అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు | US-Russia Battle for Pipelines and Natural Gas | Sakshi
Sakshi News home page

అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు

Published Fri, Aug 23 2013 1:30 AM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు - Sakshi

అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు

 విశ్లేషణ: ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహజ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి.
 
 వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రాలకు, ప్రజాస్వామ్యానికి మారు పేరు గా చెప్పుకునే అమెరికాకు స్వదేశంలోనూ, పరదేశాల్లోనూ పౌరు ల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే దీర్ఘకాలిక వ్యాధి ఉన్నదని రచ్చకెక్కించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటీవలి వార్తల్లోని వ్యక్తి. స్నోడెన్ వెల్లడించిన, వెల్లడించనున్న రహస్యాలపై పుంఖానుపుంఖాలుగా కథనాలను వెలువరించిన మీడియా ఒక కీలక అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. స్నోడెన్‌కు ఆశ్రయం కల్పించడానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు నెలరోజులు ఎందుకు పట్టింది? అమెరికాతో సంబంధాలు బెడుస్తాయన్న భయం అందుకు కారణం కానేకాదు. అవి ఇప్పటికంటే మెరుగుపడే ఆశా లేదు, దిగజారే అవకాశమూ లేదు. జూలై ఒకటిన మాస్కోలో రష్యా నేతృత్వంలోని ‘గ్యాస్ ఎగుమతి దేశాల వేదిక’ (జీయీసీఎఫ్) వార్షిక సమావేశాలు మొదలయ్యాయి.
 
 మూడేళ్లక్రితం అమెరికా తనకు చేసిన అవమానానికి స్నోడెన్ ఆశ్రయం రూపంలో బదులు తీర్చుకోవడానికి అదే రోజు పుతిన్‌కు సరైన ‘ముహూర్తం’ కుదిరింది. అందుకే నెల రోజులు స్నోడెన్ మాస్కో విమానాశ్రయంలో పడిగాపులు పడాల్సివచ్చింది. 2010 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ షేల్ గ్యాస్ ఇనిషియేటివ్ (జీఎస్‌జీయీ)ని ప్రారంభించి భారత్, చైనాలతో సహా నలభైకి పైగా దేశాలను ఆహ్వానించారు. ‘నిరపాయకరమైన’, లాభదాయకమైన పద్ధతుల్లో షేల్ గ్యాస్ వెలికితీత పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకునే ‘సహకారానికి’ నాంది పలికారు. భారీ షేల్ నిల్వలున్న రష్యాను మాత్రమే మినహాయించారు. పుతిన్ కూడా జీయీసీఎఫ్ అంతర్జాతీయ సమావేశం జరుగుతుండగా స్నోడెన్‌కు ఆశ్రయాన్ని ప్రకటించి బదులు తీర్చుకున్నారు.
 
 సహజవాయు నిక్షేపాలపై ‘భల్లూకం’ పట్టు
 షేల్ చమురు, షేల్ గ్యాస్‌లను ప్రత్యామ్నాయ చమురు, వాయువులుగా పిలుస్తున్నారు. రష్యా ప్రపంచంలోనే అతి ఎక్కువ సహజవాయు నిక్షేపాలున్న దేశం. రష్యా ఆధిపత్యంలోని జీఈసీఎఫ్ దేశాల చేతుల్లోనే ప్రపంచ సహజ వాయు నిక్షేపాలలో 70 శాతానికి పైగా ఉన్నాయి. అందుకే రష్యా, ఇరాన్, కతార్, బొలీవియా, వెనిజులా, లిబియా, అల్జీరియా తదితర 13 దేశాల జీఈసీఎఫ్‌ను చమురు ఎగుమతి దేశాల సంస్థ ‘ఒపెక్’తో పోలుస్తూ ‘గ్యాస్ ఒపెక్’గా పిలుస్తారు. రష్యా, ఇరాన్, ఖతార్‌లలో ప్రపంచ సహజవాయు నిక్షేపాలలో 57 శాతానికి పైగా ఉన్నాయి. పైగా ప్రపంచ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) ఉత్పత్తిలో 85 శాతం జీఈసీఎఫ్ చేతుల్లోనే ఉంది.
 
 అమెరికా ఇంధనావసరాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఈ అవసరాల కోసం గ్యాస్ వినియోగించే యూరోపియన్ దేశాలు జీఈసీఎఫ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. సహజవాయువేగాక పెట్రోలియం రవాణాకు వీలుగా ఉండే ఎల్‌పీజీ తయారీ మార్కెట్టుపైనా, రవాణా చేసే గ్యాస్ పైపులైన్లపైనా దాని ఆధిపత్యమే కొనసాగుతోంది. అటు గల్ఫ్‌లోనూ, ఇటు నాటో కూటమిలోనూ ఉన్న పలు అమెరికా మిత్రదేశాలు ఇంధన అవసరాలకోసమో, మార్కెట్‌కోసమో రష్యాపై ఆధారపడాల్సివస్తోంది. 1990లలో కుప్పకూలిన రష్యా దశాబ్ది తిరగకముందే కోలుకోవడం ప్రారంభించింది. పూర్వ ప్రాభవం కోసం పావులు కదుపుతోంది. 2001లో జీఈసీఎఫ్‌కు నాంది పలికి, 2008 నాటికి దాన్ని ఆర్థిక కూటమిగా మార్చింది. ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల్లో అమెరికా కూరుకుపోయిన కాలంలోనే రష్యా తన ‘సామ్రాజ్యాన్ని’ పునర్నిర్మించే ప్రయత్నాలు సాగించింది.
 
అమెరికా మరో ‘సౌదీ అరేబియా’
క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక ప్రాబల్యంతోపాటే దాని అంతర్జాతీయ ప్రతిష్ట కూడా ఇటీవలి కాలంలో దిగజారుతోంది. పైగా సోవియెట్ యూనియన్ పతనానంతర రష్యాతో సంబంధాలను పలు యూరోపియన్ దేశాలు పునర్నిర్వచించుకుంటున్నాయి. రష్యాను ఎదుర్కోడానికి అమెరికాకు షేల్ గ్యాస్ ‘మంత్రదండం’ దొరికింది. ప్రపంచ ఇంధన అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో విస్తృతంగా ఉన్న వివాదాస్పదమైన షేల్ గ్యాస్ నిల్వలను వాణిజ్యపరంగా వెలికి తీసే కార్యక్రమాన్ని ఒబామా వేగవంతం చేశారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇప్పటికే అది గ్యాస్ ఎగుమతి దేశంగా మారాల్సింది. కానీ వివిధ రాష్ట్రాల్లో షేల్ బావులకు వ్యతిరేకంగా తలెత్తుతున్న ఆందోళనలు, సుదీర్ఘ చర్చలతో ‘అనవసర’ జాప్యాలు తప్పడం లేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మూడు గ్యాస్ ఎగుమతి టెర్మినల్స్ నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 2020 నాటికే అమెరికాను ‘గ్యాస్ సౌదీ అరేబియా’గా మార్చాలనేది ఒబామా కల. 2012లో రష్యా వాయు ఉత్పత్తి 65,300 కోట్ల క్యూబిక్ మీటర్లు కాగా, అమెరికా కూడా దానికి ధీటుగా 65,100 కోట్ల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తిని సాధించింది. అమెరికా షేల్ గ్యాస్ దూకుడు కంటే వేగంగా అంచనాలపై నడిచే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు తగ్గాయి.
 
ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు చమురును ఎల్‌పీజీగా మార్చి అమ్ముకునే మార్కెట్లు కుంచించుకుపోతాయనే ఆందోళనలో పడ్డాయి. ఆ ఆందోళన చైనాకు దారులు తెరిచింది. చైనాలో కూడా విస్తారంగా షేల్ నిల్వలున్నా దానికి షేల్ జ్వరం సోకలేదు. సమీప భవిష్యత్తులో కూడా అది సంప్రదాయక చమురు నిల్వలపైనే ఆధారపడాలని యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు ఇతర దేశాల వనరులను కొని లేదా దబాయించి ప్రస్తుత అవసరాలకు విని యోగించుకుంటూ, తమ వనరులను పొదుపుగా వాడుకుంటోంది. జీఈసీఎఫ్‌తోపాటూ, అరబ్బు, ఆఫ్రికా దేశాల నుంచి కూడా అది చమురు, ఎల్‌పీజీలను దిగుమతి చేసుకోడానికి ప్రాధాన్యం ఇస్తోంది. అమెరికా షేల్ గ్యాస్‌తో పోటీ మూలంగా డిమాండు కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న గల్ఫ్ దేశాలకు చైనా అంతులేని ఇంధన దాహం ఆసరా అవుతోంది. ‘ఇంధనానికి బదులు ఆయుధాల’ ఒప్పందాలతో అమెరికా కోటలోకి చైనా వాణిజ్య మార్గంలో చొరబడిపోతోంది. రష్యా సైతం సౌదీ అరే బియా వంటి దేశాలతో అలాంటి భారీ ఒప్పందాలను చేసుకుంటోంది. గల్ఫ్‌లోని అమెరికా కోట బీటలు వార డం ప్రపంచ ఇంధన ఆధిపత్యపు పోరుకు ఒక పార్శ్వం.
 
ఒబామా పగటి కల...
పలువురు అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఒబామా షేల్ స్వప్నాన్ని పగటి కలగా కొట్టిపారేస్తున్నారు. అమెరికా చెబుతున్నట్టు దాని షేల్ నిల్వలు వంద ఏళ్లకు సరిపడేంత ఘనమైనవేమీ కావని సవాలు చేస్తున్నారు. షేల్ గ్యాస్ ప్రబోధకులు, ప్రచారకులు దాచిపెడుతున్న ఒక ఆర్థిక వాస్తవాన్ని పోస్ట్ కార్బన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు డేవిడ్ హ్యూస్ బయటపెట్టారు. 1990ల నుంచి అమెరికాలోని పనిచేస్తున్న గ్యాస్ బావుల సంఖ్య 90 శాతం పెరిగిందిగానీ, ఒక్కో బావి సగటు ఉత్పాదకత 38 శాతానికి పడిపోయిందని డేవిడ్ తన ‘డ్రిల్ బేబీ, డ్రిల్’ నివేదికలో వెల్లడించారు. షేల్... భూమిలో బాగా లోతున, సువిశాల విస్తీర్ణంలో బల ్లపరుపుగా వ్యాపించి ఉండే నేల పొరల మధ్య ఇరుక్కుని ఉంటుంది. కాబట్టి సంప్రదాయక బావుల నుంచి 70 నుంచి 100 ఏళ్ల వరకు తక్కువ వ్యయాలతో వెలికితీత సాధ్యమైతే, షేల్ బావులు 10 నుంచి 20 ఏళ్లల్లోనే అడుగంటుతాయి. ఏటికేడాది ఉత్పాదకత పడిపోతూ, వ్యయాలు పెరిగిపోతుంటాయి.  
 
 ఎప్పటికప్పుడు సమీపంలో కొత్త బావులు తవ్వుతూనే ఉండాలి, భారీగా కొత్త పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. దీంతో దీర్ఘకాలంలో షేల్ గ్యాస్ వ్యయాలు పెరిగి వాణిజ్యపరంగా లాభసాటి కాకుండాపోతుంది. ఈ ముప్పు తెలుసు కాబట్టే  అమెరికాలోని షేల్ లాబీ త్వరత్వరగా గ్యాస్ ఎగుమతులు చేసేయాలని ఆరాటపడిపోతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి భారత్ వరకు అంటించిన షేల్ జ్వరానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రసామాగ్రిని, రాయల్టీలను నొల్లేసుకోవాలని తొందరపడుతోంది. ఇతర దేశాలు షేల్ గ్యాస్ మార్కెట్లోకి వచ్చేసరికే షేల్ మార్కెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. ఒబామా షేల్ కలను అమ్మి అమెరికన్ పెట్రో గుత్త సంస్థలు లాభాలు చేసుకుంటాయి.
 
 అప్పటికల్లా కాస్పియన్ సముద్ర తీరంలోని రష్యా ఇంధన కోటలో పాగవేయాలనేది అమెరికా దీర్ఘకాలిక వ్యూహం. రష్యా ప్రాబ ల్యం కింద ఉన్న మధ్య ఆసియా దేశాల చమురు, గ్యాస్ నిక్షేపాలపై ఆధిపత్యం సంపాదించడానికి అది ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మానవహక్కుల ఉల్లంఘనకు ప్రసిద్ధి చెందిన అజర్‌బైజాన్‌లో మే నెల చివర్లో అది ‘అమెరికా-అజర్‌బైజాన్: విజన్, ప్యూచర్’ అనే సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి ఒబామా ప్రభుత్వ అత్యున్నతాధికారులు, కాంగ్రెస్ సభ్యులు, ప్రపంచ బ్యాం కు ప్రతినిధులు, మంత్రుల భార్యలు తదితరులు దాదాపు 400 మంది హాజరయ్యారు.
 
 అజర్‌బైజాన్‌ను కేంద్రంగా చేసుకొని ఆ దేశంలోని బాకూ తీరం నుంచి టర్కీకి అటు నుంచి ఇతర యూరప్ దేశాలకు గ్యాస్‌ను ఎగమతి చేయడానికి ట్రాన్స్‌కాస్పియన్ పైపులైన్ నిర్మాణానికి అమెరికాకు అజార్‌బైజాన్ స్థావరంగా మారింది. ఇంతవరకు రష్యా ప్రాబల్యం కింద ఉన్న తుర్కుమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్‌లలోని చమురు కేంద్రాలపైకి అమెరికా వల విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహ జ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి.    
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement