Vedant
-
అమెరికా బెదిరింపు ధోరణి
అహంకారం తలకెక్కితే బుద్ధి మందగిస్తుంది. పెత్తనం చలాయించాలన్న యావ పరిధుల్ని మరిచిపోతుంది. భారత్–ఇరాన్‌ల మధ్య సోమవారం కుదిరిన ఒప్పందంపై అమెరికా స్పందించిన తీరు దాని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధపడేవారు ఆంక్షలు ఎదుర్కొనక తప్పదంటూ అమెరికా విదేశాంగ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్య బెదిరింపు ధోరణిలోవుంది. 2003లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్‌తో చాబహార్ ఓడరేవు నిర్మాణంపై ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా అడుగడుగునా అడ్డుపడుతోంది. అందువల్లే అయిదేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు కాస్తా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2018లో పూర్తయిందనిపించి లాంఛనంగా ప్రారంభించారు. కానీ దానికి సంబంధించి రోడ్లు, రైల్వేలైన్లు మొదలుకొని వివిధ మౌలిక సదుపాయాల కల్పన, యంత్ర సామగ్రి వగైరాల విషయం అనిశ్చితిలో పడింది. మొత్తంమీద ఇప్పటికి 21 ఏళ్లయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్), ఇరాన్ పోర్టులు, నౌకా సంబంధ సంస్థల మధ్య ఓడరేవు టెర్మినల్ ప్రారంభంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఐపీజీఎల్ 12 కోట్ల డాలర్ల (రూ. వెయ్యికోట్లుపైగా) పెట్టుబడి పెడుతుంది. మన దేశం మరో 25 కోట్ల డాలర్ల రుణం సమకూరుస్తుంది. చాబహార్ సమీపంలో నిర్మించిన ఈ షహీద్ బెహెస్తీ పోర్టు మన దేశానికి లాభదాయకమైన ప్రాజెక్టు. అంతేకాదు... మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు అది ‘బంగారువాకిలి’. ఈ ప్రాజెక్టు కింద నిర్మాణమయ్యే రోడ్లు, రైల్వేలైన్లు వివిధ ఓడరేవులతో అనుసంధానమవుతాయి. సరుకు రవాణా చకచకా సాగుతూ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.పెట్రో కెమికల్స్, ఉక్కు, ఎరువుల రంగాల్లో ఇరాన్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది. మధ్య ఆసియా మార్కెట్లలో ఇప్పటికే తిష్ఠ వేసి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టుతో బంగారు భవిష్యత్తును కలగంటూ అందరినీ మించి ఎదగాలని దూకుడుగా వెళ్తున్న చైనాకు చాబహార్ ఓడరేవు కంట్లో నలుసు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే బీఆర్ఐ ప్రాజెక్టుకు పెద్ద విలువుండదు. ఇంతలోనే అమెరికా కొరడా ఝళిపించటం ప్రారంభించింది. ‘మేం ఇరాన్‌పై ఆంక్షలు విధించాం కనుక దానితో ఎవరూ వాణిజ్యబంధం నెలకొల్పుకోరాద’ంటూ ఫర్మానాలు జారీచేస్తోంది. రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఎందుకీ కడుపుమంట? ఏమిటీ బెదిరింపులు? ఇరాన్లో తనకు అనుకూలమైన మహమ్మద్ రెజా పహ్లావి (ఇరాన్ షా) పాలన సాగినంతకాలమూ అమెరికా ఆ దేశంతో సఖ్యంగా వుంది. ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావటంతో ఆ పాలకుడు కాస్తా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖొమేనీ కనుసన్నల్లోకి ఇరాన్ వచ్చిననాటి నుంచీ ఆ దేశాన్ని అమెరికా అష్టదిగ్బంధం చేస్తోంది. ఏదో ఒక కారణంతో కయ్యానికి దిగుతోంది. తన సమస్యను ప్రపంచ సమస్య చేసి ఎవరూ ఆ దేశంతో వ్యాపార, వాణిజ్యాలను నడపరాదంటూ బెదిరిస్తోంది. పోనీ ఈ విషయంలోనైనా నిలకడగా వున్న చరిత్ర లేదు. 2003లో ఒప్పందం కుదిరినప్పుడు మౌనంగావున్న అమెరికా, ఆ తర్వాత కాలంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. పర్యవసానంగా ఆ ప్రాజెక్టు మూలనపడింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకుని ఆంక్షలు సడలించాయి. మరుసటి ఏడాదికల్లా చాబహార్‌పై భారత్–ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఆంక్షల పర్వం మళ్లీ మొదలైంది. కానీ మన దేశానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పటికి అఫ్గాన్ ఆర్థికాభివృద్ధిని, దానికి అందాల్సిన మానవతా సాయాన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చామని అమెరికా ప్రకటించింది. సారాంశంలో క్షణక్షణమూ మారే తన చిత్తానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ మసులుకోవాలని అమెరికా వాంఛిస్తోంది. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేసివుంటే వేరుగా వుండేది. అది లేకపోవటం వల్లనే తాజాగా మరోసారి హూంకరిస్తోంది. దేశాలకు తమవైన విధానాలుంటాయి. ధూర్త దేశంగా మారి ఇరుగు పొరుగుకే కాక ప్రపంచ శాంతికే భంగంగా పరిణమించినప్పుడు ఎవరూ అలాంటి దేశంతో కలవాలనుకోరు. గతంలో ఇరాన్ విషయంలో భారత్‌కు ఇచ్చిన మినహాయింపులకు షరతులున్నాయి. ఇరాన్నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును వెంటనే తగ్గించుకోవాలని, మున్ముందు ఆపేయాలని అప్పట్లో అమెరికా కోరింది. అప్పటికి రోజుకు ఏడు లక్షల చమురు బ్యారెళ్లు దిగుమతి చేసుకునే భారత్... చివరకు ఆ దిగుమతిని ఆపేసింది కూడా! ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయాలని అమెరికా కోరినా లెక్కచేయని భారత్... మొదటినుంచీ అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తున్న తమ విషయంలో భిన్నంగా ఉంటున్నదని ఇరాన్ ఇప్పటికే విమర్శించింది. ఇరాన్ వైఖరేమిటన్న సంగతలావుంచి మన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి మనవైన విధానాలు రూపొందించుకోవటం తప్పనిసరి. విదేశాంగమంత్రి జైశంకర్ అన్నట్టు అంతర్జాతీయంగా ఎన్నో దేశాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడే చాబహార్ పోర్టును అమెరికా సంకుచిత దృష్టితో చూడటం, మోకాలడ్డాలని ప్రయత్నించటం తగదు. మన దేశం ఇతర దేశాలతో కూడా ఈ విషయంలో చర్చించాలి. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ ఇలాంటి అనారోగ్య ధోరణులు అందరికీ ముప్పు తెచ్చేవే! -
మెట్ట వేదాంతం..?
వేదాంతం అనే మాట తెలుసు అందరికీ, అర్థం సరిగ్గా తెలిసినా లేకపోయినా. ఇంతకీ ఈ మెట్టవేదాంతం ఏమిటి? కాని, ఈ మాటని చాలామంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. మాగాణి వేదాంతం మరొకటి ఉందా? దీనికీ, దానికీ తామరకి, మెట్టతామరకి మధ్య ఉన్నంత తేడా ఉంటుందా? తామర, మెట్టతామర రెండూ పూలు. అంతే వాటి సంబంధం. ఒకటి నీళ్ళలో, మరొకటి నేల మీద పెరుగుతాయి. కాని, వేదాంతానికి మెట్ట వేదాంతానికి ఉన్నది మరొక రకమైన సంబంధం. వేదాంతం ఒక శాస్త్రం. అన్ని వేదాలు క్షుణ్ణంగా చదివిన తరువాత గురువు సమీపంలో కూర్చుని వేదాలలోని మర్మాలు తెలుసుకుంటాడు శిష్యుడు. ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న ఆ సంభాషణలని ఉపనిషత్తులు అని అంటారు. వేదాధ్యయనం అయిన తరువాత తెలుసుకునే భాగాలు కనుక వేదాంతంగా పరిగణించబడినాయి. సమస్తం భగవంతుడి స్వరూపంగా భావించ గలగటం అప్పటికి అభ్యాసం అయి ఉంటుంది. అందువల్ల వేదాంతం వంటపట్టిన వారు సామాన్య భక్తులలాగా పూజాదికాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. నిరంతరం సర్వవ్యాపి అయిన పరబ్రహ్మతత్త్వాన్ని ధ్యానం చేస్తూ, వివేచన చేస్తూ, అనుభూతి చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు చెప్పే మాటలని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఒకటి, రెండు మాటలని పట్టుకుని తమకి అనుకూలంగా వాడుకుంటారు కొంతమంది. కొంతమంది తెలియక కూడా ఆ విధంగా చేస్తారు. అంటే వేదాంత పరిభాషని తన ప్రవర్తనని సమర్థించుకునేందుకు చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాలు మనకి అడుగడుగునా, కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ‘‘అన్నమైతేనేమిరా? మరి, సున్నమైతే నేమిరా?’’ అని అన్నానికి సున్నానికి తేడా లేదని అంతా సమానమేనని ఇంటిముందు అడుక్కునేందుకు వచ్చిన సన్న్యాసి పాడుతాడు. ‘అబ్బా ఎంత వైరాగ్యం!’ అని అనుకుంటూ ఉంటే ఇట్లా కొనసాగిస్తాడు – ‘‘అందుకే ఈ పాడు పొట్టకి అన్నమే వేదాము రా! పప్పన్నమే వేదాము రా! నెయ్యన్నమే వేదామురా! పెరుగన్నమే వేదాము రా!’’ అంటాడు. అంతటితో ఆగడు. ‘‘చీరలైతేనేమిరా? మరి, నారలైతే నేమిరా? అందుకే ఈ పాడు ఒంటికి చీరలే కడదామురా! పట్టుచీరలే కడదామురా!’’ ఇట్లా కొనసాగుతూ ఉంటుంది ఆ పాట. ఇటువంటి వాటిని తత్త్వాలు అంటారు. తన శక్తిమేరకు పనిచేసి ఫలితం ఏమైనా పట్టించుకోకపోవటం వేదాంతి అయిన వాడు చేసే పని. కాని, వేదాంత ప్రసంగాలు విని, విని కొన్ని ఊతపదాలు మనకి అలవాటై పోయాయి. ‘‘మన చేతుల్లో ఏముంది?’’,‘‘ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది’’ అంటూ చేతులు ముడుచుకుని కూర్చునేవారు, తమ బద్ధకానికి, చేతకానితనానికి వేదాంతపు ముసుగు వేసుకున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారి వల్లనే మన ధర్మానికి, వేదాలకి, వేదాంతానికి చెడ్డపేరు వస్తోంది. మనం మెట్టవేదాంతులం కాకుండా ఉంటే చాలు. అటువంటి వారి నుండి దూరంగా ఉండటం మంచిది. అన్నానికి సున్నానికి తేడా లేదనటం వేదాంతం. అందుకని రకరకాల అన్నాలు వేద్దామనే నిర్ణయానికి రావటం మెట్టవేదాంతం. ఈ రెండింటికి తేడా లేదని చెప్పటం దంతవేదాంతం. ఆచరణలో చూపటం అసలైన వేదాంతం. రుచికరమైన ఆహారం తినకూడదని కాదు దీని అర్థం. అది కావాలని కోరకూడదు. దొరికినది ఏది అయినా ఒకే భావనతో తినగలగాలి. అట్లాగే ఎట్లాగైనా ఉండగలగాలి. అంటే పట్టుపరుపులైనా, నేలమీదైనా ఒకే రకం గా నిద్రించటం వేదాంతి లక్షణం అయితే, రెండూ ఒకటే కనుక పట్టుపరుపులే కావాలనుకోవటం మెట్టవేదాంతం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
Vedant Deoakte: అమెరికాలో రూ.33 లక్షల ఉద్యోగం కోల్పోయిన బాలుడు
ముంబై: కోడింగ్ కాంపిటీషన్లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఏడాదికి రూ.33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది. అతడి వయసు గురించి తెలిశాక ఉద్యోగం ఇవ్వలేమని సమాచారం పంపింది. విజేత వయసు కేవలం 15 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన వేదాంత్ దేవ్కాటే వయసు 15 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్ సాయంతో స్వయంగా కోడింగ్ నేర్చుకున్నాడు. అందులో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలోని న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ నిర్వహించిన కోడింగ్ పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్ రాశాడు. సునాయాసంగ విజయం సాధించాడు. వేదాంత్ ప్రతిభను గుర్తించిన న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ తమ మానవ వనరుల విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తామని తెలిపింది. వ్యక్తిగత వివరాలు పంపాలని కోరింది. వేదాంత్ ఆ వివరాలు పంపించాడు. అతడి వయసు 15 ఏళ్లేనని తెలుసుకున్న న్యూజెర్సీ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేమని పేర్కొంది. తమ కంపెనీ నిబంధనల ప్రకారం చిన్న వయసు వారిని చేర్చుకోవడం సాధ్యపడదని నిస్సహాయత వ్యక్తం చేసింది. నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని వేదాంత్‌కు సూచించింది. -
టీకా వేయించుకోకున్నా సర్టిఫికెట్ వచ్చింది!
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన 13ఏళ్ల వేదాంత్‌కు కోవిడ్ టీకా వేసినట్లు ఆయన తండ్రికి మెసేజ్ వచ్చింది. పైగా వేదాంత్ వయసు 56గా మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో షాకైన బాలుడి తండ్రి రజత్ డాంగ్రె అ విషయమై ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించినా ఫలితం రాలేదని చెప్పారు. వేదాంత్ దివ్యాంగుడని, కొన్ని రోజుల క్రితమే తనకు పెన్షన్ కోసం వివరాలను మున్సిపాలిటీలో ఇచ్చానని తెలిపారు. ఇటీవలే మధ్యప్రదేశ్ రికార్డు స్థాయిలో టీకాలు వేసినట్లు వార్తలకెక్కింది. అయితే తమకు టీకా వేయించుకోకున్నా, బెనిఫిషియరీ సర్టిఫికెట్ వచ్చిందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తనకు అసలు పరిచయం లేని ముగ్గురు పేర్లతో మెసేజులు వచ్చాయని సత్నాకు చెందిన చైనేంద్ర పాండ్య చెప్పారు. తానే ఇంతవరకు టీకా వేయించుకోలేదని, ఎవరికో టీకా వేసిన మెసేజ్‌లు తనకు ఎందుకు వచ్చాయో తెలియట్లేదని వాపోయారు. అయితే ఈ వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇలాంటి ఫిర్యాదులేమైనా అధికారికంగా వస్తే విచారణ చేస్తామని వైద్యమంత్రి చెప్పారు. -
వేదాంత్... సామాన్యుడు కాదు..!
ఆ కుర్రాడు అందరిలా కాదు.. తన తోటి చదువుకునే పిల్లలకు భిన్నంగా కనిపించేవాడు. పదకొండేళ్ళ వయసులోనే తన ప్రతిభతో ఔరా అనిపించుకున్నాడు. మన దేశంకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నదే అతని ఆశయం.. ఆకాంక్ష. అందుకు మార్గాలను అన్వేషించాలనే కృత నిశ్చయం అతడికి అతి చిన్న వయసులోనే మొగ్గ తొడిగింది. గ్రామాల్లో స్నేహితుల కరెంటు కష్టాలను దగ్గరగా చూసిన అతడు వారికోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాడు. ఎప్పుడూ ఎల్ ఈ డీలు, అయిస్కాంతాలు, తదితర వస్తువులతో బిజీగా కనిపించే ఆ కుర్రాడిపేరు వేదాంత్ ధిరేన్ థాకర్. ఆరో తరగతి చదివేప్పుడే అతడి ఆలోచనా విధానం లో ఓ ప్రత్యేకత.... అతడి చేతిలో ఆటవస్తువులు చూస్తే తల్లితండ్రులకు ఆశ్చర్యం.... వేదాంత్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు చిన్న వయసులోనే ప్రయత్నాలు ప్రారంభించాడు. పదకొండేళ్ళ వయసులో వేస్ట్ వస్తువులతో ఉచిత విద్యుత్ ఉత్పత్తికి బీజాలు నాటాడు. మహరాష్ట్రకు చెందిన పదకొండేళ్ళ వేదాంత్ ఆరేళ్ళ వయసులో తన తండ్రి ల్యాప్ టాప్ పాడవడంతో దానినుంచీ తీసిన బ్యాటరీని వృధాగా పారేయకూడదనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు ఆ బ్యాటరీ వినియోగంతో తాను అనుకున్న విద్యుత్ ఉత్పత్తికి దారులు వెతికాడు. గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల్లో కరెంటు లేక పిల్లలు రాత్రి సమయాల్లో చదువుకోలేని స్థితిని మార్చాలనుకున్నాడు. ఆవిషయంపై దృష్టి సారించాడు. సెలవుల్లో సమయాన్ని వృధాగా పోనివ్వకుండా గ్రామాలకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయోగాలను చేస్తుండేవాడు. అందులో భాగంగానే వేదాంత్.. వేస్ట్ బ్యాటరీస్ కు సోలార్ సిస్టమ్ ను వాడి విద్యుత్ ను ఉత్పత్తి చేసే విధానాన్ని మొదటిసారి 2014 లో కనుగొన్నాడు. బ్యాటరీల్లో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి లైట్ వెలిగించి అనుకున్నది సాధించాడు. పాత బ్యాటరీలను ఉపయోగించి సోలార్ సాయంతో విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చన్న విషయాన్ని వేదాంత్ పదకొండేళ్ళ ప్రాయంలోనే కనుగొన్నాడు. ఇటువంటి విద్యుత్ తో గ్రామాల్లోని పిల్లల జీవితాల్లో విద్యుత్ వెలుగులు కురిపించాలన్నది అతని ఆకాంక్ష. వేదాంత్ ఆలోచనను అతని తండ్రి ధిరేన్ థాకర్ కూడ ప్రోత్సహించారు. ఆరేళ్ళ వయసునుంచే ప్రయోగాలను ప్రారంభించిన వేదాంత్ బ్యాటరీలు, డైనమోస్, మోటార్లు, ఐస్కాంతాలు వినియోగిస్తూ ఏడేళ్ళ వయసులో ఎలక్ట్రానిక్ టాయ్ బోట్, సౌండ్ ప్రొడ్యూసింగ్ డివైజ్ తోపాటు, పదకొండేళ్ళ వయసులో రిమోట్ ఆపరేటెడ్ బోట్ తయారు చేశాడు. ఇటీవల రిమోట్ తో డోర్ ను తెరిచే విధానాన్ని కూడ కనుగొన్నాడు. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు పేటెంట్ ను తీసుకున్నాడు. ప్రస్తుతం కంప్యూటర్ ఇంజనీర్ గా ఉన్న వేదాంత్ తండ్రి థిరేన్ కూడ ఎలక్ట్రానిక్స్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించడం వేదాంత్ కు కలసి వచ్చింది. భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదివి, మొత్తం దేశానికే ఫ్రీ కరెంట్ ఉత్పత్తి మార్గాలను కనుగొనాలని కలలు కంటున్నాడు వేదాంత్. అతడి కల సాకారం అయితే దేశంలోని విద్యుత్ కు దూరంగా ఉన్న ఎన్నో గ్రామాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది.