సుతిమెత్తగా, అతి పలుచగా, ఎంతటి చలినైనా తట్టుకోవడంలో కాశ్మీర్ శాలువాలకు ఎదురులేదు. వాటి తయారీకి లడఖ్ పాశ్మినా మేకల ఉన్ని కావాలి. వాతావరణ మార్పుల వల్ల అవి అంతరించిపోతున్నాయి. ప్రభుత్వం తీరు చూస్తే పరిస్థితి విషమించాక పాశ్మినా మేకను అంతరించిపోతున్న జాతిగా ప్రకటించి, అధికారికంగా కాశ్మీర్ శాలువాకు చరమగీతం పాడేట్టుంది.
ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ ముచ్చటపడి తన ముద్దుల భార్య జోసెఫిన్‌కు ఇచ్చిన కానుక... కాశ్మీర్ శాలువా! నేడు ప్రపంచవ్యాప్తంగా అంతస్తుకు, హోదాకు, విలాసానికి అది గుర్తు. సుతిమెత్తగా, అతి పలుచగా, ఎంతటి చలినైనా తట్టుకోవడంలో దానికి ఎదురు లేనేలేదు. పంజాబు తదితర రాష్ట్రాల్లో తయారవుతున్న నకిలీలు ఎన్నున్నా అవేవీ అసలు సిసలైన కాశ్మీర్ శాలువాకు సరిరావు. ఏమైతేనేం, కాశ్మీర్ శాలువా ఒకటి, రెండు తరాలు గడిచే సరికి చరిత్రగా మారిపోయే ప్రమాదం ఉంది. అసలు సిసలైన కాశ్మీర్ శాలువా తయారీకి పాశ్మినా మేకల ఉన్ని కావాలి. ఆ మేకలు జమ్మూకాశ్మీర్ లడఖ్ ప్రాంతానివే కావాలి. అవి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తున ఉండే చాంగ్తాంగ్ పర్వతాలపై, మైనస్ 35 డిగ్రీల అతి శీతల వాతావరణంలో బతికే మేకలు. అందుకే దూది పింజకంటే తేలికగా ఉన్నా, చలిని ఆపడంలో ఆ ఉన్నికి ధీటైంది లేదు.
టిబెట్, నేపాల్, మంగోలియాలలో కూడా పాశ్మినా మేకలు లేకపోలేదు. కానీ వాటి ఉన్ని లడఖ్ పాశ్మినా ఉన్నికి సరిపోలదు. ఇక్కడి ఉన్ని దారం మందం 9-11 మైక్రాన్‌లుంటే, ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉన్ని దారం మందం 12-16 మైక్రాన్‌లుంటుంది (మైక్రాన్ అంటే మిల్లీ మీట రులో వెయ్యోవంతు). అందుకే పాశ్మినా ఉన్నిని యంత్రాలతో నేయడం అసాధ్యం. ఆ ఉన్నికి కాశ్మీర్ లోయలోని పాశ్మినా నేత పనివారి నైపుణ్యం, అద్భుతమైన చేతి అల్లిక పని తోడైతే దానికి ఎదురేలేదు. అతి మృదువుగా, పలుచగా, నాజూగ్గా, కళాత్మకత ఉట్టిపడేలా ఉండే పాశ్మినా ధర లండన్, న్యూయార్క్ లాంటి నగరాలలో రూ.5,00,000 వరకు పలుకుతుంది.
చాంగ్తాంగ్‌లోని చాంగ్పా సంచార తెగ ఈ మేకల పెంపకంపైనే ఆధారపడి బతుకుతుంది. వాతావరణ మార్పుల దుష్ఫలితాలకు చాంగ్పాల జీవిత విధానంతోపాటూ వారి మేకల ఉనికి కూడా నేడు ప్రమాదంలో పడింది. ఆ ప్రాంతంలో శీతాకాలంలో 5 సెంటీమీటర్ల మంచు కురుస్తుంటుంది. అలాంటిది ఈ ఏడాది 121 సెంటీ మీటర్ల మంచు కురిసింది. గడ్డిపరకలు, చెట్టూచేమా మంచుతో కప్పబడిపోయాయి. మేత కరువై, చలికి గడ్డకట్టుకుపోయి 27,000 మేకలు (13 శాతం) చనిపోయాయి. దీంతో 17 శాతం చాంగ్పా కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వలస పోవాల్సివచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా ఆప్రాంతంలో ఉన్న 2 లక్షలకు పైగా పాశ్మినా మేకలు కూడా అంతరించిపోక తప్పదని, కాశ్మీరీ శాలువాను మరచిపోవాల్సి వస్తుందని లడఖ్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధిపతి రిగ్జెన్ స్పాల్‌బార్ అన్నారు.
ఇది చాంగ్పాల మనుగడ సమస్య మాత్రమే కాదు, కాశ్మీర్ లోయలో పాశ్మినా ఉన్ని నేత పనిపై ఆధారపడ్డ 3 లక్షల వృత్తి కుటుంబాల జీవన్మరణ సమస్య కూడా. ఐదుగురు పిల్లల కుటుంబానికి ఆధారంగా ఉన్న మొనీషా అహ్మద్ (45) నేడు పాశ్మినా వడకే వృత్తిని వదులుకోక తప్పలేదు. పాశ్మినాతో నెలకు రూ.10,000 వరకు ఆదాయాన్ని కళ్ల జూసిన ఆమె సాధారణ ఉన్నిని వడుకుతూ నెలకు రూ.3,000 కంటే తక్కువతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. పాశ్మినా ఊలు దారంతో బట్టను నేసే చేనేత పనివాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏటా కాశ్మీర్‌లో 60 వేల పాశ్మినా శాలువాలు తయారవుతున్నాయని, వాటి ఎగుమతుల ద్వారా 16 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యం (2011-12) లభిస్తోందని అధికారిక సమాచారం. అయితే కాశ్మీర్ లేదా పాశ్మినా శాలువాపై పేటెంటు హక్కుల పట్ల ప్రభుత్వ ఉదాసీనత ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యంత్రాలపై భారీ ఎత్తున ‘కాశ్మీర్’, ‘కాశ్మీర్ పాశ్మినా’ శాలువాలు తయారవుతున్నాయి. ప్రభుత్వం తీరు చూస్తే పరిస్థితి మరింత విషమించాక పాశ్మినా మేకను అంతరించిపోతున్న జంతు జాతిగా ప్రకటించి, అధికారికంగా కాశ్మీర్ శాలువాకు చరమగీతం పాడేట్టుంది. కాశ్మీర్ శాలువా గత వైభవ ఘనకీర్తిగా మిగిలిపోవాల్సిందేనా?
- పిళ్లా వెంకటేశ్వరరావు
కనుమరుగవుతున్న కాశ్మీర్ శాలువ!
Published Thu, Sep 26 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement