గంగరాజం మృతదేహం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు
పేద కుటుంబం.. తండ్రికాలం చేయడంతో అతడే ఇంటి భా రాన్ని బుజస్కంధాలపై వేసుకున్నాడు. సొంతూరిలో ఉపాధి లేకపోవడంతో ఆరేళ్లుగా గల్ఫ్‌బాట పడుతున్నా డు. 35 రోజుల క్రితం సౌదీ లో గుండెనొప్పితో మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చివరిచూపుకోసం కన్నీళ్లతో జాగారం చేస్తున్నారు. ఇప్పటికీ మృతదేహం ఇల్లు చేరకపోవడంతో ముట్టుడుతో ఉంటూ ఊరికి దూరంగా జీవిస్తున్నారు.
పెద్దపల్లి/చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన రొండి గంగరాజం(48) గ్రామంలో కూలీ పని చేస్తుండేవాడు. తండ్రి గతంలోనే చనిపోవడంతో తల్లి గంగవ్వ, భార్య దేవలక్ష్మీ, కుమారులు శ్రీకాంత్, ప్రశాంత్‌ను ఇతడి సంపాదనతోనే పోషిస్తున్నాడు. కూలిపని చేస్తే వచ్చే డబ్బు లు సరిపోక ఇల్లుగడిచేది కాదు. దీంతో ఆరు సంవత్సరాలుగా సౌదీకి జీవనోపాధి నిమిత్తం వెళ్తున్నాడు.
బల్దియాలో పని
గంగరాజం ఆరేబియాలోని హుక్‌మాన్ బల్దియా కంపెనీలో చెత్తాసేకరణ పని చేస్తున్నాడు. మంచి జీతం రావడంతో కుటుంబాన్ని ఎలాంటి లోటు లేకుండా పోషించుకుంటున్నాడు. ఆరుమాసాల క్రితం ఇంటికొచ్చి మళ్లీ దేశం వెళ్లిపోయాడు.
గుండెపోటుతో మృతి
గతేడాది డిసెంబర్ 19న పనికి వెళ్లిన గంగరాజం ఛాతిలో నొప్పివస్తుందని పడిపోయాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించేలోగా గుండెపోటుతో మృతిచెందా డు. అక్కడి స్నేహితుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
35 రోజులుగా ఎదురుచూపులు
గంగరాజం శవం ఐదురోజుల్లో స్వగ్రామానికి చేరుతుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం... మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు అంగీకరించలేదు. దీంతో డిసెంబర్ 24న గంగరాజం కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. స్పందిచిన కేటీఆర్ భారత రాయబార అధికారులతో మాట్లాడారు. వారు గంగరాజం పనిచేసిన కంపెనీని సంప్రదించారు. అలాంటి మృతదేహాలు చాలా ఉన్నాయని సమయం వచ్చినప్పుడు పంపిస్తామని కంపెనీవారు తేల్చిచెప్పారు. దీంతో కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది.
ఊళ్లోవాళ్లు దూరం...
హిందూసంప్రదాయం ప్రకారం. కుటుంబలో ఓ వ్యకి మరణిస్తే ఆంత్యక్రియలు, పెద్దకర్మ పూర్తి చేసే వరకు ఎవరితో సంబంధాలు లేకుండా, చుట్టుపక్కల వారికి దూరంగా మెదులుతారు. గంగరాజం కుటుంబ సభ్యులకూ అదే పరిస్థితి ఎదురవుతోంది. గ్రామంలోని ఎవరూ తమ ఇంటికి రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment