'45 నిమిషాల్లో లక్షన్నర ఫాలోవర్స్'
న్యూఢిల్లీ: అమెరికాకు సంబంధించి పలు రహస్యాలను బట్టబయలు చేసి ఆ దేశానికి వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రస్తుతం పెరుగుతున్న ఫాలోవర్స్ సంఖ్య నిమిషానికి మూడు వేలమంది ఉన్నారు. తనకు అంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్న స్నోడెన్ మాత్రం తొలిసారి అమెరికాకు చెందిన రక్షణ సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఎజెన్సీని ఫాలో అవడం విశేషం.
'కెన్ యూ హియర్ మీ నౌ' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు. ఆయన ఖాతా ప్రొఫైల్ వివరాల ప్రకారం ఫ్రీడాన్ఆఫ్ ప్రెస్కు ఆయన ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ట్విట్టర్లో స్నోడెన్ జాయిన్ అవడం పట్ల అన్ని దేశాలతోపాటు భారత్ కూడా ఆయన ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారా అని తీవ్ర ఆసక్తితో ఉంది. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 7.79 లక్షలుమంది ఉండగా మరో నాలుగు రోజుల్లో 50 లక్షలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెరికా పౌరుడు, సీఐఏ మాజీ ఉద్యోగి అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికాకు సంబంధించి అసాధారణమైన అంశాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పౌరులు నిత్యమూ జరుపుతున్న ఫోన్ సంభాషణలు, ఛాటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్సింగ్‌లు, ఈమెయిల్స్‌పై అమెరికా నిరంతర నిఘా పెట్టిందని, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లే కాదు... క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల పిన్ నంబర్లు దొంగిలిస్తున్నదని ఆయన అమెరికా దుశ్చర్యలను చెప్పాడు. స్వ పర భేదాలు కూడా లేకుండా నమ్మకస్తులైన మిత్రులుగా ఉంటున్న యూరోపియన్ యూనియన్ దేశాలపైనా, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియాలపైనా కూడా గూఢచర్యానికి పాల్పడుతున్నదని స్నోడెన్ వెల్లడించడంతో పెను సంఛలనమే అయింది.