‘తాలిబన్ రాజధాని’లో అఫ్ఘాన్ క్రీడ | tahlinban capital's afghanisthan game | Sakshi
Sakshi News home page

‘తాలిబన్ రాజధాని’లో అఫ్ఘాన్ క్రీడ

Published Wed, Jul 2 2014 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

‘తాలిబన్ రాజధాని’లో అఫ్ఘాన్ క్రీడ - Sakshi

‘తాలిబన్ రాజధాని’లో అఫ్ఘాన్ క్రీడ

విఫలం కానున్న పాక్ సైనిక చర్యలోనే అమెరికా అఫ్ఘాన్‌లోని తన భవితను వెతుక్కుంటోంది. పాక్ కోరుతున్నట్టు అమెరికా - అఫ్ఘాన్ -పాక్‌ల కూటమి తప్ప గత్యంతరం లేదని భావిస్తోంది. దాని అర్ధం అఫ్ఘాన్ ‘శాంతి ప్రక్రియ’ నుంచి భారత్‌ను మినహాయించడమే.
 
నరేంద్రమోడీ ప్రభుత్వానికి అమెరికా పంపుతున్న ‘ప్రేమ సందేశాల’పై మన మీడియాకు చిన్న చూపున్నట్టుంది.  లేకపోతే 2008 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ మొహ్మద్ సయీద్ నేతృత్వంలోని ‘ధార్మిక సంస్థ’ జామతే ఉద్ దవాను గత నెల 26న ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటుందా? హఫీజ్‌ను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల జాబితాకు ఎక్కించి, అతని తలపై కోటి డాలర్ల నజరానాను ప్రకటించి మూడేళ్లు గడచింది. అయినా పాకిస్థాన్‌లో బహిరంగంగానే  యథేచ్ఛగా భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్న హఫీజ్ ఇకపై కూడా అలాగే నిక్షేపంగా ఉంటాడు, జమాతే ఉద్ దవా కూడా నిక్షేపంగా ఉంటుందనేది నిజమే. లష్కరే తోయిబా, దాని ముసుగు సంస్థ జమాతే ఉద్ దవా భారత్‌లో ప్రత్యేకించి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర చర్యలపైనే దృష్టిని కేంద్రీకరించే సంస్థ లు. ‘‘జమాతే ఉద్ దవా అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలను కుంటోంది. ఆర్భాటం లేకుండా గుట్టు  చప్పుడు కాకుండా తన పని తాను చేసుకుపోయే అది ఆ పనిని మనం అనుకునే దాని కంటే త్వరగానే చేయగలుగుతుంది’’అని అమెరికన్ పాకిస్థానీ అరీఫ్ జమాల్ గట్టి విశ్వాసం. ఇటీవలే వెలువడిన ఆయన రాసిన ‘కాల్స్ ఫర్ ట్రాన్స్‌నేషనల్ జిహాద్: లష్కరే తోయిబా’ అమెరికా ఊహిస్తున్న దానికంటే జమాతే ఉద్ దవా చాలా ప్రమాదకరమైన సంస్థని పేర్కొంది. అమెరికాది కంటి తుడుపు చర్యేనని పెదవి విరిచేయడం సహజమే. కానీ ఆరేళ్లపాటూ ఆ పని చేయలేని అమెరికా ‘ఇప్పుడే’ ఎందుకు చేసినట్టు?

 సమాధానాన్ని గత నెల 15 నుంచి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పాక్ తాలిబన్‌గా పిలిచే తెహ్రికే తాలిబన్ పాకిస్థాన్ (టీపీపీ) ఉగ్రవాదులపై ఉత్తర వజీరిస్థాన్‌లో చేపట్టిన సైనిక దాడుల్లో వెతుక్కోవాలి.అప్ఘానిస్థాన్‌లో గద్దె నెక్కనున్న అమెరికా అనుకూల ప్రభుత్వంలో వెదుక్కోవాలి. పాక్ వాయవ్య సరిహ ద్దుల్లోని కేంద్ర పాలిత ఆదివాసి ప్రాంతాల్లోని (ఎఫ్‌ఏటీఏ) ఉత్తర వజీరిస్థాన్ ‘ప్రపంచ తాలిబన్ రాజధాని.’ అఫ్ఘాన్‌లోని నాటో దళాలపై దాడులు సాగించి, సరిహద్దులు దాటడం తాలి బన్లు ఏళ్ల తరబడి ఆడుతున్న ఆట. ఈ ఆటను కట్టించడానికి అమెరికా బలవంతం మీద 2009లో స్వాత్‌పై సైనిక చర్యను ప్రారంభించిన పాక్ సైన్యం ఉత్తర వజీరిస్థాన్ జోలికి పోలేదు. అలాంటిది నేడు వజీరిస్థాన్‌పై సైనిక చర్యకు సిద్ధం కావడంతో ఉగ్రవాదంపై పాక్ వైఖరిలో మార్పువచ్చిందని విశ్లేషకులు తొందరపాటు నిర్ధారణలు చేసేస్తున్నారు. రెండు వారాల్లో టీపీపీని తుడిచి పెట్టేస్తామంటూ సైన్యం ప్రారంభించిన ఈ చర్య 5 లక్షల మంది ప్రజలను నిర్వాసితులను చేసింది. 376 మంది మిలిటెంట్లు, 17 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యపు అధికారిక సమాచారం. సోమవారం నాటికి గానీ పాక్ సైన్యం భూతల పోరుకు సిద్ధం కాలేకపోయింది. ఇంతా చేసి పాక్ సైన్యం చేస్తున్న పోరంతా పాక్‌లో దాదాపు 50 వేల మందిని బలిగొన్న టీపీపీకి వ్యతిరేకంగా చేస్తున్న దాడులే. పాక్ అనుకూల అఫ్ఘాన్ తాలిబన్, హఖానీ నెట్‌వర్క్, హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపులతో పాక్ సైన్యం అనధికార శాంతి మంత్రం జపిస్తూనే ఉంది. సైనిక చర్య మొదలు కాగానే టీపీపీ అధినేత ముల్లా ఫజులుల్లా సహా కీలక నేతలంతా సరిహద్దు దాటేశారు.

ఎట్టకేలకు నవాజ్ సైనిక చర్యకు సిద్ధం కావడానికి ప్రధాన కారణం గత నెల 9న కరాచీ విమానాశ్రయంపై టీపీపీ జరిపిన ఉగ్రదాడే . పాకిస్థాన్ తెహ్రికె ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ సైనిక చర్య విఫలం కాక తప్పదని ముందే జోస్యం చెప్పారు. ఇమ్రాన్ కోరుతున్న శాంతి చర్చల కోసమే నవాజ్ నెలల తరబడి సమయాన్ని వృథా చేశారు. ఆ కాలంలోనే టీపీపీ సైన్యంతో తలపడటానికి సన్నద్ధమైంది. అందుకే సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటించగలుగుతోంది. ఇప్పటికే కీలక నేతలను బలగాలను సరిహద్దులను దాటించేసింది. ఎట్టకేలకు సైన్యం ఉత్తర వజీరిస్థాన్‌ను కైవసం చేసుకున్నా దాన్ని అక్కడే నిలిపి ఉంచక తప్పదు. ఉపసంహరించిన వెంటనే టీపీిపీ తిరిగి తిష్టవేయక తప్పదు. విఫలం కానున్న ఈ సైనిక చర్యలోనే అమెరికా అఫ్ఘాన్‌లో తన భవితను వెతుక్కుంటోంది. నాటో సేనల ఉపసంహరణ గడువు దగ్గరపడుతుండగా దానికి ఒకే ఒక్క దారి మిగిలింది. అది పాక్ సైన్యం, ఐఎస్‌ఐలు కోరుతు న్న అమెరికా-అఫ్ఘాన్-పాక్‌ల కూటమికి అంగీకరించడం. అం టే అఫ్ఘాన్ ‘శాంతి ప్రక్రియ’ నుంచి భారత్‌ను మినహాయించ డం. అందుకు భారత్‌కు చెల్లిస్తున్న చెల్లని చెక్కులలో మొదటిది జమాతే ఉద్ దవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం.

 పిళ్లా వెంకటేశ్వరరావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement