రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’ | Japan defense spending trends worrying | Sakshi
Sakshi News home page

రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’

Published Thu, Oct 17 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’

రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’

చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాగే అబే కూడా ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. అంతర్జాతీయ వాణిజ్యం చైనా ప్రధాన అస్త్రం. జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి.
 
 ‘ఒకే పర్వతంపై రెండు పులులు మనలేవు.’ప్రాచీన చైనా తత్వవేత్త కన్‌ఫ్యూషియస్ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల చైనాపై విరుచుకుపడ్డారు. విపరీతంగా పెరిగిపోతున్న జపాన్ రక్షణ వ్యయం పట్ల గత నెల చివర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జపాన్ ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద సైనిక బడ్జెట్‌గల దేశం. ఈ ఏడాది అది సైనిక దళాలపై 5 వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయనుంది. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో (జీడీపీ) 10 శాతాన్ని సైన్యంపై ఖర్చు చేస్తుండగా, తాము 3 శాతాన్నే ఖర్చు చేస్తున్నామని అబే అక్కసు. ప్రపంచంలోని మూడవ అతి పెద్ద దేశమైన చైనాతో 65వ స్థానంలో ఉన్న జపాన్ రక్షణ వ్యయాన్ని పోల్చడం అర్థరహితం. చైనా గత కొన్నేళ్లుగా 10 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుండగా, జపాన్ ఈ ఏడాదే వృద్ధి బాట పట్టింది. ప్రపంచంలోని రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని చైనా నుంచి తిరిగి దక్కించుకోగలమని అబే విశ్వాసం!
 
 అందుకే అబే ‘ఆసియా పర్వతంపై’ చైనా స్వేచ్ఛా విహారాన్ని సహించలేకుండా ఉన్నారు. ఆయన తరచుగా జపాన్ ‘గత వైభవాన్ని’ గుర్తుచేసుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఇతర దేశాలపై సాగించిన దురాక్రమణ యుద్ధాలకు ఒకప్పటి ప్రధాని తమీచి మురయామా క్షమాపణలు చెప్పడాన్ని సమర్థించడం లేదని అబే సెలవిచ్చారు. అసలు ‘దురాక్రమణ’ అంటేనే ఎవరూ ఇదమిత్థంగా నిర్వచించలేదని వాదించారు. ‘వివిధ దేశాల మధ్య ఘటనలు మనం ఎక్కడ నిలబడి చూస్తున్నాం అనే దాన్ని బట్టి విభిన్నంగా కనిపిస్తాయి’ అని అన్నారు. 1910 నుంచి 1945 వరకు జపాన్ కొరియాను దురాక్రమించి, అత్యంత పాశవిక అణచివేత సాగించింది.
 
 1931-37 మధ్య అది చైనాలోని సువిశాల భాగాన్ని ఆక్రమించింది. ఒక్క నాంకింగ్‌లోనే రెండు లక్షల మంది చైనీయులను ఊచకోత కోసింది. 1941లో పెరల్ హార్బర్ (అమెరికా) దాడితో ప్రారంభించి థాయ్‌లాండ్, మలయా, బోర్నియా, బర్మా, ఫిలిప్పీన్స్‌లపై దండెత్తింది. ఆసియా దేశాల మహిళలను సైన్యపు లైంగిక బానిసలుగా దిగజార్చిన హేయ చరిత్ర నాటి జపాన్‌ది. జీవ, రసాయనిక ఆయుధాల తయారీ కోసం అది ‘యూనిట్ 731’ను ఏర్పాటు చేసింది. కొరియా, చైనా, రష్యా తదితర దేశాలకు చెందిన లక్షలాది మందిని ‘ప్రయోగాల’ కోసం హతమార్చింది. అబే ఆ స్థానం నుంచి ‘గత వైభవాన్ని’ చూస్తున్నారు. ఈ ఏడాది ‘731 యూనిట్’ సంస్మరణ సభకు హాజరై ‘731’ అని ప్రముఖంగా రాసి ఉన్న యుద్ధ విమానం కాక్‌పిట్‌లో ఎక్కి మరీ ఫొటోలు దిగారు!  
 
 ‘అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి బెదిరింపులను లేదా బలప్రయోగాన్ని జపాన్ శాశ్వతంగా తిరస్కరిస్తుంది’ అనే రాజ్యాంగంలోని నిబంధనకు తిలోదకాలివ్వడానికి ‘దేశ రక్షణకు చట్టపరమైన ప్రాతిపదిక పునర్నిర్మాణ సలహా మండలిని’ అబే నియమించారు. జపాన్ ‘రక్షణకు’ ఇప్పటికే ఐదు లక్షల సేనలతో త్రివిధ దళాలున్నాయి. ఆత్యాధునిక క్షిపణులు తప్ప సకల సాయుధ సంపత్తి ఉంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులపై ఫిలి ప్పీన్స్, వియత్నాం వంటి దేశాలకు చైనాకు మధ్య వివాదాలు రగులుతున్నాయి. జపాన్ ఇదే అదనుగా ఒకప్పటి తన వలసవాద అవశేషమైన సెనెకాకు దీవులను ‘జాతీయం’ చేసి చైనాతో కయ్యానికి కాలుదువ్వింది. ఆ సాకుతో చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. తనలాగే అమెరికా సైనిక స్థావరాలున్న దేశమైన ఫిలిప్పీన్స్‌తో జపాన్ చేయి కలిపింది. భారత్‌తో సైనిక సహకారానికి ఉవ్విళ్లూరుతోంది.
 
 అణు వ్యాపా ర భాగస్వామ్యంతో భారత్‌ను అమెరికా, జపాన్‌ల చైనా వ్యతిరేక వ్యూహంలో భాగస్వామిని చేయాలని అశిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలాగే అబే కూడా వర్తమాన ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. చైనా ‘శాంతియుతంగా’ ఆధిపత్యపోరు సాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం దాని ప్రధాన అస్త్రం. ప్రపంచ వాణిజ్యం లో చైనాదే అగ్రస్థానం. జపాన్ విదేశీ వాణిజ్యంలో సైతం అమెరికా తర్వాత ద్వితీయ స్థానం చైనాదే. ఏటా ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ 30,000 కోట్ల డాలర్లు! జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. గత వారం ఇండోనేసియాలోని బాలీలో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో (ఎపెక్) చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ కేంద్ర బిందువుగా నిలవడం అదే సూచిస్తోంది. చైనాను చూసి కాకపోయినా జర్మనీని చూసైనా అబే ‘శాంతియు తం’గా ఆర్థిక ప్రాభవం కోసం ప్రయత్నించడం ఉత్తమం.  
 - పిళ్లా వెంకటేశ్వరరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement