అనుకోని అతిథికి అభ్యంతరాలు | Sakshi Guest Column On Bangladesh Sheikh Hasina Issue | Sakshi
Sakshi News home page

అనుకోని అతిథికి అభ్యంతరాలు

Published Fri, Aug 16 2024 12:17 AM | Last Updated on Fri, Aug 16 2024 12:17 AM

Sakshi Guest Column On Bangladesh Sheikh Hasina Issue

విశ్లేషణ

బంగ్లాదేశ్‌ అంతర్గత పరిణామాల ఫలితంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్‌ హసీనా ఆశ్రయం కోరుతూ భారత్‌కు వచ్చారు. అయితే భారత్‌ ఆమెకు శాశ్వత ఆశ్రయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయినా... అత్యవసరంగా ఆమెను అక్కున చేర్చుకొంది. ఆ విధంగా ఆమె ప్రాణాలను కాపాడ గలిగింది. ఇటీవలి కాలంలో భారత విధానంలో చోటు చేసుకున్న మార్పులు, బంగ్లాదేశ్‌తో భవిష్యత్తులో ఎదురవ్వగల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భారత్‌ శాశ్వత ఆశ్రయాన్ని నిరాకరిస్తోంది. ఇదే సమయంలో హసీనా బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని ఆశిస్తున్నా అక్కడ ఆమెకు ద్వారాలు మూసుకొన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌ ఆమె కోసం తగిన నివాసప్రాంతాన్ని వెదకడంలో తన దౌత్య పరపతిని ఉపయోగించే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. పాకిస్తాన్‌ కబంధ హస్తాల నుండి స్వాతంత్య్రం కోసం పోరాటానికి నాయకత్వం వహించిన, ఆ దేశ ప్రజాస్వామ్య దశ ప్రక్రియలో ఎక్కువ భాగం నాయకత్వం వహించిన కుటుంబం ఇకపై దేశ భవిష్యత్తులో ఎటువంటి పాత్రనూ కలిగి ఉండదు. పెరుగుతున్న హింసాకాండ మధ్య షేక్‌ హసీనా ఢాకా నుండి నిష్క్రమించడం అనేది బంగ్లాదేశ్‌లో ఆమె కుటుంబ ఉనికి ముగింపును సూచిస్తుంది. ముజిబుర్‌ రెహ్మాన్‌ విగ్రహంపై మూత్ర విసర్జన చేస్తున్న నిరసనకారుడి చిత్రాలూ, మాజీ ప్రధాని లోదుస్తు లను ప్రదర్శిస్తున్న ఇతరుల చిత్రాలూ ఆ కుటుంబం పట్ల ప్రజల్లో పెరిగిన ద్వేషాన్ని తెలియజేస్తున్నాయి.

హింసాత్మక మార్గాల ద్వారా ప్రజల నిరసనలను అరికట్టేందుకు బంగ్లా సైన్యం నిరాకరించడంతో, షేక్‌ హసీనా ఆశ్రయం కోరుతూ భారత్‌కు వచ్చారు. ఆమె భారత్‌లో ఆశ్రయం పొందడం ఇదే మొదటి సారి కాదు. 1975లో ఆమె తండ్రి ముజిబుర్‌ రెహ్మాన్‌ హత్యకు గురైనప్పుడు హసీనా, ఆమె కుటుంబం భారతదేశంలో నివసించారు. ఆరేళ్లపాటు న్యూఢిల్లీలో ఉన్న హసీనా, ఆ ఉపకారాన్ని మరచిపోలేదు. ఆమె అప్పుడు ప్రధాని కుమార్తె. తన తండ్రి ఢాకాలో ఘోర హత్యకు గురైనప్పుడు ఆమె జర్మనీలో ఉన్నారు. అందువల్లే ఆమె ప్రాణం నిలబడింది. 

ఈసారి మాత్రం ఆమె పదవి నుంచి వైదొలిగిన ప్రధానమంత్రిగా ఉన్నారు. భారత్‌ తనను నిరాశపరచదన్న ఆమె విశ్వాసం చెల్లుబాటైంది. ఆమెకు జాతీయ భద్రతా సలహాదారు స్వాగతం పలికారు, అనంతరం విదేశాంగ మంత్రి ఆమెను కలిశారు. ఆమె ప్రస్తుతం న్యూ ఢిల్లీలోని సురక్షిత గృహంలో ఉన్నారు, ఆమె ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుంటారు. ఆమె ఇకపై దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండరు కాబట్టి ఆమె ఆశ్రయం పొందాలనుకునే దేశం నుండి వీసా అవసరం. ఆమె భవిష్యత్‌ గమనంలో భారత్‌ తనదైన పాత్ర పోషిస్తుంది.

ఆమె భారతదేశానికి చేరుకున్న సందర్భంలో, డాక్టర్‌ జైశంకర్‌ మాట్లాడుతూ, ‘చాలా తక్కువ సమయంలో, భారతదేశానికి రావడా నికి ఆమె అనుమతిని కోరారు’ అని పేర్కొన్నారు. తన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ప్రభుత్వం ఆమెకు సమయం ఇస్తుందని ఆయన అన్నారు. ఆమె షాక్‌లో ఉన్నారనీ, కోలుకోవడానికి తగినంత సమయం కావాలనీ భారత ప్రభుత్వం పేర్కొంది. 

ఆమె భారత దేశంలో ఉన్న సమయంలో సంబంధిత ప్రోటోకాల్, రక్షణతో పాటు ఆమెను ప్రభుత్వ అతిథిగా భావించి వ్యవహరించడం కొనసాగుతుంది. ఆమెకు ఇద్దరు బిడ్డలు. కుమారుడు సజీబ్‌ అహ్మద్‌ వాజెద్‌ అమెరికాలో ఉంటూండగా, కుమార్తె సైమా వాజెద్‌ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థకు సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ రీజినల్‌ డైరెక్టర్‌గా సైమా వాజెద్‌ వ్యవహరిస్తున్నారు. 

అయితే హసీనా అమెరికాకు వెళ్లడం కుదరదని, ఆమె వీసాను అమెరికా రద్దు చేసిందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో నివసించడం హసీనాకు ఇష్టమైన మొదటి ఎంపిక. ఆమెతోపాటు ఢాకా నుండి పారిపోయి వచ్చిన ఆమె సోదరి షేక్‌ రెహానా బ్రిటిష్‌ పౌరురాలు. కాబట్టి అక్కడికి హసీనా వెళ్లడం అర్థవంతంగానే ఉంటుంది. షేక్‌ రెహానా కుమార్తె తులిప్‌ సిద్ధిక్‌ పార్లమెంటులో లేబర్‌ పార్టీ సభ్యురాలు. పైగా ట్రెజరీ, నగరాభివృద్ధి మంత్రికి ఆమె ఆర్థిక కార్యదర్శి కూడా!

తమ ఇమ్మిగ్రేషన్‌ చట్టం ప్రకారం బ్రిటన్‌ వెలుపల ఉన్న వారికి ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందేందుకు ఎటువంటి నిబంధనా లేదని బ్రిటన్‌ అధికారులు సూచిస్తున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ‘అంతర్జాతీయ రక్షణ అవసరమయ్యే వారు తాము చేరుకునే మొదటి సురక్షిత దేశంలో (ఈ సందర్భంలో భారత్‌) ఆశ్రయం పొందాలి – అదే భద్రతకు వేగవంతమైన మార్గం’ అని కూడా వారు పేర్కొన్నారు. 

‘బంగ్లాదేశ్‌లో గత కొన్ని వారాల సంఘ టనలపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో దర్యాప్తు’ కోసం డిమాండ్‌ చేయడం ద్వారా బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్‌ సంక్షోభానికి ఆజ్యం పోశారు. షేక్‌ హసీనాను పదవీచ్యుతురాలిని చేయడాన్ని సమర్థిస్తున్నట్లు ఈ ప్రకటన సూచిస్తుంది.

ఆమెకూ, భారత ప్రభుత్వానికీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఆమెకు భారత్‌ ఆశ్రయమివ్వడం సరి కాదు. ఆమెకున్న భద్రతాపరమైన ఆందోళనలు ఆమె కదలికలను తీవ్రంగా పరిమితం చేస్తాయి. పైగా ఎన్నికల అనంతరం, అధికారంలో ఉన్న చివరి రోజులలో ఆమె తీసుకున్న నిర్ణయాలపై అభియోగాలను ఎదుర్కొ నేందుకు ఆమెను రప్పించాలనే డిమాండ్లు పెద్ద సంఖ్యలో వస్తు న్నాయి. కొన్ని ఆరోపణలు కల్పితం కావచ్చు. కానీ దేశంలో సాగు తున్న రాజకీయ క్రీడలో ఆమె పావుగా మారతారు.

జనరల్‌ ముషారఫ్‌ను విచారించకుండా పాక్‌ సైన్యం అక్కడి ప్రభుత్వాన్ని నిరోధించింది. తద్వారా ఆయన దుబాయ్‌లో జీవించగలిగారు. ఇది బంగ్లాదేశ్‌లోనూ పునరావృతం కావచ్చు. భవిష్య త్తులో బంగ్లాలో సైనిక నాయ కత్వం ఎలా రూపొందుతుంది అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. హసీనా భారతదేశంలోనే కొనసా గడం సరికాదని, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహ్మద్‌ యూనస్‌ పేర్కొన్నారు. 

బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇప్పటికే షేక్‌ హసీనాను, ఆమె సోద రిని అరెస్టు చేయాలని, అభియోగాలను ఎదుర్కొనేందుకు వారు దేశా నికి తిరిగి రావాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఆమె భారత్‌లోనే ఉండి పోయినట్లయితే, ఆమెను అప్పగించేందుకు న్యూఢిల్లీ అనుమతి నిరాక రిస్తుంది. 

ఇది ఇండో–బంగ్లా సంబంధాలను దెబ్బ తీస్తుంది. భారత్, బంగ్లాదేశ్‌ 2016 జూలైలో ‘రెండు దేశాల మధ్య పారిపోయిన నేరస్థు లను త్వరితగతిన అప్పగించడం’ లక్ష్యంగా ఒక అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు నిరాక రిస్తే భారత్‌ ఒకే పక్షంవైపు మొగ్గు చూపుతోందనే మాట వస్తుంది.

ఆమె తిరిగి రావాలనే డిమాండ్‌ను తిరస్కరించడం వల్ల బంగ్లా దేశ్‌లో భారత వ్యతిరేక భావాలు కూడా ఏర్పడవచ్చు, ఇది భారత దేశం కోరుకోదు. హసీనాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జమాతే ఇస్లామీ ఈ నిరసనలకు నాయకత్వం వహించి ఇరు దేశాల సంబంధాల సాధా రణీకరణపై ప్రభావం చూపుతుంది.

1962 యుద్ధం జరిగి, దలైలామాను తమకు అప్పగించాలని చైనా క్రమం తప్పకుండా డిమాండ్‌ చేసినప్పటికీ, న్యూఢిల్లీ దశాబ్దాలుగా ఆయనకు దేశంలో ఆతిథ్యం ఇచ్చింది. 1992 నుండి దివంగత ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ నజీబుల్లా కుటుంబానికి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. కుటుంబానికి సురక్షితమైన ఇల్లు, నెలవారీ స్టైపండ్‌ అందించడం జరిగింది. అయితే ఇటీవల భారత్‌ తన విధానాలను మార్చుకోవడం ప్రారంభించింది. 

2022 జూలైలో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు ఆశ్రయం ఇవ్వడానికి న్యూఢిల్లీ నిరాకరించింది. 2021 ఆగస్టులో అమె రికా సైన్యాల ఉపసంహరణ తర్వాత తాలిబాన్‌ దేశాన్ని స్వాధీనం చేసుకు న్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్‌లోని అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వ సభ్యులకు సురక్షిత మైన స్వర్గధామాలను కల్పించడానికి భారత్‌ నిరాకరించింది.

ఇవి ఇంకా ప్రారంభ రోజులే. బంగ్లాదేశ్‌ స్థిరపడటానికి, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేయడానికి కాస్త సమయం పడుతుంది. షేక్‌ హసీనాకు ఆశ్రయం కల్పించే అవకాశాల గురించి ఆలోచిస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పకపోయినప్పటికీ, ఆమె కోసం తగిన నివాసప్రాంతాన్ని వెదకడంలో మాత్రం అది తన దౌత్య పరపతిని ఉపయోగించుకుంటుంది. ఈ పని ఎంత వేగంగా చేస్తే అంత మంచిది.

హర్ష కక్కడ్‌ 
వ్యాసకర్త భారత సైన్యంలో విశ్రాంత మేజర్‌ జనరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement