న్యూఢిల్లీ: ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసీ సులేమానిని అమెరికా లక్షిత దాడుల్లో హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా భగ్గు మన్నాయి. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలవుతుందని, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇరువర్గాల దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్న నేటి పరిస్థితుల్లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు లేవు. ఇరాన్, అమెరికా మధ్య పరిమిత యుద్ధం జరిగినా భారత్ బాగా నష్టపోవాల్సి వస్తోంది.
యుద్ధం వల్ల భారత్‌కు ప్రాథమికంగా రెండు ముప్పులు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో వర్క్ పర్మిట్లపై పోయిన వారితో సహా మొత్తం 80 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ముఖ్యంగా అరేబియన్ గల్ఫ్‌లో ఎక్కువ మంది ఉన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే వారి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. 1990 దశకంలో అమెరికా, ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత్, ప్రత్యేక విమానాల ద్వారా 1,10,000 మంది భారతీయులను ఢిల్లీకి తీసుకొచ్చింది. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరగ్గ పోయినా ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగిన భారతీయుల ఉద్యోగాలకు ఎసరు వస్తుంది.
సౌదీ అరేబియా, ఖతార్ మధ్య గత కొన్నేళ్లుగా ప్రాంతీయ సంఘర్షణలు కొనసాగుతుండడం వల్ల వేలాది మంది ప్రవాస భారతీయులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. కేరళ నుంచి వెళ్లిన పాతిక లక్షల మంది భారతీయుల్లో అప్పుడే కొందరు వెనుతిరిగి వస్తున్నారు. ఒకేసారి అందరిని రప్పించడం కష్టమని చెప్పి రావాలనుకుంటున్న వారిని రమ్మని కేరళ చెబుతోంది. ప్రవాస భారతీయులు ఎక్కువ మంది వెను తిరిగి వస్తే ఏటా కేంద్రానికి వచ్చే నాలుగువేల కోట్ల డాలర్ల సొమ్మును భారత్ నష్టపోవాల్సి వస్తోంది. ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు వస్తోన్న విదేశీ మారక ద్రవ్యంలో ఇది యాభై శాతానికన్నా ఎక్కువ.
అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం ద్వారా భారత్‌కు మరో ముప్పు పొంచి ఉంది. ఇరాన్ మిలటరీ కమాండర్ సులేమానిని హతమార్చారన్న వార్తతోనే అంతర్జాతీయ చమురు ధరలు నాలుగు శాతం పెరిగాయి. ఇరాన్ నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకోకపోయినప్పటికీ మనకు గల్ఫ్ దేశాల నుంచి చమురు ‘హోర్ముజ్’ జలసంధి గుండా వస్తోంది. ప్రపంచంలో మూడొంతుల చమురు ఎగుమతి ఈ జలసంధి ద్వారానే జరుగుతోంది. యుద్ధం వచ్చినట్లయితే ఈ జలసంధి మూసుకుపోతుంది. పర్యవసానంగా చమురు ధరలు పెరిగి భారత్‌లో ద్రవ్యోల్బణం మరింత తీవ్రమవుతుందని, ఆహార పదార్థాల ధరలు ఆకాశానంటుతాయని ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఆర్థిక పరిస్థితి అదుపు తప్పింది. ద్రవ్యోల్పణం పెరిగింది. జీడీపీ రేటు గణనీయంగా పడిపోయింది. వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో అమెరికా–ఇరాన్ యుద్ధం అనివార్యం అయితే దాన్ని ఆపేంత శక్తి కూడా భారత్‌కు లేదు.
సంబంధిత వార్తలు
Comments
Please login to add a commentAdd a comment