బంగ్లాదేశ్‌ అంటే భయపడాల్సిందేనా? | Sakshi Guest Column On Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ అంటే భయపడాల్సిందేనా?

Published Thu, Aug 8 2024 6:35 AM | Last Updated on Thu, Aug 8 2024 7:13 AM

Sakshi Guest Column On Bangladesh

విశ్లేషణ

ముజిబుర్‌ రెహ్మాన్‌ కుటుంబానికి ఆగస్టు ఎప్పుడూ క్రూరమైన నెలగానే ఉంటోంది. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపక నిర్మాత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ తన మొత్తం కుటుంబంతో సహా 1975 ఆగస్టు 15 తెల్లవారు జామున సైనిక తిరుగుబాటులో మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు షేక్‌ హసీనా, షేక్‌ రెహానా భారతదేశానికి వలస రావలసి వచ్చింది.

తన తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన షేక్‌ హసీనా, 2004 ఆగస్టు 21న తాను ప్రసంగిస్తున్న ర్యాలీపై గ్రెనేడ్‌ దాడిలో గాయపడి దాదాపు మరణం అంచులను తాకి వచ్చారు.బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో హర్కత్‌–ఉల్‌–జిహాద్‌ అనే ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో అవామీ లీగ్‌ కార్యకర్తలు చాలామంది మరణించారు. ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత ఆగస్టు మధ్యాహ్నం, హసీనాను ప్రధాని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ, ఆమె నివాసంపై దాడి చేస్తామని బెదిరించిన నిరసనకారులను కాల్చి చంపడానికి ఇష్టపడని బంగ్లాదేశ్‌ సైన్యం, ఆమెను పదవి వీడి ఢాకా నుండి పారి పోవాలని కోరింది.

బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం మేరకు కోటా కల్పిస్తున్నట్లు హసీనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోటాకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు సాగిన విద్యార్థి ప్రదర్శనల పట్ల షేక్‌ హసీనా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు. ఆ ఘటన... బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ, జమాత్‌– ఎ–ఇస్లామీ పార్టీల్లోని ఆమె ప్రత్యర్థుల మద్దతుతో పాలన మార్పు కోసం డిమాండ్‌గా మారిందని ఇక్కడ తిరిగి చెప్పాల్సిన పనిలేదు.

బంగ్లాదేశ్‌ బాగుండాలని కోరుకునే వారికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, విద్యార్థుల ప్రతిఘటనా ఉద్యమం పాలనా మార్పు కోసం డిమాండ్‌గా మాత్రమే కాకుండా, భావజాల మార్పు కోసం ప్రతీకార యుద్ధంగా మారింది. హసీనా దేశం విడిచి పారి పోవడంతో, బంగ్లాదేశ్‌ జాతిపిత ముజిబుర్‌ రెహ్మాన్‌ విగ్రహాన్ని ఇస్లాం విరుద్ధమని పేర్కొంటూ ఆందోళనాకారులు పగలగొట్టారు. అవామీ లీగ్‌ నాయకుల కార్యాలయాలను, ఇళ్లను కూడా తగలబెట్టారు. అంతకు ముందు రోజు రాత్రి రంగ్‌పూర్‌లో, ఇతర ప్రాంతాల్లో మైనా రిటీల ఇళ్లపై, గ్రామాలపై దాడులు జరి గాయి. ఇది బంగ్లాదేశ్‌కు, మరీ ముఖ్యంగా పొరుగు దేశా లకు ఏ సంకేతాలను ఇస్తోంది?

గత రెండు ఎన్నికలలో రిగ్గింగ్‌ చేసిన ఆరోపణలతో సహా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, అవామీ లీగ్‌ దేశంలో లౌకిక పాలనను అందించింది. బంగ్లాదేశ్‌లో నివసించే మైనారిటీల భూములు కబ్జాకు గురై, అప్పుడప్పుడు దాడులు జరిగినప్పటికీ, ఏ సైనిక నియంతృత్వం లేదా దేశాన్ని పాలించిన మునుపటి పాలనా వ్యవస్ధల కంటే చాలా ఎక్కువ స్థాయిలో వాళ్లు సమాన అవకాశాలను పొందారన్నది వాస్తవం.

చిట్టగాంగ్‌ కొండ ప్రాంతాలలో బౌద్ధ గిరిజనులపై దాడులు, బరిషల్, ఫరీద్‌పూర్‌లలో హిందూ గ్రామాలను తగులబెట్టడం తర చుగా జరుగుతూ వచ్చిన బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలించిన రోజుల్లోకి ప్రస్తుతం బంగ్లాదేశ్‌ దిగజారిపోవడం భారత్‌కు నిజంగానే ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామం ఇప్పటికే జనాభాపరంగా విస్తరించి ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోకి వేలాదిమంది శరణార్థులను నెట్టివేస్తుంది. 

బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలనలో, జిహాదీలను అఫ్గానిస్తాన్‌కు ఎగుమతి చేసి బంగ్లాదేశ్‌ అపఖ్యాతి పాలైంది. 2001లో తాలిబన్లను తరిమికొట్టిన తర్వాత, వారు బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చి, ఢాకాలోనే కాకుండా భారత గడ్డపై దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఇప్పుడూ అలా జరిగే అవకాశం గురించి భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ‘తిరుగుబాటు’లో కొందరు పాకిస్తానీ యులను జోడించారని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. భారతదేశ ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదు లకు సురక్షితమైన స్వర్గధామాలను సృష్టించడానికి, బంగ్లాదేశ్‌లోని అనుకూల వాతా వరణాన్ని పాకిస్తాన్‌ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది.

భారతదేశం వంటి పొరుగు దేశాలతో వాణిజ్యం, ప్రయాణ కనెక్టివిటీకి ప్రాధాన్యత నిస్తూనే స్వతంత్ర అలీన విదేశాంగ విధానాన్ని కోరుకునే వారికీ... చైనాతో సన్నిహిత సంబంధాలను నెరపడానికి అవసరమైతే భారతదేశ భద్రతా ప్రయోజనాలతో రాజీ పడటానికైనా సిద్ధపడేవారికీ మధ్య అవామీ లీగ్‌ పాలన విభజితమై ఉండింది. ఏదేమైనప్పటికీ, షేక్‌ హసీనా ఎల్లప్పుడూ ఇతరులకు ప్రాధాన్య తనిస్తూనే భారతదేశంతో మెరుగైన సంబంధాలను నిర్మించుకునే వైఖరిని తీసుకుంటూ వచ్చారు. తీస్తా నదిని దిగువకు అభివృద్ధి చేసే విషయంలో, చైనా ప్రతిపా దనను పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో భాగస్వామి కావాలనే భారత ప్రతిపాదనకు సూటిగా అంగీకరించారు. ఆ మేరకు బీజింగ్‌ ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు కొట్టివేసిన కోటాలకు (బంగ్లా స్వాతంత్య్రోద్యమం కోసం పోరాడిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు) వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన నుండి, పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్‌ పాయింట్‌ పిలుపుగా విద్యార్థుల నిరసనలు రంగు మారుతున్న క్రమంలో ఇలా జరగటం అనేది మరొక విషయం. కానీ, చరిత్రకారులు, అంతర్జాతీయ సంబంధాల పరిశీలకులు ఏదో ఒక రోజు దీనిపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. 

ఏమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న చైనా కోరల గురించి భారతదేశమూ, గతంలో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని అనేక అంశాలలో వ్యతిరేకించిన పాశ్చాత్య దేశాలూ జాగ్ర త్తగా పరిశీలించాల్సిన అవ సరం ఉంది.  చైనాకు బంగ్లాదేశ్‌ దాదాపు 7 బిలియన్‌ డాలర్ల రుణా లను చెల్లించాల్సి ఉంది. దాని రుణ చెల్లింపులు ఇప్పటికే దాని విదేశీ మారక నిల్వలకు సంబంధించి సంక్షోభం సృష్టించాయి. ఇవి 2021 ఆగస్టు, 2024 జూన్‌ మధ్య కాలంలో 60 శాతం మేరకు పడి పోయాయి. శ్రీలంకను అనుసరించి బంగ్లాదేశ్‌ కూడా చైనా రుణ ఉచ్చులో మునిగిపోవచ్చు. 

రుణమాఫీకి బదులుగా రుణదాతకు వ్యూహాత్మక ఓడరేవులు, ఆర్థిక మండలాలను ఇవ్వవలసి వస్తుంది కూడా. చైనా ఓడలు నెలల పర్యంతం హిందూ మహాసముద్ర ప్రాంతాలను సర్వే చేస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంత దేశాలలో విస్త రించిన చైనా నావికాదళ ఉనికితో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. ఢాకాలో కొత్తగా రానున్న ప్రభుత్వంతో వ్యవహ రించేటప్పుడు ఈ అంశాలన్నింటినీ భారతీయ ఉన్నతాధి కారులు పరిగణనలోకి తీసుకోవాలి. 

ఈ పరిస్థితులలో, భారతదేశం, ప్రజాస్వామ్య ప్రపంచం కాయవలసిన ఉత్తమమైన పందెం ఏమిటంటే బంగ్లా దేశ్‌ మిలిటరీకి మద్దతు ఇవ్వడం, ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం చైనా అనుకూల మంత్రులు లేదా కరడు గట్టిన ఛాందసవాదులతో నింపబడకుండా చూసుకోవడం. అవామీ లీగ్‌ పని ముగియలేదు. అది ఇప్పటికీ దేశంలో లోతైన మూలాలను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో మద్దతు దారులను కలిగి ఉంది. సైన్యం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో అవామీ లీగ్‌ తన స్థానాన్ని కోల్పోకూడదు.

చివరగా, ప్రపంచం శరవేగంతో మారుతుంది. కమ్యూ నిజం రాత్రికి రాత్రే మరణించినట్లే, షేక్‌ హసీనా ప్రభుత్వం కూడా కుప్పకూలి పోయింది. ఏదేమైనప్పటికీ, భావజాలాలు పాలనా వ్యవస్థల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఇవి సరైన ‘వాతావరణ పరిస్థితుల’లో పునరాగమనం చేయ గలవు. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన భారతదేశం, ఇతర దేశాలన్నీ ఆ పాఠాన్ని గుర్తుంచుకోవడం మంచిది.

జయంత రాయ్‌ చౌధురీ 
వ్యాసకర్త పీటీఐ తూర్పు రీజియన్‌ మాజీ హెడ్‌
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement