యుద్ధం కోసం‘ శాంతి’ | America gets multilateral benefits from geneva treaty | Sakshi
Sakshi News home page

యుద్ధం కోసం‘ శాంతి’

Published Thu, Nov 28 2013 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

యుద్ధం కోసం‘ శాంతి’

యుద్ధం కోసం‘ శాంతి’

వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఎవరికి? ఇస్తారో లేదో గానీ ఇవ్వాల్సింది మాత్రం నిస్సంశయంగా బరాక్ ఒబామాకే. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు 2009లో ఆ పురస్కారాన్ని అందుకున్నారనే శంక అనవసరం. రెడ్ క్రాస్ మూడు సార్లు ఆ పురస్కారాన్ని అందుకుంది. నిన్న సిరియాపై యుద్ధాన్ని విరమించిన ఒబామా... నేడు ఈ చేత్తో ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకొని, ఆ చేత్తో అఫ్ఘానిస్థాన్‌తో భద్రతా ఒప్పందంపై అంగీకారానికి వచ్చారు. వచ్చే ఏడాది అఫ్ఘాన్ నుంచి సేనల ‘ఉపసంహరణ’కు దారి తెరిచారు. నోబెల్ శాంతికి ఇంతకన్నా అర్హతలు కావాలా? 2009లో ఆయనకు నోబెల్ ఇచ్చినది ఎక్కువ యుద్ధాలను ప్రారంభించినందుకేనని వాదించే వాళ్లు తక్కువేమీ కాదు. అలాంటి వాళ్లను సంతృప్తి పరచడానికేనన్నట్టుగా మంగళవారం అమెరికా బీ-52 యుద్ధ విమానాలు చైనా ‘గగనతల రక్షణ గుర్తింపు ప్రాంతం’లోకి (ఏడీఐజెడ్) ప్రవేశించి కాలు దువ్వాయి.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్నాయని అనుకుంటుండగా... 4,500 కిలో మీటర్ల దూరంలో మరో అగ్నిగుండాన్ని సృష్టిస్తానని ఒబామా హామీని ఇచ్చారు. జెనీవాలో ఇరాన్‌కు, ఐదు భద్రతా మండలి శాశ్వత దేశాలకు మధ్య అణు ఒప్పందం కుదిరిన రోజునే, నవంబర్ 24నే  చైనా... తూర్పు చైనా సముద్ర ప్రాంత ఏడీఐజెడ్‌ను ప్రకటించింది. తమకు తెలియకుండా తమ గగన తలంలోకి ప్రవేశించే విమానాలను కూల్చే హక్కు తమకు ఉన్నదని ప్రకటించింది. రెండు రోజులైనా గడవక ముందే అమెరికా... చైనా హక్కుల ప్రకటనను బేఖాతరు చేసి కాలుదువ్వి, సవాలు విసిరింది. చైనాకు అతి సమీపంలోని దియాయు (సెనెకాకు) దీపుల విషయంలో గత కొంతకాలంగా జపాన్, చైనాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒకప్పుడు చైనాను దురాక్రమించిన  జపాన్ ఆ దీవులపై తన వలసవాద హక్కుల కోసం పట్టుబడుతోంది. చైనా అవి తమవేనని వాదించడమే గాక తరచుగా ఆ దీవులపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి చూపుతోంది. జపాన్‌కు అమెరికా అండ ఉన్న మాట నిజమే. అయినా అది ఇలా ప్రత్యక్షంగా రంగ ప్రవేశం చేసి తనకు ధీటైన ప్రత్యర్థిగా ఎదుగుతున్న చైనాకు సవాలు విసరడం జపాన్‌ను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
 
 ‘ఒప్పందం కోసం సిరియా బలి’ఈ పరిణామాలు ఇరాన్ అణు ఒప్పందం సమయంలోనే జరగడం కాకతాళీయం కాదు. ఇరాన్ అణు ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మండిపాటు ‘సమంజసమే.’ ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివే తకు దారి తెరచిన జెనీవా ఒప్పందం ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి ఉన్న ‘అస్తిత్వ ప్రమాదాన్ని’ నిర్లక్ష్యం చేసిందని ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందుకే అది ఇరాన్‌కు ‘లొంగుబాట’ని, దాని అణు బాంబు కార్యక్రమానికి పచ్చజెండా చూపడమేనని మండిపడుతున్నారు. ఒకవిధంగా చూస్తే నెతన్యాహూ అంటున్నది నిజమే. ఒప్పందం ప్రకారం ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కుదించుకున్నా, అంతర్జాతీయ శల్య పరీక్షలను అనుమతించినా... రెండు దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ కోరుతున్నట్టు దాని అణు కార్యక్రమం పూర్తిగా నిలిచి పోదు. ఇరాన్ అణు ఒప్పందం కోసం అమెరికా ‘సిరియాను బలిపెట్టిందని’ ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలు చేస్తున్న ఆరోపణను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఆ ఆరోపణే అమెరికా విదేశాంగ విధానంలో వస్తున్న పెనుమార్పులను అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది. అమెరికా రక్షణశాఖ పెంట గాన్ సలహాలను పెడచెవిన పెట్టి సెప్టెంబర్‌లో ఒబామా సిరియాపై యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో రష్యా, చైనాలతో ఘర్షణకు దిగడానికి సిద్ధపడలేక వెనుదిరగాల్సి వచ్చింది. అమెరికా దురాక్రమణ  జరగక సిరియా ‘ప్రజాస్వామ్యం’ ఏమైపోతోంది? అసద్ ప్రభుత్వ సేనలు బలం పుంజుకున్నాయి. నానా గోత్రీకులైన ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలు సహా తిరుగుబాటు దళాలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక దశలో రష్యా మధ్యవర్తిత్వంతో గద్దె దిగడానికి కూడా అంగీకరించిన అసద్ వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు! ఇంతకూ ‘సిరియా బలికి’ ఇరాన్ అణు ఒప్పందానికి ఉన్న సంబంధం ఏమిటి?
 
 ‘శాంతి’ వ్యూహాత్మక ప్రయోజనాలు
 ఇరాన్, అమెరికా వైరం సమస్యను అణు సమస్యగా చూస్తున్న వారు జెనీవా ఒప్పందంతో అమెరికా సాధించిన రెండు కీలక ప్రయోజనాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఒకటి, ఇరాన్ తన చమురు పరిశ్రమ సహా ఆర్థిక వ్యవస్థను అమెరికా, ఈయూ దేశాలకు తెరవడానికి ఆంగీకరించడం. ఆర్థికమాంద్యంతో, ఇం దన సమస్యతో సతమతమవుతున్న ఈయూకు ఇది ప్రత్యేకించి కీలకమైనది. ఇక రెండవది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలతో ముడిపడినది. విశాల మధ్యప్రాచ్యంగా పిలిచే అఫ్ఘానిస్థాన్ నుంచి సిరియా వరకు ఉన్న ప్రాంతంలో సుస్థిర పరిస్థితులను నెలకొల్పడంలో అమెరికాకు సహకరిస్తానని అది వాగ్దానం చేసింది. అంటే సిరియాలో అధ్యక్షుడు అసద్ స్థానంలో అమెరికా ప్రయోజనాలకు కూడా హామీని కల్పించే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కు కృషి చేయడం. సిరియా సంక్షోభకాలం అంతటా అసద్‌కు మద్దతుగా నిలిచిన ఇరాన్... అమెరికాతో నెయ్యం కోసం అతన్ని బలిపెట్టే అవకాశం లేదు. పైగా రష్యా ప్రమేయం లేకుండా సిరియాలో అధికార మార్పిడికి అవకాశాలు తక్కువ. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పాటుకు ఇరాన్ సహాయపడగలుగుతుంది. 2001లో హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పాటులో ఇరాన్ కీలక పాత్ర వహించింది. ఇటు సిరియాలోనూ అటు అఫ్ఘాన్‌లోనూ కూడా పలుకుబడి గల ఇరాన్ నేడు సైతం అఫ్ఘాన్ ‘శాంతి’లో కీలక పాత్రధారిగా నిలుస్తుంది. అందరూ అంటున్నట్టుగా ఇరాన్ జెనీవా ఒప్పందానికి కట్టుబడుతుందా లేదా అనేది ప్రశ్న కానే కాదు. ఆ ఒప్పందమేమీ దాని అణు శక్తి కార్యకలాపాలను పూర్తిగా నిషేధించేది కాదు. ఆరునెలల తర్వాైతైనా అలాంటి ఒప్పందం కుదిరే అవకాశం లేదు. కాకపోతే ఇరాన్ ఈ రెండు అంశాలలో మాత్రం మాట నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసం అఫ్ఘాన్ ‘సుస్థిరీకరణ’కు సహకరించాల్సి వస్తుంది.  కాబట్టి ఇజ్రాయెల్, సౌదీలు ఒబామాపై తమ ఆరోపణ ను ‘అఫ్ఘాన్ కోసం సిరియాను బలి పెట్టారు’ అని సవరించుకోవాలి.
 
 2024 వరకు అఫ్ఘాన్‌లో తిష్ట
 గత ఏడాది విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ అఫ్ఘాన్ తాలిబన్లతో జరిపిన చర్చలు విఫలమైనప్పటి నుంచి అమెరికా పశ్చిమ ఆసియా విధానం మారుతోంది. అప్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్‌ని కాదని స్వయంగా తాలిబన్లతో శాంతి చర్చలకు దిగిన అమెరికా లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి కర్జాయ్‌నే నమ్ముకుంది. ఎట్టకేలకు కర్జాయ్ అమెరికా సేనలు అప్ఘాన్‌లో మరో పదేళ్లు పాటు నిలిపి ఉంచడానికి అంగీకరించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో సరిగ్గా జెనీవా చర్చల సమంలోనే , ఈ నెల 20న ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం’ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందానికి అప్ఘాన్ తెగల మండలి ‘లోయా జిర్గా’ ఈ నెల 24నే ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందంపై ఇప్పుడు సంతకాలు చేసేది లేదని, వచ్చే ఏడాది నూతన అధ్యక్షుడే సంతకాలు చేస్తారని కర్జాయ్ తిరకాసు పెట్టారు. దీని అంతరార్థం... 2024 వరకు అప్ఘాన్‌లో అమెరికా సైన్యం నిలిపి ఉంచాలంటే వచ్చే ఏడాది కర్జాయ్ గానీ ఆయన ఆమోదించినవారు గానీ అధ్యక్షులు కావాలి. తాలిబన్లు ఈ భద్రతా ఒప్పందాన్ని, రానున్న ఎన్నికలను కూడా తిరస్కరిస్తున్నారు. కాబట్టి అఫ్ఘాన్ మారణ హోమం కొనసాగుతూనే ఉంటుంది. అప్ఘాన్‌లో కర్జాయ్ తెర ముందో వెనుకో ఉండి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఇరాన్ అండదండలు కావాలి. అందుకు దానికి పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. అప్ఘాన్ ‘సుస్థిరీకరణ’ వ్యూహంలో భాగంగానే అమెరికా ఇరాన్ పట్ల తన వైఖరిని మార్చుకుంది. ఇరాన్ నూతన అధ్యక్షుడు హసన్ రుహానీ పట్టువిడుపుల కారణంగానే అణు ఒప్పందం కుదిరిందని బావిస్తున్నవారు పొరబడుతున్నారు. ఆయన గద్దెనెక్కింది ఆగస్టులో కాగా అమెరికా మార్చిలోనే ఇరాన్‌తో సఖ్యతకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఒమన్‌లో అమెరికా విదేశాంగశాఖ ఉప మంత్రి విలియం బరన్స్ సహా అత్యున్నత స్థాయి అధికారుల బృందం ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సాగించింది. ఆ తర్వాత ఇరాన్ ఎన్నికలకు ముందు మేలో విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఒమన్‌లో రహస్యంగా అణు ఒప్పందానికి ‘ప్రాతిపదికను’ తయారు చేసిన విషయం రచ్చకెక్కింది. ఇటు అఫ్ఘాన్‌లో రష్యా, చైనాల ప్రాబల్యానికి కళ్లెం వేయడానికి, అటు తనకు ప్రత్యర్థిగా నిలుస్తున్న చైనాకు బుద్ధి చెప్పడానికి ఇరాన్ తురుపు ముక్కను ఒబామా ప్రయోగించారు. ఫలితం వేచి చూడాల్సిందే!
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement