళ్లీ హింస చెలరేగింది. ప్రపంచ దేశాలలో ఈ ట్రిబ్యునల్ మీద ఏకాభిప్రాయం లేదు. టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా అభియోగాలను ఎదుర్కొంటున్నవారికి క్షమాభిక్ష పెట్టాలని లేఖ రాయగా, యూరోపియన్ పార్లమెంట్ ఈ విచారణ పట్ల హర్షం వ్యక్తం చేసింది. కానీ బంగ్లాదేశ్ పౌరులు జమాత్ మీద పెంచుకున్న ఆగ్రహాన్ని బట్టి చూస్తే హసీనాలో కక్ష సాధిం పు యోచన కంటె రాజకీయంగా, చారిత్రకంగా, దేశ రక్షణ కోసం నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతను నెరవేర్చే పనిలో ఉన్నారని అనిపిస్తుంది. బంగ్లా న్యాయస్థానాల వైఖరి కూడా జమాత్‌కు వ్యతిరేకమే. జమాత్ మీద నిషే ధం ‘సంతోషం కలిగించే వార్త’ అని వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్ వ్యాఖ్యానించింది. లౌకికవాదం పునాదిగా ముందడుగు వేయాలన్న బంగ్లా ఆకాంక్షకు జమాత్ అతి పెద్ద అవరోధమన్న వాదన సర్వత్రా బలం పుంజుకుంది. మతోన్మాదాన్ని ఆశ్రయించి మనుగడ సాగిస్తున్న సంస్థలను నిషేధించాలని కోరుతూ ఈ జనవరిలో ఢాకాలోని షాబాగ్ కూడలిలో పెద్ద ప్రజా ప్రదర్శన జరిగింది. తరీఖత్ సమాఖ్య 2009, జనవరి 25న జమాత్ గుర్తింపును రద్దుచేయాలని ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తరీఖత్ సూఫీ సిద్ధాం తాన్ని నమ్మే చిన్న మత సంస్థ. అంతగా పేరు లేని ఈ సంస్థ మరో 24 మందితో కలిసి కోర్టుకెక్కింది. దీనితో ఈ ఆగస్టు 1న బంగ్లా హైకోర్టు జమాత్ గుర్తింపును రద్దు చేసింది. ఫలితంగా ఎన్నికలలో పోటీకి అర్హత కోల్పోయిం ది. మరో 6 మాసాలలో బంగ్లా ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్ర నాయకులకు వరసగా పడుతున్న కఠిన శిక్షలతో ఉడికిపోతున్న జమాత్ సంస్థకు హైకోర్టు తీర్పుతో పుండు మీద కారం చల్లినట్లయింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కూడా కొట్టివేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనితో హింసాకాండ మరింత పెరిగింది. ప్రస్తుత పరిణామాలు బంగ్లాదేశ్‌కు అగ్నిపరీక్ష. వీటి నుంచి బంగ్లా బయటపడటం అంటే మతోన్మాదం పిడికిలి నుంచి బయటపడటమే. అది బంగ్లాకు పెద్ద వరమైతే, భారత్‌కు పెద్ద ఊరట. - డాక్టర్ గోపరాజు నారాయణరావు