సూర్యకుమారి రాకకోసం ఎదురుచూస్తున్న ఆమె తల్లి, పిల్లలు(అంతరచిత్రం) సూర్యకుమారి(ఫైల్ ఫొటో)
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించేందుకు తాను గల్ఫ్‌కి వెళ్లడం ఒక్కటే సరైన మార్గమని ఆ పేదింటి మహిళ భావించింది. ఓ ఏజంట్ సాయంతో గల్ఫ్‌కి వెళ్లింది. అయితే రోజులు, నెలలు గడిచి ఏళ్లు దాటిపోతున్నా..అటు కుటుంబానికి సాయపడే అవకాశం లేక, స్వదేశానికి వచ్చే దారి లేక దేశం కాని దేశంలో నానాఅవస్థలు పడుతోంది. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించారని బాధితురాలి కుటుంబసభ్యులు వాపోతున్నారు.
తూర్పుగోదావరి, రాజానగరం మండలం: పల్లకడియానికి చెందిన వనుం సూర్యకుమారి కూలి పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. భర్త నాగేశ్వరరావు సంపాదనాపరుడు కాకపోవడంతో ఆమె గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకుంది. రాజమహేంద్రవరం సమీపంలోని చింతలనామవరానికి చెందిన మజిత్ (ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటాడు) అనే ఏజెంటును సంప్రదించి 2016 జూన్‌లో గల్ఫ్‌కు పయనమైంది. తన తల్లిదండ్రులకు అప్పగించింది. ఒక శేఠ్ ఇంటిలో నెలకు 1100 సౌదీ రియాల్స్ (మన దేశ కరెన్సీ ప్రకారం రూ.19 వేలు) జీతానికి పనికి చేరింది. నాలుగు నెలలపాటు అంతా సవ్యంగానే సాగింది. ఆ తరువాత ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ఇంటి యజమాని ఇబ్బంది పెడుతున్నట్టుగా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చింది.
ఇష్టానుసారంగా కొట్టడం, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని వారు ఏజంట్ మజిత్ దృష్టికి తీసుకు వెళ్లగా రూ.1.40 లక్షలు చెల్లించాలని అతడు డిమాండ్ చేశాడు. అయితే తాము అంత చెల్లించుకోలేమని రూ.20 వేలు ఇచ్చారు. అయినా ఎటువంటి ఫలితం లేక చివరికి రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రాజానగరం పోలీసులు కేసు కట్టి, ఏజంటును రప్పించి, కోర్డులో హాజరుపరచగా అతను బెయిల్‌పై వెళ్లిపోయాడని, తమకు దిక్కెవరని బాధితలు వాపోతున్నారు. కొన్ని నెలలుగా సూర్యకుమారి నుంచి ఫోన్ రాలేదని, గల్ప్‌లో ఆమెకు ఏమైందోననే భయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
బెంగతో తండ్రి మృతి
సౌదీ అరేబియా వెళ్లిన తన కుమార్తె అక్కడ చిత్రహింసలు అనుభవిస్తుందన్న విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బెంగతో మంచం పట్టారు. జనవరిలో తండ్రి మరణించగా, తల్లి మృత్యువుతో పోరాడుతోంది. ఇక ఆమె భర్త నాగేశ్వరరావు పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోగా ఇద్దరు పిల్లలను ఆమె అక్క, చెల్లెలు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని సౌదీ అరేబియాలో ఇబ్బందులు పడుతున్న సూర్యకుమారిని క్షేమంగా ఇంటికి రప్పించే ఏర్పాట్లు చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment