వాళ్లు దేవుణ్ణి నమ్మడం లేదు..!
విత్తు ముందా? చెట్టు ముందా అన్నట్లుగానే ఆస్తిక వాదం, నాస్తిక వాదం మధ్య శతాబ్దాల తర్కం నడుస్తూనే ఉంది. విశ్వం పుట్టుకకు దేవుడు కారణమా? బిగ్ బ్యాంగ్ థియరీ నిజమా? అన్నదానిపై ఎవరికి తోచిన వివరణ వారిస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయంపై యూరప్ ఐస్లాండ్ లో తాజాగా ఓ పోల్ నిర్వహించారు. నిజంగా ప్రపంచం పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మరోసారి చేశారు.
ఐస్లాండ్ లోని ఎథికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ విశ్వం పుట్టుకపై సర్వే నిర్వహించింది. ప్రపంచం ఎక్కడ ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలుసుకునేందుకు ప్రశ్నల ద్వారా పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 25 సంవత్సరాల వయసులోపు 93.9 శాతం మంది విశ్వం పుట్టుకకు బిగ్ బ్యాంగే కారణమని చెప్పగా... మిగిలిన ఆరు శాతం మంది తమకు తెలియదన్నారు. కాగా విశ్వం దేవుడి వల్లే పుట్టిందని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేదు.
దీని ఆధారంగా స్థానిక రెక్జావిక్ వాసులు, యువత ఏ మతాన్నీ, దేవుణ్ణీ నమ్మడం లేదని తెలుస్తోందని ఐస్లాండ్ పత్రిక నివేదికలు చెప్తున్నాయి. ఇక్కడి వారిలో 80.6 శాతం మందిలో అదీ 55 ఏళ్ళకు పైబడిన వారు అంతా క్రైస్తవులే ఉన్నారు. 11.8 శాతం మాత్రం నాస్తికులుగా చెప్పాలి. కాగా 25 సంవత్సరాలు... అంతకంటే చిన్న వ్యక్తుల్లో 40.5 శాతం మంది నాస్తికులు కాగా మిగిలిన 42 శాతంమంది క్రైస్తవులని తేలింది.
అయితే ఇదే పోల్ పై పలు విమర్శలు కూడ వెల్లువెత్తాయి. ఓ రెడ్డిట్ యూజర్ (ఇంటర్నెట్ మొదటి పేజీ) ఈ పోల్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని ఆరోపించారు. అసోసియేషన్ నిర్వహించిన సర్వే గందరగోళంగా ఉందని, అడిగిన ప్రశ్నల్లో క్లారిటీ లేదని అన్నారు. విశ్వం పుట్టుక గురించి మీరేమనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు... బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది, దేవుడు సృష్టించాడు, తెలియదు, ఇతరాలు అన్న ఆప్షన్లు ఇవ్వడంలో అర్థం లేదన్నారు.
చాలామంది దేవుడే బిగ్ బ్యాంగ్ కూ కారణమని నమ్ముతారని, ఇతరములు అన్న సమాధానంలో వీటిలో ఏదీ కాక దేవుడే బిగ్ బ్యాంగ్ ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడన్న అర్థం కూడా వస్తుందని అన్నారు. మరికొంతమంది యూజర్లు.. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మొదట కాథలిక్ ప్రీస్ట్, భౌతిక శాస్త్రవేత్త జార్జిస్ లెమైట్రే నుంచి పుట్టిందన్నది వాస్తవమన్నారు. ఇలా ఎవరికి తోచిన వాదం వారు చేయగా.. అసలు విశ్వ పుట్టుక విషయం పక్కన పెడితే శాస్త్రీయ సిద్ధాంతాలకూ, దేవుడికీ పోలిక కుదరదని ముందు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.