created
-
తోడేలులా ప్రవర్తిస్తున్న యువకుడు
ముజఫర్‌నగర్: యూపీలోని బహ్రయిచ్ తోడేళ్ల దాడులతో వణికిపోతోంది. తాజాగా ముజఫర్ నగర్లోనూ ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇక్కడ దాడులకు పాల్పడుతున్నది ఏ తోడేలో, కుక్కనో కాదు.. ఒక యువకుడు. వినడానికి విస్తుపోయేలా ఉన్నా ఇది నిజం.వివరాల్లోకి వెళితే యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ యువకుడు నరమాంస భక్షకునిగా మారి, పలువురిని కరుస్తునాడు. అతను సృష్టిస్తున్న భీభత్సానికి స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఆ యువకుడు ఓ మహిళతో పాటు ఓ బాలికను గట్టిగా కరిచాడు. అతని దాడి నుంచి బాధిత మహిళను బాలికను ఆ దారినపోతున్నవారు అతికష్టం మీద కాపాడారు.ఆ యువకుడు కుక్కల వెంట పరిగెడుతూ, వాటిని భయపెట్టడంతో పాటు దారినపోయినవారిని కొరుకుతూ గాయపరుస్తున్నాడు. ఈ నేపధ్యంలో స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. -
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలు ఇండోనేషియాలో విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి సులవేసి దీవిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందారు. వివిధ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అక్కడి అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 13 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రబ్బరు పడవలు, ఇతర వాహనాలను ఉపయోగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్లో 37 మంది మృతి చెందారు. అల్ జజీరా నివేదిక ప్రకారం విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 37. 74 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎడ్వర్డో లైట్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో ప్రభావిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
చార్ధామ్ యాత్రపై సైబర్ నేరగాళ్ల కన్ను.. ఆటకట్టించిన పోలీసులు
చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ యాత్రపై కన్నువేశారు. గతంలో హెలీ సర్వీసుల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసగించిన ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు హోటల్ బుకింగ్ పేరుతోనూ యాత్రికులను వంచించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపధ్యంలో తాజాగా పోలీసులు హోటల్ బుకింగ్ పేరుతో సృష్టించిన ఏడు నకిలీ వెబ్సైట్లను, హెలీ సర్వీస్ బుకింగ్ కోసం సృష్టించిన 12 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఏడాది కాలంలో పోలీసులు చార్ధామ్ యాత్రతో ముడిపడిన 83 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఇటువంటి మోసాలను నివారించడానికి పోలీసు శాఖలోని ఇంటర్నెట్ మీడియా సెల్‌ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో హెలీ సర్వీస్ బుకింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఆయుష్ అగర్వాల్ తెలిపారు. యాత్రికులు https://www.heliyatra.irctc.co.in/ ద్వారా చార్ధామ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాత్రికులెవరైనా నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించినప్పుడు డెహ్రాడూన్ ఎస్టీఎఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9456591505, 9412080875 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. -
సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈసారి వినూత్నంగా వేడుకలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు తమతమ జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు. ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు తమతమ సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్‌ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్‌మనీని కూడా ఇస్తారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులకు ప్లాన్.. హై అలర్ట్ జారీ.. -
హోదాతో 22 లక్షల ఉద్యోగావకాశాలు
-
వాళ్లు దేవుణ్ణి నమ్మడం లేదు..!
విత్తు ముందా? చెట్టు ముందా అన్నట్లుగానే ఆస్తిక వాదం, నాస్తిక వాదం మధ్య శతాబ్దాల తర్కం నడుస్తూనే ఉంది. విశ్వం పుట్టుకకు దేవుడు కారణమా? బిగ్ బ్యాంగ్ థియరీ నిజమా? అన్నదానిపై ఎవరికి తోచిన వివరణ వారిస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయంపై యూరప్ ఐస్లాండ్ లో తాజాగా ఓ పోల్ నిర్వహించారు. నిజంగా ప్రపంచం పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మరోసారి చేశారు. ఐస్లాండ్ లోని ఎథికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ విశ్వం పుట్టుకపై సర్వే నిర్వహించింది. ప్రపంచం ఎక్కడ ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలుసుకునేందుకు ప్రశ్నల ద్వారా పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 25 సంవత్సరాల వయసులోపు 93.9 శాతం మంది విశ్వం పుట్టుకకు బిగ్ బ్యాంగే కారణమని చెప్పగా... మిగిలిన ఆరు శాతం మంది తమకు తెలియదన్నారు. కాగా విశ్వం దేవుడి వల్లే పుట్టిందని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేదు. దీని ఆధారంగా స్థానిక రెక్జావిక్ వాసులు, యువత ఏ మతాన్నీ, దేవుణ్ణీ నమ్మడం లేదని తెలుస్తోందని ఐస్లాండ్ పత్రిక నివేదికలు చెప్తున్నాయి. ఇక్కడి వారిలో 80.6 శాతం మందిలో అదీ 55 ఏళ్ళకు పైబడిన వారు అంతా క్రైస్తవులే ఉన్నారు. 11.8 శాతం మాత్రం నాస్తికులుగా చెప్పాలి. కాగా 25 సంవత్సరాలు... అంతకంటే చిన్న వ్యక్తుల్లో 40.5 శాతం మంది నాస్తికులు కాగా మిగిలిన 42 శాతంమంది క్రైస్తవులని తేలింది. అయితే ఇదే పోల్ పై పలు విమర్శలు కూడ వెల్లువెత్తాయి. ఓ రెడ్డిట్ యూజర్ (ఇంటర్నెట్ మొదటి పేజీ) ఈ పోల్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని ఆరోపించారు. అసోసియేషన్ నిర్వహించిన సర్వే గందరగోళంగా ఉందని, అడిగిన ప్రశ్నల్లో క్లారిటీ లేదని అన్నారు. విశ్వం పుట్టుక గురించి మీరేమనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు... బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది, దేవుడు సృష్టించాడు, తెలియదు, ఇతరాలు అన్న ఆప్షన్లు ఇవ్వడంలో అర్థం లేదన్నారు. చాలామంది దేవుడే బిగ్ బ్యాంగ్ కూ కారణమని నమ్ముతారని, ఇతరములు అన్న సమాధానంలో వీటిలో ఏదీ కాక దేవుడే బిగ్ బ్యాంగ్ ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడన్న అర్థం కూడా వస్తుందని అన్నారు. మరికొంతమంది యూజర్లు.. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మొదట కాథలిక్ ప్రీస్ట్, భౌతిక శాస్త్రవేత్త జార్జిస్ లెమైట్రే నుంచి పుట్టిందన్నది వాస్తవమన్నారు. ఇలా ఎవరికి తోచిన వాదం వారు చేయగా.. అసలు విశ్వ పుట్టుక విషయం పక్కన పెడితే శాస్త్రీయ సిద్ధాంతాలకూ, దేవుడికీ పోలిక కుదరదని ముందు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. -
మూడేళ్ల వయస్సులో వరల్డ్ రికార్ట్
-
వేదాంత్... సామాన్యుడు కాదు..!
ఆ కుర్రాడు అందరిలా కాదు.. తన తోటి చదువుకునే పిల్లలకు భిన్నంగా కనిపించేవాడు. పదకొండేళ్ళ వయసులోనే తన ప్రతిభతో ఔరా అనిపించుకున్నాడు. మన దేశంకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నదే అతని ఆశయం.. ఆకాంక్ష. అందుకు మార్గాలను అన్వేషించాలనే కృత నిశ్చయం అతడికి అతి చిన్న వయసులోనే మొగ్గ తొడిగింది. గ్రామాల్లో స్నేహితుల కరెంటు కష్టాలను దగ్గరగా చూసిన అతడు వారికోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాడు. ఎప్పుడూ ఎల్ ఈ డీలు, అయిస్కాంతాలు, తదితర వస్తువులతో బిజీగా కనిపించే ఆ కుర్రాడిపేరు వేదాంత్ ధిరేన్ థాకర్. ఆరో తరగతి చదివేప్పుడే అతడి ఆలోచనా విధానం లో ఓ ప్రత్యేకత.... అతడి చేతిలో ఆటవస్తువులు చూస్తే తల్లితండ్రులకు ఆశ్చర్యం.... వేదాంత్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు చిన్న వయసులోనే ప్రయత్నాలు ప్రారంభించాడు. పదకొండేళ్ళ వయసులో వేస్ట్ వస్తువులతో ఉచిత విద్యుత్ ఉత్పత్తికి బీజాలు నాటాడు. మహరాష్ట్రకు చెందిన పదకొండేళ్ళ వేదాంత్ ఆరేళ్ళ వయసులో తన తండ్రి ల్యాప్ టాప్ పాడవడంతో దానినుంచీ తీసిన బ్యాటరీని వృధాగా పారేయకూడదనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు ఆ బ్యాటరీ వినియోగంతో తాను అనుకున్న విద్యుత్ ఉత్పత్తికి దారులు వెతికాడు. గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల్లో కరెంటు లేక పిల్లలు రాత్రి సమయాల్లో చదువుకోలేని స్థితిని మార్చాలనుకున్నాడు. ఆవిషయంపై దృష్టి సారించాడు. సెలవుల్లో సమయాన్ని వృధాగా పోనివ్వకుండా గ్రామాలకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయోగాలను చేస్తుండేవాడు. అందులో భాగంగానే వేదాంత్.. వేస్ట్ బ్యాటరీస్ కు సోలార్ సిస్టమ్ ను వాడి విద్యుత్ ను ఉత్పత్తి చేసే విధానాన్ని మొదటిసారి 2014 లో కనుగొన్నాడు. బ్యాటరీల్లో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి లైట్ వెలిగించి అనుకున్నది సాధించాడు. పాత బ్యాటరీలను ఉపయోగించి సోలార్ సాయంతో విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చన్న విషయాన్ని వేదాంత్ పదకొండేళ్ళ ప్రాయంలోనే కనుగొన్నాడు. ఇటువంటి విద్యుత్ తో గ్రామాల్లోని పిల్లల జీవితాల్లో విద్యుత్ వెలుగులు కురిపించాలన్నది అతని ఆకాంక్ష. వేదాంత్ ఆలోచనను అతని తండ్రి ధిరేన్ థాకర్ కూడ ప్రోత్సహించారు. ఆరేళ్ళ వయసునుంచే ప్రయోగాలను ప్రారంభించిన వేదాంత్ బ్యాటరీలు, డైనమోస్, మోటార్లు, ఐస్కాంతాలు వినియోగిస్తూ ఏడేళ్ళ వయసులో ఎలక్ట్రానిక్ టాయ్ బోట్, సౌండ్ ప్రొడ్యూసింగ్ డివైజ్ తోపాటు, పదకొండేళ్ళ వయసులో రిమోట్ ఆపరేటెడ్ బోట్ తయారు చేశాడు. ఇటీవల రిమోట్ తో డోర్ ను తెరిచే విధానాన్ని కూడ కనుగొన్నాడు. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు పేటెంట్ ను తీసుకున్నాడు. ప్రస్తుతం కంప్యూటర్ ఇంజనీర్ గా ఉన్న వేదాంత్ తండ్రి థిరేన్ కూడ ఎలక్ట్రానిక్స్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించడం వేదాంత్ కు కలసి వచ్చింది. భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదివి, మొత్తం దేశానికే ఫ్రీ కరెంట్ ఉత్పత్తి మార్గాలను కనుగొనాలని కలలు కంటున్నాడు వేదాంత్. అతడి కల సాకారం అయితే దేశంలోని విద్యుత్ కు దూరంగా ఉన్న ఎన్నో గ్రామాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. -
హవ్వ.. ఇదేం విచిత్రం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: క్షేత్రస్థాయి అధికారుల పోస్టుల భర్తీ పట్టించుకోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉన్నత స్థాయిలో కొత్త పోస్టుల సృష్టికి ఉబలాటపడుతోంది. జిల్లాస్థాయిలో ప్రస్తుతం ప్రజా సంబంధాల అధికారి(డీపీఆర్ఓ) పర్యవేక్షణలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. డీపీఆర్ఓ పోస్టును కొనసాగిస్తూనే కొత్తగా డిప్యూటీ డెరైక్టర్(డీడీ) లేదా అసిస్టెంట్ డైరక్టర్(ఏడీ) పోస్టులను సృష్టించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 12 డీడీ, 13 ఏడీ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెదక్ జిల్లాకు ఈ ఇద్దరిలో ఏ హోదా అధికారి వస్తారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో డీపీఆర్‌ఓతో పాటు, ముగ్గురు డివిజనల్ పీఆర్వోలు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో రంగారెడ్డి జిల్లా డివిజనల్ పీఆర్వో ప్రణీత్ డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లా డీపీఆర్ఓగా పనిచేస్తున్నారు. సిద్దిపేట డివిజనల్ పీఆర్వో ఆరోగ్య కారణాలతో చాలాకాలంగా సెలవులో ఉన్నారు. మెదక్, సంగారెడ్డిలో డివిజనల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన పబ్లిసిటీ అసిస్టెంట్ నాగభూషణంకు పౌర సరఫరాల విభాగం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వేతనం చెల్లిస్తూ మెదక్ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. రెండు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(ఏపీఆర్ఓ) పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. ఆరుగురు పబ్లిసిటీ అసిస్టెంట్లకు గాను ఇద్దరే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు నల్గొండ జిల్లా నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారే కావడం గమనార్హం. ఫొటోగ్రాఫర్ లేకపోవడంతో ఆర్వీఎం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఓ వ్యక్తిని నియమించి నెట్టుకొస్తున్నారు. ఉన్న ఒక్క ఆడియో విజువల్ పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టూ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం అధికారుల పోస్టులను మాత్రం ఉదారంగా మంజూరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.