టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయినట్లేనా..ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనా..ఇజ్రాయెల్‌పై డ్రోన్‌లు,మిసైళ్లతో దాడులు జరిపిన తర్వాత ఇరాన్ మెత్తబడిందా.. అంటే ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన ప్రకటన అవుననే చెబుతోంది.
‘ఇజ్రాయెల్‌పై మేం జరిపిన దాడుల గురించి అమెరికాకు సమాచారమిచ్చాం. ఈ దాడులు పరిమితమైనవి. కేవలం మా ఆత్మరక్షణ కోసం చేసినవేనని తెలిపాం. మిడిల్ ఈస్ట్ ప్రాంత, ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశమేమీ మాకు లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం మా ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడం’అని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ చెప్పారు.
ఆదివారం(ఏప్రిల్14) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్దుల్లాహియాన్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన డ్రోన్,మిసైల్ దాడులను అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ఖండించిన నేపథ్యంలో దాడులు కొనసాగించే ఉద్దేశం లేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం.
కాగా, శనివారం(ఏప్రిల్ 13) అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్ది డ్రోన్‌లు, మిసైళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ అడ్డుకుని కూల్చివేసింది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ అధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది.
ఇదీ చదవండి.. ఇరాన్ మిసైల్ దాడులు.. తొలిసారి స్పందించిన నెతన్యాహు
Comments
Please login to add a commentAdd a comment