అహంకారం తలకెక్కితే బుద్ధి మందగిస్తుంది. పెత్తనం చలాయించాలన్న యావ పరిధుల్ని మరిచిపోతుంది. భారత్–ఇరాన్‌ల మధ్య సోమవారం కుదిరిన ఒప్పందంపై అమెరికా స్పందించిన తీరు దాని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధపడేవారు ఆంక్షలు ఎదుర్కొనక తప్పదంటూ అమెరికా విదేశాంగ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్య బెదిరింపు ధోరణిలోవుంది. 2003లో వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్‌తో చాబహార్ ఓడరేవు నిర్మాణంపై ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా అడుగడుగునా అడ్డుపడుతోంది.
అందువల్లే అయిదేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు కాస్తా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2018లో పూర్తయిందనిపించి లాంఛనంగా ప్రారంభించారు. కానీ దానికి సంబంధించి రోడ్లు, రైల్వేలైన్లు మొదలుకొని వివిధ మౌలిక సదుపాయాల కల్పన, యంత్ర సామగ్రి వగైరాల విషయం అనిశ్చితిలో పడింది. మొత్తంమీద ఇప్పటికి 21 ఏళ్లయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్), ఇరాన్ పోర్టులు, నౌకా సంబంధ సంస్థల మధ్య ఓడరేవు టెర్మినల్ ప్రారంభంపై ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం కింద ఐపీజీఎల్ 12 కోట్ల డాలర్ల (రూ. వెయ్యికోట్లుపైగా) పెట్టుబడి పెడుతుంది. మన దేశం మరో 25 కోట్ల డాలర్ల రుణం సమకూరుస్తుంది. చాబహార్ సమీపంలో నిర్మించిన ఈ షహీద్ బెహెస్తీ పోర్టు మన దేశానికి లాభదాయకమైన ప్రాజెక్టు. అంతేకాదు... మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు అది ‘బంగారువాకిలి’. ఈ ప్రాజెక్టు కింద నిర్మాణమయ్యే రోడ్లు, రైల్వేలైన్లు వివిధ ఓడరేవులతో అనుసంధానమవుతాయి. సరుకు రవాణా చకచకా సాగుతూ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.
పెట్రో కెమికల్స్, ఉక్కు, ఎరువుల రంగాల్లో ఇరాన్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది. మధ్య ఆసియా మార్కెట్లలో ఇప్పటికే తిష్ఠ వేసి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టుతో బంగారు భవిష్యత్తును కలగంటూ అందరినీ మించి ఎదగాలని దూకుడుగా వెళ్తున్న చైనాకు చాబహార్ ఓడరేవు కంట్లో నలుసు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే బీఆర్‌ఐ ప్రాజెక్టుకు పెద్ద విలువుండదు.
ఇంతలోనే అమెరికా కొరడా ఝళిపించటం ప్రారంభించింది. ‘మేం ఇరాన్‌పై ఆంక్షలు విధించాం కనుక దానితో ఎవరూ వాణిజ్యబంధం నెలకొల్పుకోరాద’ంటూ ఫర్మానాలు జారీచేస్తోంది. రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఎందుకీ కడుపుమంట? ఏమిటీ బెదిరింపులు? ఇరాన్‌లో తనకు అనుకూలమైన మహమ్మద్ రెజా పహ్లావి (ఇరాన్ షా) పాలన సాగినంతకాలమూ అమెరికా ఆ దేశంతో సఖ్యంగా వుంది. ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావటంతో ఆ పాలకుడు కాస్తా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖొమేనీ కనుసన్నల్లోకి ఇరాన్ వచ్చిననాటి నుంచీ ఆ దేశాన్ని అమెరికా అష్టదిగ్బంధం చేస్తోంది. ఏదో ఒక కారణంతో కయ్యానికి దిగుతోంది.
తన సమస్యను ప్రపంచ సమస్య చేసి ఎవరూ ఆ దేశంతో వ్యాపార, వాణిజ్యాలను నడపరాదంటూ బెదిరిస్తోంది. పోనీ ఈ విషయంలోనైనా నిలకడగా వున్న చరిత్ర లేదు. 2003లో ఒప్పందం కుదిరినప్పుడు మౌనంగావున్న అమెరికా, ఆ తర్వాత కాలంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. పర్యవసానంగా ఆ ప్రాజెక్టు మూలనపడింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకుని ఆంక్షలు సడలించాయి. మరుసటి ఏడాదికల్లా చాబహార్‌పై భారత్–ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.
కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఆంక్షల పర్వం మళ్లీ మొదలైంది. కానీ మన దేశానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పటికి అఫ్గాన్ ఆర్థికాభివృద్ధిని, దానికి అందాల్సిన మానవతా సాయాన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చామని అమెరికా ప్రకటించింది. సారాంశంలో క్షణక్షణమూ మారే తన చిత్తానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ మసులుకోవాలని అమెరికా వాంఛిస్తోంది. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేసివుంటే వేరుగా వుండేది. అది లేకపోవటం వల్లనే తాజాగా మరోసారి హూంకరిస్తోంది.
దేశాలకు తమవైన విధానాలుంటాయి. ధూర్త దేశంగా మారి ఇరుగు పొరుగుకే కాక ప్రపంచ శాంతికే భంగంగా పరిణమించినప్పుడు ఎవరూ అలాంటి దేశంతో కలవాలనుకోరు. గతంలో ఇరాన్ విషయంలో భారత్‌కు ఇచ్చిన మినహాయింపులకు షరతులున్నాయి. ఇరాన్‌నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును వెంటనే తగ్గించుకోవాలని, మున్ముందు ఆపేయాలని అప్పట్లో అమెరికా కోరింది. అప్పటికి రోజుకు ఏడు లక్షల చమురు బ్యారెళ్లు దిగుమతి చేసుకునే భారత్... చివరకు ఆ దిగుమతిని ఆపేసింది కూడా! ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయాలని అమెరికా కోరినా లెక్కచేయని భారత్... మొదటినుంచీ అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తున్న తమ విషయంలో భిన్నంగా ఉంటున్నదని ఇరాన్ ఇప్పటికే విమర్శించింది.
ఇరాన్ వైఖరేమిటన్న సంగతలావుంచి మన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి మనవైన విధానాలు రూపొందించుకోవటం తప్పనిసరి. విదేశాంగమంత్రి జైశంకర్ అన్నట్టు అంతర్జాతీయంగా ఎన్నో దేశాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడే చాబహార్ పోర్టును అమెరికా సంకుచిత దృష్టితో చూడటం, మోకాలడ్డాలని ప్రయత్నించటం తగదు. మన దేశం ఇతర దేశాలతో కూడా ఈ విషయంలో చర్చించాలి. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ ఇలాంటి అనారోగ్య ధోరణులు అందరికీ ముప్పు తెచ్చేవే!
Comments
Please login to add a commentAdd a comment