వేదాంత్... సామాన్యుడు కాదు..!
ఆ కుర్రాడు అందరిలా కాదు.. తన తోటి చదువుకునే పిల్లలకు భిన్నంగా కనిపించేవాడు. పదకొండేళ్ళ వయసులోనే తన ప్రతిభతో ఔరా అనిపించుకున్నాడు. మన దేశంకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నదే అతని ఆశయం.. ఆకాంక్ష. అందుకు మార్గాలను అన్వేషించాలనే కృత నిశ్చయం అతడికి అతి చిన్న వయసులోనే మొగ్గ తొడిగింది. గ్రామాల్లో స్నేహితుల కరెంటు కష్టాలను దగ్గరగా చూసిన అతడు వారికోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాడు.
ఎప్పుడూ ఎల్ ఈ డీలు, అయిస్కాంతాలు, తదితర వస్తువులతో బిజీగా కనిపించే ఆ కుర్రాడిపేరు వేదాంత్ ధిరేన్ థాకర్. ఆరో తరగతి చదివేప్పుడే అతడి ఆలోచనా విధానం లో ఓ ప్రత్యేకత.... అతడి చేతిలో ఆటవస్తువులు చూస్తే తల్లితండ్రులకు ఆశ్చర్యం.... వేదాంత్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు చిన్న వయసులోనే ప్రయత్నాలు ప్రారంభించాడు. పదకొండేళ్ళ వయసులో వేస్ట్ వస్తువులతో ఉచిత విద్యుత్ ఉత్పత్తికి బీజాలు నాటాడు.
మహరాష్ట్రకు చెందిన పదకొండేళ్ళ వేదాంత్ ఆరేళ్ళ వయసులో తన తండ్రి ల్యాప్ టాప్ పాడవడంతో దానినుంచీ తీసిన బ్యాటరీని వృధాగా పారేయకూడదనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు ఆ బ్యాటరీ వినియోగంతో తాను అనుకున్న విద్యుత్ ఉత్పత్తికి దారులు వెతికాడు.
గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల్లో కరెంటు లేక పిల్లలు రాత్రి సమయాల్లో చదువుకోలేని స్థితిని మార్చాలనుకున్నాడు. ఆవిషయంపై దృష్టి సారించాడు. సెలవుల్లో సమయాన్ని వృధాగా పోనివ్వకుండా గ్రామాలకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయోగాలను చేస్తుండేవాడు. అందులో భాగంగానే వేదాంత్.. వేస్ట్ బ్యాటరీస్ కు సోలార్ సిస్టమ్ ను వాడి విద్యుత్ ను ఉత్పత్తి చేసే విధానాన్ని మొదటిసారి 2014 లో కనుగొన్నాడు.
బ్యాటరీల్లో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి లైట్ వెలిగించి అనుకున్నది సాధించాడు. పాత బ్యాటరీలను ఉపయోగించి సోలార్ సాయంతో విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చన్న విషయాన్ని వేదాంత్ పదకొండేళ్ళ ప్రాయంలోనే కనుగొన్నాడు. ఇటువంటి విద్యుత్ తో గ్రామాల్లోని పిల్లల జీవితాల్లో విద్యుత్ వెలుగులు కురిపించాలన్నది అతని ఆకాంక్ష.
వేదాంత్ ఆలోచనను అతని తండ్రి ధిరేన్ థాకర్ కూడ ప్రోత్సహించారు. ఆరేళ్ళ వయసునుంచే ప్రయోగాలను ప్రారంభించిన వేదాంత్ బ్యాటరీలు, డైనమోస్, మోటార్లు, ఐస్కాంతాలు వినియోగిస్తూ ఏడేళ్ళ వయసులో ఎలక్ట్రానిక్ టాయ్ బోట్, సౌండ్ ప్రొడ్యూసింగ్ డివైజ్ తోపాటు, పదకొండేళ్ళ వయసులో రిమోట్ ఆపరేటెడ్ బోట్ తయారు చేశాడు. ఇటీవల రిమోట్ తో డోర్ ను తెరిచే విధానాన్ని కూడ కనుగొన్నాడు. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు పేటెంట్ ను తీసుకున్నాడు.
ప్రస్తుతం కంప్యూటర్ ఇంజనీర్ గా ఉన్న వేదాంత్ తండ్రి థిరేన్ కూడ ఎలక్ట్రానిక్స్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించడం వేదాంత్ కు కలసి వచ్చింది. భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదివి, మొత్తం దేశానికే ఫ్రీ కరెంట్ ఉత్పత్తి మార్గాలను కనుగొనాలని కలలు కంటున్నాడు వేదాంత్. అతడి కల సాకారం అయితే దేశంలోని విద్యుత్ కు దూరంగా ఉన్న ఎన్నో గ్రామాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది.