‘యూరో’ సర్కస్ | Euro Bulls Crack as Odds of Return to 2013 Lows Jump: Currencies | Sakshi
Sakshi News home page

‘యూరో’ సర్కస్

Published Sat, Nov 9 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

‘యూరో’ సర్కస్

‘యూరో’ సర్కస్

సంక్షోభం వల్ల నిరుద్యోగం, అల్ప వేతనాలు, పేదరికంతో అల్లాడుతున్న ప్రజలలో ఈయూ, యూరో కరెన్సీల పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. విదేశీయుల పట్ల గుడ్డి వ్యతిరేకత, జాత్యహంకారం వ్యాపిస్తున్నాయి. యుద్ధానంతర కాలపు మహా విషాదంలో యూరో అధినేతలు బఫూన్లలా వినోదం పంచుతున్నారు.
 
 ఎంతటి విషాదంలోనైనా వినోదాన్ని పంచగల సమర్థత యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధినాయకులకు, దేశాధినేతలకే సాధ్యం. ఇటలీ ప్రధాని ఎర్నికో లెట్టా రేపెప్పుడో యూరోపియన్ యూనియన్ పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో పొంచి ఉన్న ముప్పును గురించి దిగులు పడిపోతున్నారు. వచ్చే మేలో జరిగే ఆ ఎన్నికల్లో ‘యూరో సంశయవాదులు, ఈయూ వ్యతిరేకులు’ అధికారంలోకి రానున్నారని బెంగ పెట్టేసుకున్నారు. ఇంతకూ రేపు ఆయన అధికారంలో ఉంటారో లేదో తెలియదు! మధ్యేవాద వామపక్షమైన డెమోక్రటిక్ పార్టీ (పీడీ) అధినేత లూగీ బెర్సానీ స్వయంగా మితవాదులతో చేతులు కలిపి ‘మడి’ మంటగలుపుకోలేక... ఫిబ్రవరిలో లెట్టాను ప్రధానిని చేసారు. ఆ ‘అంటరాని’ పార్టీ (పీడీఎల్) అధినేత, మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ దయాదాక్షిణ్యాలపై బతుకుతున్న ప్రభుత్వానికి ముప్పు రానేవచ్చింది. ఎన్నికల కోసం తెగ ఆరాటపడుతున్న బెర్లుస్కోనీ ‘మహా కూటమి’ ప్రభుత్వంలోని తమ మంత్రుల చేత రాజీనా మాలు చేయించారు. ఈ చర్యను వ్యతిరేకించే కొందరు ఆయన ఆదేశాలను ధిక్కరిస్తారని వినవస్తోంది. ఆ చీలిక వస్తుందో లేదో గానీ బెర్లుస్కోనీయే ‘చీలిక’కు రంగం సిద్ధం చేశారు. పార్టీ పేరును ‘ఫోర్జా ఇటాలియా’గా (ఇటలీ, లేచి రా) మార్చేశారు. ఎన్నికల కోసం అంగలారుస్తున్న నే త పార్టీ చీలికకు యత్నించడం మూర్ఖత్వం కాదా? బెర్లుస్కోనీ మూర్ఖుడు కాడు. లెట్టా గత నెల 30న హెచ్చరించిన ‘యూరో సంశయవాదులు, ఈయూ వ్యతిరేకుల’ ముప్పును బెర్లుస్కోనీ ముందుగానే గ్రహించారు.
 
 యూరో సంక్షోభం ఫలితంగా నిరుద్యోగం, అల్ప వేతనాలు, పేదరికంతోనూ, సంక్షేమ వ్యయాల కోతల తోనూ అల్లాడుతున్న యూరోపియన్లలో ఈయూ పట్ల, యూరో ఉమ్మడి కరెన్సీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. వలస వచ్చిన విదేశీయుల పట్ల గుడ్డి వ్యతిరేకత, జాత్యహంకారం వ్యాపిస్తున్నాయి. లెట్టా హెచ్చరించిన ఆ ‘ముప్పు’ను ముద్దు చే సి పచ్చి మితవాద శక్తుల మద్దతుతో అధికారాన్ని అందుకోగలనని బెర్లుస్కోనీ ఆశ. దాన్ని వ్యతిరేకించేవారు దారికి రావడమో లేక బయటకు పోవాలనో ఆయన అభిమతం. ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్నికలు జరిగితే ఫిబ్రవరి ఫలితాలు పునరావృతంగాక తప్పదు. ‘వీళ్లంతా అవినీతిపరులే. మూడు దశాబ్దాలుగా దేశాన్ని భ్రష్టు పట్టించారు. న్యాయం కోసం యుద్ధం ఇప్పుడే మొదలైంది’ అంటూ గత ఎన్నికల్లో గర్జించిన  బెప్పే గ్రిల్లే (ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ స్వతంత్ర ఉద్యమం) మళ్లీ ప్రతాపాన్ని చూపనున్నారు.  అప్పటిలాగే ఈ సుప్రసిద్ధ విదూషక చక్రవర్తి సునాయాసంగా 25 శాతం ఓట్లు సాధించగలుగుతారు. మళ్లీ రాజకీయ సంక్షోభం తప్పదు. బెర్లుస్కోనీ సృష్టించిన అస్థిర రాజకీయ పరిస్థితి ఈయూ, యూరోల నిరాశామయ భవితకు అద్దం పడుతుంది.
 
 ఇటలీ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 1.5 శాతంగా ఉంటుం దని లెట్టా అంటుంటే... ఊహించనదానికంటే వేగంగా క్షీణించిపోతోందని ప్రభుత్వ గణాంక శాఖ (మైనస్ 1.8 శాతం) గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌లో లెట్టే ప్రభుత్వం ఈయూ బెయిలవుట్ సహాయాన్ని స్వీకరించినప్పుడే ఆరు నెలల్లో మరో బెయిలవుట్ తప్పదని నిపుణులు హెచ్చరించారు. యూరో జోన్‌లోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ క్షీణతతో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌కు గండం తప్పదని కూడా హెచ్చరించారు. ఆ గండం రానే వచ్చింది. రేటింగ్స్ సంస్థ ‘స్టాండర్డ్ అండ్ పూర్’ ఫ్రాన్స్ పరపతి స్తోమత రేటింగ్స్‌ను ఏఏ ప్లస్ నుంచి ఏఏకు తగ్గించింది. సోషలిస్టు అధ్యక్షునిగా ఫ్రాంకోయిస్ హాలెండే జనాదరణ రేటింగ్స్ 55 ఏళ్ల కనిష్టానికి... 25 శాతానికి ముందే పడిపోయాయి. ఈయూ నేతలు గ్రీస్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, ఐర్లాండ్, సైప్రస్ తదితర ‘రెండో తరగతి’ ఈయూ దేశాలలోనూ, స్వదేశాల్లోనూ అమలుచేస్తున్న ‘పొదుపు’ చర్యల పర్యవసానమిది.
 
 యూరో సంక్షోభ దేశాల్లో ఎక్కడా వృద్ధి అన్నదే కనిపించకున్నా జర్మనీ, బ్రిటన్‌ల వంటి దేశాల నామమాత్రపు వృద్ధితోనే సంక్షోభం నుంచి గట్టెక్కిపోయామని నాలుగు నెలల క్రితమే ఈయూ ప్రకటించింది. 2014లోయూరో జోన్ వృద్ధి రేటు 1.4 శాతంగా ఉంటుందని యూరోపియన్ కమిషన్ అంచనా వేసింది. దాన్ని రెండోసారి సవరించి సోమవారం  1.1 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమేనని ప్రకటించింది. అయినా నిస్సిగ్గుగా ‘స్పష్టమైన సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి,’ ‘మలుపు తిరుగుతున్నాం’ అంటోంది. అంతే నిస్సిగ్గుగా హాలెండే సైతం 0.5 శాతం వృద్ధికే సంబరపడుతూ పరిస్థితి ఆశావహంగా ఉన్నదని అంటున్నారు. యుద్ధానంతర యూరప్‌లోని గొప్ప విషాద పరిస్థితుల్లో యూరో అధినేతలు బఫూన్లుగా మారి వినోదం పం చడం విశేషం.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement