Edward Snowden
-
వాళ్లిద్దరిని క్షమించేద్దామా ? మస్క్ ట్వీట్‌పై యూజర్ల రియాక్షన్ ఇదే!
యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్లను యుఎస్ ప్రభుత్వం క్షమించాలా? వద్దా? అనే అంశం ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ చర్చకు తెరలేపారు. ఇదే విషయంపై నెటిజన్ల నుంచి అభిప్రాయం తీసుకునేందుకు ఓ పోల్ చేశారు. ‘నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు. కానీ పోల్ మాత్రమే చేశాను. అసాంజే, స్నోడెన్‌లను క్షమించాలా?’ అని మస్క్ ట్వీట్ చేశారు. అసాంజే,స్నోడెన్ ఇద్దరూ అమెరికా ఆర్మీ, ఇంటెలిజెన్స్ చేసిన తప్పులు, వాటి తాలుకూ ఆధారాల్ని బహిర్గతం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అసాంజేను, రష్యాలో ఉంటున్న స్నోడెన్‌ను దేశానికి రప్పించేలా యూఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్నోడెన్‌కు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ పౌరసత్వం మంజూరు చేశారు. తాజాగా, రష్యా పాస్ పోర్ట్ అందుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక మస్క్ చేసిన పోల్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. పోస్ట్ చేసిన గంటలోపే 560,000 కంటే ఎక్కువ మంది ఓట్ చేశారు. వారిలో చాలా మంది యూజర్లు మస్క్ ట్వీట్‌కు మద్దతు పలుకుతూ ఓట్ చేశారు. ఇద్దరు విజిల్బ్లోయర్లను క్షమించాలని 79.8 శాతం మంది యూజర్లు అంగీకరిస్తూ ఓటు వేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. I am not expressing an opinion, but did promise to conduct this poll. Should Assange and Snowden be pardoned? — Elon Musk (@elonmusk) December 4, 2022 -
ముందు ‘యూఐడీఏఐ’ని అరెస్ట్ చేయండి
లండన్: ఆధార్ అక్రమాలపై యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అధికారులను ముందు అరెస్ట్ చేయాలని ప్రఖ్యాత అమెరికన్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ అన్నారు. ఆధార్ వివాదంపై మంగళవారం ఆయన మరోమారు ట్వీటర్ ద్వారా స్పందించారు. అక్రమాలను బయటపెట్టిన జర్నలిస్టులపై విచారణకు బదులుగా వారికి అవార్డులు ఇవ్వాలని సూచించారు. భారత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోట్లాది భారతీయుల గోప్యతను బయటపెట్టే విధానాలకు చెక్ పెట్టేలా సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. ప్రజల జీవితాలు తమ చేతుల్లో ఉండాలని ప్రభుత్వాలు భావిస్తుంటాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని పేర్కొన్నారు. ఆధార్ సమాచారం రూ.500కే లభిస్తోందన్న వార్తలపై ఆయన గతంలో స్పందించిన సంగతి తెలిసిందే. -
యుఐడిఎఐ అధికారులను అరెస్ట్ చేయండి!
అమెరికన్ విజిల్ బోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ మరోసారి ఆధార్ హ్యాకింగ్ వివాదంపై స్పందించారు. ఆధార్ డేటా హ్యాకింగ్‌పై సమాచారం అందించిన రిపోర్టర్‌కు మద్దతుగానిలిచిన ఆయన భారత ప్రభుత్వం చర్యలపై అభ్యంతరం వక్తం చేశారు. మంగళవారం ట్విట్టర్ ద్వారా స్పందించిన స్నోడెన్ లీకింగ్‌ను బయటపెట్టిన జర్నలిస్టుపై చర్యలుకాదు.. లీకింగ్ వ్యవహారం, అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేశారు. ఈ అక్రమాలను బయటపెట్టిన జర్నలిస్టుపై విచారణకు బదులుగా, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) అధికారులను శిక్షించాలనిహితవు పలికారు. నిజానికి ఆధార్ డేటా ఉల్లంఘనను బయటపెట్టిన ఆ జర్నలిస్టుకు అవార్డు దక్కాలి గానీ, విచారణ కాదు అని ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం నిజంగా న్యాయం చేయాలనుకుంటే కోట్లాది భారతీయుల గోప్యతను నాశనం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సంస్కరణలను ప్రవేశపెట్టాలన్నారు. దీనికి బాధ్యులైనవారిని అరెస్ట్ చేయాలనుకుంటే.. యుఐడిఎఐ వారిని అరెస్ట్ చేయాలని స్నోడెన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇటీవల ఆధార్ డేటా కేవలం రూ.500 లకే మార్కెట్లో లభ్యమవుతోందన్న వార్తలపై కూడా స్నోడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. The journalists exposing the #Aadhaar breach deserve an award, not an investigation. If the government were truly concerned for justice, they would be reforming the policies that destroyed the privacy of a billion Indians. Want to arrest those responsible? They are called @UIDAI. https://t.co/xyewbK2WO2 — Edward Snowden (@Snowden) January 8, 2018 -
ఆధార్ గోప్యతపై స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు
ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. రోజుకో సంచలన నివేదికలు బహిర్గతం కావడం దేశ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్ గోప్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్ చేయడం చాలా సులువని శుక్రవారం వెల్లడించారు. అమెరికా సెక్యూర్టీకి చెందిన అనేక రహస్య పత్రాలను బయటపెట్టిన స్నోడెన్ వ్యాఖ్య ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశం పరిచయం చేసిన ఆధార్ డేటాబేస్ అక్రమ వినియోగానికి, (మిస్ యూజ్, అబ్యూజ్) అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ ఉద్యోగి , విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించారు. ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయి, కానీ ఆ డేటాహ్యాకింగ్‌కు గురి కావడం సాధారణ విషయమే అన్నారు. చట్టాలు ఉన్నా, దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని చర్రిత చెబుతోందన్నారు. భారతదేశంలో ఆధార్ డాటాబేస్ ఉల్లంఘనపై సీబీఎస్ విలేఖరి జాక్ విట్టేకర్ వ్యాఖ్యలకు స్నోడెన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. వ్యక్తిగత జీవితాల సంపూర్ణ రికార్డులను తెలుసుకోవడం ప్రభుత్వాల సహజ ధోరణి అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆధార్ డేటా సెక్యూరిటీ దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలతో ఆధార్ డేటా గోప్యత చర్చనీయాంశమైనంది. దీనిపై సుప్రీంకోర్టులో నిర్ణయం కూడా పెండింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగానే కేవలం రూ.500 లకే ఆధార్ కార్డు వివరాలు లభ్యం అంటూ వచ్చిన నివేదికలు మరింత కలవరం పుట్టించాయి. ఇటీవల ట్రిబ్యూన్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చాలాసులువుగా ఆధార్ డేటా వచ్చేస్తుందని ఆ పత్రిక బుధవారం ఒక కథనంలో పేర్కొన్నది. దీన్ని ప్రభుత్వం, యూఐడీఏఐ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. It is the natural tendency of government to desire perfect records of private lives. History shows that no matter the laws, the result is abuse. https://t.co/7HSQSZ4T3f — Edward Snowden (@Snowden) January 4, 2018 -
గూగుల్ 'అల్లో'వాడారో.. అంతేనట!
ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ మెసేజింగ్ యాప్‌లకు భారీ షాకిస్తూ.. సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన అల్లో యాప్ అంత శ్రేయస్సుకరం కాదంట. ప్రస్తుత చాటింగ్ యాప్స్‌కు దీటుగా ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు గూగుల్ చెప్పుకుంది. కానీ ఈ యాప్ వాడితే వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతింటుందట. ఈ విషయాన్ని స్వయానా గ్లోబల్ ఐకాన్‌గా పేరున్న ఎడ్వర్డ్ స్నోడెనే వెల్లడించారు. అల్లో స్మార్ట్ చాట్‌ను వినియోగించ వద్దని ఆయన వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. గూగుల్ ప్రవేశపెట్టిన ఈ యాప్‌లో ప్రైవసీ సరిగా లేదని, ఈ చాట్ యాప్ ద్వారా పంపే మెసేజ్‌లన్నింటినీ గూగుల్ స్టోర్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పారు. ఈ యాప్‌ను వినియోగదారులు వాడొద్దని సూచిస్తున్నారు. మెసేజ్‌లను కేవలం తాత్కాలికంగా మాత్రమే స్టోర్ చేస్తామని ప్రకటించిన గూగుల్ అల్లో టీమ్, రహస్యంగా లేని అన్ని మెసేజ్‌లను డిలీట్ చేసేంత వరకు స్టోర్ చేసే ఉంచుతామని బుధవారం తేల్చేసింది. అదేవిధంగా గూగుల్‌కు, డివైజ్‌కు మధ్య మెసేజ్‌లు ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయని, వాటిని గూగుల్ చదివే వీలుంటుందని ప్రకటించింది. దీంతో ఈ యాప్ వ్యక్తిగత ప్రైవసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాప్‌ను "గూగుల్ నిఘా"గా విమర్శిస్తూ వివిధ ట్వీట్లను ఎడ్వర్డ్ స్నోడెన్ పోస్టు చేశారు. యూజర్లు ఇతరులకు అల్లో ద్వారా చేరవేసే ప్రతి సందేశాన్ని గూగుల్ సేవ్ చేయడం ప్రమాదకరమని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేయడమేనని ఆయన అన్నారు. పోలీసు రిక్వెస్ట్ ప్రకారం రికార్డు చేసిన వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ లీక్ చేయొచ్చని తెలిపారు. గూగుల్ అల్లోకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటమే మంచిదని ఆయన యూజర్లకు సూచించారు. -
స్నోడెనా మజాకా..
న్యూయార్క్: వరదలా వచ్చిపడుతున్న ఈమెయిల్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్తో సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ట్విట్టర్ నోటిఫికేషన్స్ వరదలా వచ్చిపడుతుండటంతో తనకు ఏమి తోచడం లేదని స్నోడెన్ పేర్కొన్నాడు. అతని ట్విట్టర్ ఖాతాలో 12.6 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. గత వారం స్నోడెన్ చేసిన తొలి ట్వీట్ 'కెన్ యూ హియర్ మి నౌ'ను 1.2 లక్షల రీట్వీట్ చేశారంటే అతని ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేయడం మరిచిపోవడంతో తన ట్విట్టర్ ఖాతాకి 47 గిగాబైట్ డాటా వచ్చి చేరిందని ఎడ్వర్డ్ స్నోడెన్ ట్వీట్ చేశాడు. ప్రతి నోటిఫికేషన్‌కి తనకు ఓ అప్డేట్ వచ్చిందని పోస్ట్ చేశాడు. ఖాతా ప్రారంభించిన తొలిరోజే అధిక ఫాలోయర్స్‌ను సంపాదించుకున్న వ్యక్తుల్లో ఒకరిగా స్నోడెన్ నిలిచిన విషయం విదితమే. ట్విట్టర్ అకౌంట్ స్నోడెన్ ఓపెన్ చేసి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. తన ఫాలోయర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి స్నోడెన్ అశ్చర్యానికి లోనవుతున్నాడు. I forgot to turn off notifications. Twitter sent me an email for each: Follow Favorite Retweet DM 47 gigs of notifications. #lessonlearned — Edward Snowden (@Snowden) October 1, 2015 -
'45 నిమిషాల్లో లక్షన్నర ఫాలోవర్స్'
న్యూఢిల్లీ: అమెరికాకు సంబంధించి పలు రహస్యాలను బట్టబయలు చేసి ఆ దేశానికి వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రస్తుతం పెరుగుతున్న ఫాలోవర్స్ సంఖ్య నిమిషానికి మూడు వేలమంది ఉన్నారు. తనకు అంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్న స్నోడెన్ మాత్రం తొలిసారి అమెరికాకు చెందిన రక్షణ సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఎజెన్సీని ఫాలో అవడం విశేషం. 'కెన్ యూ హియర్ మీ నౌ' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు. ఆయన ఖాతా ప్రొఫైల్ వివరాల ప్రకారం ఫ్రీడాన్ఆఫ్ ప్రెస్‌కు ఆయన ప్రస్తుతం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ట్విట్టర్లో స్నోడెన్ జాయిన్ అవడం పట్ల అన్ని దేశాలతోపాటు భారత్ కూడా ఆయన ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారా అని తీవ్ర ఆసక్తితో ఉంది. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 7.79 లక్షలుమంది ఉండగా మరో నాలుగు రోజుల్లో 50 లక్షలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా పౌరుడు, సీఐఏ మాజీ ఉద్యోగి అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికాకు సంబంధించి అసాధారణమైన అంశాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పౌరులు నిత్యమూ జరుపుతున్న ఫోన్ సంభాషణలు, ఛాటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్సింగ్‌లు, ఈమెయిల్స్‌పై అమెరికా నిరంతర నిఘా పెట్టిందని, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లే కాదు... క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల పిన్ నంబర్లు దొంగిలిస్తున్నదని ఆయన అమెరికా దుశ్చర్యలను చెప్పాడు. స్వ పర భేదాలు కూడా లేకుండా నమ్మకస్తులైన మిత్రులుగా ఉంటున్న యూరోపియన్ యూనియన్ దేశాలపైనా, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియాలపైనా కూడా గూఢచర్యానికి పాల్పడుతున్నదని స్నోడెన్ వెల్లడించడంతో పెను సంఛలనమే అయింది. -
నన్ను పెళ్లాడతావా?
అమెరికాను గడగడలాడించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను బుట్టలో వేసుకునేందుకు రష్యా ప్రయత్నించిందని ఆ దేశానికి చెందిన మాజీ గూఢచారి ఒకరు వెల్లడించారు. తమకు బద్దశత్రువైన అమెరికాకు కొరుకుడుపడని స్నోడెన్ ను తమ దారికి తెచ్చుకునేందుకు మహిళా గూఢచారిని రష్యా ప్రయోగించిందని పేర్కొన్నారు. ఇందుకోసం అన్నా చాప్మాన్(32) అనే 'వేగు' చుక్కను రంగంలోకి దించిందని కేజీబీ మాజీ ఏజెంట్ బోరిస్ కార్పిచ్కోవ్ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చాప్మాన్ తన సోయగాలతో స్నోడెన్ ను వలవేసిందన్నారు. అతడిని ఒక్కసారే కలిసినప్పటికీ పెళ్లి ప్రతిపాదన చేసిందని తెలిపారు. 'స్నోడెన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ ట్వీటర్ లో కోరింది. ఇదంతా పథకం ప్రకారం జరిగిందని కార్పిచ్కోవ్ పేర్కొన్నారు. ఒకవేళ చాప్మాన్ ప్రతిపాదనను స్నోడెన్ అంగీకరిస్తే రష్యా పౌరసత్వం తీసుకునేందుకు అర్హుడవుతాడు. ఫలితంగా అతడు శాశ్వతంగా రష్యాలో ఉండిపోవాల్సి రావొచ్చు. పౌరసత్వం వచ్చిన విదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సివుంటుందని వివరించారు. స్నోడన్ కు చేసిన పెళ్లి ప్రతిపాదనపై స్పందించేందుకు చాప్మాన్ ఓ ఇంటర్వ్యూలో నిరాకరించింది. రష్యా దౌత్తవేత్త పుత్రిక అయిన చాప్మాన్ 2010లో వార్తాల్లోకి వచ్చింది. రష్యా ఏజెంటుగా అమెరికాలో పనిచేశానని చెప్పి ఆమె సంచలనానికి తెరతీశారు. గూఢచారి అని బయట ప్రపంచానికి తెలియకముందు న్యూయార్క్ సిటీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఆమె పనిచేసింది. అమెరికా నుంచి రష్యాకు తిరిగొచ్చిన తర్వాత మోడల్ గానూ పనిచేసి ప్రాచుర్యం పొందింది. అమెరికా నుంచి తప్పించుకున్న స్నోడెన్ కు రష్యా ఆశ్రయం ఇచ్చింది. మూడున్నరేళ్లు తమ దేశంలో ఉండేందుకు అతడికి అనుమతినిచ్చింది. -
నెట్‌వర్క్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందా?
ఏదైనా సమాచారం ఒక నెట్‌వర్క్‌లోకి వెళ్లిన తరువాత దాని గోప్యతకు గ్యారంటీలేదు. 100 శాతం రహస్యంగా ఉంటుందన్న నమ్మకంలేదు. అమెరికా లాంటి దేశం కూడా తన సీక్రెట్లను కాపాడుకోలేకపోయింది. వికీలీక్స్ దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఈ పరిస్థితుల్లో సమాచారాన్ని రహస్యంగా ఉంచే నెట్‌వర్క్‌ను చైనా సిద్ధం చేస్తోంది. వికీలీక్స్ - ఎడ్వర్డ్ స్నోడెన్.. ఈ రెండు పేర్లు వింటే అమెరికా ప్రభుత్వానికి కోపం నషాళానికి అంటుతుంది. ప్రపంచానికి పెద్దన్నగా తనకు తానుగా ప్రకటించుకుని అమెరికా చేస్తున్న దురాగతాలను వికీలీక్స్ ద్వారా స్నోడెన్ విడుదల చేశారు. దీంతో స్నోడెన్‌ను పట్టుకునేందుకు అగ్రరాజ్యం చేయని ప్రయత్నం లేదు. రష్యాతో పాటు మరి కొన్ని దేశాలు స్నోడెన్‌కు రక్షణ కల్పిస్తున్నాయి. అమెరికా నెట్‌వర్క్‌ను స్నోడెన్ చేధించడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. స్నోడెన్నే కాదు, ఏ డెన్ వచ్చినా చేధించలేని, హ్యాక్ చేయలేని నెట్‌వర్క్‌ను కొన్ని దేశాలు డెవలప్ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ విషయంలో చైనా కాస్త ముందుంది. క్వాంటమ్ నెట్‌వర్క్‌లో సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి పంపితే అందులోకి ఎవరూ చొరబడలేరు. ఈ నెట్‌వర్క్‌ను డెవలప్ చేసేందుకు 1980లలోనే ఐబీఎం ప్రయత్నించింది. గడిచిన 30 ఏళ్లుగా దీని మీద రీసెర్చ్ అంతగా ముందుకు పోలేదు. వికీలీక్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా ప్రభుత్వం క్వాంటమ్ నెట్వర్క్ పరిశోధన కోసం భారీగా నిధులు కేటాయించింది. ఒక నిర్దిష్టమైన మార్గంలో క్వాంటమ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతారు. ఆ మార్గంలో వెళ్లే సమాచారాన్ని ఎవరైనా హ్యాక్ చేయాలని, దొంగలించాలని ప్రయత్నిస్తే సమాచారం తన రూపాన్ని మార్చుకుంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ను కాజేసినా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంత ప్రాధాన్యం ఉన్న క్వాంటమ్ నెట్‌వర్క్‌ను మొదట బీజింగ్, షాంఘై నగరాల మధ్య ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. 2016 కల్లా ఈ రెండు నగరాల మధ్య 2 వేల కిలో మీటర్ల మేర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. క్వాంటమ్ నెట్‌వర్క్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచం వ్యాప్తంగా ఇలాంటి నెట్వర్క్ వేయాలంటే శాటిలైట్ల సహకారం అవసరమని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సేఫెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌పై దృష్టి సారించాయి. అయితే తాడిని తన్నేవాడున్నప్పుడు దాని తల దన్నే వాడు కూడా ఉంటాడని మన పెద్దలు చెబుతుంటారు. అట్లాగే క్వాంటమ్ నెట్‌వర్క్‌ను కూడా చేధించే హ్యాకర్లు పుట్టుకొచ్చే అవకాశంలేకపోలేదు. ** -
‘నోబెల్’కు నామినేట్ అయిన స్నోడెన్
అమెరికా నిఘా వ్యవహారాలను ప్రపంచానికి చాటిన ధీరుడు ఓస్లో (నార్వే): దేశ భద్రత ముసుగులో దేశాలు, సంస్థలు, వ్యక్తుల ఆంతరంగిక వ్యవహారాలపై విస్తృత స్థాయిలో నిఘా పెట్టిన అమెరికా దుశ్చర్యను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. స్నోడెన్ సహకారంతో వికీలీక్స్ వెబ్సైట్ వెల్లడించిన అమెరికా నిఘా వ్యవహారం గత సంవత్సరం సంచలనం సృష్టించింది. అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమయ్యాయి. నార్వేలో ఇంతకుముందు అధికారంలో ఉన్న వామపక్ష సోషలిస్ట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బార్డ్ వెగర్ సోజెల్, సొంత పార్టీకి చెందిన మరో నేత స్నోరీ వాలెన్తో కలిసి స్నోడెన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు. స్నోడెన్ చర్య ప్రభుత్వాల విశ్వసనీయతపై చర్చను లేవనెత్తిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
ఫ్రీడం ఆఫ్ ప్రెస్ ఫౌండేషన్ డైరెక్టర్ల బోర్డులో స్నోడెన్!
వాషింగ్టన్: అమెరికా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు చేపట్టబోతున్నాడు. స్వేచ్ఛగా, ధైర్యంగా వార్తలందించే మీడియా సంస్థలకు బాసటగా నిలిచేందుకు 2012లో స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడం ఆఫ్ ప్రెస్ ఫౌండేషన్ (ఎఫ్‌పీఎఫ్) డెరైక్టర్ల బోర్డులో చేరబోతున్నాడు. ఈ సందర్భంగా ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు డానియెల్ ఎల్స్‌బర్గ్ మాట్లాడుతూ.. అమెరికా జర్నలిస్ట్‌ల్లో అతను ఒక మచ్చుతునక, తన హీరో అంటూ కొనియాడారు. వికీలీక్స్ లీకులతో అమెరికాలో ఎన్ఎస్ఏ గూఢచర్యంపై విస్తతంగా చర్చజరుగుతోందన్నారు. బాధ్యతాయుతమైన విలేఖరిగా స్నోడెన్ నిలుస్తారని పేర్కొన్నారు. వార్తా పత్రికలకు స్వేచ్ఛగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో దానికి స్నోడెన్ ఒక ఉదాహరణ అని ఎఫ్‌పీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నోడెన్ భావితరాల జర్నలిస్ట్‌లకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆ సంస్థ తెలిపింది. గొప్పవ్యక్తుల సమాహారమైన ఎఫ్పీఎఫ్తో కలసి పనిచేయడం తనకు దక్కిన గౌరవమని స్నోడెన్ తెలిపాడు. -
భారత్‌లో ఆరురోజులున్న స్నోడెన్!
న్యూయార్క్: అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్, గతంలో భారత్‌లో ఆరు రోజులు ఉన్నాడని అమెరికా ‘ఫారెన్ పాలసీ’ మ్యాగజైన్ సోమవారం వెల్లడించింది. స్నోడెన్ ఎన్ఎస్ఏలో పనిచేస్తున్న కాలంలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో ఉంటూ అక్కడకు చేరువలో ఉన్న ఒక సంస్థ ఎథికల్ హ్యాకింగ్‌పై నిర్వహించిన కోర్సుకు హాజరయ్యాడని వెల్లడించింది. -
అమెరికాలో అక్టోబర్ సంక్షోభం
ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలిగించేటట్టు ఉంది. నష్టనివారణ చర్యలు కోసం అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ‘ఎడ్వర్డ్ స్నోడెన్‌కు కృతజ్ఞతలు’ రెండురో జుల క్రితం అమెరికా పౌరులు కొందరు కేపిటల్ హిల్ అనేచోట ఊరేగింపుగా వెళుతూ ఇచ్చిన నినాదాలలో ఇదొకటి. ఇప్పుడు స్నోడెన్ అమెరికాకు ప్రథమ శత్రువన్న సం గతి ప్రపంచమంతటికీ తెలుసు. ‘ఈ సామూహిక గూఢచర్యం పనులు ఆపాలి!’ అని కూడా ఆ పౌర బృందం ఆక్రోశించింది. ఒక వ్యవస్థగా అమెరికాను స్వదేశీయులే ఎంత చీదరించుకుంటున్నారో చెప్పడానికి ఇదిచాలు. సందర్భం కూడా తలవంపులు తెచ్చేదే. తనకు అత్యంత ఆప్తమైన యూరప్ ఖండ పాలకుల ఫోన్ల సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ అమెరికా అడ్డంగా దొరికిపోయింది. ఈ అక్టోబర్ 24న లండన్ నుంచి వెలువడే ‘గార్డియన్’ ప్రచురించిన ఒక వార్తా కథనం అగ్రదేశంలో అక్టోబర్ సంక్షోభానికి బీజం వేసింది. ‘2006, అక్టోబర్’కు చెందిన ఒక కీలక పత్రమే ఈ కథనానికి కేంద్రబిందువు. ప్రపంచంలో 200 మంది ప్రముఖుల, ప్రముఖ సంస్థల సెల్‌ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ చిరునామాలను సేకరించి, అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ)వారి సమాచారాన్ని రహస్యంగా తెలుసుకుంటున్న సంగతిని ఆ పత్రం రుజువు చేస్తోంది. ఎన్ఎస్ఏ మాజీ కాంట్రాక్టర్ అయిన స్నోడెన్ విడుదల చేసిన రహస్య పత్రాల గుట్టలలోనిదే ఇది కూడా. ‘గార్డియన్’ దీనిని అదను చూసి ప్రచురించింది. యూరోపియన్ యూనియన్ సమావేశాల కోసం ఆయా దేశాల అధినేతలంతా బ్రస్సె ల్స్‌లో సమావేశమవడానికి కాస్త ముందు ఆ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. అమెరికా గూఢచర్యానికి పాల్పడిన సంగతి తిరుగు లేకుండా రుజువు చేసింది. ఈ 200 మంది ఫోన్లు, ఈమెయిల్ చిరునామాలలో జర్మనీ చాన్సలర్ ఏంజెలినా మెర్కెల్ ఉపయోగించే మొబైల్ నెంబరు కూడా ఉంది. ఇది ఆ దేశానికి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. చరిత్ర సృష్టిస్తూ తను అధ్యక్షునిగా ఎన్నికైనపుడు (2011) ఒబామా పిలిచిన యూరప్ నుంచి ఆహ్వానించిన తొలి అతిథి మెర్కెల్. ఇప్పుడు ఆమె అమెరికాను నిలదీయాలని గట్టిగా కోరు కుంటున్నారు. బ్రస్సెల్స్ ఏర్పాటైన ఈయూ సమావేశం కూడా చర్చనీయాంశాలను పక్కన పెట్టి అమెరికా విపరీత చర్య గురించే ఎక్కు వగా ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలి గించేటట్టు ఉంది. నష్ట నివారణ చర్యలు చేప ట్టాలని అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. మెర్కెల్ మొబైల్ నుం చి ఎన్ఎస్ఏ సమాచారం సేకరిస్తున్న సంగతి తనకు తెలియదని, ఈ విషయం బహిర్గత మైన వెంటనే అధ్యక్షుడు ఒబామా అమాయ కత్వం నటించారు. అయితే గూఢచర్యం సం గతి 2010 సంవత్సరం నుంచి ఒబామాకు తెలుసునని జర్మనీ పత్రిక ‘బిల్డ్ ఏఎం సోన్టా గ్’ ఒక బాంబు పేల్చింది. మెర్కెల్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్ వినే పనిలో అమెరికా గూఢచారి శాఖ ఉద్యోగి ఒకరు ఉన్నారని 2010లోనే ఎన్ ఎస్ఏ అధిపతి కీత్ అలెగ్జాండర్ ఒబామాకు నివేదించిన సంగతిని జర్మనీ పత్రిక వెల్ల డించింది. ఈ సంగతి విని ఒబామా ‘ఇంకాస్త సమాచారం కూడా సేకరించండి!’ అని ఆదే శించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మెర్కె ల్ నమ్మదగిన జర్మన్ కాదని ఒబామా నమ్మక మట. అమెరికా గూఢచర్యం గురించి జర్మనీ ఇప్పటికే అక్కడి అమెరికా రాయబారిని పిలిచి చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాల మీద శ్వేత సౌధం అధికార ప్రతినిధి కెయిట్లిన్ హేడెన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినా, ఒక పాత సత్యం కొత్తగా వెల్లడించారు. విదేశాలకు సం బంధించిన సమాచారాన్ని అమెరికా గూఢ చారి సంస్థలు సేకరించడం మామూలేనని ఆయన సెలవిచ్చారు. మెర్కెల్ నుంచి కాదు, ఆమెకు ముందు అధ్యక్ష పదవిలో ఉన్న జెరార్డ్ ష్రోడర్ ఫోను సమాచారం కూడా అమెరికా విన్న సంగతి కూడా బయటపడింది. సెప్టెం బర్ 11,2001 దాడుల తరువాత అమెరికా నిగూఢత, జవాబుదారీతనాలకు సంబంధిం చిన మొత్తం విలువలను విడిచిపెట్టేసిందని స్నోడెన్ పత్రం వ్యాఖ్యానించింది. దీని ఫలి తమే కావచ్చు, అమెరికా ఈయూకు చెందిన కార్యాలయాలు, ప్రముఖులకు చెందిన ఐదు లక్షల ఫోన్ కాల్సును రహస్యంగా సేకరిం చిందని తేలింది. 35 మంది ప్రపంచ ప్రముఖ రాజకీయ ప్రముఖులలో మెర్కెల్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకాయిస్ హోలాండ్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా వాన్ రోసెఫ్, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో వంటి వారి కాల్స్ ఎన్ఎస్ఏ చాటుగా వింటున్నదని ఆరోపణలు వచ్చాయి. ఇంకా రష్యా, ఇరాన్, రష్యా నాయకుల కాల్స్ కూడా ఆ సంస్థ లక్ష్యంగా ఎంచుకుంది. రష్యా, బ్రెజిల్ ఇప్ప టికే దీని మీది మండిపడుతుండగా, అమెరికా ఇక నమ్మకమైన దేశమేనని రుజువు చేసుకునే పని ఆ దేశానిదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యా ఖ్యానించారు. ఈ సంవత్సరాంతంలోగా ఈ అంశం మీద అమెరికాతో చర్చలు జరపాలని మెర్కెల్ అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికాను వెలివేసే ఉద్దేశం వీరికి ఎంతమా త్రమూ లేదు. ఇప్పుడు బహుశా ప్రపంచం అంతా ఎదురు చూసేది ఒక అంశం కోసమే కావచ్చు. అది- కేపిటల్ హిల్ తరహా ఊరేగిం పులు బలపడాలి. తమ ప్రభుత్వం మీద ఆ పౌరులు వినిపిస్తున్న వ్యతిరేక నినాదాలకు పదును రావాలి. - కల్హణ -
అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు
విశ్లేషణ: ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహజ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి. వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రాలకు, ప్రజాస్వామ్యానికి మారు పేరు గా చెప్పుకునే అమెరికాకు స్వదేశంలోనూ, పరదేశాల్లోనూ పౌరు ల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే దీర్ఘకాలిక వ్యాధి ఉన్నదని రచ్చకెక్కించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటీవలి వార్తల్లోని వ్యక్తి. స్నోడెన్ వెల్లడించిన, వెల్లడించనున్న రహస్యాలపై పుంఖానుపుంఖాలుగా కథనాలను వెలువరించిన మీడియా ఒక కీలక అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. స్నోడెన్‌కు ఆశ్రయం కల్పించడానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు నెలరోజులు ఎందుకు పట్టింది? అమెరికాతో సంబంధాలు బెడుస్తాయన్న భయం అందుకు కారణం కానేకాదు. అవి ఇప్పటికంటే మెరుగుపడే ఆశా లేదు, దిగజారే అవకాశమూ లేదు. జూలై ఒకటిన మాస్కోలో రష్యా నేతృత్వంలోని ‘గ్యాస్ ఎగుమతి దేశాల వేదిక’ (జీయీసీఎఫ్) వార్షిక సమావేశాలు మొదలయ్యాయి. మూడేళ్లక్రితం అమెరికా తనకు చేసిన అవమానానికి స్నోడెన్ ఆశ్రయం రూపంలో బదులు తీర్చుకోవడానికి అదే రోజు పుతిన్‌కు సరైన ‘ముహూర్తం’ కుదిరింది. అందుకే నెల రోజులు స్నోడెన్ మాస్కో విమానాశ్రయంలో పడిగాపులు పడాల్సివచ్చింది. 2010 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ షేల్ గ్యాస్ ఇనిషియేటివ్ (జీఎస్జీయీ)ని ప్రారంభించి భారత్, చైనాలతో సహా నలభైకి పైగా దేశాలను ఆహ్వానించారు. ‘నిరపాయకరమైన’, లాభదాయకమైన పద్ధతుల్లో షేల్ గ్యాస్ వెలికితీత పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకునే ‘సహకారానికి’ నాంది పలికారు. భారీ షేల్ నిల్వలున్న రష్యాను మాత్రమే మినహాయించారు. పుతిన్ కూడా జీయీసీఎఫ్ అంతర్జాతీయ సమావేశం జరుగుతుండగా స్నోడెన్‌కు ఆశ్రయాన్ని ప్రకటించి బదులు తీర్చుకున్నారు. సహజవాయు నిక్షేపాలపై ‘భల్లూకం’ పట్టు షేల్ చమురు, షేల్ గ్యాస్‌లను ప్రత్యామ్నాయ చమురు, వాయువులుగా పిలుస్తున్నారు. రష్యా ప్రపంచంలోనే అతి ఎక్కువ సహజవాయు నిక్షేపాలున్న దేశం. రష్యా ఆధిపత్యంలోని జీఈసీఎఫ్ దేశాల చేతుల్లోనే ప్రపంచ సహజ వాయు నిక్షేపాలలో 70 శాతానికి పైగా ఉన్నాయి. అందుకే రష్యా, ఇరాన్, కతార్, బొలీవియా, వెనిజులా, లిబియా, అల్జీరియా తదితర 13 దేశాల జీఈసీఎఫ్ను చమురు ఎగుమతి దేశాల సంస్థ ‘ఒపెక్’తో పోలుస్తూ ‘గ్యాస్ ఒపెక్’గా పిలుస్తారు. రష్యా, ఇరాన్, ఖతార్‌లలో ప్రపంచ సహజవాయు నిక్షేపాలలో 57 శాతానికి పైగా ఉన్నాయి. పైగా ప్రపంచ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిలో 85 శాతం జీఈసీఎఫ్ చేతుల్లోనే ఉంది. అమెరికా ఇంధనావసరాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఈ అవసరాల కోసం గ్యాస్ వినియోగించే యూరోపియన్ దేశాలు జీఈసీఎఫ్పైనే ఆధారపడి ఉన్నాయి. సహజవాయువేగాక పెట్రోలియం రవాణాకు వీలుగా ఉండే ఎల్పీజీ తయారీ మార్కెట్టుపైనా, రవాణా చేసే గ్యాస్ పైపులైన్లపైనా దాని ఆధిపత్యమే కొనసాగుతోంది. అటు గల్ఫ్‌లోనూ, ఇటు నాటో కూటమిలోనూ ఉన్న పలు అమెరికా మిత్రదేశాలు ఇంధన అవసరాలకోసమో, మార్కెట్కోసమో రష్యాపై ఆధారపడాల్సివస్తోంది. 1990లలో కుప్పకూలిన రష్యా దశాబ్ది తిరగకముందే కోలుకోవడం ప్రారంభించింది. పూర్వ ప్రాభవం కోసం పావులు కదుపుతోంది. 2001లో జీఈసీఎఫ్కు నాంది పలికి, 2008 నాటికి దాన్ని ఆర్థిక కూటమిగా మార్చింది. ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల్లో అమెరికా కూరుకుపోయిన కాలంలోనే రష్యా తన ‘సామ్రాజ్యాన్ని’ పునర్నిర్మించే ప్రయత్నాలు సాగించింది. అమెరికా మరో ‘సౌదీ అరేబియా’ క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక ప్రాబల్యంతోపాటే దాని అంతర్జాతీయ ప్రతిష్ట కూడా ఇటీవలి కాలంలో దిగజారుతోంది. పైగా సోవియెట్ యూనియన్ పతనానంతర రష్యాతో సంబంధాలను పలు యూరోపియన్ దేశాలు పునర్నిర్వచించుకుంటున్నాయి. రష్యాను ఎదుర్కోడానికి అమెరికాకు షేల్ గ్యాస్ ‘మంత్రదండం’ దొరికింది. ప్రపంచ ఇంధన అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో విస్తృతంగా ఉన్న వివాదాస్పదమైన షేల్ గ్యాస్ నిల్వలను వాణిజ్యపరంగా వెలికి తీసే కార్యక్రమాన్ని ఒబామా వేగవంతం చేశారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇప్పటికే అది గ్యాస్ ఎగుమతి దేశంగా మారాల్సింది. కానీ వివిధ రాష్ట్రాల్లో షేల్ బావులకు వ్యతిరేకంగా తలెత్తుతున్న ఆందోళనలు, సుదీర్ఘ చర్చలతో ‘అనవసర’ జాప్యాలు తప్పడం లేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మూడు గ్యాస్ ఎగుమతి టెర్మినల్స్ నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 2020 నాటికే అమెరికాను ‘గ్యాస్ సౌదీ అరేబియా’గా మార్చాలనేది ఒబామా కల. 2012లో రష్యా వాయు ఉత్పత్తి 65,300 కోట్ల క్యూబిక్ మీటర్లు కాగా, అమెరికా కూడా దానికి ధీటుగా 65,100 కోట్ల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తిని సాధించింది. అమెరికా షేల్ గ్యాస్ దూకుడు కంటే వేగంగా అంచనాలపై నడిచే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు తగ్గాయి. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు చమురును ఎల్పీజీగా మార్చి అమ్ముకునే మార్కెట్లు కుంచించుకుపోతాయనే ఆందోళనలో పడ్డాయి. ఆ ఆందోళన చైనాకు దారులు తెరిచింది. చైనాలో కూడా విస్తారంగా షేల్ నిల్వలున్నా దానికి షేల్ జ్వరం సోకలేదు. సమీప భవిష్యత్తులో కూడా అది సంప్రదాయక చమురు నిల్వలపైనే ఆధారపడాలని యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు ఇతర దేశాల వనరులను కొని లేదా దబాయించి ప్రస్తుత అవసరాలకు విని యోగించుకుంటూ, తమ వనరులను పొదుపుగా వాడుకుంటోంది. జీఈసీఎఫ్తోపాటూ, అరబ్బు, ఆఫ్రికా దేశాల నుంచి కూడా అది చమురు, ఎల్పీజీలను దిగుమతి చేసుకోడానికి ప్రాధాన్యం ఇస్తోంది. అమెరికా షేల్ గ్యాస్‌తో పోటీ మూలంగా డిమాండు కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న గల్ఫ్ దేశాలకు చైనా అంతులేని ఇంధన దాహం ఆసరా అవుతోంది. ‘ఇంధనానికి బదులు ఆయుధాల’ ఒప్పందాలతో అమెరికా కోటలోకి చైనా వాణిజ్య మార్గంలో చొరబడిపోతోంది. రష్యా సైతం సౌదీ అరే బియా వంటి దేశాలతో అలాంటి భారీ ఒప్పందాలను చేసుకుంటోంది. గల్ఫ్‌లోని అమెరికా కోట బీటలు వార డం ప్రపంచ ఇంధన ఆధిపత్యపు పోరుకు ఒక పార్శ్వం. ఒబామా పగటి కల... పలువురు అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఒబామా షేల్ స్వప్నాన్ని పగటి కలగా కొట్టిపారేస్తున్నారు. అమెరికా చెబుతున్నట్టు దాని షేల్ నిల్వలు వంద ఏళ్లకు సరిపడేంత ఘనమైనవేమీ కావని సవాలు చేస్తున్నారు. షేల్ గ్యాస్ ప్రబోధకులు, ప్రచారకులు దాచిపెడుతున్న ఒక ఆర్థిక వాస్తవాన్ని పోస్ట్ కార్బన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు డేవిడ్ హ్యూస్ బయటపెట్టారు. 1990ల నుంచి అమెరికాలోని పనిచేస్తున్న గ్యాస్ బావుల సంఖ్య 90 శాతం పెరిగిందిగానీ, ఒక్కో బావి సగటు ఉత్పాదకత 38 శాతానికి పడిపోయిందని డేవిడ్ తన ‘డ్రిల్ బేబీ, డ్రిల్’ నివేదికలో వెల్లడించారు. షేల్... భూమిలో బాగా లోతున, సువిశాల విస్తీర్ణంలో బల ్లపరుపుగా వ్యాపించి ఉండే నేల పొరల మధ్య ఇరుక్కుని ఉంటుంది. కాబట్టి సంప్రదాయక బావుల నుంచి 70 నుంచి 100 ఏళ్ల వరకు తక్కువ వ్యయాలతో వెలికితీత సాధ్యమైతే, షేల్ బావులు 10 నుంచి 20 ఏళ్లల్లోనే అడుగంటుతాయి. ఏటికేడాది ఉత్పాదకత పడిపోతూ, వ్యయాలు పెరిగిపోతుంటాయి. ఎప్పటికప్పుడు సమీపంలో కొత్త బావులు తవ్వుతూనే ఉండాలి, భారీగా కొత్త పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. దీంతో దీర్ఘకాలంలో షేల్ గ్యాస్ వ్యయాలు పెరిగి వాణిజ్యపరంగా లాభసాటి కాకుండాపోతుంది. ఈ ముప్పు తెలుసు కాబట్టే అమెరికాలోని షేల్ లాబీ త్వరత్వరగా గ్యాస్ ఎగుమతులు చేసేయాలని ఆరాటపడిపోతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి భారత్ వరకు అంటించిన షేల్ జ్వరానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రసామాగ్రిని, రాయల్టీలను నొల్లేసుకోవాలని తొందరపడుతోంది. ఇతర దేశాలు షేల్ గ్యాస్ మార్కెట్లోకి వచ్చేసరికే షేల్ మార్కెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. ఒబామా షేల్ కలను అమ్మి అమెరికన్ పెట్రో గుత్త సంస్థలు లాభాలు చేసుకుంటాయి. అప్పటికల్లా కాస్పియన్ సముద్ర తీరంలోని రష్యా ఇంధన కోటలో పాగవేయాలనేది అమెరికా దీర్ఘకాలిక వ్యూహం. రష్యా ప్రాబ ల్యం కింద ఉన్న మధ్య ఆసియా దేశాల చమురు, గ్యాస్ నిక్షేపాలపై ఆధిపత్యం సంపాదించడానికి అది ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మానవహక్కుల ఉల్లంఘనకు ప్రసిద్ధి చెందిన అజర్బైజాన్లో మే నెల చివర్లో అది ‘అమెరికా-అజర్బైజాన్: విజన్, ప్యూచర్’ అనే సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి ఒబామా ప్రభుత్వ అత్యున్నతాధికారులు, కాంగ్రెస్ సభ్యులు, ప్రపంచ బ్యాం కు ప్రతినిధులు, మంత్రుల భార్యలు తదితరులు దాదాపు 400 మంది హాజరయ్యారు. అజర్‌బైజాన్‌ను కేంద్రంగా చేసుకొని ఆ దేశంలోని బాకూ తీరం నుంచి టర్కీకి అటు నుంచి ఇతర యూరప్ దేశాలకు గ్యాస్‌ను ఎగమతి చేయడానికి ట్రాన్స్‌కాస్పియన్ పైపులైన్ నిర్మాణానికి అమెరికాకు అజార్బైజాన్ స్థావరంగా మారింది. ఇంతవరకు రష్యా ప్రాబల్యం కింద ఉన్న తుర్కుమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్లలోని చమురు కేంద్రాలపైకి అమెరికా వల విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహ జ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి. - పిళ్లా వెంకటేశ్వరరావు