అమెరికా ‘గీత’... చమురు వాత! | america restrictions | Sakshi
Sakshi News home page

అమెరికా ‘గీత’... చమురు వాత!

Published Wed, Mar 19 2014 11:49 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికా ‘గీత’... చమురు వాత! - Sakshi

అమెరికా ‘గీత’... చమురు వాత!

అమెరికా ఆదేశాల మేరకు చౌకగా లభించే ఇరాన్ చమురు దిగుమతుల్లో కోత విధించారు. దక్షిణ ఆసియా పరిస్థితుల్లో భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంకాగల ఇరాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలను కాలదన్నుకోవడం ప్రమాదకరం.
 
 అవసాన దశలో ఉన్నంత మాత్రాన యూపీఏ ప్రభుత్వం చేతులు ముడుచుకు కూచోలేదు, చల్లగా కానిచ్చేయాల్సిన పనులను కానిచ్చేస్తోంది. గత నెల 28న ఇరాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ జారిఫ్‌తో భేటీ అయిన మన ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇరాన్‌తో సంబధాలలో సర్వతోముఖ వృద్ధిని కాంక్షించారు. అమెరికా-ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలతో ఉద్రిక్తతలు సడలినట్లనిపిస్తున్న నేపథ్యంలో మన్మోహన్ మాటలు నిజమేననుకున్నాం. ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మనకు ఇరాన్ అంటే ముడి చమురు గుర్తుకు రావడం సహజం. ఇకపై ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులు జోరుగా సాగి, పెట్రో ధరల మోత కాస్త తగ్గుతుందని ఆశపడ్డాం.

 

రిబేటు ధరతో, ఉచిత రవాణా సౌలభ్యంతో లభించే ఇరాన్ చమురు దిగుమతులను తగ్గించాలని నిర్ణయించారు!  ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతల సడలింపుల జోరుతో మన దిగుమతిదారులు జనవరి-మార్చి మధ్య రోజుకు 3,22,000బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోడానికి కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. తదుపరి త్రైమాసికలో (ఏప్రిల్-జూన్) మరింత పెరుగుతాయని అంచనాలు కట్టారు. కానీ ఏప్రిల్ నుంచి ఇరాన్ నుంచి దిగుమతుల్లో భారీ కోత పడనుంది. సగటున రోజుకు 1,95,000 బ్యారెల్స్‌కు మించకుండా నియంత్రిం చడానికి ఆపసోపాలు పడుతున్నారు. మరే  దేశమైనా ఇరాన్ కంటే చౌకగా చమురును సరఫరా చేస్తోనంటుందా అంటే అదీ లేదు. రోజుకి 1,95,000 బ్యారెళ్ల  ‘లక్ష్మణ రేఖ’ ఎవరు గీసింది?
 
 

అడిగినా మన్మోహన్ చెప్పరు. అడక్కపోయినా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలే చెప్పారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరేవరకు దానిపై తాము విధించిన ఆంక్షలలో 95 శాతం యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేశారు. అంటే భారత్ కోసం తాము గీసిన ‘లక్ష్మణ రేఖ’కు మించి ఇరాన్‌నుంచి చమురు దిగుమతి చేసుకోరాదు. గీత దాటితే ఏమౌతుంది? ఏమీ కాదని టర్కీ, ఒమన్, ఖతార్, ఇరాక్, తుర్కుమెనిస్థాన్ లాంటి దేశాలు అమెరికా ఆంక్షలను అసలు పట్టించుకోలేదు. భారత్ ‘ఆసియా శక్తి’, ‘ఆసియా సూపర్ పవర్’ అని చెప్పే మన్మో హన్ ఇలా అమెరికా ముందు సాష్టాంగపడాల్సిన అగత్యమేమిటి? అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లడం, ఉపశమించడంపై ఆధారపడి ఇరాన్‌తో సంబంధాలను ఎప్పటికప్పుడు పునర్విచించుకోవడం సాధ్యంకాదంటూ అప్పట్లో ఆయన వేసిన రంకెలన్నీ ఏమైపోయాయి?  అమెరికా ఇంధన మంత్రి ఎర్నెస్ట్ మోనిజ్ జనవరి మొదట్లోనే ఈ విషయమై హెచ్చరించారని, దీంతో అమెరికా వత్తిడులకు లొంగాల్సి వచ్చిందని వినవస్తోంది. నిజమే. కానీ ఈ వ్యవహారానికి మరో పార్శ్వం కూడా ఉంది. అది ఫాస్ట్‌ట్రాక్‌పై అమెరికా నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) దిగుమతుల కోసం యుద్ధ ప్రాతిపదికపై సాగుతున్న సన్నాహాలు. అమెరికా నుంచి  అంటే గల్ఫ్ ప్రాంత ముడి చమురును శుద్ధి చేసి, పైపుల ద్వారా రవాణాకు వీలుగా ఎల్‌పీజీగా మార్చి సరఫరా చేస్తారు.
 
 అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులకు బదులుగా అమెరికా చమురు, గ్యాస్ రంగంలోకి ప్రత్యేకించి షేల్ గ్యాస్ రంగంలోకి భారత చమురు సంస్థలకు ప్రవేశం లభిస్తుందని చెబుతున్నారు. తద్వారా షేల్ గ్యాస్ అన్వేషణ, వెలికితీత సాంకేతిక పరిజ్ఞానం మనకు లభిస్తుందని మన విదేశాంగ శాఖ సెలవిస్తోంది. అతి పెద్ద భారత చమురు సంస్థ రిలయన్స్‌కు ఇప్పటికే అమెరికా షేల్ గ్యాస్ ఆస్తులలో 20 శాతంపై యాజమాన్యం ఉంది. ఇరాన్ నుంచి దిగుమతుల కోతకు మన్మోహన్‌ను చెవి మెలిపెట్టి ఒప్పించడంలో రిలయన్స్ హస్తం ఉందని వినవస్తోంది. భారత ఇంధన భద్రతను అమెరికా చేతిలో పెట్టడం కంటే అవివేకమైన విషయం మరొకటుండదు. అన్నిటికీ మించి మరో అంశం కూడా ఉంది. భారత్‌లాగే ఇరాన్ కూడా పాకిస్థాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం సమస్యను ఎదుర్కుంటోంది. పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ  అధికారంలో ఉండగా అమెరికాను ధిక్కరించి మరీ ఇరాన్-పాక్ లైన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమెరికా ఒత్తిడి మేరకే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. గత 35 ఏళ్లుగా దిగజారుతున్న ఆరెండు దేశాల మధ్య సంబంధాలు నేడు అథఃపాతాళానికి చేరాయి. రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్న దక్షిణ ఆసియా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంకాగల ఇరాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలను కాలదన్నుకోవడం ప్రమాదకరం.
 పిళ్లా వెంకటేశ్వరరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement