ఫ్రీడం ఆఫ్ ప్రెస్ ఫౌండేషన్ డైరెక్టర్ల బోర్డులో స్నోడెన్!
వాషింగ్టన్: అమెరికా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు చేపట్టబోతున్నాడు. స్వేచ్ఛగా, ధైర్యంగా వార్తలందించే మీడియా సంస్థలకు బాసటగా నిలిచేందుకు 2012లో స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడం ఆఫ్ ప్రెస్ ఫౌండేషన్ (ఎఫ్‌పీఎఫ్) డెరైక్టర్ల బోర్డులో చేరబోతున్నాడు. ఈ సందర్భంగా ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు డానియెల్ ఎల్స్‌బర్గ్ మాట్లాడుతూ.. అమెరికా జర్నలిస్ట్‌ల్లో అతను ఒక మచ్చుతునక, తన హీరో అంటూ కొనియాడారు. వికీలీక్స్ లీకులతో అమెరికాలో ఎన్‌ఎస్‌ఏ గూఢచర్యంపై విస్తతంగా చర్చజరుగుతోందన్నారు. బాధ్యతాయుతమైన విలేఖరిగా స్నోడెన్ నిలుస్తారని పేర్కొన్నారు.
వార్తా పత్రికలకు స్వేచ్ఛగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో దానికి స్నోడెన్ ఒక ఉదాహరణ అని ఎఫ్‌పీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నోడెన్ భావితరాల జర్నలిస్ట్‌లకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆ సంస్థ తెలిపింది. గొప్పవ్యక్తుల సమాహారమైన ఎఫ్‌పీఎఫ్‌తో కలసి పనిచేయడం తనకు దక్కిన గౌరవమని స్నోడెన్ తెలిపాడు.